Previous Page Next Page 
పిపాసి పేజి 24


    "ఏం లేదు రాధీ.... ఎందుకో తలనొప్పిగా వుంది" అన్నాడు.


    "అయ్యో..... పడుకోండి.... నేను తలపడతాను" అంటూ అతన్ని మంచం మీద పడుకోబెట్టి, తల పట్టింది. మధన్ కళ్ళు మూసుకుపడుకున్నాడు, రాధిక నడుం చుట్టూ చేతులు వేసి. ఏ తెల్లవారు ఝామునో నిద్రపట్టిన రాధికకి, మెలకువ వచ్చేసరికి బాగా తెల్లవారిపోయింది. కిటికీ అద్దంల్లోంచి ప్రసరించే అరుణ కిరణాల గిలిగింతలకి, కళ్ళు తెరిచింది. మధన్ వేపు తిరిగింది. ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. మెల్లగా లేచి తలుపులు తెరిచి ఇవతలి కొచ్చింది. రాజేశ్వరమ్మ వంటగిన్నెలతో కుస్తీ పడుతోంది.


    తల్లి పూజగదిలో దేముడికి దీపం పెడుతోంది.


    రేణుక స్నానం చేసి తల దువ్వుకుంటోంది. రాధికని చూసి ముసిముసిగా నవ్వులు నవ్వింది రేణుక.


    రాధిక పళ్ళు తోముకుని వంటింట్లోకి వెళ్ళింది. చిరునవ్వుతూ కాఫీ అందించింది అత్తగారు.


    మరికాస్సేపటికి మధన్ గబగబా బాత్ రూములోకి వెళ్లాడు స్నానానికి.


    "రాధీ..... మీ ఆయనకి కాఫీ ఇవ్వమ్మా" అంటూ కాఫీ కప్పును రాధికకి అందించింది రాజేశ్వరమ్మ.


    మధన్ స్నానం పూర్తిచేసి రాగానే, కాఫీ కప్పుతో గదిలో కెళ్లింది రాధిక. ఎదురుగుండా నుంచున్న రాధికని చూసి. "నన్ను క్షమించు రాధీ..... రాత్రి విపరీతమయిన తలనొప్పి వచ్చింది." "ఫరవాలేదు" తలవంచుకుంది రాధిక. "ఊ..... కాఫీ తీసుకోండి" అంది, ఇంకేమీ చెప్పనీయకుండా.


    "నువ్వు?" అన్నాడు కప్పునందుకుంటూ మధన్.


    "నేను తాగాను."


    "ఊహు...... మళ్ళీ ఈ కప్పులోంచి" అంటూ కాఫీ కప్పును ఆమె నోటికందించాడు.


    రెండు గుక్కల తాగాక, "ఇది నాకూ" అంటూ మిగిలిన కాఫీ తాగేశాడు.


    "ఛ.... ఛ... అదేమిటండీ నా ఎంగిలి తాగేశారు."     


    "ఏం?"


    "నా ఎంగిలి మీరు తాగకూడదు. మీ ఎంగిలి నేను తాగితే పుణ్యం."


    "అలా అని ఎవరు చెప్పారు?"


    "మన పెద్దలు"


    "నేను పెద్దను కానా?"


    "అని ఎవరన్నారు?"


    "అయితే నే చెప్పేదీ వినాలి. భార్యాభర్తల్లో ఆ తేడాలుండకూడదు. ఇద్దరూ సమానమే. తెలిసిందా?"


    "తెలిసింది సార్?" అంది స్టూడెంటులా చేతులు కట్టుకునుంచుని.  


    "గుడ్ గరల్.... ఏదీ ముద్దు పెట్టు బంగారు తల్లి" అంటూ బుగ్గ చూపించాడు.    


    "ఇంకానయం, పట్టపగలు, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారూ?"


    "ఏమనుకుంటారు? ప్రేమ పక్షులనుకుంటారు." అంటూ ఆమె నడుంమీద చెయ్యేసి దగ్గరికి లాక్కున్నాడు.     


    "అక్కా" అనుకుంటూ లోపలికొస్తూన్న రేణుక, తిరిగి వెళ్ళిపోవడం చూసిన రాధిక "చూశారా, రేణుక చూసింది" అంటూ బుంగమూతి పెట్టింది.


    "చూడనీ. ఏమైంది! మా తమ్ముడు రాలేదు కానీ లేకపోతే ఇలాగే బందీ అయి వుండేది, మీ చెల్లెలు కూడా."


    "ఛీ.... పోండీ" అంటూ పకపకా నవ్వింది. ఎలాగో పట్టు విడిపించుకుని తుర్రుమంది రాధిక.


    స్నానం చేసొచ్చి, తల దువ్వుకుంటూంటే రేణుకొచ్చి కూర్చుంది అక్కడ.


    "అమ్మ ఏం చేస్తోందే" అంది రాధిక.


    "అమ్మా, అత్తయ్యా కలిసి వంట చేస్తున్నారు. అక్కా నేను రేపు వెళ్ళిపోదాం అనుకుంటున్నా" అంది రేణుక.


    "అప్పుడేనా? అయినా మరిదిగారెందుకు రాలేదు? అతనొచ్చి వుంటే మరో నాలుగు రోజులుండేవారు. అప్పుడే అమ్మాయిగారి మనసు అటు మళ్ళినట్టుంది" అంది నవ్వుతూ.


    రేణుక నవ్వుతూ ఊరుకుంది, ఏమనాలో తెలీక.


    "రేణూ! నువ్వు ఇప్పుడప్పుడే వెళ్ళడానికి వీల్లేదు. మరిదిగారికి రాసేసెయ్" లాలనగా అంది.


    "సరేలే చూద్దాం."   


    "అక్కా. ఒక్క పాట పాడవు! నువ్వు చాలా బాగా పాడతావని, డాన్సు చేస్తావని విన్నాను. డాన్సు చేసే ప్రాప్తం లేకపోయింది. కనీసం పాటైనా పాడు" అంది రేణుక.


    "తప్పకుండా పాడ్తానమ్మా" అంటూ, తన కిష్టమయిన మదనగోపాలుడి మీద "మాయల్ని చాలించు మధు సూధనా" అంటూ భైరవి ఆలాపించింది. ఆకమనీయ కంటహంణవిని,రాజేశ్వరమ్మ సరోజినీ కూడా వంటింట్లోంచి వచ్చి కూర్చున్నారు.  


    తలుపుచాటు నుంచి పాటంతా విన్న మధన్ "చూశావా రేణూ, ఎంత అబహాండాలు వేస్తుందో, నేనేం మాయలు చేశాను" అన్నాడు.  


    "ఏమో బావగారూ, ఏమీ చెయ్యందే మా అక్క ఏందుకలా అంటుంది?రాధకి ప్రేమించడం తప్ప దెప్పిపొడవడం తెలీదే. అటువంటి రాధే ఇలా అంటోందంటే...."


    "అమ్మో.... అమ్మో.... అక్కా చెల్లెళ్ళిద్దరూ ఒక్కటైపోయారు. చూశావా అమ్మా" అంటూ తల్లితో చెప్పాడు.                          

 Previous Page Next Page