ఇద్దరూ సినిమా చూశారు. హోటల్లో భోజనం చేశారు. అమూల్య తనకోసం అన్నీ వదులుకొని వచ్చింది. తన జీవితంలోకి వెన్నెలలా ప్రవేశించింది. కాని అమూల్యను తను సంతృప్తి పరచగలడా? ప్రయోజనం ఏమిటి? ఏది ఏమైనా అమూల్యను సంతోషంగా ఉంచడానికి తను పరివిధాలా ప్రయత్నించాలి.
అమూల్య మోచేత్తో శ్రీధర్ ను పొడిచింది.
టాక్సీ వేగంగా పోతున్నది.
శ్రీధర్ తృళ్ళిపడి చెయ్యి తన చేతిలోకి తీసుకొని నొక్కాడు.
"ఏమిటి ఆలోచిస్తున్నావ్?"
"నీ గురించే"
"నా గురించా? ఏ విషయం"
"నిన్ను ఎప్పుడూ సంతోషంగా ఉంచాలని..."
"శ్రీ! నీతో వుండటమే నాకు చాలు. నా పక్కన ఉంటే చాలు. ఎన్ని బాధల్నయినా భరిస్తాను."
"బాధలే! బాబోయ్ నిన్ను బాధలు పడనిస్తానా?"
"కిలకిల నవ్వింది అమూల్య.
"నువ్వెప్పుడు ఇలా నవ్వుతూ ఉండాలనే నేను కోరుకునేది"
"ఎలా ఎలా?"
"ఇలా ఇలా" పాటలా సాగదీశాడు. శ్రీధర్ అమూల్య నడుంమీద చెయ్యి వేసి దగ్గరకు లాక్కున్నాడు.
టాక్సీ డ్రయివర్ ముసిముసిగా నవ్వుకోవడం కారు అద్దంలో కన్పించింది.
కళ్ళతోనే సైగచేసి చూపించింది డ్రయివరు కేసి.
"అతనికి తన పెళ్లినాటి సంగతులు గుర్తొచ్చి ఉంటాయి" అన్నాడు శ్రీధర్.
టాక్సీ ఊరులో ప్రవేశించింది.
"అబ్బ మరో రోజు"
"ఏమిటి?"
"ఈ పల్లెలో ఉండాలి."
"తర్వాత?"
"హైదరాబాద్ వెళ్తాంగా?"
"ఎన్ని రోజులుంటావ్ అక్కడ. రెండు రోజులకే ఈ పల్లె వాతావరణం బోరుకొట్టిందా?"
"లేదు, లేదు డాడీని చూడాలనిపించింది-"
"అమూల్య అబద్ధం చెబుతోందని శ్రీధర్ కు అర్థంకాకపోలేదు.
ఆమె స్వభావం శ్రీధర్ కు తెలుసు.
రెండురోజులకే బోరంటుంది. ముందు ముందు వుండగలదా? తమ కుటుంబంతో, జీవితంతో రాజీపడగలదా? తను అమూల్యను వివాహం చేసుకొని తప్పు చేశాడు. ఈ వివాహం వల్ల తనకంటే ఆమెకు ఎక్కువ బాధ కలగవచ్చును.
టాక్సీ వచ్చి వాకిట్లో ఆగింది.
బంగారమ్మ వచ్చి తలుపు తీసింది.
"అమ్మా అన్నం తిన్నావా?"
"లేదురా మీకోసమే చూస్తున్నాను."
"చెల్లాయిలు అప్పుడే పడుకున్నారా?"
"ఇప్పుడు ఎంత అయిందనుకుంటున్నావ్?"
శ్రీధర్ గడియారం కేసి చూశాడు. "ఓ మై గాడ్! పన్నెండు."
"నువ్వు అన్నం తినమ్మా. మేము తినేవచ్చాం"
బంగారమ్మ మారు మాట్లాడకుండా వంటింట్లోకి వెళ్ళింది.
శ్రీధర్ గదిలోకి వెళ్ళేటప్పటికే అమూల్య నైట్ గౌనులో వున్నది.
"నిన్న పొద్దున్న అమ్మ ఏమందో తెలుసా"
అమూల్య ప్రశ్నార్థకంగా చూసింది.
"అదేమిట్రా అబ్బాయ్. నీ భార్య అలా గోసాయివాడిలా - దాన్నేమంటారో- పైనుంచి కిందకు తగిలించుకుంటుంది?" అన్నది పకపక నవ్వాడు శ్రీధర్.
అతని నవ్వుతో శృతి కలిపింది అమూల్య.
"మీ చెల్లెళ్ళయితే సినిమాలో హీరోయిన్, అదీ డబ్బున్న హీరోయిన్ లా వున్నానట ఆ గౌనులో. ఈసారి వచ్చేటప్పుడు వాళ్ళక్కూడా చెరొకటీ తెచ్చిస్తానన్నాను."
"అంతపని చేయకు?"
"ఏం?"
"నువ్వు పెరిగిన వాతావరణం వేరు. వాళ్ళు ఇలాంటివి అలవాటు చేస్తే తెలిసీ తెలియని వయసులో రాబోయే భర్తల్ని గురించి ఏవేవో కలలు కంటారు. చివరకు మనం వాళ్ళకు పెళ్ళి చెయ్యలేక చచ్చిపోతాం?"
"అవును. మనమేగా వాళ్ళ పెళ్ళిళ్ళు చెయ్యాలి?"
ఆ మాట అంటుంటే అమూల్యకు తమాషా అనుభూతి కలిగింది.
ఇకనుంచి ఈ ఇంటి బాధ్యతలు శ్రీధర్ తో కలిసి తను పంచుకోవాలి.
"రేపు ప్రోగ్రాం ఏమిటి?"
"చచ్చాం"
"ఏం?"
"ఈ పల్లెటూర్లో ప్రోగ్రాములు కావాలంటే ఎలా?"
"అప్పుడు వెళ్ళాంగా మీ తాటితోపుకు? అక్కడికెళ్దాం."
"అక్కడికెందుకూ?"