Previous Page Next Page 
మరీచిక పేజి 23


    జాన్ వేదాంతిలా నవ్వాడు.

 

    "నిజం జాన్ నువ్వు కన్పించకపోతే..."

 

    "ఆఁ ఏం చెయ్యాలనుకున్నావ్? పెళ్ళి చేసుకుని..."

 

    "నో! నో! జాన్! ఈ మనుషుల మధ్య నేను వుండలేను. నాకు ఊపిరి సలపటం లేదు. ఈ పెళ్ళి చస్తే చేసుకోకూడదనుకున్నాను. ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకున్నాను!"

 

    "గుడ్ ఐడియా!"

 

    శబరి చివ్వున తలెత్తి జాన్ ముఖంలోకి చూసింది. జాన్ గేటు మీదకు వాలి నిల్చుని శబరి ముఖంలోకి ప్రశంసా పూర్వకంగా చూశాడు. అతని కళ్ళు ఏవేవో లోకాల్ని చూస్తున్నట్లున్నాయి.

 

    "ఈ పెళ్ళికంటే ఆత్మహత్యే నయం!"

 

    'మళ్ళీ నాకు ధైర్యం వచ్చింది. నువ్వు కన్పించావ్! ఇక నీతో వచ్చేస్తాను."

 

    నువ్వు వచ్చేస్తావని నాకు తెలుసు!"

 

    "లోపలికెళ్దాం రా జాన్! రోడ్డున వెళ్ళేవాళ్ళంతా మనల్నే చూస్తున్నారు" అంది శబరి.

 

    "మీ డాడీ మమ్మీ-" భయపడుతూ అన్నాడు జాన్.

 

    "లేరు. పెళ్లి బట్టలూ, నగలూ కొనడానికి బయటికి వెళ్ళారు. ఇప్పుడిప్పుడే రారులే! రా! లోపలకు!"

 

    "ఇక్కడ కూర్చుందాం!" అంటూ జాన్ బాదంచెట్టు మొదలుకు ఆనుకుని కూర్చున్నాడు.

 

    "యల్.యస్.డి. వేసుకున్నావా?"

 

    "కాదు. మధ్యాహ్నం మార్జువానా తీసుకున్నాను."

 

    "అదెలా వుంటుంది?"     

 

    "వస్తావుగా, చూద్దువుగానిలే!"

 

    "ఇప్పుడు వెళ్లిపోదామా?"

 

    "ఇప్పుడు కాదు. ఎల్లుండి సాయంత్రం ఆ చెరువు దగ్గరకు వచ్చేయ్! ఆ తెల్లవారు ఝామున మనం గోవా వెళ్ళిపోదాం! మనకు డబ్బు కావాలిగా? కొంచెం డబ్బూ నగలూ పట్టుకొని వచ్చెయ్!"

 

    "అలాగే!" అన్నది ఉత్సాహంగా జాన్ ని తనివితీరా చోస్తూ.

 

    "జాన్!"

 

    "ఏమిటి?"


    
    "నీకు అమ్మానాన్నా వున్నారా?"

 

    "ఉన్నారు. కాని వాళ్ళను నేను తిరస్కరించాను. వాళ్ళు ఇప్పుడు నాకేమీ కారు!"

 

    "మీక్కూడా బాగా డబ్బుందా?"

 

    "లేదు!"

 

    "నువ్వు హిప్పీగా ఎలా మారావు? ఎందుకు మారావూ?"
    


    జాన్ ఓ క్షణం ఆలోచిస్తూ వుండిపోయాడు.

 

    "చెప్పవా జాన్? అసలు నీకు అమ్మా నాన్నా పెట్టిన పేరేమిటి?"

 

    "అవన్నీ గుర్తు చేసుకోవడం నాకిష్టం లేదు బేబీ!"

 

    "నాకు వినాలని వుంది. చెప్పవూ?" బ్రతిమలాడుతున్నట్టు అడిగింది.

 

    "చెబుతాను. నా అసలు పేరు నరేంద్ర!"

 

    "నరేంద్రా! బలే బాగుంది! మరి నీ పేరు ఎందుకు చెప్పవూ?"

