Previous Page Next Page 
డా|| వాసిరెడ్డి సీతాదేవి సాహిత్యం పేజి 25


    "అరూ! నువ్వు నిజంగా ఇన్ని సంవత్సరాలుగా ఇంత బాధను అనుభవించావని నాకు తెలియదు" అంటూ పక్కన కూచుని జాలిగా కదిలాయి.

 

    "ఇప్పటికీ నువ్వెంత అందంగా ఉన్నావు అరూ! నీకు నలభయ్ ఏళ్ళు దాటాయని ఎవరూ అనుకోరు. నీ సౌందర్యం ముందుకు వచ్చి కాలం కూడా ఆశ్చర్యంగా ఆగిపోయిందా అనిపిస్తుంది నిన్ను చూస్తుంటే."

 

    సంభాషణను మరో వైపుకు మళ్ళించటానికే రాజారావు మాట మార్చాడని అర్ధం కాకపోలేదు అరుంధతికి.

 

    మౌనంగా కూచుంది.

 

    "అరూ! ఒక విషయం చెపుతాను కోపగించుకోవు గదూ?" అన్నాడు ప్రాధేయపూర్వకంగా రాజారావు.

 

    అరుంధతి "ఏమిటి" అన్నట్లు చూసింది. ఆ చూపులో ఉదాసీనతా, నిర్లిప్తతా స్పష్టంగా గోచరిస్తున్నాయి.

 

    "కాస్త మనుషుల రాకపోకలు తగ్గేలా చూడాలి నువ్వు. వీళ్ళంతా నీచేత పనులు చేయించుకొని, బయట రకరకాల ప్రచారం చేస్తున్నారు. కనీసం వచ్చిన వాళ్ళతో గౌరవంగా మాట్లాడి పంపించు" అన్నాడు రాజారావు భయం భయంగా ఆమె ముఖంలోకి చూస్తూ.

 

    "నేను వీళ్ళందర్నీ గౌరవించాలా? వీళ్ళంతా నాకిచ్చిన గౌరవం ఏమిటి? నామీద గౌరవంతోనే నా ఇంటి చుట్టూ తిరుగుతున్నారా? నావల్ల పనులు జరుగుతాయి. కనుక "ఛీ - ఛా" అన్నా నా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. లోకం దృష్టిలో వీళ్ళంతా గౌరవంగల పెద్ద మనుషులు. ఈ పెద్ద మనుషులే నేను బయట కాలు పెడితే వింత జంతువును చూసినట్లు చూస్తారు; కుష్ఠురోగిని చూచి తొలగిపోయినట్లు తొలగిపోతారు. నాతో మాట్లాడటంవల్ల వాళ్ళ గౌరవానికి భంగం వాటిల్లుతుంది. అందుకే వీళ్ళందర్నీ నా చుట్టూ తిప్పుకుంటున్నాను. నా ముందు మోకరిల్లేలా చేస్తున్నాను. నా కసి తీర్చుకుంటున్నాను."

 

    రాజారావు అరుంధతి ముఖంలోకి ఆశ్చర్యంగా చూశాడు.

 

    "ఏం, నా మాటలు వింటుంటే ఆశ్చర్యం కలుగుతూందా? నేను డబ్బుకోసమే ఇదంతా చేస్తున్నానని లోకంతోపాటు మీరూ అనుకుంటున్నారు. ఈ డబ్బు నాకెందుకు? ఈ డబ్బు జీవితంలో నేను పోగొట్టుకున్నదాన్ని నాకు ఇప్పించలేదని నాకు తెలుసు. వాళ్ళమీద కసి తీర్చుకుంటాను. నామీద నేనే కసి తీర్చుకుంటున్నాను. మీ కోసం డబ్బు సంపాదిస్తున్నాను."

 

    "నా కోసమా?"

