Previous Page Next Page 
ప్రణయ వీచికలు పేజి 24

మిస్టర్ హారే ఆమె ముఖంలోకి ఆశ్చర్యంగా చూశాడు. తన ప్రశ్నకు తానే ఆశ్చర్యపడింది సీత. తాను బాబాయితో పెద్ద పెద్ద విషయాల గురించి చర్చిస్తున్నది. తనకు ఇంత ధైర్యం ఎలా వచ్చింది?
"వాడొక గాలి వెధవ. ఆ సంగతులన్నీ నీకెందుకూ? నీకు పొద్దుపోకపోతే మంచి పుస్తకాలు చదువుకో." మిస్టర్ హారే కంఠం కరుగ్గా ఉన్నది.
"పొరపాటుగా మాట్లాడితే క్షమించండి" సీత నీళ్ళునములుతూ అన్నది.
"వాడికి తలబిరుసు ఎక్కువ. అన్నీ అవకతవక పనులే చేస్తాడు. వాడి చేష్టలవల్ల ఇప్పటికే మనవాళ్ళకు ఇన్నో ఇబ్బందులు ఏర్పడ్డాయి" మిస్టర్ హారే అన్నాడు.
"ఇబ్బందులా? ఎలాంటి ఇబ్బందుకు?" నోటివరకు వచ్చిన మాటల్ని మింగేసుకొన్నది సీత. మౌనంగా తలవంచుకుని టిఫిన్ తినసాగింది.
"వైస్ రాయ్ కి అతనంటే చాలా కోపంగా ఉంది. అసలు వాడివల్లనే ఇండియన్ జడ్జెస్ ఇంగ్లీషు వాళ్ళమీద విచారణ జరపడం న్యాయసమ్మతం అనే భావం ప్రజల్లో బయలుదేరింది. వాడివల్ల ఇంగ్లీషు వాళ్ళ పరువుప్రతిష్టలు మంట గలిసేరోజు ఆసన్నం కాబోతుందనే భయంవల్లనే వైస్ రాయ్ నన్ను పిలిపించారు." మిస్టర్ హారే గంభీరంగా అన్నాడు.
"మీరు అతని భావాలతో ఏకీభవించారా?"
"ఏకీభవించడమా? అతని భావాలతోనా?"
సీత మరో ప్రశ్న వేయలేదు.
"అప్పటికీ నేను అతనికి చిన్నపిల్లవాడికి చెప్పినట్టు చెప్పాను. కనీసం ఆ బిల్లులోని కొన్ని భాగాలనైనా తొలగించమన్నాను. వీల్లేదని ఖచ్చితంగా చెప్పాడు."
ఆమె మిష్టర్ హారే ముఖంలోకి చూసింది. బాబాయ్ తనతో ముఖ్యమైన విషయాల్ని చర్చిస్తున్నాడు. ఆమెకు గర్వంగా ఉంది. సంతృప్తిగా ఉంది. సంతోషంగా ఉంది. తనకు ఇండియాకు వచ్చాక ఓ ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఏర్పడింది.
మిష్టర్ హారే మళ్ళీ అన్నాడు.
"ఏదిఏమైనా నేను చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని పరిశీలించాలి. వైస్ రాయ్ అంతటివాడు నామీద ఇంత బాధ్యత పెట్టాడు. బ్లాస్ట్ ఆలోచనల్ని న్యాయశాస్త్రంలో ఇరికించకుండా చూసే బాధ్యత నామీద ఉన్నది." సీత తనకు బాబాయి చెబుతున్న విషయాలు విసుగు కలిగిస్తున్నాయి. వినాలనిపించడం లేదు.
బాబాయ్! న్యాయశాస్త్రం నీకు కొట్టిన పిండి లాంటిది. నువ్వు తల్చుకుంటే ఏదయినా చెయ్యగలవు అన్నది మిస్టర్ హారేని సంతృప్తిపరచాలని.
"అవును సీతా! నువ్వు నిజం చెప్పావ్. నిజాంను ఒప్పించి మిష్టర్ బ్లంట్ ఆట కట్టించాలి" మిష్టర్ హారే ముఖం ప్రసన్నంగా ఉంది.
ఆమె ఆ ముఖంలోకి చూస్తూ "బాబాయి ఎప్పుడూ ఇలా వుంటే ఎంత బాగుంటుంది?" అని అనుకొన్నది.
"గుడ్ మార్నింగ్ సర్! గుడ్ మార్నింగ్ మిస్ అరాను! అన్నాడు ఒక సైనికాధికారి వారి దగ్గరకు వస్తూ.
"వెరీ గుడ్ మార్నింగ్!"
"ఈరోజు ప్రోగ్రాం తెచ్చాను" అన్నాడు సైనికాధికారి. ప్రోగ్రాం పేపరు హారే ముందు వుంచాడు.
