Previous Page Next Page 
డా|| వాసిరెడ్డి సీతాదేవి సాహిత్యం పేజి 23


    "అల వైకుంఠపురంబులో, నగరిలో, ఆమూల సౌధంబులో" అన్న పద్యం గుర్తొచ్చింది కుమార్ రాజావారికి. "ఎంత మహారాణీ వైభవాన్ని అనుభవిస్తుందో?" అనుకున్నాడు ఒకనాటి తమ వైభవాలను గుర్తు తెచ్చుకుంటూ.

 

    "హేమా హేమీలను నడిరోడ్డులో, క్యూలో నుల్చోపెడుతూంది. తస్సదియ్యా! ఏం సాగించుకుంటుందిలే!" అన్నాడు బుర్రమీసాలు కదులుతుండగా చిన్నయ్య.

 

    "ఎంతకాలంలే! ఆయన పలుకుబడి చెల్లినంతవరకు. అదీ తగ్గుతూందనే వినికిడి" అన్నాడు వేంకటేశ్వర్లు.

 

    "హైకమాండుకు కొందరు రిపోర్టు కూడా చేశారట- ఇక్కడ రాజ్యం చేస్తున్నది ప్రభుత్వంలో ఎలాంటి పదవినీ అలంకరించని సాధారణ స్త్రీ అని," అన్నాడు మరో లావుపాటి పెద్దమనిషి.

 

    "తరువాత చచ్చి గీ పెట్టినా పిట్టమనిషి ఈ దరిదాపుల్లో కనిపించడు" అన్నాడు వెంకటేశ్వర్లు.

 

    "ఆయన దిగిపోయిన తెల్లారే జనం క్యూలో నిలబడతారు చూస్తూండండి!" అన్నాడు వళ్ళు మండిన ఓ యువ డాక్టరు- అంతకు ముందే వచ్చి గోడ పక్కగా నిలబడ్డాడు.

 

    "ఆయన దిగిపోయాక ఎందుకొస్తారయ్యా మీ పిచ్చి కాకపోతే?" అన్నారు కుమార్ రాజావారు.

 

    "వస్తారు. తప్పక వస్తారు. అలా చూస్తూండండి." అన్నాడు కసిగా.

 

    ఎవరికీ అతని మాటలు సరిగా బోధపడలేదు.

 

    "ఎందుకొస్తారంటారు?" చిన్నయ్య అడిగాడు.

 

    "ఎందుకా తన్నటానికి! పనులు చేయించుకున్నవాళ్ళూ, చేయించుకోలేకపోయినవాళ్ళూ ఇద్దరూ వచ్చి క్యూలో నిలబడతారు" అన్నాడు డాక్టరు.

 

    అందరూ ఫక్కున నవ్వబోయి భయంవేసి. కిసుక్కున నవ్వారు. రాజావారు విలాసంగా పెదవులు కదిలించి వూరుకున్నారు. రాజాలు ఎంత నవ్వు వచ్చినా అంతకంటే ఎక్కువ నవ్వకూడదు.

 

    రంగన్న ముఖం తిప్పుకొని నవ్వుకోవటం చాలామంది చూశారు.

 

    "అదిగో అమ్మగారు!" అన్నాడు రంగన్న లేచి నిల్చుంటూ. అందరి కళ్ళూ కుతూహలంగా ఒకేవైపుకు తిరిగాయి. మేడమీద కారిడార్ లో కనిపించిన స్త్రీమూర్తిని చూసి రాజావారు విస్తుబోయారు. ఆయన అరుంధతి అందాన్ని గురించి విన్నాడు. కాని ఆమెలో అంత ఠీవి ఉంటుందని వూహించలేదు. ఠీవిగా నిల్చొని, గంభీరంగా చూస్తూ, హుందాగా కనిపించింది ఆమె రాజావారికి. ఆమె కదిలినప్పుడు ఆమె చెవులకున్న పోగులూ, మెళ్ళో నెక్ లెసూ తళతళమంటున్నాయి. మెట్లమీదనుంచి ముందు నాగేంద్రరావు దిగి వచ్చాడు. ఆ వెనకనే అరుంధతి మహారాణిలా దిగింది. సౌందర్యంలో ఏ మహారాణీ ఆమెకు సరికాదు. "చితౌడ్ రాణి పద్మిని ఇలాగే ఉండేదేమో!" అనుకున్నారు మనసులో రాజావారు. ఒక్కసారి చూసి చూడనట్లే గేట్లో నిలబడ్డ వాళ్ళవంక చూసింది. వాళ్ళు అక్కడ ఉన్నది గమనించనట్లే పూలమొక్కలను పరిశీలిస్తూ తోటలో తిరుగుతూంది. చిన్నగా, నాగేంద్రరావు ఆమె వెనక నడుస్తూ, ఆమె ఎటుపోతే అటేపోతూ అతి వినయంగా ఏదో విషయాన్ని విన్నవించుకుంటున్నాడు. ఆమె వింటూన్నది విననట్లే.