 

    "మరి నా డబ్బు మీదికాక ఎవరిదవుతుంది? నేనేం చేసుకుంటాను ఈ డబ్బును? ఎవరికిస్తాను? నాకెవరున్నారు?" కలలో పలవరిస్తున్నట్లు అంది అరుంధతి.

 

    రాజారావు ఆలోచనలో పడ్డాడు. "ఏది ఏమైనా ఇంటికి వచ్చేవాళ్ళను కనీసం గౌరవిస్తున్నట్లు నటించు. అయినా వాళ్ళు నిన్నేం చేశారు?" అన్నాడు రాజారావు లోతుగా ఉన్న స్వరంతో.

 

    అరుంధతిలో ఆవేశం కట్టలు తెంచుకుంది. ఉద్రేకం ఉరకలు తీసింది.

 

    "నన్నేం చేశారా? ప్రత్యక్షంగా నువ్వు నన్ను నా స్థానం నుంచి కిందకు తోశావు. పరోక్షంగా వాళ్ళు- కిందపడి విలవిల కొట్టుకొంటున్న నన్నుచూసి పళ్ళికిలించారు. అసహ్యించుకున్నారు. నన్ను పతిత అన్నారు. చివరకు నేను పతితననే నమ్మకాన్ని నాలోకి నింపారు. నేను నమ్మాను. బయట ప్రపంచంలో తలెత్తుకొని తిరగటానికి భయపడ్డాను. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయాను. నేనూ ఈ సమాజంలో ఒక వ్యక్తినేననే విషయాన్ని మర్చిపోయాను. వంటరిగా ఇంత విశాల ప్రపంచంలో చీకటి బ్రతుకుతో ఊపిరిసలపక అల్లాడిపోయాను" ఆవేశంతో రాజారావును నువ్వనే అనేసింది. ఎందుకో ఈసారి మీరు అని అనాలనిపించలేదు.

 

    "నువ్విలా కావటానికి నేనా బాధ్యుణ్ణి?" రాజారావు కొంచెం విసుగ్గా చూశాడు.

 

    అరుంధతి తిరస్కారంగా చూసింది రాజారావు ముఖంలోకి. ఆ చూపుల్ని తప్పించుకుంటూ ఆలోచిస్తున్నట్లు నటించాడు.

 

    "అవును నువ్వు బాధ్యుడివి కావు! ఇదంతా స్వయంకృతాపరాధమే. నేను భ్రమపడ్డాను. మిమ్మల్ని ఒక ఆదర్శమూర్తిగా భావించాను. నా కలల రాజకుమారుడిగా భ్రమపడ్డాను. లోకం పోకడ తెలియని నా కళ్ళకు మీరు ఎంతో ఎత్తున నిల్చున్నట్లు కనిపించారు. మీ దగ్గిరకు చేరుకోవాలనే వ్యామోహంలో నాకో సంఘం నిర్ణయించిన మార్గాన్ని వదిలి పైకి ఎక్కాలని ప్రయత్నించాను. ఫలితం కింద ఎక్కడో లోతుగా వున్న చీకటి లోయలోకి పడిపోయాను. దాంతో నేను జీవితంలో చాలా చాలా పోగొట్టుకున్నాను. నా మార్గాన్ని నేను నిర్ణయించుకొనే అధికారం నాకు ఈ సమాజంలో లేదని ఆలోచించగలిగే విజ్ఞానం ఆనాడు నాకు లేదు." రెండు చేతుల్లో ముఖాన్ని దాచుకొని కుమిలి కుమిలి ఏడుస్తున్న అరుంధతిని ఎలా ఓదార్చాలో తెలియక చూస్తూ కూర్చుండిపోయాడు రాజారావు.

 

    హృదయాన్ని అలుముకున్న మేఘాలు విచ్చిపోయాయి. కన్నీటి రూపంలో ప్రవహించాయి. అరుంధతి లేచి వెళ్ళి ముఖం కడుక్కొని వచ్చి కూచుంది.

