మతిపోయినవాడులా దిక్కులు చూశాడు.
"నీకే చెబుతూంది.!"
పిచ్చిచూపులు చూశాడు.
"వెడతావా లేదా?" గర్జించింది.
"మరి...నా...పని?" అన్నాడు ఎలాగో తెప్పరించుకొని.
"ఏం పని? నీలాంటి వాళ్ళను గుమ్మంలో అడుగు పెట్టనివ్వడమే నా తప్పు."
"నా డబ్బు?" జారిపోతున్న గుండెల్ని ఎగదోసుకుంటూ అన్నాడు సీతారామయ్య.
"ఏం డబ్బు? ముందు బయటకెళ్ళు!" గట్టిగా అరిచింది అరుంధతి.
తలవంచుకొని, దెబ్బతిన్న పులిలా బయటి కెళ్ళిపోయాడు విసురుగా సీతారామయ్య. అలా వెళ్ళిపోతున్న అతన్ని కొంచెంసేపు కసిగా చూసి, మళ్ళీ తనలో తనే నవ్వుకుంది.
రాజావారికి ఆ పెద్దమనిషిమీద జాలి వేసింది. అక్కడ కూచోటానికి భయం వేస్తూంది. ఎప్పుడు బయట పడదామా అనిపించింది.
సీతారంమయ్య ఆమెకు చేసిన అపచారం ఏమీలేదు. అతని పనికి పదివేల బేరం కుదిరింది. అయిదువేలు ముందుగానే ఇచ్చాడు. జనార్ధనరావు పదిహేనువేలు ఇచ్చేడు. సీతారామయ్యకు ఇప్పించాలనుకున్న లైసెన్సును జనార్ధనరావుకు ఇప్పించింది. సీతారామయ్యను ఎలాగయినా వదిలించుకోవాలి! అలాంటి పరిస్థితుల్లో "మేకా పులి" కథల్లోలా ఏదో ఒక కారణం వెతుకుతోంది వాళ్ళతో పేచీ పెట్టుకోవటానికి. ఇలాంటి కేసు ఇది మొదటిది కాదు. లంచం తీసుకోవటం ఎంత తప్పో, ఇవ్వటం కూడా అంతే తప్పు కనుక, వాళ్ళు దొంగకు తేలు కుట్టినట్లు కిక్కురు మనకుండా వెళ్ళిపోతారు. కాని ఆమెను కసితీరా తిట్టుకుంటూ, ఆమెను గురించి రకరకాల కథలూ ప్రచారం చేస్తారు.
మిగిలిన ఇద్దర్నీ తెల్లవారి రమ్మని మర్యాదగానే చెప్పింది. వాళ్ళ వెనకే నాగేంద్రరావు వెళ్ళాడు. వాళ్ళను గేటుబయట కలుసుకొని ఏదో మాట్లాడి లోపలకు వచ్చాడు.
చిన్నయ్య ఫ్లాస్కుతో కాఫీ పట్టుకొచ్చాడు.
"ఏమయ్యా? సరిగ్గా రెండు కప్పులుపట్టే ప్లాస్క్ కొనుక్కొచ్చావ్! నీ కాకిబుద్ధి పోనిచ్చావ్ గాదు!" అంది. చిన్నయ్య ముఖం చిన్నది చేసుకున్నాడు. అంత ఉత్సాహమూ ఇట్టే నీరుగారి పోయింది. నాగేంద్రరావు లోపలకు వెళ్ళి రెండు కప్పులూ, సాసర్లూ పట్టుకొచ్చాడు. చిన్నయ్య కాఫీపోసి అరుంధతికి ఓ కప్పు ఇచ్చి రాజాగారికి మరో కప్పు ఇచ్చాడు.
అరుంధతి కాఫీ "సిఫ్" చేస్తూ అంది. "ఆఁ ఏమన్నారూ? యం.పి. సీటుకి అప్లయ్ చెయ్యాలని వుందనిగదూ అన్నారు?"
"అవునండీ" అన్నాడు రాజావారు స్వరంలోకి మార్దవాన్ని తెచ్చిపెట్టుకోవటానికి ప్రయత్నిస్తూ.
"చెయ్యండి, మంచిదేగా!" అంది ఎటో చూస్తూ నిర్లక్ష్యంగా.
"కాని...."
"అబ్బే అనుమానం ఎందుకు? తప్పక గెలుస్తారు!" అంది అరుంధతి.
