Previous Page Next Page 
మరీచిక పేజి 24


    "పోలీసులా? ఎందుకూ?"

 

    "పిక్ పాకెటింగ్ చేస్తున్నానని వాళ్ల అనుమానం. ఒకటిరెండు సార్లు ఆ పని కూడా చేశాను. పిల్లల జైల్లో కూడా పెట్టారు. సమయానికి ఇంత తిండి దొరికేది. అదే బాగుంది అనిపించింది. అక్కడ నాలుగేళ్ళు వున్నాను. ఒకరోజు వార్డెన్ కు ఎదురుతిరిగి బాగా దెబ్బలు తిన్నాను.

 

    నేను అక్కడ నుంచి ఎలాగో తప్పించుకున్నాను. మళ్ళీ బయటి ప్రపంచంలోకి అడుగుపెట్టాను.

 

    ఆబిడ్ రోడ్డులో ఒకసారి కొందరు హిప్పీలను చూశాను. తమాషాగా కన్పించారు. వాళ్ళనే చూస్తూ, వాళ్ళు ఎక్కడికెళితే అక్కడికెళ్ళాను. వారంతా ఫారెన్ వాళ్ళే. వాళ్లు నవ్వుతూ నన్ను పలకరించారు. నాకు ఇంగ్లీషు బాగా మాట్లాడటం రాదు. పిల్లల జైల్లో చదువు కూడా చెప్పేవాళ్ళు. అందుకే సరిగా సమాధానం చెప్పలేకపోయినా వాళ్లు చెప్పేది కొంత అర్థం అయ్యేది!"

 

    "ఇప్పుడు బాగానే మాట్లాడుతావుగా?" మధ్యలో అందుకొని అడిగింది శబరి.

 

    "వాళ్ల మధ్య చాలాకాలం నుంచి వుండటం వలన ఇప్పుడు బాగానే మాట్లాడగలను."

 

    "తర్వాత?"

 

    "తర్వాత ఇంకేముంది? వాళ్ళు నన్ను ఆప్యాయంగా చూశారు. వాళ్ళ దగ్గర ఏది వున్నా నాకూ వాళ్ళతోపాటే ఇచ్చేవారు. వాళ్ళకు ప్రేమించడం మాత్రమే తెలుసు. ద్వేషించడం తెలియదు. వాళ్ళలో ఒకణ్ణి అయిపోయాను. జీవితాన్ని అర్థం చేసుకున్నాను. సుఖపడటం అంటే ఏమిటో తెలుసుకున్నాను. బాదర బందీలేదు, మరొకరి భయం లేదు. మా ప్రపంచంలో అంతా ఆనందమే."

 

    కారు లోపలకు వచ్చింది. శబరి గాభరాగా లేచి నిల్చుంది.

 

    "డాడీ మమ్మీ వచ్చారు. నువ్వెళ్ళిపో! ఎల్లుండి కలుస్తాను" అన్నది శబరి గాబరాగా. జాన్ తప్పుకొని వెళ్ళబోయాడు. రుక్మిణి చిత్రంగా చూస్తూ నిల్చుంది.

 

    "ఎవడ్రానువ్వు?" రంగారావు మెళ్ళోని పూసల దండను దొరక పుచ్చుకున్నాడు.

 

    "డాడీ అతన్ని వదిలెయ్! దాదాపు అరిచినట్టే అన్నది శబరి.

 

    "ఎవడేవాడు?" రుక్మిణి అడిగింది.

 

    'నా బాయ్ ఫ్రెండ్!"

 

    రంగారావు అతన్ని వదిలేసి శబరికేసి విస్మయంగా చూశాడు.

 

    రుక్మిణికి నోటమాట రాలేదు. డ్రైవర్ తలవంచుకొని పెద్దవాళ్ళ విషయం తనకెందుకు అన్నట్టు నిల్చున్నాడు.

 

    "ఏమిటే అన్నావ్?" రంగారావు కోపంతో రెచ్చిపోయి శబరి ఆ చెంపా ఈ చెంపా వాయించసాగాడు.

 

    "డాడీ! ఆగు! నన్నుకొట్టే అధికారం నీకెవరిచ్చారు?" శబరి ఎదురుతిరిగింది.

 

    "నిన్ను కొట్టాలా చంపాలా? మా కడుపున చెడబుట్టావు! వాడెవడ్నో హిప్పీగాడ్ని ఇంటికి తీసుకొచ్చింది చాలక బాయ్ ఫ్రెండ్ అంటావటే. నీకిదేం పోయే కాలమే!" రుక్మిణి పిచ్చిదానిలా అరవసాగింది.

 

    "ఎందుకలా అరుస్తావ్?" శబరి కూడా అరిచింది.

 

    "ఎంతకు తెగించావే?" రుక్మిణి చెయ్యి ఎత్తింది.

 

    "చెయ్యి దించు. నామీద చెయ్యిపడిందా?" గట్టిగా అరిచింది శబరి. రంగారావు శబరిని అయోమయంగా చూస్తూ నిల్చున్నాడు.

 

    "నిన్ను కన్నందుకు ఇదటే నువ్వు-"

 

    "నిన్ను కనమని.... నేను అడిగానా?"

 

    రుక్మిణి ఏమనాలో తోచనట్టు చూస్తూ వుండిపోయింది.

 

    "నా యిష్టం వచ్చినట్టు నేను చేస్తాను. మధ్య మీరెవరు నన్ను కొట్టడానికి?"

 

    "మేం ఎవరిమా? నేను తల్లినే, ఆయన నీ తండ్రి. నిన్ను కన్నవాళ్ళం? పెంచిన వాళ్ళం! నీ సుఖం కోసం రాత్రింబవళ్ళు ఆలోచించే వాళ్ళం."