 

    ఫోన్ మోగింది. అరుంధతి వెళ్ళి ఫోన్ ఎత్తి జవాబు ఇవ్వకుండానే రిసీవర్ పక్కనపెట్టివచ్చి కూర్చుంది. రాజారావు వెళ్ళి ఫోన్ తీసుకున్నాడు. అరుంధతి రాజారావుకేసి చూస్తూంది. రాజారావు ముఖం చిట్లించాడు. "అర్ధగంటలో వస్తాలే అంటూ చిరాగ్గా ఫోన్ పెట్టేశాడు. అన్యమనస్కంగా వచ్చి కూచున్నాడు.

 

    "మీ జీవిత భాగస్వామిని ఆజ్ఞ అయిందిగా? వెళ్ళండి కూర్చున్నారేం!" వ్యంగ్యంగా అంది అరుంధతి.

 

    అరుంధతికి ఒకప్పుడు రాజారావు తన భార్యను గురించి బాధపడుతూ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. ఆదర్శంకోసం పోరాడుతూ దమ్మిడీ సంపాదించే శక్తి లేనప్పుడు అతన్ని ఆమె చిన్నచూపు చూసింది. ఆదరించలేదు. ప్రేమలో ఒక్కమాట మాట్లాడి అతడి అలుపును పోగొట్టటానికి ఎన్నడూ ప్రయత్నించలేదు. ఈనాడు అతనికి హోదా ఉంది. ప్రయోజకుడయ్యాడు. ధనం సంపాదిస్తున్నాడు. ఒక గంట భర్త యింటికి రావటం ఆలస్యం అయితే ఆరాటపడిపోతుంది. ఏమయితేనేం, ఆమె అతని భార్య! అతను ఆమెను గౌరవించకపోతే సంఘం అతనిని గౌరవించదు. సన్మానాలకూ, సభలకూ ఆవిణ్ణి వెంటబెట్టుకొని వెళితే అతని గౌరవం ఇనుమడిస్తుంది.

 

    రాజారావు దిగ్గునలేచి నిల్చున్నాడు. "వస్తాను, రేపు రాలేను. ఎల్లుండి రాత్రి కనిపిస్తా." ఆమె జవాబుకు ఎదురు చూడకుండానే బయటకు వెళ్ళిపోయాడు. గేటు తెరిచిన శబ్దం, కారు స్టార్టయిన చప్పుడు వినిపించాయి అరుంధతికి.

 

    ఖాళీగా ఉన్న అంత పెద్ద భవనంలోని ఓ పెద్ద గదిలో వంటరిగా బిక్కుబిక్కు మంటూ కూచునివున్న అరుంధతి హృదయంలో ఏదో చాలా పెద్ద ఖాళీ ఏర్పడినట్లనిపించింది. రాజారావు వచ్చి వెళ్ళినప్పుడల్లా ఇన్ని సంవత్సరాలుగా తనకు అదే అనుభూతి కలుగుతూ ఉంది. కాని, ఈనాటి ఖాళీ ఎప్పటికీ వుండేదికాదు అని అనిపిస్తూంది.

 

    మంచానికి అడ్డంగా పడి పైకప్పుకేసి చూస్తూ పడుకుంది. కళ్ళనుంచి ప్రవహిస్తున్న కన్నీరు చెక్కిళ్ళను తుడుపుతుంటే గుండెల్లో జ్వాలలు ప్రజ్వరిల్లుతున్నాయి.


                                        27


    అరుంధతి నిద్రలేచేటప్పటికి బాగా పొద్దెక్కింది. రాత్రంతా నిద్రలేని కళ్ళు ఇసుకపడినట్లు మెర మెరలాడుతున్నాయి. లేచి వెళ్ళి నిలువుటద్దం ముందు నిల్చుంది అలవాటు ప్రకారం. తన ప్రతిబింబాన్ని చూసి పలకరింపుగా నవ్వుకుంది. ఆ నవ్వులో జాలీ, విషాదం నిండి ఉన్నాయి. రాజారావు తను ఏడ్చి కళ్ళు తుడుచుకున్నాక అందంగా ఉంటుంది అనేవాడు. ఆ మాటకొస్తే ఏడ్చేప్పుడు ఆడవాళ్ళంతా అందంగానే ఉంటారు. ఏమిటో తన పిచ్చి వూహలు!

