Previous Page Next Page 
ప్రణయ వీచికలు పేజి 25

"అవును!"
"నేనూ విన్నాను - రెసిడెంటును కొత్త ప్రధానిని నియమిస్తారటగా?" సర్ హారే అడిగాడు.
"అవును సర్."
"నిజాం ఏనుగు మీద వస్తారా?" సీత పసిపిల్లలా కళ్ళు మెరిపిస్తూ అడిగింది.
"అవును! ఏనుగు మీదే వస్తారు. ఆయన ఎక్కినా ఏనుగుకాక మరో రెండు ఏనుగులు కూడా వస్తాయి" అనేసి బయటికి వెళ్ళిపోయాడు సైన్యాధికారి. సీత ఆనందంతో చప్పట్లు కొట్టింది.
సర్ హారే ఆమెకేసి చూశాడు.
"బాబాయ్! నాకు నిజాం చూడాలని వుంది. ఏనుగుల్ని కూడా వాటిని చాలా చక్కగా అలంకరిస్తారట గదూ?"
"నీకు సర్దాగానే వుంది. కాని రెసిడెంటుకు బొత్తిగా ఇష్టం లేదు."
"ఎందుకని?" హారే ముఖంలోకి కుతూహలంగా చూస్తూ అడిగింది.
రాజకీయ కుతంత్రాల గురించి నీకు ఇప్పుడే అర్థంకాదు. నిజాం బాగా ఆలోచించి మంచివాడిని ప్రధానిగా నియమించాలని కార్డరీ కోరిక. కాని బ్లన్ట్ ఇక్కడ కూడా కుట్ర చేస్తున్నాడు. వైస్ రాయ్ ని వల్లో వేసుకొన్నాడు. ఆ పరపతిలో ఎందుకూ పనికిరాని ఓ కుర్రకుంకను ప్రధానిగా నియమించాలనే ఆలోచనలో వున్నాడు. మిస్టర్ హారే తనకు తానే చెప్పుకొంటున్నట్టుగా మంద్రస్థాయిలో అన్నాడు. సర్ హారే డైనింగ్ టేబుల్ ముందునుంచి లేచాడు. తనతో గదిలోకి వెళ్ళిపోయాడు.
కాని హారే ఈ విషయాలు తనతో చర్చించడానికి ఇష్టపడడని ఆమెకు తెలుసు. తనను మరీ పసిపిల్లలా తేల్చి పారేస్తాడు బాబాయి. చాలామంది మగవాళ్ళలాగే, ఆడవాళ్ళతో రాజకీయాలు మాట్లాడటానికి అతను ఇష్టపడడు. ఆడవాళ్ళు రాజకీయాలు అర్థం చేసుకోలేరని వాళ్ళ నమ్మకం.
సీత నిట్టూర్పు విడిచింది. కిటికీలో నుండి తోట కన్పిస్తున్నది. ఆమె మనసులో ఆ అజ్ఞాత నేస్తం మెదిలాడు. అనాయాసంగా ఆమె పెదవులు విచ్చుకొన్నాయి. బుగ్గలు గులాబిరేకలా అయ్యాయి. కళ్ళల్లోకి కొంత వెలుగు తోసుకొని వచ్చింది. అతడు ఈసారి కన్పిస్తే తన సందేహాలన్నీ అతని ముందు వుంచాలి. అతను ముందు వుంచాలి. అతను తప్పక సమాధానం ఇస్తాడు.
ఈ రెసిడెన్సీలో రెండు గ్రూపులు ఉన్నట్టు తనకు కూడా అర్థం అయింది. తన బాబాయి దృష్టిలో తను ఒక ఫూల్, పసిబిడ్డ. ఇలాంటి విషయాలు గురించి ఆలోచించే హక్కు తనకు లేదు. సీత కిందపెదవిని మునిపంటితో నొక్కింది. పెద్దవాళ్ళు- అదే వయసుతోపాటు అనుభవాన్ని జీర్ణించుకొన్నవాళ్ళంతా లార్డ్స్ రిప్పన్ అభిప్రాయాలతో ఏకీభవించడం లేదని తనకు అర్థం అయింది.
ఇందులో ఏ గ్రూపును తన నేస్తం సమర్థిస్తాడో?
"మేమ్ సాబ్!" సీత ఆలోచనల దారం పుటుక్కున తెగింది. గిర్రున తిరిగి చూసింది. రెసిడెన్సీలో పనిచేసే కుర్రవాడు నిల్చుని వున్నాడు.
"ఏమిటి?"
"మేమ్ సాబ్! దర్జీ వచ్చాడు. మీరు పిలవమన్నారు గదూ?"
"దర్జీ అంటే టైలర్ కదూ?" అన్నది సీత. ఒకరి భాష ఒకరికి అర్థం కాదు. పనికుర్రాడు కొన్ని ఇంగ్లీషు పదాలు వల్లించగలడు. వాటికితోడు సైగలు కోడించి ఆమెకు అర్థం అయ్యేలా చెప్పడానికి ప్రయత్నించాడు.
