Previous Page Next Page 
పిపాసి పేజి 23


    పచ్చని తలంబ్రాలు వర్షపు జల్లులా వళ్ళంతా కప్పేస్తూంటే అంతా మరిచిపోయి మరోలోకంలో విహరించారు రాధికా మధన్ లు.  


    పెళ్ళి అయిపోయింది. సరోజినీ, రాజేశ్వరమ్మ, రేణుక కలిసి, రాధికని పందిరిలోంచి మెల్లగా నడిపిస్తూ లోపలకు తీసుకుపోయారు. దాంతో అంతా ఒక్కొక్కరే వెళ్ళిపోయారు. భోజనాలకు ఏర్పాటు చేశారు. సాంబశివరావుగారూ, సత్యం ముఖ్యమైన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళంతా వెళ్లిపోవడం వల్ల, పందిరి ప్రశాంతంగా వుంది. కానీ, రాధిక హృదయంలో సముద్రం ఘోషిస్తోంది. "నలుగురూ ఇలా అంటూ ఉంటే మధన్ చిన్నబోతాడేమో! ఇదే ఆమెని వేధిస్తూన్న ప్రశ్న. కానీ అతని వదనంలో అటువంటి ఛాయలేమి కనపడకపోవటంతో మనస్సులోనే భగవంతునికి కృతజ్ఞతలర్పించుకుంది.  


    సత్యం మాత్రం భోజనాల ముందు, అందర్నీ తెగ నవ్విస్తున్నాడు.


    సాయంత్రానికల్లా రాజేశ్వరమ్మ, రేణుక మధన్ గది సర్దడంలో నిమగ్నులయ్యారు. సరోజిని రాధికను అలంకరించింది. ఎఱ్ఱటి అంచు తెల్లటిపట్టుచీర కట్టింది. నగలన్నీ వేసి, తలనిండా పూలు పెట్టి పూలజడ వేసింది, పెందలాడే భోజనాలు పెట్టి, పాలగ్లాసుతో లోపలికి తోసేవరకూ, రాధికకు అర్థం కాలేదు ఆ తతంగం అంతా.     


    ఎందుకో ఒక్కసారిగా సిగ్గుముంచుకొచ్చి, ఒళ్ళంతా చెమటలు పట్టినయ్. చేతులూ కాళ్ళూ, వొణుకుతున్నట్టనిపించింది. అడుగు వెనక్కి వెయ్యబోయేసరికి, తలుపులు దభిలుమని మూసేశారు బయటినుంచి.   


    మంచం మీద ఆలోచిస్తూ కూర్చున్న మధన్ తలుపు చప్పుడుకి తిరిగి చూశాడు. మల్లె మొగ్గలా తలుపు దగ్గర ముడుచుకుపోయి నుంచున్న రాధిక ముగ్ధ సౌందర్యాన్ని కళ్లార్పకుండా చూసి, చకితుడయ్యాడు. పాలగ్లాసుతో వొయ్యారంగా నుంచున్న రాధిక, కలల్లో కనిపించే స్వప్న సుందరిలా, శిలల పాయ చూసే అజంతా సుందరిగా, కావ్యాలలో చదివే గంధర్వ కన్యలా కనిపించింది. అక్కడ రంగులూ, కుంచె ఉంటే అమాంతంగా అప్పటికప్పుడే బొమ్మ గీసేసి ఉండేవాడు.


    మెల్లగా నడిచి వెళ్ళి, ఆమె భుజాలమీద చెయ్యి వేశాడు. ఆ స్పర్శకి, ఉలిక్కిపడింది రాధిక.


    చెయ్యిపట్టుకుని నడిపించి మంచం మీద కూర్చోబెట్టాడు, చేతిలోని పాలగ్లాసు తీసి పక్కన బెడుతూ కృతజ్ఞత నిండిన మనస్సుతో, వొణుకుతూన్న అధరాలతో, బరువెక్కిన కనురెప్పల్ని మెల్లగా పైకెత్తి అతనికేసి చూసింది రాధిక. మన్మథ బాణాల్లాంటి ఆ చూపులవాడి కోర్చుకోలేక, గట్టిగా ఆమెను గుండెలకి అదుముకున్నాడు మధన్. ఆలింగనంలో స్వర్గ సుఖాలను అనుభవించింది రాధిక.


    "రాధీ...."


    "ఊ...." అంది నెమ్మదిగా మత్తుగా.


    "దేముడు చాలా మంచివాడు అందుకే ఈ అందాలరాశిని, ఈ సుగుణాల్పోగును, నాకు భార్యగా ఇచ్చాడు కదూ" అన్నాడు పెదవులు చుంబిస్తూ.    