 

    కుమార్ రాజావారు, ఇంకా కొందరు పెద్దలు వాళ్ళలోవాళ్ళే కుతకుతా ఉడికిపోతున్నారు. అదే సమయంలో ఓ యువతి నడిచివచ్చి గేటులో నిల్చుంది. ఆమె వేషభూషణలు చూస్తుంటే ఎక్కడో చిన్న ఉద్యోగం చేస్తున్న ఆమెలా కన్పిస్తున్నది. గేటునుంచి లోపలకు వెళ్ళబోయింది.

 

    "ఏందమ్మోయ్! ఇంతమంది గొప్పోళ్ళు ఎంతోసేపటి నుంచి నిల్చున్నారు. నువ్వేమో వచ్చీరాకతలికే జొరబడుతున్నావు?" అన్నాడు రంగన్న.

 

    "నువ్వు కొత్తగా వచ్చినట్లున్నావు. నేను లోపలకు వెళ్ళితే అమ్మగారు ఏమీ అనరు. నన్ను పోనియ్" అంది అంతమందిలో తనకు అవమానం జరిగినట్టు బాధపడుతూ.

 

    కుమార్ రాజా ఆమెను ఓరకంటితో చూడనట్లే చూస్తున్నారు. ఆమె చొరవకు అతనికి ఆశ్చర్యం కలిగింది.

 

    "అమ్మబాబోయ్! అమ్మగారు చెప్పకుండా మడిసిని లోపలకు పంపటమే? నా చరమం వలిసేయరు?" అన్నాడు రంగన్న భయాన్ని వ్యక్తం చేస్తూ.

 

    "పోనియ్ వెళ్ళి అమ్మగారితో జానకి వచ్చిందని చెప్పు!" అంది చిన్నగా రంగడితో ఆ యువతి.

 

    గేటువాడు నీళ్ళు నములుతూ నిల్చున్నాడు. "కాసేపు నిల్చోండమ్మా! అందరూ నిల్చోలా" అన్నాడు.    

 

    ఆమె ముఖంలో అభిమానం కొట్టిచ్చినట్లు కనిపించింది. గిరుక్కున వెనక్కు తిరిగింది. గబగబా నడిచిపోతూంది. అందరూ నోళ్ళు తెరుచుకొని చూశారు. అందరికీ అలాగే చెయ్యాలని ఉంది. కాని అవసరాలు వారిని అలా చెయ్యనివ్వటం లేదు. కుమార్ రాజావారికి తల కొట్టేసినట్లయింది. ఆ ఆడపిల్లకు ఉన్న మాత్రం అభిమానం తనకు లేదా? గబగబా వెళ్ళి కార్లో కూచున్నారు. కారు స్టార్టుచేసి ఆపారు. దూరంగా చకచకానడిచి వెళుతున్న ఆ యువతి వైపు చూశారు.

 

    ఆమె ఏదో చిన్న ఉద్యోగంకోసం వచ్చి ఉంటుంది. లేకపోతే ఇంక్రిమెంటు ఇవ్వలేదని చెప్పుకోటానికో వచ్చి ఉండవచ్చు. అదీగాకపోతే మహా ఐతే యల్.డి.సి. ఉద్యోగం నుంచి యు.డి.సి. ప్రమోషన్ కోసం వచ్చి ఉంటుంది. అందుకే అంత నిర్లక్ష్యంగా వెళ్ళిపోతూంది. కాని తన పని అలాంటి చిన్న పనికాదే? తను యం.పి. సీటుకోసం వచ్చాడు. తను ఆ అమ్మాయిని చూసి వెళ్ళిపోతే ఎలా? ఆలోచనలో పడ్డ రాజావారు కారు దగ్గరకు వచ్చిన నాగేంద్రరావును చూసి కారు దిగారు.

 

    "అమ్మగారు తమర్ని రమ్మంటున్నారు" అని చెప్పాడు నాగేంద్రరావు. చప్పట్లు చరిచి దూరంగా వెళుతున్న జానకిని కూడా పిలిచాడు.

