Previous Page Next Page 
మానిని మనసు పేజి 24

    "ఇంకా కావాలా?"
    "వద్దు"
    ఆమె నీళ్ళు తాగిందికాని అక్కడ్నుంచి లేవలేదు.
    "పద! వెళ్ళి పడుకుందాం"
    "చదవడం పూర్తయిందా?" వ్యంగ్యంగా అన్నది.
    రమణ మాట్లాడలేదు.
    అనసూయ అతడి కళ్ళలోకి చురుగ్గా చూసింది.
    రమణ కలవరపడ్డాడు.
    "మాటాడరేం? నవల పూర్తయిందా?"
    "రేపు పూర్తిచేస్తాను."
    "మీరు అయితే ఎవరితోనూ మాట్లాడ లేదన్నమాట."
    "ఓ అదా! నీ ఫ్రెండు నిద్రపట్టడం లేదని వచ్చింది"
    "ఊఁ"
    "ఏదైనా పుస్తకముంటే ఇవ్వమన్నది."
    "ఆ మాత్రానికే పాపం దానిమీద అంత గట్టిగా అరవాలా?"
    రమణకు సమాధానం దొరకలేదు.
    "నేను లేవగానే ఎందుకలా తన గదిలోకి పరుగు తీసింది?"
    "ఏమో నాకేం తెలుసు. నీ ఫ్రెండు చాలా చిత్రమైన మనిషి. పద పడుకుందాం. నాకు నిద్రొస్తున్నది."
    అనసూయ పడుకుంది.
    కళ్ళు మూసుకుంది.
    దుఃఖం వస్తోంది.
    తన అనుమానం నిజమే అయింది. వీళ్ళిద్దరికీ ఏదో సంబంధము వున్నది. మామూలు పరిచయం కాదు. ఇద్దరూ ఘర్షణ పడుతున్నారు. రమణ ఆమెను నమ్మించి మోసం చేశాడా?
    అవును! ఇద్దరికీ నిద్రపట్టలేదు. ఎలా పడుతుంది?
    సావిత్రి కూడా తన దగ్గర నాటకం ఆడుతున్నది. దానికి తన భర్త రమణ అని తెలియదు. అందుకే చూడగానే బిగుసుకుపోయింది. ఈ రెండు రోజులనుంచీ పిచ్చిపట్టినట్టు ప్రవర్తిస్తోంది.
    తను మోసపోయింది.
    తన భర్త తన మీద ప్రేమవున్నట్టు నాటకం ఆడుతున్నాడు.
    ఆమె కళ్ళనుంచి నీరు కారిపోతున్నది.
    ఆలోచనలతో తల పగిలిపోతున్నది.
    అదే నిజమైతే చస్తే తను రమణతో కాపురం చెయ్యలేదు.
    ఎంత హాయిగా ఏమి జరగనట్టే నిద్రపోతున్నాడో!
    మంచంమీద నుంచి లేచి దుప్పటి వేసుకొని పడుకుంది. భర్తంటే అసహ్యం వేసింది.
                                          11
    తెల్లవారి అనసూయ యాంత్రికంగా పనిచేస్తున్నది. ముభావంగా వున్నది. రమణ అడిగినదానికి ఊఁ ఆఁ అంటూ క్లుప్తంగా అతనికేసి చూడకుండానే సమాధానాలు ఇస్తున్నది.
    రమణకి కూడా భార్యను పలకరించాలంటే జంకుగానే వుంది. రమణమూర్తి ఆఫీసుకి వెళ్ళిపోయాడు.
    "మధ్యాహ్నం భోజనము పంపించకు" అన్నాడు వెళుతూ వెళుతూ.
    మరోసారైతే లక్ష ప్రశ్నలు వేసేది. భార్య వాలకం రమణకు చిరాకును కలిగించింది.
    "సావిత్రీ! టిఫిన్ చేద్దువురా" పిలిచిందామె. ఆమె కంఠములో మునుపటి ఆప్యాయత లేదు. పొడిగా వున్నదామె కంఠం.
    సావిత్రి వచ్చి డైనింగ్ టేబుల్ ముందు కూచుంది.
    ఆమె సావిత్రి ముఖంలోకి చూస్తూ కూచుంది.
    "నువ్వు తినవూ?"
    "కడుపు నిండుగా వుంది. తినకపోయినా ఫర్వాలేదు"
    అనసూయ మాటలో ద్వంద్వార్ధం వుంది. కాని సావిత్రి గమనించలేదు.
    సావిత్రి ఇంత లోతుమనిషని తనకు తెలియదు. ఆమెను తను ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించింది. ఎంతో సరదాగా వారంరోజులు గడిపింది. కనీసం తనకు నిజాయితీగల స్నేహితురాలైతే నిజం చెప్పకూడదూ? నీ భర్త ముందే నాకు తెలుసు. ఇద్దరం ప్రేమించుకున్నాం అని చెప్పొచ్చుగా. అప్పుడు తనకు ఇంత బాధ వుండదు. గతాన్ని త్రవ్వే మనస్తత్వం కాదు తనది. కనీసం తన భర్తయినా చెప్పివుంటే తను ఇంత మానసికంగా కృంగిపోయేది కాదు. ఇద్దరూ తననుంచి రహస్యాన్ని దాస్తున్నారు.
    "ఏమిటోయ్ అంతగా ఆలోచిస్తున్నావ్?" నవ్వుతూ అడిగినది సావిత్రి.
    ఆమెకు వళ్ళు మండిపోయింది.
    గుండెలు తీసిన ఆడది.
    ఏమీ జరగనట్టే మాట్లాడుతున్నది.
    పైగా నవ్వుతూ మాట్లాడుతుంది. ఎలా నవ్వగలుగుతోందో? వీళ్ళ రహస్యం కనుక్కునేంతవరకూ తనకు మనశ్శాంతి వుండదు.

 Previous Page Next Page