 

    బెడ్ కాఫీకోసం వచ్చి డైనింగ్ టేబిల్ దగ్గర కూచుంది. నాయర్ కాఫీకప్పు తెచ్చి ముందు పెట్టాడు.

 

    "నేను వచ్చి కూచుని ఎంతసేపయింది?" అసలే ఎర్రగా ఉన్న కళ్ళను కెంపులు చేస్తూ అడిగింది.

 

    "ఇప్పుడే గదమ్మా మీరు వచ్చి కూచున్నారు?" అనాలనుకున్నాడు కాని, అలా అంటే ఆ కాఫీ తన ముఖంమీదకు వచ్చేస్తుందని వూరుకున్నాడు. ఆమె ప్రతి విషయానికీ అలా అనటం, జవాబు ఇవ్వాలనుకుంటూనే వూరుకోవటం మామూలే. అక్కడ నోరు మూసుకొని, వంటింట్లోకి వెళ్ళి తెరిచాడు. ఏదో గొణుక్కున్నాడు.

 

    "నాయర్!" కేక పెట్టింది అరుంధతి.

 

    నాయర్ కు ఆ దెబ్బ బంతికి కాలు తగిలినట్లు తగిలింది. వచ్చి ఆమె ముందు పడిపోయాడు మరో నిముషంలో. భయంతో వణికిపోతూ నిల్చున్నాడు.

 

    "ఏమిటి వాగుతున్నావ్?"

 

    పూర్తిగా మతిపోయింది నాయర్ కు.

 

    "మాట్లాడవేం?'

 

    "నే...నేనా?"

 

    "మరి నేనా?"

 

    "ఏమీ అనలేదమ్మా!" అన్నాడు వణుకుతూ.

 

    వాడి వణుకు చూస్తుంటే అరుంధతికి నవ్వొచ్చింది. కాని ఆపుకొనే ప్రయత్నంలో ముఖాన్ని మరికొంచెం బిగించాల్సి వచ్చింది.

 

    "ఏదో గొణుగుతున్నావు - నేను వినలేదనుకున్నావా?"

 

    "ఆ...అదా-అమ్మగారూ-నేను పాట పాడుకుంటున్నానండమ్మా!" ఠక్కున జవాబిచ్చాడు నాయర్.

 

    "ఏడవలేకపోయావూ?" ఏ పాట పాడావూ?"

 

    "అదండి...అదే...చందమామ చల్లగా, మత్తుమందు చల్లగా-" గబగబా అనేశాడు.

 

    "పో! నీ పని చూసుకో. అధిక ప్రసంగం చెయ్యకు." మందలించింది అరుంధతి. నాయర్ రెండో నిముషంలో వంటింట్లో పడి ఊపిరి పీల్చుకున్నాడు స్వేచ్చగా.

 

    "అమ్మగారూ!" పనిమనిషి లక్ష్మి వచ్చి నిల్చుంది.

 

    "ఏం, నీకే మొచ్చింది ఇంత పొద్దుటే?"

 

    "ఆడు - ఆ రంగన్న వచ్చిండు" అంది లక్ష్మి.

 

    "వస్తే! ఏమిటేవ్ ముఖ్యమంత్రి వచ్చినట్లు చెబుతున్నావ్?"

 

    "అది కాదమ్మగారూ- ఆడికి జీతం కావాలంట. రెండురోజులనుంచి తెగ తిరుగుతున్నాడు. తమరు ఏదో పనిలో ఉన్నారని తిప్పి పంపించేత్తున్నారు. ఇయ్యాళ జీతం తీసుకొనికాని పోడంటమ్మ. మొండికెత్తినాడు" అంది లక్ష్మి.