 

    "ఆ పేరునూ, ఆ జీవితాన్ని పూర్తిగా మర్చిపోవాలనే!"

 

    "అయినా గుర్తుందిగా?" కిలకిల నవ్వింది.

 

    "నువ్వూ బాగానే మాట్లాడుతావు!"

 

    శబరి కళ్ళు మెరిపిస్తూ "నీ కథ చెప్పవూ? చెప్పకపోతే నీతో రాను!" అన్నది.

 

    "నాకు ఐదేళ్ళుండగా అమ్మ చచ్చిపోయింది. నాన్న ఒక ఆఫీసులో గుమాస్తా ఉద్యోగం చేస్తాడు. అమ్మ నన్ను చాలా ప్రేమగా చూసేది. ఒకరోజు నాన్న కొత్తమ్మను ఇంటికి తీసుకొచ్చాడు."

 

    "కొత్తమ్మా? అదేమిటి?"

 

    "మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. ఆమెను తీసుకొచ్చి అమ్మ అని చెప్పాడు. అమ్మ స్థానంలో మరో అమ్మ వచ్చినందుకు సంతోషించాను. కొత్త అమ్మ అని పిల్చేవాణ్ణి. కొద్ది రోజులు బాగానే చూసింది. ఆ తర్వాత ప్రతిచిన్న దానికీ తిట్టసాగింది. తర్వాత కొట్టడం కూడా సాగించింది. లేనిపోనివి చెప్పి నాన్నచేత కూడా కొట్టించేది. కొత్తమ్మకు ఒక అబ్బాయీ, అమ్మాయి పుట్టారు. ఇంటి చాకిరి సగం నాచేత చేయించేది. చేతకాకపోతే కొట్టేది. ఎన్నో రాత్రిళ్ళు అమ్మను తల్చుకొని ఏడ్చాను. నన్ను వంటరిగా వదలి వెళ్ళిపోయినందుకు అమ్మను తిట్టాను!" అంటూ ఆగి శబరి ముఖంలో చూశాడు.

 

    శబరి కళ్ళలో కన్నీటి బిందువులు కన్పించాయి.

 

    "బాగా చదవలేక పోయేవాణ్ణి. పరీక్ష తప్పితే నాన్న చావకొట్టేవాడు. అప్పుడు నాకు పన్నెండేళ్లు. ఏడవక్లాసు పరీక్ష రాస్తున్నాను. ఇంట్లో చదవడానికి నాకు తీరిక ఉండేదికాదు. క్లాసులో కూర్చుంటే కూడా కొత్తమ్మ ముఖమే కన్పిస్తూ వుండేది. కసిగా తిట్టుకుంటూ కూర్చునేవాడిని. పరీక్ష పేపరు తీసుకున్నాను. ప్రశ్నలు చదివాను. ఒక్కటీ అర్థంకాలేదు. పరీక్ష తప్పుతాను. నాన్నచేత దెబ్బలు తినాలి. పరీక్ష తప్పితే కొత్తమ్మ స్కూలు మానిపిస్తానని చెప్పింది. నాకు ఒకటే ఏడ్పు వస్తూంది. కళ్ళ వెంట నీరు కారిపోతూ వుంది. చివరకు ఎంత దిగమింగుకున్నా దుఃఖం పొంగి వచ్చేసింది. వెక్కిళ్ళు పెట్టి ఏడవసాగాను. అది చూసి మా క్లాసు టీచరు కమలమ్మ నా దగ్గరకు వచ్చింది.

 

    "ఏం బాబూ? ఎందుకు ఏడుస్తున్నావ్?" అని అడిగింది.

 

    "నాకు ప్రశ్నలకు ఏం రాయాలో అర్థం కావడంలేదు. పరీక్ష తప్పితే నాన్న చంపేస్తాడు!" అంటూ బావురుమన్నాను.

 

    ఆమె నాతల నిమురుతూ "ఛా! ఏడవకు. నువ్వు తెలివైన వాడివి. నువ్వు పరీక్ష తప్పడం ఏమిటి? జాగ్రత్తగా ప్రశ్నలు చదువుకో!" లాలించింది.

 

    అంతకంటే ఆమె నాకు ఎలాంటి సహాయం చెయ్యలేకపోయింది.