"అది నాకూ తెలుసు. కాని ముందు సీటు రావాలిగా!" అన్నారు రాజారావు తమ సహజధోరణిలో గంభీరంగా.
"మీకు సీటు రాకపోవటం ఏమిటి?"
"అలా అనకండి, తమ దయ వుంటేనే!" నవ్వబోయి రాజావారు ఆమె ముఖం మాడ్చుకోవటం చూసి ఠక్కున ఆగిపోయారు.
అరుంధతి కప్పులో మిగిలిన కాఫీని ఒక్కగుక్కలో తాగేసి, లేచి లోపలకు వెళ్ళిపోయింది.
రాజావారు ఆమె ఏదో అర్జెంటుపనిమీద అలా వెళ్ళిందనుకున్నారు. కూచున్నారు ఆమెకోసం చూస్తూ. కాని లోపలనుంచి ఎంతకూ రాదు. అర్ధగంటకు పైనే అయింది. రాజావారికి ఆశ్చర్యం వేసింది. మళ్ళీ రాదేమో! ఛ! రాకుండా ఎలా వుంటుంది? అకస్మాత్తుగా తనకు ఏమీ చెప్పకుండానే లోపలకు వెళ్ళిందిగా - తప్పక వస్తుంది. మాటి మాటికి మెట్లవైపు చూస్తూ కూర్చున్నారు రాజావారు.
"ఏమయ్యా నాగేంద్రరావూ! ఆమెగారు ఎంతకూ రాదేం?" అడిగారు రాజావారు వుండబట్టలేక.
"ఇంకా వస్తుందనే కూర్చున్నారా?"
"అదేం?" విస్మయంగా ప్రశ్నించారు రాజావారు.
"అది అంతే!" అన్నట్లు చిరునవ్వు నవ్వాడు నాగేంద్రరావు.
"మీరు విషయాన్ని తేల్చేసి ఒక్కసారే చెప్పేస్తే ఎలాగండి? ఒకటికి పదిసార్లు అమ్మగారిని కలుసుకోవాలి. ఆ మాటా ఈ మాటా మాట్లాడాలి. అసలు మాట వెంటనే కుండబద్దలు కొట్టినట్టు చెప్పేయకూడదు. క్రమంగా మీ మాటల్లో చెప్పనట్లే చెప్పాలి. ఆమె విననట్లే వింటుంది."
రాజావారికి వళ్ళు మండిపోయింది "అదేంటయ్యా వూరికినే చేసి పెడుతుందా ఏం? కావాల్సిందేదో వెంటనే చెప్పేస్తే ముఖం మీద పారేస్తాగా! ఆమె చుట్టూ తిరగాల్సిన ఖర్మమేం పట్టింది?" ఉబికివస్తున్న కోపాన్ని అణుచుకుంటూ అన్నారు రాజావారు.
"అమ్మగారి దగ్గర అంత త్వరగా పనులు జరగవయ్యా! మీకంటే ముందునుంచే చాలామంది సీట్లకోసం తిరుగుతూ వున్నారు. ఆడాళ్ళుకూడా తెగ తిరుగుతున్నారు. రామినీడుగారు అమ్మగారు వాడుకోవడం కోసం తమ కారును ఇక్కడే వదిలేసి వెళ్ళారు. మరో కొత్తకారు కొని ఇచ్చేంతవరకూ తమ కారుని వాడుకోమని మనవి చేసుకున్నారు. వారుకూడా యం.పి. సీటు కోసమే తిరుగుతున్నారు" అన్నాడు నాగేంద్రరావు.
"ఆ యువతి కూడా సీటు కోసమేనా తిరుగుతోంది?" రాజావారు ప్రశ్నించారు జానకిని ఉద్దేశించి.
"అబ్బే లేదండి! ఆమెకు రావాల్సిన ప్రమోషన్ ఏదో రాలేదట, దానికోసం వస్తోంది."
"మరి అంత అభిమానం చూపిస్తుందేం?"
"ఆమెకు చాలా అభిమానమండి. ప్రమోషను వస్తే వస్తుంది. లేకపోతే లేదు. అభిమానం మాత్రం చంపుకోను అన్నట్లు వుంటుంది. ఆమెను ఎప్పుడూ కసురుకోరు" నాగేంద్రరావు చెప్పుకుపోతున్నాడు- రాజావారు దిగ్గున లేచారు.