 

    ఐతే ఆమె అంతా గమనిస్తూనే ఉందన్నమాట! రూపానికి మించిన తెలివితేటల్లా ఉన్నాయి. అఖండురాలు! నిల్చున్నంతవరకు నిల్చోపెట్టింది. వెళ్ళిపోతున్నారని తెలిసి కబురు పంపించింది. తెగిందాకా లాగదు. పూర్తిగా తెగిపోతే తనకూ నష్టమేగా! ఆలోచిస్తూనే రాజావారు గేటుదాటి లోపలకు అడుగు పెట్టారు. ఒక కుర్చీమీద కాలుమీద కాలు వేసుకొని ఠీవిగా కూచుని ఉంది అరుంధతి. ఆ దగ్గర్లో ఎక్కడా మరో కుర్చీ కనిపించక రాజావారు గతుక్కుమన్నారు. ఆయనకు వళ్ళు మండిపోయింది. తను ఆమె ఎదురుగా నిల్చొనే మాట్లాడాలా? అల్లంత దూరంలోనే నిల్చొనిపోయిన రాజావారినిచూసి చిరునవ్వు నవ్వింది అరుంధతి. ఆ నవ్వు-నీ ఆలోచనలు నాకు తెలుసులే అన్నట్లుంది. "ఎవరి కోసం నిల్చుంటావోయ్!" అన్నట్లుగా కూడా ఉంది.

 

    "నాగేంద్రరావుగారూ! ఒక కుర్చీ తెప్పించండి!" అంది ఆజ్ఞాపిస్తున్నట్టు. ఆమె నోటినుంచి మాట వెలువడిందే తడవుగా ఒక్క అంగలో వెళ్ళి వరండాలో ఉన్న వ్యక్తి ఒక కుర్చీ వేశాడు.

 

    "అరే! మీరే తెస్తున్నారా? పనివాళ్ళంతా ఏమయ్యారు?" అంది అరుంధతి నొచ్చుకున్నట్లు. అక్కడ పనివాళ్ళెవవరూ లేరనీ, తనకే ఆ పని పురమాయించిందనీ నాగేంద్రరావుకు తెలుసు. వళ్ళు మండింది.

 

    "బోడి ముండ! దీనికి కుర్చీలు కూడా మోయాల్సి వచ్చింది. కానియ్ ఆ లైసెన్సు కాస్త చేజిక్కించుకున్నాక మళ్ళీ నీకు చిక్కుతానా?" మనసులోనే తిట్టుకొన్నాడు నాగేంద్రరావు.

 

    "కూచోండి రాజాగారూ!" అంటూనే "రండి జానకిగారూ! మీరు పైకివెళ్ళి నా గదిలో కూచోండి. తోచకపోతే రేడియో పెట్టుకోండి. ఇప్పుడే వస్తాను" అంది అరుంధతి. ఆమె మేడ మీదకు వెళ్ళిపోతుంటే రాజావారు చూస్తూ కూర్చున్నారు.

 

    "చెప్పండి" అంది అరుంధతి ధీర గంభీరస్వరంతో రాజావారిని నిశితంగా చూసింది ఓ నిమిషం.

 

    కుమార్ రాజా ఆమెను గురించి విన్నప్పుడు ఆమెను మరోలా ఊహించుకున్నాడు. కళ్ళు తిప్పుతూ మాట్లాడుతుందనీ, విలాసంగా నవ్వుతుందనీ, వయ్యారంగా నడుస్తుందనీ ఊహించుకున్నాడు. ఆమెది-అతను ఊహించుకున్నదానికంటే మిన్నగా ఉన్న అందం. మనిషిలో హుందాతనం. ఆమె మాటలో, కదలికలో గాంభీర్యం చూస్తూంటే రాజావారికి చాలా ఆశ్చర్యం వేసింది.

 

    "నేను యం.పి.సీటుకు అప్లయ్ చేద్దామనుకుంటున్నాను" అన్నారు రాజావారు, వారి సహజమైన గాంభీర్యంతో.

 

    "ఆహా! అలాగే?" అని మాత్రం అని నాగేంద్రరావు వైపు చూసింది. అంతవరకూ చేతులు కట్టుకొని నిల్చున్నవాడు, త్రుళ్ళిపడి అరుంధతికి దగ్గరగా వచ్చి వినయంగా నిల్చున్నాడు.

 

    చూట్టానికి కాస్తో కూస్తో చదువుకున్నవాడిలా వున్నాడు. జీతగాడికంటె అన్యాయంగా ఇలా ప్రవర్తిస్తున్నాడేం? అనుకున్నారు రాజావారు నాగేంద్రరావును చూస్తూ.

 

    తను చెప్పినమాటను వినీ విననట్లే వూరుకుందేం? రాజావారికి అయోమయంగా ఉంది ఆమె వ్యవహారం.