 

    ఏదో తోచిన సమాధానాలు రాసి పేపర్లు ఇచ్చాను. ఇంటికి వెళ్ళాలని లేదు. నాన్న - ప్రశ్నలకు ఏం సమాధానాలు రాశావని అడుగుతాడు.

 

    స్కూలు వరండా గోడకు ఆనుకొని ఏడుస్తూ కూర్చున్న నా దగ్గరకు కమలమ్మ టీచర్ వచ్చింది. ఆమె ఆప్యాయంగా నన్ను దగ్గరకు తీసుకొని ఓదార్చింది. ఇంటికి వెళ్ళమన్నది. నేను వెళ్ళనన్నాను. తన ఇంటికి తీసుకెళ్ళింది. అన్నం బలవంతంగా తినిపించింది. ఆమె ఆప్యాయతలో నాకు తల్లి ప్రేమ కన్పించింది. అమ్మను తల్చుకుని మళ్ళీ ఏడ్చాను!"

 

    ఆగాడు జాన్. శబరి చెంపలమీదుగా కన్నీరు కారుతూ ఉంది. "మీనాన్న చాలా చెడ్డవాడు!" అన్నది.

 

    "అవును!"

 

    "ఆఁ తర్వాత?"

 

    "సాయత్రం కూడా ఇంటికి వెళ్ళనన్నాను. కమలమ్మ టీచర్ నన్ను ఇంటికి తీసుకొచ్చింది. అప్పటికి నాన్న ఆఫీసునుంచి వచ్చాడు. పిల్లల్ని కొట్టకూడదని. పరీక్ష తప్పుతామనే భయం ఉన్న పిల్లలు పరీక్షలు రాయలేరనీ చెప్పింది. ఆమెను కూడా తీసుకొచ్చినందుకు కొత్తమ్మ గయ్యిమని లేచింది. ఆమెను కూడా ఏదో అన్నది. కమలమ్మ టీచరు తెల్లబోయింది. చిన్నబుచ్చుకుని వెళ్లిపోయింది. ఆ తర్వాత నాన్న...

 

    "ఏరా గాడిదా నేను కొడతానని మీ టీచరుకు చెప్పావా?" అంటూ వంగదీసి బాదసాగాడు. దెబ్బల బాధ భరించలేక పెద్దగా ఏడవసాగాను!

 

    "ఇంతమాత్రానికే ఎంత పెద్దగా అరుస్తున్నాడో చూడండి. ఇరుగూ, పొరుగూ సవతి తల్లి నానా బాధలు పెడుతున్నదని అనుకోవాలని. వాడు టీచర్ తో ఇంకా ఏమేమి చెప్పాడో!" అన్నది మా సవతి తల్లి.

 

    "ఏరా ఇంకేం చెప్పావ్?" నాన్న గర్జించాడు.

 

    "ఏం చెప్పలేదు. నన్ను కొట్టకు" అంటూ ఏడ్చాను. దెబ్బలు తిని ఏడుస్తూ పడుకున్నాను. అమ్మ అన్నం తినమని పిలవలేదు. నాన్న మాత్రం ఒక్కసారి పిల్చాడు. నేను పలకలేదు. వెళ్ళిపోయాడు.

 

    ఆ రాత్రి నాకు నిద్రపట్టలేదు. దెబ్బల బాధ, కడుపులో ఆకలి బాధ, గుండెల్లో కసి, నిద్రపోతున్న నాన్నను పొడిచి చంపాలనిపించింది." ఓ క్షణం ఆగాడు జాన్.

 

    "ఊఁ తర్వాత?" దగ్దద స్వరంతో అడిగింది శబరి.

 

    "నిద్ర పట్టలేదు. ఆ ఇంట్లో ఉండకూడదనుకున్నాను. ఇంట్లోనుంచి పారిపోయాను. ఎలాగో హైదరాబాదు చేరుకున్నాను. అక్కడ నాలాంటి పిల్లలు చాలామంది వుంటారు. బస్టాండులో అడుక్కుంటూ వుండేవాణ్ణి. ఒకసారి పోలీసులు పట్టుకున్నారు."

 Previous Page Next Page