"సరే! రేపు వస్తానని చెప్పు మీ అమ్మగారికి" అంటూ లేచిన రాజావారు మనస్సులోనే అరుంధతిని తనకువచ్చిన తిట్లన్నీ తిట్టుకున్నారు.
నాగేంద్రరావు వుసూరుమంటూ లాన్ లో చతికిలబడ్డాడు. అమ్మగారు వెళ్ళమని సెలవు ఇవ్వందే అతను వెళ్ళటానికి వీల్లేదు. నాగేంద్రరావు తిట్టుకుంటూ కూచున్నాడు.
26
"రేపేనా మీ సన్మానం?" అరుంధతి ఏదో ఆలోచిస్తూ నిదానంగా అడిగింది.
"అవును. చాలా హడావిడి చేస్తున్నారు. నేను అసలు వద్దన్నాను కాని వాళ్ళు వినటంలేదు" అన్నాడు రాజారావు సిగరెట్ పొగను గాలిలోకి వూది సుడులు తిరుగుతున్న ఆ పొగలోకి దీర్ఘంగా చూస్తూ.
"సన్మానం చేస్తామంటే వద్దనటం ఎందుకులెండి! ముందు ముందు కావాలన్నా చేసేవారు వుండకపోవచ్చు."
రాజారావు సిగరెట్ పొగలో చిక్కుపడిన కళ్ళను అరుంధతి వైపుకు తిప్పాడు. వెంటనే మళ్ళీ తన చూపుల్ని మరల్చుకున్నాడు. సిగరెట్ దమ్మును గట్టిగా పీల్చాడు.
"రేపు సన్మానానికి ఇక్కడనుంచే వెళ్ళండి. మిమ్మల్ని తీసుకెళ్ళటానికి వచ్చేవాళ్ళని ఇక్కడికే రమ్మని చెప్పండి" అంది అరుంధతి ఏదో నిర్ణయాన్ని వినిపిస్తున్నట్లు.
"ఎందుకూ?" విస్మయంతో ఠక్కున అడిగేశాడు.
"నేను వస్తాను." ఖచ్చితంగా అంది.
"నువ్వొస్తావా?" అయోమయంగా ప్రశ్నించాడు రాజారావు.
"ఏం? అంత అయోమయంగా ముఖం పెడతారేం? నన్ను తీసుకెళితే, ఆ చేసే సన్మానం చెయ్యనంటారా?" ఆమె కంఠం వ్యంగ్యంగా స్పష్టంగా దృఢంగా పలికింది.
"అది..కాదు...."
"ఓహో! సన్మానం నాక్కూడా చేసేస్తారనే భయం కాబోలు!" అంది అదో ధోరణిలో.
"అదికాదు....అరూ!"
"ఏదికాదు? మనిద్దర్ని గురించి ఎవరికి తెలియదనీ?"
"తెలుసు కనుకనే వద్దంటున్నాను" అన్నాడు రాజారావు.
"ఇంతకాలం మీ తియ్యటి మాటలు నమ్మాను. పిచ్చిదాన్నే అయ్యాను. అందువల్ల నేను చాలా పోగొట్టుకున్నానని క్రమంగా తెలుస్తూంది. ఇకనుంచి మీతో బాహాటంగానే తిరగదలుచుకున్నాను" అంది అరుంధతి పరీక్షగా రాజారావును గమనిస్తూ.
రాజారావు కొంచెం తొట్రుపాటు చెందాడు. మళ్ళీ సర్దుకొని "అది మనిద్దరికీ మంచిదికాదు. నన్ను అర్ధం చేసుకో అన్నాడు."
"అవును. మిమ్మల్ని అర్ధం చేసుకుంటూనే వున్నాను. ఈ పదేళ్లుగా నేను మిమ్మల్ని అర్ధం చేసుకోవటానికి ప్రయత్నిస్తూనే వున్నాను. మీరూ మిమ్మల్నర్ధం చేసుకోమని చెబుతూనే వున్నారు." బాధగా అంది.
"నీకు నేనేం తక్కువ చేశాను?"