 

    "ఆ చిన్నయ్యనూ, గోపాలాన్నీ పిలవండి!" అంది అరుంధతి నాగేంద్రరావుతో.

 

    లాగితన్నిన బంతిలా లోపలపడ్డాడు చిన్నయ్య. అతని వెనకే నిదానంగా నడుస్తూ డాక్టర్ గోపాలం వచ్చాడు. గోపానికి అప్పటికే ముఖంనిండా చెమటపట్టి ఉంది. అరచేతులు చెమటతో తడిసిపోతున్నాయి.

 

    "ఏమయ్యా! నీకు బుద్ధి ఉందా లేదా? నిన్ను మళ్ళీ ఈ ఇంటి ఛాయలకు రావద్దని చెప్పాలా?" ఆమె ముఖం ఎర్రగా అస్తమిస్తున్న సూర్యబింబంలా వుంది. కళ్ళు పెద్దవి చేసింది. రాజావారికి భయం వేసింది. ఆమెను చూడనట్లే కుర్చీలో బిగుసుకొనిపోయి కూచున్నాడు.

 

    డాక్టర్ ముఖంలో కత్తివేటుకు రక్తం చుక్కలేదు.

 

    "పొరపాటయింది...క్ష...మించండి...తమ...రు"

 

    "ఆపు! ముందిక్కడనుంచి వెళ్ళు." రౌద్రంగా అరచింది. ఉలిక్కిపడబోయిన రాజావారు తమాయించుకున్నారు. గోపాలానికి అరికాళ్ళూ, అరిచేతులూ చల్లబడ్డాయి. తలవంచుకొని, బిక్కచచ్చిపోయి వెనక్కి తిరిగాడు. అతడి చేతిలో యాపిల్ పండు ఉంది.

 

    "యాపిల్ పండు పట్టుకొచ్చాడు, యాపిల్ పండు. పక్షి!" వస్తున్న నవ్వును ఆపుకుంటూ అంది. గోపాలం విన్నాడు. కాని కిక్కురుమనకుండా బయటకు వెళ్ళిపోయాడు. ఆమె ముఖంలో నవ్వు చూడగానే రాజావారికి స్పుట్నిక్ లో నరకంలోకిపోయి తిరిగి ఆ స్పుట్నిక్ లోనే స్వర్గంలోకి వచ్చిపడ్డట్టు అనిపించింది .తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. అరుంధతి నాగేంద్రరావుకేసి అర్ధయుక్తంగా చూసింది. నాగేంద్రరావు వెంటనే బయటకు వెళ్ళాడు. వెళ్ళిపోతున్న డాక్టర్ను పూర్తిగా వెళ్ళనివ్వకుండా ఉంచటానికే నాగేంద్రరావును పంపించిందని రాజారావు వూహించారు. ఆమె తెలివితేటలకు ఆశ్చర్యపోయారు. "ఈమెకే బాగా చదువుండి, రాజకీయాల్లో దిగితే భారత ప్రధాని అయిపోదే?" అనుకున్నారు రాజావారు.

 

    కాంట్రాక్టరు చిన్నయ్యకు చిరుచెమటలు పోస్తున్నాయి. "ఇవాళ తన యోగం ఎలా ఉందో! ఈవిడగారు ఎప్పుడు ఎవర్ని అవమానించినా కొత్తవాళ్ళ ముందే చేస్తుంది. ఈ రాజా ముందు తనను కూడా అవమానించదు కదా?" మరో మనిషి లేనప్పుడు ఆమె ఎవర్నీ అవమానించదు. అవమానం పొందినవాడు- వాడికివాడుగా వెళ్ళి ఎవరితోనూ చెప్పుకోలేడుగా?

 

    "ఏమయ్యా కాంట్రాక్టర్? రాజావారికి కాఫీ తీసుకురా!" అంది అరుంధతి.

 

    రాజావారికి ఆశ్చర్యం వేసింది. లక్షాధికారి చిన్నయ్యకు, ఇంట్లో పదిరూపాయలకు పాచిపని చేసేవాడికి చెబుతున్నట్లు చెబుతుందేమిటి?

 

    "చిత్తం! ఇప్పుడే తెస్తాను" అంటూ వెనక్కు తిరిగాడు చిన్నయ్య.

 

    "చేతులు వూపుకుంటూ వెళ్ళి ఎందులో తేస్తావయ్యా కాఫీ?" అంది అరుంధతి వస్తున్న నవ్వును బలవంతంగా ఆపుకుంటూ.

