Previous Page Next Page 
మానిని మనసు పేజి 23


    "నువ్వు వెళ్ళలేదు?"
    "లేదు. నీ సంగతి కనుక్కొని కాని వెళ్ళదల్చుకోలేదు." కసిగా అన్నది ముఖం కందగడ్డలా ఉన్నది. కళ్ళలో క్రూరత్వం కన్పించింది. ఆమె రూపం చూస్తుంటే రమణమూర్తి గుండె ఝల్లుమన్నది.
    "నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్ధం కావడం లేదు."
    రమణమూర్తికి అనసూయ నిద్రలేస్తుందేమోనని భయముగా వుంది.
    "అర్ధమయ్యేలా చెప్పడానికే నేను హాస్టల్ కి వెళ్ళలేదు."
    "అర్ధరాత్రిపూట ఏమిటి గొడవ. ఏదైనా మాట్లాడాలనుకుంటే రేపు మాట్లాడు."
    "నన్ను తప్పుకు తిరుగుతున్నావ్ గా!"
    "అనసూయ ఏమైనా అనుకుంటుందని!"
    "పాపం ఎంత ప్రేమ! నువ్వు నరరూపంలో వున్న పిశాచివని దానికి తెలియదు. అమాయకురాలు."
    "పిచ్చిదానిలా మాట్లాడకు! చాలా పొద్దుపోయింది."
    "అందుకే వచ్చాను. అనసూయ నిద్రపోతున్నది. నీ సంగతి తేల్చుకోవడానికి ఇదే సమయం!"
    "సంగతి నువ్వు తేల్చుకోవడమేమిటి?"
    "నీ సంగతి నాకేగా తెలుసు అందర్నీ మోసం చేశావు. కాని నువ్వు చేసిన ఆ పాపం నా నుంచి దాచలేవు."
    "నేనా! పాపం చేశానా? నీకేమైనా పిచ్చా?"
    "నాకు పిచ్చికాదు, నువ్వే అందర్నీ పిచ్చివాళ్ళను చేస్తున్నావు. అనసూయ నా చిన్ననాటి స్నేహితురాలు. దాని కన్యాయం జరగడం నేను సహించలేను."
    "అనసూయకు అన్యాయమా? ఏమిటి నువ్వనేది?" అయోమయంగా చూశాడు రమణ.
    "మరీ అంత అమాయకంగా ముఖం పెట్టకు నీ మొదటి భార్యను నువ్వు చంపావు!"
    రమణమూర్తి వెర్రిముఖం వేశాడు. చూస్తుండిపోయాడు.
    "చంద్రవదనను హత్యచేశావ్"
    రమణమూర్తి స్థాణువులా వుండిపోయాడు.
    "నీ భార్యను సజీవంగా దహనం చేశావు. నిలువునా కాల్చి చంపావ్."
    "అంటే ఇంకా నువ్వు నన్ను అనుమానిస్తూనే ఉన్నావన్నమాట" రమణమూర్తి కళ్ళలో నీలినీడలు పారాడాయి.
    "నేను అనుమానించడం ఏమిటి? అది వాస్తవం"
    "ఏమిటా వాస్తవం?" కరుగ్గా అన్నాడు రమణ.
    "నీ భార్యని రోజూ రాత్రిళ్ళు బాదేవాడివి. ఒకరోజు గొంతు పిసికి చంపటానికి చేశావ్. నేను తలుపు కొట్టడంవల్ల ఆమె ప్రాణం ఆరోజుకి దక్కింది."
    "అట్టె వాగకు. నువ్వు తలుపులు తట్టినప్పుడు నేను తలుపు తీశాను. నా భార్య నిద్రపోతున్నదని చెప్పాను."
    "మరి అలా చెప్పక ఎలా చెబుతావ్?"
    రమణమూర్తి తెల్లముఖం వేశాడు.
    "తెల్లవారి సింహాచలం తీసుకెళ్ళాక అదీ ఒక ప్లానే. ఆ కొండమీదనుంచి తోసెయ్యాలని నీ ప్లాను. అది వీలులేక పోయింది. తెల్లవారేటప్పటికి కిరసనాయిల్ పోసి చంపావ్."
    "సావిత్రీ!"
    "ఏం బెదిరిస్తున్నావా?"
    "నువ్వేం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా?"
    "తెలుసు. నేనెవరితో మాట్లాడుతున్నానో కూడా తెలుసు. ఒక హంతకుడితో మాట్లాడుతున్నాను. భార్యని నిలువునా దహనం చేసిన రాక్షసుడితో మాటాడుతున్నాను."
    "స్టాపిట్! ప్లీజ్ స్టాప్ దట్ నాన్సెన్సు" దాదాపు అరిచినట్టె అన్నాడు.
    "నేను ఆపను. నీ భార్యను, అందాలరాశిని, నిన్నెంతగానో ప్రేమించినదాన్ని ఎందుకు చంపావో తెలుసుకొనేంత వరకూ ఆపను."
    అకస్మాత్తుగా డైనింగ్ హాల్లో లైటు వెలిగింది.
    "సావిత్రీ ప్లీజ్! నీ రూమ్ లో కెళ్ళిపో. తర్వాత మాటాడుకుందాం. అనసూయ లేచింది" అన్నాడు కంగారు పడిపోతూ.
    సావిత్రి గిర్రున తిరిగి తన రూమ్ లో కెళ్ళింది.
    "విషయం పూర్తిగా తెలుసుకొని గానీ ఇక్కడ్నుంచి వెళ్ళ" నని చెప్పి మరీ వెళ్ళింది.
    రమణమూర్తి గుండెలనిండుగా గాలి పీల్చుకున్నాడు.
    తడబాటును అణుచుకున్నాడు.
    డైనింగ్ హాల్లోకి వచ్చాడు.
    అనసూయ డైనింగ్ టేబుల్ ముందు కూర్చుని ఉన్నది. ఆమె ముందు వాటర్ బాటిల్ వున్నది.
    "ఏమిటి అనూ! నిద్రపట్టలేదా?" నవ్వుతూ అడిగాడు.
    ఆమె అతడి ముఖంలోకి చూస్తుండిపోయింది.
    "ఏమిటి అలా చూస్తావ్?"
    "మిమ్ముల్నే"
    "నన్నా?"
    "అవును."
    "ఏం రోజులాగా లేనా?"
    అనసూయ అదోలా నవ్వింది.
    "నువ్వు నిద్రపోలేదా?"
    "పోయాను. అకస్మాత్తుగా మాటలు వినిపించాయి."
    "మాటలు వినిపించాయా?" ఆశ్చర్యాన్ని నటిస్తూ అన్నాడు.
    "ఒక పురుషుడూ, ఒక స్త్రీ ఘర్షణ పడుతున్నట్టు వినిపించింది."
    "కలవచ్చిందేమో"
    "కలకాదు. మీ గొంతు విన్నాను."
    రమణమూర్తి ముఖం వెలావెలా పోయింది.
    "నేను నవల చదువుతున్నాను."
    "అలాగా" అంటూ ఆమె బాటిల్ లోని నీరు గ్లాసులోకి వంపుకుంది.
    "నాక్కూడా ఇవ్వు"
    గ్లాసు అతడికి అందించింది.
    "నువ్వు తాగి ఇవ్వు"
    "ఫర్వాలేదు తాగండి"
    రమణమూర్తి గటగట నీరు తాగి ఖాళీ గ్లాసు ఆమెకి అందించాడు.

 Previous Page Next Page