Previous Page Next Page 
మానిని మనసు పేజి 22

 

      సావిత్రికి రమణమూర్తితో మాట్లాడకుండా హాస్టల్ కు వెళ్ళాలని లేదు.
    రమణమూర్తి సావిత్రిని తప్పించుకు తిరుగుతున్నాడు. అనసూయకు అనుమానం రాకుండా ఉండేందుకు ఆమెతో అతిగా మాట్లాడుతున్నాడు. భర్త ప్రవర్తన కొత్తగా ఉన్నట్లు అనసూయ గ్రహించింది. పైకి ఏమీ అనుమానం లేనట్లే నటిస్తున్నది.
    ఇద్దర్నీ రెడ్ హాండెడ్ గా పట్టే ప్రయత్నంలో ఉన్నది అనసూయ.
    "ఏమండీ! హాస్టల్లో సీటు దొరికిందా?" అన్నాడు రమణ సావిత్రితో.
    "ఏం? అది ఇక్కడ వుండటం మీ కిష్టంలేదా?" అన్నది అనసూయ.
    బయటకి వెళ్తే తేలిగ్గా కలుసుకోవచ్చును. అదే హింట్ గా అంటున్నాడు మనసులో అనుకుంది.
    "అబ్బే అదేం లేదు. నువ్వే అన్నావుగా వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో సీటుకోసం ప్రయత్నిస్తుందని. అవసరమయితే రికమండేషన్ చేయిద్దామని."
    "సీటు వచ్చిందన్నాను. ప్రయత్నిస్తుందనలేదు."
    సావిత్రి కాఫీ సిప్ చేస్తూ వేరే లోకంలో వున్న మనిషిలా వుంది.
    "ఏమే సావీ! మరో వారం రోజులు ఉంటావుగదూ?"
    "ఉంటాను. వారం రోజులని ఖచ్చితంగా చెప్పలేను."
    ఆ రోజు సాయంత్రం రమణ ఆఫీసునుంచి వచ్చాడు. డ్రాయింగు రూంలో సావిత్రి కూర్చుని ఉన్నది.
    రమణ ఆమెను చూసి ముందుకు కదలలేనట్టు నిలబడిపోయాడు.
    "మీరు..." ఏదో అనాలనుకున్నాడు రమణ. కాని ఆ పైకి ఏమీ అనలేదు.
    "అవును నేనే! గుర్తున్నానా? ఎక్కడో చూసినట్టు మాత్రమే ఉన్నానా?"
    అనసూయ గడపలోనే ఆగిపోయింది.
    సావిత్రి అన్న చివరిమాటలు విన్నిది.
    రమణ గాభరాను అణుచుకుంటూ "మీకు హైదరాబాదు నచ్చిందా?" అన్నాడు.
    "నచ్చినా నచ్చకపోయినా రెండేళ్ళు ఉండాల్సిందేగా?"
    "మీ గైడ్ ఎవరు?"
    "యం.యన్. రెడ్డిగారు."
    అనసూయ ఇద్దర్నీ మార్చిమార్చి చూడసాగింది.
    "అనూ! కాఫీ ఇవ్వవా?" నవ్వుతూ అడిగాడు రమణమూర్తి.
    అనసూయకు అద్దం తీసుకొచ్చి ముఖం చూసుకో అని భర్తకు ఇవ్వాలనిపించింది.
    "ఎందుకివ్వనూ? నేను ఉన్నది అందుకేగా" అంటూ వంటగదికేసి వెళ్ళింది అనసూయ.
    రమణమూర్తి ఆమె వెనకే లోపలకు వెళ్ళాడు.
    సావిత్రి రమణమూర్తిని చూస్తూ కసిగా నవ్వుకుంది.
    ఎంతకాలం తప్పించుకు తిరుగుతావో చూస్తాగా అనుకుంది. కసిగా మునిపంటితో పెదవిని కొరుక్కుంది. పెదవి చిట్లి రక్తం వస్తుంది కూడా ఆమెకు తెలియదు.
    "కాఫీ తీసుకో" అనసూయ సావిత్రికి కాఫీ అందించింది.
    "అరె అదేమిటి పెదవి చిట్లి రక్తం వస్తోంది" అన్నది అనసూయ ఆశ్చర్యంగా.
    "పొరపాటుగా పెదవి కరుచుకున్నాను" అంటూ కాఫీ అందుకుంది. పైటతో పెదవి రక్తాన్ని అద్దుకుంది.
    అనసూయ వెళ్ళిపోయింది.
    రమణమూర్తి బట్టలు మార్చుకొని బయటికి వెళ్ళాడు.