"సర్! మిస్టర్ కార్డరీ మీకోసం అర్థగంట నుంచి ఎదురుచూస్తున్నారు. ఆయనతోపాటు రెసిడెన్సీకి సంబంధించిన లీగల్ ఎడ్వైజర్ కూడా వున్నారు. వాళ్ళు బిల్లు విషయంలో మీ అభిప్రాయాలను తెలుసుకోవాలని కుతూహలపడుతున్నారు."
మిస్టర్ హారే గంభీరంగా ముఖంపెట్టి తలపంకించాడు.
"వాళ్ళంతా కమిటీ హాల్లో వున్నారనుకొంటాను?" అడిగాడు హారే.
"అవును సర్! అని మిస్టర్ హారేకి సమాధానం చెప్పి, ఆమెకేసి చూశాడు సైన్యాధికారి.
"మిస్ అరాన్! మిస్టర్ బర్నెస్ అర్థగంటలో వస్తానని చెప్పమన్నారు. మీరు బేగం గార్డెన్స్ చూడాలన్నారటగా!"
"అవును! బర్నెస్ కు కృతజ్ఞతలు ఎలా చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. నన్ను ఎక్కడ కలుసుకోమన్నారు?" ఆమె కుతూహలంగా అడిగింది.
ఆయనే ఇక్కడకు వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తారు. సాయంకాలం ఇక్కడ డిన్నర్ కూడా వున్నది. దాదాపు ఏభయ్ మంది దాకా అతిథులు రావచ్చును.
"ముస్లిం కుటుంబాల వాళ్ళు కూడా వస్తారా?" ఆమె కళ్ళు పెద్దవి చేసి అడిగింది.    
రాయల్ ఫామిలీ వాళ్ళు వస్తారు. చిన్న ఎంటర్ టైన్ మెంటు ప్రోగ్రాం కూడా వున్నది.
"రియల్లీ?" అన్నది సీత. "యస్. ఆ తర్వాత డిన్నర్ హాల్ పక్కగా ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన హాల్లో బాల్ రూం డ్యాన్స్ కూడా వున్నది.
"వండర్ ఫుల్!" సంతోషంగా కేరింతలు కొట్టే పసిపిల్లలా అన్నది సీత.
"ఇదేమంత చెప్పుకోదగిన పార్టీ కాదు. వైస్ రాయ్ వచ్చినప్పుడు ఏర్పాటు చేసే పార్టీ చూడాలి మీరు"
"పార్టీ కూడా చూడాలని వుంది. అంతవరకూ ఇక్కడే వుంటాం గదూ బాబాయ్!." మిస్టర్ హారే సీతముఖంలోకి చూశాడు. ఆమె పక్క చూపులు చూసింది.
బాబాయికి కోపం వచ్చిందా?
"అది జరగబోయే సంప్రదింపులు మీద ఆధారపడి వుంటుంది. నా వుద్దేశ్యంలో మనము మరో రెండు నెలల వరకు అదే ఏప్రిల్ చివరి వరకూ ఇక్కడే వుంటాం" మిస్టర్ హారే ప్రసన్నంగానే సమాధానం ఇచ్చాడు.
సీత గుండెల నిండుగా గాలి పీల్చుకుంది. తను అనవసరంగా భయపడుతోంది. బాబాయి పూర్తిగా మారిపోయాడు. కనీసం ఇండియాలో వున్నంతకాలం అయినా బాబాయిలో ఈ మార్పు వుంటుంది.
"సర్ భారతీయులు ఇవాళ అంగీకరించిన విషయాన్ని రేపు కూడా అంగీకరిస్తారనే నమ్మకం నాకు లేదు." సైన్యాధికారి మాటలకు సీత తన ఆలోచనల నుంచి బయటపడింది. ఇద్దర్నీ మార్చి మార్చి చూసింది. కనురెప్పలు టపటపలాడిస్తూ చూసింది. ఆమె మనసులో పెల్లుబికుతున్న ఆనందం ఆమె ప్రతికదలికలోనూ ద్యోతకమౌతున్నది. మిస్టర్ హారే పెదవులపైన దరహాసరేఖ లీలగా కదిలింది.
"బ్లంట్ చాలా రిజర్వ్ డ్ గా వున్నాడు. అతను ఇలా మూర్ఖంగా ప్రవర్తిస్తే ఏ సంస్కరణ అయినా అమలుపరచడానికి వారాలేమిటి, నెలలే పట్టవచ్చు" అన్నాడు సర్ హారే.
"అవును సర్ మీరు చెప్పింది అక్షరాలా నిజం." అని సీతకేసి తిరిగి చిరునవ్వు నవ్వాడు.
"వస్తాను సర్" అంటూ కొద్ది అడుగులు ముందుకు వేసి ఆగి వెనక్కి చూసి, "మిస్ ఆరాన్ రేపు నిజాం ఇక్కడకు వస్తున్నారు."
"నిజాం వస్తున్నారా?" సీత తనకు తెలియకుండానే చివ్వున లేచి నిల్చుంది.

 Previous Page Next Page