"టైలర్ ఎక్కడున్నాడు?" అన్నది.
అమర్ వెనకే వెళ్ళింది.
అక్కడ టైలర్ మూటవిప్పి బట్టలు చూపించాడు. సీత కళ్ళు విప్పారాయి. తెల్లపట్టుమీద జరీ పువ్వులున్న బట్ట ఆమెను ఆకర్షించింది. ఒకటి డే డ్రస్, ఒకటి ఈవెనింగ్ డ్రస్ కుట్టమన్నారని వచ్చీరాని ఇంగ్లీషులో టైలర్ చెప్పాడు. ఆమె లోపలకువెళ్ళి తన డే డ్రస్సూ, ఈవెనింగ డ్రెస్సూ తెచ్చి ఇచ్చింది. వాటి ఆదిలో కుట్టమన్నది.
"ఎవరు పంపించారు?" అని అడిగింది సీత.
"నాకు తెలియదు. మరో దర్జీ నాకు ఇచ్చాడు" అన్నాడు దర్జీ.
ఆమె దుస్తులు దర్జీ తెచ్చినబట్టలముందు వెలవెల పోతున్నాయి.
"కుట్టుకూలి ఎంతవుతుంది?" భయంగా అడిగింది సీత. ఎక్కువయితే తను ఇచ్చుకోలేదని ఆమెకి తెలుసు. మిస్టర్ హారేను డబ్బు అడగాలంటే ఆమెకు భయం. డబ్బు విలువను గురించి పెద్ద లెక్చర్ ఇస్తాడు.
"మీరివక్కర్లేదు మేడం" అన్నాడు దర్జీ. సీత రిలీఫ్ గా గాలి పీల్చి వదిలింది. దర్జీ వెళ్ళిపోయాడు. అతనే పంపించి వుంటాడు. అతనికంటే తనగురించి ఇంతగా మరెవరు ఆలోచిస్తారు? సీతకు వెంటనే అతనికి థ్యాంక్స్ చెప్పాలనిపించింది. కాని అతడు అనుకున్నప్పుడల్లా కన్పించదని ఆమెకు తెలుసు. చిత్రమైన వ్యక్తి తనంటే ఎందుకో ఇంత ఇది? కనీసం అతను తనకుతనపేరు కూడా చెప్పలేదు. బర్నెస్ వచ్చాడు. అతనితో ఆమె బేగం పార్కుకు వెళ్ళింది. ఆమెకు ఆ తోటలోని ప్రతి పువ్వు, ఆకూ, తీగా, ఖైరున్నిసా ప్రేమకథను విన్పిస్తున్నట్టుగా అన్పించింది. ప్రేమ! జగమంతా ప్రేమమయం!
అతను...తనను...కిర్క్ పాట్రిక్ ఖైరున్నిసాను ప్రేమించినట్టు ప్రేమిస్తున్నాడా?
ఆ తోటలో వున్న చిన్న బంగళాలోకి ఆమె వెళ్ళాలని ప్రయత్నించింది. కాని బర్నెస్ అందుకు అంగీకరించలేదు. ఖైరున్నిసా ప్రేమ ప్రచండమైనది. ఆ ప్రేమకు ఆమె సరదా అడ్డం రాలేదు. మతం అడ్డం రాలేదు. దేశం అడ్డం రాలేదు.
"వాళ్ళ పిల్లలు ఆనందంగా జీవించారా?" సీత ప్రశ్నకు అతను చిరునవ్వు నవ్వాడు.
"ఆ ప్రశ్న ఎన్నోసార్లు నాకు నేనే వేసుకొన్నాను" అన్నాడు ఆలోచిస్తూ బర్నెస్.
"మరి ఆ ప్రశ్నకు సమాధానం దొరికిందా?" సీత కుతూహలంగా అడిగింది. బ్లన్ట్ ఆమె అతను ఆమె కళ్ళలోకి లోతుగా చూశాడు. తల ఊపాడు. "లేదు" అన్నాడు.
ఇలాంటి వివాహాలవల్ల తెలివైన పిల్లలు పుడతారంటారు. ఆరోగ్యంగా కూడా ఉంటారట. కాని సంతోషంగా వుండరట. తండ్రివైపు వాళ్ళుగానీ, తల్లివైపు వాళ్ళుగానీ ఇలాంటి పిల్లల్ని ఆదరించరట" సాలోచనగా అన్నది సీత.
"అవును! అలాంటి పిల్లలు చాలా తెలివయినవాళ్ళుగా వుంటారు." ఆమెకు అజ్ఞాత స్నేహితుడు గుర్తొచ్చాడు. అతను మేధావి. అతని తండ్రి ఇంగ్లీషువాడై వుంటాడు. తల్లి ఇండియన్ అయి వుండాలి.
"ఏమిటి ఆలోచిస్తున్నారు?"

 Previous Page Next Page