    సావిత్రి డ్రాయింగు రూంలో కూర్చుని ఇంగ్లీషు నవల చదవటానికి ప్రయత్నిస్తోంది.
    అనసూయ వంట చేస్తున్నది.
    ఆమె మనసు ఆక్రోశిస్తున్నది.
    తన భర్తకూ సావిత్రికీ పరిచయము ఉన్నది. అది మామూలు పరిచయం కాదు. అందుకే ఇద్దరూ వింతగా ప్రవర్తిస్తున్నారు. తనకు ఆ మాత్రం బుర్రలేదనుకున్నట్టున్నారు. సావిత్రికి మగవాళ్ళంటే కసి! దానికి కారణం డిజప్పాయింట్ మెంటు. తన భర్త ఒక పెద్ద నటుడు. అతని నటన తను అర్ధం చేసుకోలేకపోయింది. ఈ ఆరునెలలూ ఎంత ప్రేమ ఒలక బోశాడు? ఏదో జరిగింది. కాని సావిత్రి ఉద్దేశ్యం ఏమిటి? హాస్టల్ కు వెళ్ళకుండా ఇక్కడే ఎందుకు తిష్టవేసింది. సావిత్రి తనకు ద్రోహం చేస్తుందా? ఎంతకయినా తగిందే. పెళ్ళి చేసుకోదట. మగవాళ్ళను నమ్మదట!
    "నేను సహాయం చెయ్యనా అనూ?" సావిత్రి వంటింట్లోకి వచ్చి అనసూయ ప్రక్కన కూర్చుంది.
    అనసూయకు సావిత్రిని బాగా తిట్టాలనిపించింది. చాచి చెంప పగలగొట్టాలనిపించింది.
    "అక్కర్లేదు నువ్వెళ్ళి చదువుకో?" అన్నది నవ్వుతూ.
    తొమ్మిదయినా రమణమూర్తి రాలేదు.
    ఆకలేస్తుందని సావిత్రి ముందే భోంచేసి పడుకుంది.
    రమణమూర్తి తొమ్మిదిన్నరకు వచ్చాడు.
    అనసూయ తలుపు తీసింది. ఇంత ఆలస్యం అయిందేమని అడగలేదు.
    "సారీ అనూ. ఒక ఫ్రెండు కన్పించి ఇంగ్లీషు సినిమాకు తీసుకెళ్ళాడు!"
    "బట్టలు మార్చుకురండి. నాకు ఆకలేస్తోంది."
    రమణమూర్తి లోపలకెళ్ళి బట్టలు మార్చుకొని వచ్చాడు.
    డైనింగ్ టేబుల్ ముందు సావిత్రి కన్పించలేదు.
    "మీ ఫ్రెడు వెళ్ళిపోయిందా?" ఉత్సాహంగా అడిగాడు.
    "అది ఇక్కడ వుంటే మీకు ఇబ్బందిగా ఉందా?"
    "ఉండదామరి! మనిద్దరి మధ్యలో పానకంలో పుడకలా..."
    "మనస్ఫూర్తిగా అంటున్నారా?" అదోలా పలికింది అనసూయ కంఠం.
    "అదేమిటి అనూ! నీ దగ్గరనేను ఎప్పుడైనా అబద్ధాలు ఆడానా?"
    "ఆడలేదనే అనుకున్నాను."
    "నీ మనసులో ఏదో వుంది అది కక్కేస్తే పోతుందిగా?"
    "సమయం వచ్చినప్పుడు కక్కుతాను" అన్నది వ్యంగ్యంగా.
    రమణమూర్తి ముఖం చిన్న బుచ్చుకున్నాడు.
    రమణమూర్తి భోజనం కాగానే పడక గదిలోకి వెళ్ళలేదు. పుస్తకం చదువుతూ డ్రాయింగ్ రూంలో  కూర్చున్నాడు. అతనికి అనసూయ ప్రవర్తన ఆందోళనను కలిగిస్తున్నది. అనవసరంగా మాటామాట పెరుగుతుందనే భయం పట్టుకుంది. అందుకే డ్రాయింగు రూంలో కూర్చున్నాడు.
    అనసూయ తన గదిలో పడుకుంది.
    సావిత్రికి నిద్రపట్టడం లేదు.
    సావిత్రి లేచింది.
    చిన్నగా తలుపు తెరుచుకుంది. పిల్లిలా శబ్దం కాకుండా వెళ్ళి రమణమూర్తి ఎదురుగా నిల్చుంది.
    పుస్తకం చదవడంలో లీనమై ఉన్న రమణమూర్తి నీడలా ఎవరో తన ఎదురుగా నిల్చున్నట్టయి తృళ్ళిపడ్డాడు. చేతిలో పుస్తకం క్రింద పడింది.
    "నువ్వా?"
    "అవును నేనే"

 Previous Page Next Page