 

    వెళుతున్న చిన్నయ్య ఠక్కున ఆగి, "ఫ్లాస్కు కొని పోయించుకొస్తానమ్మా! ఎంతసేపు. కార్లో ఇక్కడున్నట్లు వస్తాగా" అంటూ ఉత్సాహంగా దేవీ ప్రసాదం లభించినట్లు ఉప్పొంగిపోతూ బయటకు వెళ్ళాడు.    

 

    ఆమె తనకిస్తున్న గౌరవానికి రాజావారు ఆశ్చర్యపోయారు. మరీ అంత మర్యాద తెలియని మనిషికాదు. ఆమెకు ఎవరికి గౌరవం ఇవ్వాలో తెలుసు? అనుకుంటూ సంతృప్తిపడ్డారు రాజావారు.

 

    "ఆలస్యం అయినందుకు ఏమీ అనుకోకండి. వాళ్ళనుకూడా పంపించివేస్తాను. తరువాత మనం సావధానంగా మాట్లాడుకోవచ్చు!" అంది అరుంధతి.

 

    రాజావారు ఆమె తనకిస్తున్న గౌరవానికి పరవశించిపోయారు.

 

    నలుగురు పెద్దమనుషులు లోపలకు వచ్చారు. వాళ్ళు కూచోటానికి ఏమీలేవు. వాళ్ళు ఆశించినట్లుకూడా కనిపించటంలేదు. వాళ్ళంతా అంతకు ముందు చాలాసార్లు వచ్చి వెళ్ళినవాళ్ళే. అందరూ బాగా కలిగినవాళ్ళే. సమాజంలో పేరు ప్రఖ్యాతులు గలవాళ్ళే. రాజావారికి వాళ్ళు అలా నిల్చోవటం కొంచెం బాధగానే ఉంది. వారిని ఎవర్నీ అతను ఎరగడు.

 

    "ఏమయ్యా వేంకటేశ్వర్లూ! నేను చెప్పిన పనేమయింది?" చాలా గంభీరంగా మారిపోయింది అరుంధతి వదనం.

 

    "అదే తమరికి మనవి చేసుకుందామని వచ్చాను."

 

    "ఊఁ" అని ఊరుకుంది మౌనంగా అరుంధతి.

 

    "మహబూబ్ నగర్ వెళ్ళే దారిలో పాతిక ఎకరాల భూమి పదివేలకు ఉంది" అన్నాడు వెంకటేశ్వర్లు.

 

    "మరి ఇంకా ఆలోచనెందుకు. త్వరగా సెటిల్ చెయ్యండి" అంది అరుంధతి.

 

    "అలాగే" అంటూ ఏదో అనబోయి వూరుకున్నాడు.

 

    "ఏమిటా నీళ్ళు నమలటం? చెప్పదల్చుకున్నదేదో సరిగా చెప్పండి!" అరుంధతి కంఠం ఖంగ్ మని మోగింది.

 

    "నా విషయం." నీళ్ళు నమిలాడు వెంకటేశ్వర్లు.

 

    అరుంధతి ముఖం చిట్లించింది. "మీ పని అవుతూనే ఉందిలే. ముందు ఆ పని పూర్తిచేసి రిజిష్టర్ చేయించే ప్రయత్నాలు చెయ్యండి!" ఆజ్ఞాపించింది. అంతెత్తు మనిషి ముడుచుకొని పోయి, అతి వినయంగా నమస్కరించి బ్రతుకుజీవుడా అన్నట్లు గేటుబయట పడ్డాడు.

 

    "సీతారామయ్యగారూ! మీ వ్యవహారం నాకు బొత్తిగా నచ్చలేదు." కనుబొమలు ముడుచుకొన్నాయి. సీతారామయ్యకు కళ్ళు తిరిగినంత పనయింది.

 

    సీతారామయ్య లక్షాధికారి. బస్ రూటుకు లైసెన్స్ సంపాదించటం కోసం అరుంధతి చుట్టూ తిరుగుతున్నాడు. భారీవిగ్రహం. మనిషి నిండుగా కనిపిస్తాడు. చూడగానే అభిమానించాలనిపించే వ్యక్తిత్వం. బాగా చదువుకున్నవాడని ముఖమే చెబుతుంది.

 

    "అంత మనిషినీ నిలువునా ఖూనీ చేసింది" అనుకున్నారు రాజావారు.

 

    "నువ్వు జనార్ధనరావుతో ఏమన్నావ్?" హుంకరించింది.

 

    "నే...నేనా?....?" మాటలు సరిగా పెగల్లేదు.

 

    "మరి నేనా?" రెట్టించింది అరుంధతి.

 

    "వెళ్ళు-మళ్ళీ ముఖం చూపించకు!"

 Previous Page Next Page