"అవును-నాకేం తక్కువ చెయ్యలేదు. అన్నీ ఇచ్చారు. పెద్ద భవనం కట్టించారు. ఇంటిముందు తోట వేయించారు. వజ్రవైడూర్యాలు, బోలెడంత డబ్బు సంపాదించుకున్నాను. ఇంటి చుట్టూ కుక్కల్లా తిరిగే పెద్దమనుషులు! నా కీర్తి ఢిల్లీ వరకు వ్యాపించటం! అప్పుడప్పుడు రహస్యంగా వస్తున్నానని మిమ్మల్ని మీరే భ్రమ పెట్టుకుంటూ వస్తూ వుండటం! ఇంతకంటే నాకేం కావాలి? అవును నాకేం కావాలి? అన్నీ వున్నాయి. కాని స్త్రీ నిజంగా కోరుకునేది ఏమిటో అదే లేదు." అరుంధతి కంఠం కోపంతో, దుఃఖంతో వణికింది.
"కాదు, అరూ!"
"కాదు, అవును నేను మీకు భార్యను కాను. ఇంతకంటే ఎక్కువ పొందే అర్హత నాకు లేదు, అవును! భర్తనూ, ఇంటినీ, బిడ్డనూ, గౌరవాన్నీ అన్నిటినీ వదిలి వచ్చాను. మీతో పద్దానుగు ఏళ్ళుగా వుంటున్నాను. కాని మీకు నేనేం కాను. నేనీమీ కాను. నాకు మీమీద ఎలాంటి అధికారమూ లేదు."
తనకు తనే చెప్పుకుంటున్నట్లు చిన్న కంఠంతో ఎక్కడకో చూస్తూ అంది.
"నువ్వలా మాట్లాడితే నేనేం చెప్పగలను చెప్పు?" మరో సిగరెట్ తీసి ముట్టిస్తూ అన్నాడు రాజారావు.
"మీరేం చెప్పగలరు? మీరేమి చెప్పలేరు. భయం ఎందుకు సత్యం చెప్పటానికి? నువ్వు నాకేమీ కావు, నిన్ను నావెంట బహిరంగంగా వెంట పెట్టుకొని వెళ్ళలేను అని చెప్పండి." వస్తున్న దుఃఖాన్ని బలవంతంగా గొంతులోనే తొక్కిపట్టటానికి ప్రయత్నిస్తూ అంది.
"అలా అని నేను అన్నానా? నువ్వు నాకేం కావని నేను అన్నానా? నువ్వు నా సర్వస్వానివి." రాజారావుకు తన మాటలు తనకే కృత్రిమంగా వినిపించాయి.
"హుఁ! సర్వస్వం! అయితే మరి నన్ను ఎందుకు బహిరంగంగా స్వీకరించటానికి భయపడ్డారు? ఈ పద్ద్నాలుగు సంవత్సరాల్లో ఒక్కసారయినా నన్ను మీ వెంటబెట్టుకొని ఎక్కడికయినా తీసుకెళ్ళారా? కనీసం ఇది మీ ఇల్లేననీ, ఈ ఇంట్లో ఉన్న వ్యక్తి మీ మనిషి అనీ, ఆమె దగ్గరకు వెళ్ళటానికి నేను ఎందుకు భయపడాలి అనీ, ఈ పద్నాలుగు సంవత్సరాల్లో ఒక్కసారయినా అనుకున్నారా? మీరు మీ జీవితంలో నాకు ఇచ్చిన స్థానం ఏమిటి? మీ దృష్టిలో నేను మీ ఉంపుడుగత్తెను. సమాజం దృష్టిలో నేను పతితను, లేచి వచ్చిన మనిషిని." అరుంధతి కంఠం జీరబోయింది.
రాజారావు లేచి అశాంతిగా గదిలో అటూ ఇటూ పచార్లు చెయ్యసాగాడు.
"నేను చేసిన ఆ పని-ఏ రిక్షావాడికోసమో, ఏ కూలీవాడికోసమో చేసివుంటే, వాడు నాకు ఈ వైభవం ఇవ్వలేకపోయినా, తన ఇంట్లో తన పెళ్ళానికి ఇచ్చిన స్థానాన్ని ఇచ్చేవాడు. నన్ను తన జీవిత భాగస్వామిగా ధైర్యంగా స్వీకరించేవాడు. అతడు ధైర్యంగా స్వీకరిస్తాడు గనుక-అతని చుట్టూ ఉన్న వర్గం కూడా చచ్చినట్లు గౌరవం ఇస్తుంది." కంఠంలో దుఃఖం మాటల్ని వెనక్కు నెట్టేసింది.