 

    "మొదటి రెండూ నిజమే! కానీ మీకు కావాల్సింది నా సుఖం కాదు."

 

    "ఏమిటమ్మా ఆ మాటలు?" రంగారావు కోపాన్ని దిగమింగుకుంటూ అన్నాడు.

 

    "అవును డాడీ! నా సుఖం కోరేవాళ్ళయితే నా మార్గానికి అడ్డురారు!"

 

    "పిల్లలు తెలిసీ తెలియక పెడమార్గం పడుతూ వుంటే తలిదండ్రులు ఎలా చూస్తూ వుంటారమ్మా?"

 

    "పెడమార్గమా? ఏది పెడమార్గం? ఏది మంచి మార్గం? వీటిని నిర్ణయించే వాళ్ళెవరు? అమ్మకు భయపడుతున్నట్టు నువ్వు నటించడం మంచి మార్గమా? చాటుగా సుబ్బమ్మతో..."

 

    "బేరీ! రుక్మిణి దాదాపు అరిచింది.

 

    రంగారావు అయోమయంగా చూశాడు!

 

    "నువ్వు బీదవాళ్ళకు అప్పులిచ్చి నగలు - కాజెయ్యడం మంచి మార్గమా? అమ్మ పొద్దుట లేచిం దగ్గరనుంచీ పదిమంది మధ్యా అబద్ధాలు చెపుతూ కోతలు కొయ్యడం మంచి మార్గమా?"

 

    తల్లీతండ్రి కూతురి ముఖంలోకి అయోమయంగా చూస్తూ వుండిపోయారు.

 

    "మీకు తీరని కోరికల్ని పిల్లల ద్వారా తీర్చుకుంటారు."

 

    "నీకు పిచ్చి పట్టిందే!" అన్నది రుక్మిణి ఏడుపు గొంతుతో.

 

    "ఇంకా పట్టలేదు. ఇంకా కొంతకాలం మీ మధ్యన ఉంటే తప్పక పడుతుంది."

 

    "ఇవన్నీ ఆ హిప్పీ వెధవ నేర్పించాడా?" తమాయించుకొని అడిగాడు రంగారావు.

 

    "అవును!"

 

    రంగారావుకు ఏం చెయ్యాలో తోచలేదు.

 

    రుక్మిణి "అయ్యో నా కూతురికి ఆ వెధవ మందు పెట్టినట్టున్నాడు." ఏడుపు ప్రారంభించింది.

 

    "లోపలకు పదండి!" రంగారావు అంతకంటే ఏమనాలో తోచలేదు.

 

    "ఈసారి వాడు ఇక్కడికి వస్తే జైల్లో పెట్టించండి! గాడ్దెను!" రుక్మిణి అన్నది.

 

    శబరి అప్పటికే విసురుగా లోపలకు వెళ్ళిపోయింది.

 

    "ఇదేమిటండీ! ఆదిత్య వింటే ఇంకేమయినా ఉందా?

 

    "నువ్వు అల్లరి చెయ్యకు. తెలిసీ తెలియని వయసు. ఆ వెధవ ఏదో చెప్పి ఉంటాడు. మంచిగా లాలించి చెప్పాలి. దాన్ని కొట్టినా లాభం లేదు. మరీ మొండికేసేలా ఉంది."

 

    "ఏమిటో నాకంతా అయోమయంగా ఉంది. దాని మెళ్ళో ఆ మూడు ముళ్ళూ పడతాయని నాకు నమ్మకం లేదు."

 

    "అమ్మాయితో నేను మాట్లాడతాలే! నువ్వేమీ అనకు!"

 

    "అది సరే! అమ్మాయి ఏదో సుబ్బమ్మ అంటోంది?"

 

    "ఆఁ అదా? ఏమిటో దాని మనసు సరిగా ఉన్నట్టు లేదు. వాడు ఏదో మత్తుమందు ఇచ్చినట్టున్నాడు. ఆరోజు ఏదో మందు వేసుకుంది చూశావా? అది ఈ వెధవే ఇచ్చి ఉంటాడు!" మాటమార్చాడు రంగారావు.

 

    "అవును! వీడే ఆ పనిచేసి ఉంటాడు."

 

    "ఇకనుంచి దాన్ని ఒక్కదాన్నే ఇంట్లో వదిలి మనిద్దరం బయటికి వెళ్ళడం మంచిదికాదు. నువ్వు కాస్త క్లబ్బులూ, పార్టీలూ తగ్గించుకోవాలి" అన్నాడు రంగారావు.

 

    "ఒక్కగానొక్క బిడ్డ అని అల్లారుముద్దుగా పెంచాం! అదే... ఆ ముద్దే దాన్ని ఇలా తయారుచేసింది."

 

    "ఇప్పుడు బాధపడి ఏం లాభం?"

 

    "అయ్యో! ఆదిత్య వస్తున్నాడండీ! అది ఏం వాగుతుందో ఏమో ఖర్మ!"

 

    "అదంతా నేను చూసుకుంటాలే!" నువ్వు లోపలకు వెళ్ళు!"

 

    రుక్మిణి లోపలకు వెళ్ళింది. రంగారావు తెచ్చి పెట్టుకున్న నవ్వుతో ఆదిత్యకు ఎదురు వెళ్లాడు.


                                                           15


    శబరి తల్లి గదిలోకి రాబోయి గదిలోనే ఆగిపోయింది.

 

    రుక్మిణి పసిపిల్లలా వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉన్నది. రంగారావు భార్యను ఓదారుస్తూ ఉన్నాడు.

 Previous Page Next Page