 

    "పో నీ పని చూసుకో." కసురుకుంది లక్ష్మిని. పనిమనిషి అమ్మగారి ఆజ్ఞ ప్రకారం తన పని చూసుకోవటానికి వెళ్ళిపోయింది.

 

    స్నానంచేసి పదకొండు గంటలకు కిందకు దిగి వచ్చింది. ఆమెను చూస్తూనే, నేలమీద మోకాళ్ళు ముడుచుకొని కూచునివున్న రంగన్న లేచి నిలబడ్డాడు. సవినయంగా నమస్కరించాడు.

 

    "ఏం?" అన్నట్లు చూసింది అరుంధతి.

 

    "అమ్మగారూ! జీతం ఇప్పించండి" అన్నాడు రంగన్న.

 

    "జీతమా! జీతం ఇస్తానని నీకు చెప్పానట్రా?" అంది అరుంధతి.

 

    రంగన్న నోరు తెరుచుకుని చూశాడు. మరి జీతం ఇవ్వక ఏమిస్తుందట? వాడికి మాటలు దొరకలేదు.

 

    "నువ్వొచ్చి ఎంతకాలం అయింది?" ప్రశ్నించింది అరుంధతి.

 

    "మొన్నటికి నెలయిం దమ్మగారూ?" అన్నాడు నంగినంగిగా.

 

    "గొలుసుకట్టులా మాట్లాడతావేంరా?" సరిగా మాట్లాడలేవూ?"

 

    రంగన్న అరుంధతిముందు తలవంచుకొని నిల్చున్నాడు.

 

    "నిన్ను చూసి చాలా చురుకైన వాడివనుకున్నాను. తెలివితేటలు గలవాడివి అనుకున్నాను. చివరకు దద్దమ్మవని తేలిపోయింది. నీలాంటి దద్దమ్మలు నా గేట్లో ఉండటానికి వీల్లేదు. ఇంతకుముందు ఉన్న వాళ్ళెవరూ నన్ను జీతం అడగలేదు. అయినా వాళ్ళకు ఆ గేటు విడవటం ఇష్టం ఉండేదికాదు, బలవంతాన బయటకు గెంటాల్సివచ్చేది" అంది అరుంధతి బంతిమొక్కను చేత్తో పట్టుకొని పరిశీలిస్తూ.

 

    రంగన్నకు అంతా అయోమయంగా ఉంది. ఆ ఇంటి వ్యవహారమంతా అయోమయంగానే ఉంది. జీతం లేకుండా పనిచేసేవాళ్ళా? ఎందుకు? ఎలా?

 

    "ఏరా మాట్లాడవు? ఇక్కడకు వచ్చిన రోజు నేను నీతో ఏమన్నాను?"

 

    "ముందు ఎంత జీతం కావాలన్నారమ్మా! ఏభయ్ కావాలన్నా నండమ్మా! అప్పుడు తమరేమో నవ్వుతూ 'ఏభయ్ ఏమిటి? అంతకంటే చాలా ఎక్కువే దొరుకుతుందిలే' అన్నారమ్మా!" పసిపిల్లవాడు పాఠం వల్లించినట్లు వల్లించాడు రంగన్న.

 

    "కరెక్టు! నేను ఇస్తాననలేదుగా! దొరుకుతుంది అన్నాను." అంది అరుంధతి నవ్వుతూ.

 

    వాడికి అర్ధంకాలేదు. వంచిన తల ఎత్తలేదు.

 

    "అర్ధంకాలేదు గదూ?"

 

    కాలేదన్నట్లు గిర్రున తల తిప్పాడు రంగన్న.