    "ఏమోనండీ నాకు తెలీదు నాకు తెలిసిన ఒక్కడే చీకటిలో మునిగిపోయి కొట్టుమిట్టాడుతూన్న నాకు, వెలుగు చూపించి, వెన్నెలలు పండించుకునే భాగ్యాన్ని కలిగించిన మహాత్ముడు నన్ను చేబట్టిన నాథుడు."     


    "ఊ..... కవిత్వం చెప్తున్నావే"


    "కాదు కమ్మని యదార్థాన్ని వివరంగా చెబుతున్నాను."


    అతని కౌగిలిలో ఉక్కిరిబిక్కిరవుతోంది రాధిక.


    "రాధికా.... ఈనాటితో ఇరువురం ఒక్కటయ్యాం మనతోపాటు మన ధ్యేయం, మనజీవనం కూడా ఒకటి కావాలి. లోకంతో నాకు పనిలేదు. నేను నిర్మించుకున్న ఆశయాల ఆలయంలో, నా రాధికని దేవతగా ప్రతిష్టిస్తాను నేను పూజారినై కర్తవ్యాన్ని నెరవేరుస్తాను. రాధీ నువ్వు కలహంసవై, మయూరివై ఆడుతూ వుంటే, నేను కవినై, చిత్రకారుణ్ణి అయి, రచనలు చెప్తాను. చిత్రాలు గీస్తాను. రాధికా - మధన్ ల నృత్య సంగీత చిత్రశాలను నిర్మిస్తాను. కళాసరస్వతిని సేవిస్తూ పదిమందికీ లలితకళలను పంచి పెడతాను. మనదేశాన్ని కళాఖండంగా మార్చేస్తాను. దీనికంతటికీ నా రాధికని సూత్రధారిణిని చేస్తాను...." ఆవేశంలో ఊగిపోతూ, రాధికను మరింత గట్టిగా తన హృదయానికి హత్తుకుపోయేలా కౌగిలించుకున్నాడు.    


    రాధిక ఆశ్చర్యంగా అతనివైపు చూసింది.


    "ఏమిటి రాధీ.... ఏమిటలా చూస్తున్నావు" అన్నాడు, ఆమె చెక్కిళ్ళు నిమురుతూ.


    "ఏవండీ... నా ఆశయాల ఆలయం ఏమిటో తెలుసా? మన యిల్లు ఆ ఆలయంలోని దేముడు మీరే నేను పూజారిణినై మీ సేవలు చేస్తూ, పిల్లాపాపలతో, ఆదర్శగృహిణిగా బతికి, పసుపు కుంకుమలతో మీ చేతుల్లో కళ్ళు మూస్తాను. ఈ వరాలు ప్రసాదించమని, ప్రతినిత్యం మీకే పూజలు చేస్తాను." అతని హృదయానికి తల ఆన్చుకుని. ఊహల్లో తేలిపోతూ అంది రాధిక.  


    మధన్ ఉలిక్కిపడ్డాడు. "రాధీ.... నువ్వు మామూలు దానిలా మాట్లాడుతున్నావు. నువ్వొక కళాకారిణివి అంతులేని శక్తి నీలో దాగి వుంది. దాన్ని వృధా చెయ్యడం అవివేకం."   


    "ఏమండీ! నాలో ఏ శక్తి వుందో ఏముందో నాకనవసరం. ఇప్పుడు, నేను నేను కాదు. అసలు నేనంటూ ఒకదాన్ని కాను. మీరే నేను. మీ సేవే నా తృప్తి. నా నాట్యం, నా గానం అంతా ఇన్నాళ్ళూనే కప్పుకున్న ముసుగు. దానితో నాకింక పనిలేదు. నేను నిర్మించుకున్న పవిత్ర ఆలయంలో వాటికి తావులేదు."      


    "రాధీ....."


    "అవునండీ, నేనన్నది ముమ్మాటికీ నిజం" అతని భుజంమీద తలపెట్టి, కళ్ళు మూసుకుంది ఆనందానుభూతుల్లో తేలిపోతూ.


    మధన్ ఆలోచనలో పడిపోయాడు.


    రాధిక కళ్ళు మూసుకుని కలలు కంటోంది. తన్మయత్వంలో మునిగిపోయిన రాధిక, కళ్ళు తెరచి అతనికేసి చూసింది. "ఏమిటండీ..... ఆలోచిస్తున్నారూ" అంది.                 

 Previous Page Next Page