"అరూ!" వ్యాకులపాటుతో అన్నాడు రాజారావు ఆమె దగ్గరగా వచ్చి నిల్చుంటూ.
"మీరు నాకు ఇవ్వవలసిన స్థానం ఇచ్చి ఉంటే, సమాజం కూడా నన్ను గౌరవంగానే చూసేది." అరుంధతి అంది- చిన్నగా రుద్ధ కంఠంతో.
"ఇప్పుడు నన్నేం చెయ్యమంటావు?"
"ఇంకా ఇప్పుడు ఏం చేస్తారు? నా జీవితమంతా అయిపోయింది. రేపు మీతో రావాలని గానీ, ఆ సన్మానంలో భాగం పంచుకోవాలని గానీ నాకు నిజంగా కోరిక లేదు. ఒకప్పుడు, చిన్నతనం వల్లనే కావచ్చు - ఉండేది. కనీసం మీ సన్మానాలు చూడలేక పోతున్నాననీ, మీ ఉపన్యాసాలు వినలేకపోతున్నాననీ, ఎన్నో రాత్రిళ్ళు మౌనంగా రోదించేదాన్ని. అన్నీ ఉన్నాయి కాని నా కన్నీళ్ళు తుడవటానికి ఎవరూ ఉండేవారు కారు. ఈ భవనం, ఈ ఖరీదైన సామాగ్రీ, డబ్బూ, ఇవి ఏమీ నన్ను లాలించి ఓదార్చలేకపోయాయి."
"అరూ! అంత బాధపడినట్లు నాకు తెలియదు. నువ్వు ఒక్కసారయినా నాతో అనలేదు."
అరుంధతి తిరస్కారంగా నవ్వింది. ఆ నవ్వులో జీవితంలో రుచి చూసిన చేదంతా నిండి ఉంది.
"నేను చెప్పాలా? అర్ధం చేసుకొనే బాధ్యత మీకు లేదూ? నా గురించి ఆలోచించటానికీ, అర్ధం చేసుకోవటానికీ మీకు తీరిక ఉంటే గదూ? అధికారం వెంట పరుగు మొదలుపెట్టారు. డబ్బుదాహం పెరిగింది. మీ పిల్లలకు పెద్ద పెద్ద చదువులు చెప్పించాలి. విదేశాలకు పంపించాలి. పెద్ద పెద్ద లక్షాధికారులతో సంబంధాలు చెయ్యాలి. ఇలాంటివి ఎన్నో బాధ్యతలు మీ నెత్తిమీద ఉన్నాయి. వాటిని గురించిన ఆలోచనలతోనే మీకు ఊపిరి సలపక చచ్చిపోతూంటే, నా గురించి ఆలోచించే అవకాశం ఎక్కడ ఉంది? అవసరం మాత్రం ఏముంది? మరీ అంతగా విసుగ్గా ఉంటే నా అందం ఒకసారి గుర్తొచ్చేది. ఎవరూ చూట్టం లేదనుకుంటూ ఎవరికీ తెలియదనుకుంటూ ఆత్మద్రోహం చేసుకుంటూ, ఇక్కడకు వచ్చేవారు!"
"అరూ! నన్నెందుకు చిత్రవధ చేస్తావు?" అంటూ కణతలు పట్టుకొని కూచున్నాడు రాజారావు.
అరుంధతి కన్నీటితో తడిసిన పెద్ద పెద్ద రెప్పల్ని బలవంతంగా పైకి ఎత్తి రాజారావు ముఖంలోకి చూసింది. తను అతన్ని చిత్రవధ చేస్తూందా? తను పద్దానుగేళ్ళగా అనుభవించిన మానసిక వేదననూ, హింసనూ ఒక్కసారైనా అర్ధం చేసుకోవటానికి ప్రయత్నించాడా? కొంతకాలం అతను తన ఇంటికి తప్పనిసరి అయి వస్తున్నాడనీ, మనస్పూర్తిగా రావటం లేదనీ తను గ్రహించలేదనే అనుకుంటున్నాడా? తనద్వారా ఎక్కువ డబ్బు సంపాదించగలుగుతున్నాడు.
"అరూ! నన్ను అలా చూడకు. అంత ఏవగించుకున్నట్లు చూడటం నేను భరించలేను."
అరుంధతి విషాదంగా నవ్వింది. రెప్పలు వాలిపోయాయి.