 

    "రోజుకు ఎంతమందిని నువ్వు ఈ గేటునుంచి లోపలకు వదులుతున్నావు? వచ్చిన ఒక్కొక్కడి దగ్గరా ఒక రూపాయి చొప్పున వసూలు చేసుకున్నా, నేలకు రెండువందలకు ఢోకా ఉండదు. అలాగని మరీ చిన్న ఉద్యోగాలకోసం వచ్చేవాళ్ళను పీడించకు. నువ్వింత అమాయకుడివని నేను అనుకోలేదు." అంది అరుంధతి ఎర్ర గులాబీపువ్వు వొకదాన్ని తెంపుతూ.

 

    రంగన్నకు ముందు అర్ధంకాలేదు. తీరా అర్ధం అయాక భయం వేసింది.

 

    "భయపడకు. నేనే చెబుతున్నాగా! అందులో తప్పులేదు. వాళ్లు చాలా గుంజుకోవాలనే ప్రయత్నంలోనే ఇక్కడకు వస్తున్నారు. నీమీడా, నామీదా ఆప్యాయతకొద్దీ రావటంలేదు" అంది అరుంధతి.

 

    రంగన్న కళ్ళు సంతోషంతో మెరిసిపోయినయ్.

 

    "అలాగేనమ్మా! ఇయ్యాల్టికి ఒక రూపాయిప్పించండమ్మా! నిన్నటినుంచి ఇంట్లో పస్తులు" అన్నాడు ఉత్సాహంగా.

 

    "నిన్నటినుంచీ పస్తులా? మరి నాకు చెప్పలేదేం?" అనబోయి ఊరుకుంది. లోపలకు వెళ్ళింది. రంగన్న ఆశగా చూస్తూ నిల్చున్నాడు. అరుంధతి రంగన్న చేతికి వందరూపాయలనోటు అందించింది. రంగన్న తెల్లముఖంవేసి నోటువైపూ, అరుంధతివైపూ అనుమానంగా చూడసాగాడు.

 

    "ఏమిటి అలా చూస్తావు? అది వందరూపాయల నోటు. వెళ్ళు! సాయంత్రం కొంచెం త్వరగా రా!" వెనక్కు తిరిగి లోపలకు వెళుతున్న అరుంధతికి రంగన్న వెనకనుంచి చేతులెత్తి మొక్కాడు. అతని కళ్లలో కృతజ్ఞతాభావం తొణికిసలాడింది.

 

    ఆనాడంతా అరుంధతికి ఏదో వెలితి వెలితిగా అనిపించింది. తనకు అతిప్రియమైన వస్తువేదో తన జీవితంనుంచి తొలగిపోయి నట్లనిపించింది. జీవితమంతా బోలుగా, ఖాళీగా అనిపించింది. ఆ సాయంత్రం జరగబోయే సన్మానం గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నది. ఆ సన్మానానికి అతని భార్యాపిల్లలూ వెళతారు. అతని స్నేహితులూ, పరిచయస్తులూ వెళతారు. అతనంటే ఇష్టంలేని వాళ్ళుకూడా వెళతారు. కాని తను వెళ్ళలేదు. వెళితే అందరికళ్ళూ తననే కత్తుల్లా గుచ్చేస్తాయి. తనను జూనుంచి తప్పించుకొని వచ్చిన వింత జంతువును చూసినట్లు చూస్తారు. తనను తెలిసినవాళ్ళు తెలియనివాళ్ళకు చూపించి-"ఆవిడే?" అంటారు. తెలియనివాళ్ళూ, అప్పుడే చూసినవాళ్ళూ చిత్రంగా తనవైపు చూస్తారు. తాను అందరిలా సహజంగా తిరగలేదు. తిరగనివ్వరు. చిన్నతనంలో అంతగా బాధపడలేదు, రాజారావు ప్రేమలో తను ప్రపంచం గురించి ఆలోచించలేదు. తను పోగొట్టుకున్నది ఎంత విలువయిందో క్రమంగా తనకు అర్ధం అయింది. 

 Previous Page Next Page