Previous Page Next Page 
వేసవి వెన్నెల పేజి 22


    "ఏమిటి అలా చూస్తున్నావ్?"


    "ఇప్పటినుంచే నీలో అసంతృప్తి బయలుదేరింది కదూ?"


    నో నో అదేం కాదు. మమ్మీ అలా అన్నందుకు బాధగా వుంది. అంతే.


    "అంతేనా?"


    "అంతే నువ్వు నా పక్కన ఉంటే నాకేం భయం."


    "ఆడవాళ్ళంతా ప్రశ్నలతో విసిగిస్తున్నారనుకుంటాను."


    "అవును. మరీ అనాగరిక జనం. కొత్తని ఊరుకున్నాను లేకపోతేనా?"


    "నువ్వు అలా బాధపడకూడదు. పల్లెటూరి వాళ్ళు అలాగే మాట్లాడతారు. పట్టించుకోకూడదు."


    "ఛ మరీను ఏమే ఉసే అసే అంటుంటే నేను మాత్రం ఎంతకని సహించను?"


    "పన్నెండు అయింది" అన్నాడు శ్రీధర్.


    ఊహు. అంటూ శ్రీధర్ అమూల్యను దగ్గరకు తీసుకున్నాడు.


                                           * * *


    వాకిట్లో టాక్సీ నిలబడి వున్నది.


    అమూల్య ముస్తాబవుతూ ఉన్నది.


    "ఒరేయ్ శ్రీ ఆ కారు ఎవర్దిరా మీ అత్తగారు పంపించారా?" తల్లి శ్రీధర్ ను అడిగింది.


    "అది కారు కాదమ్మా టాక్సీ"


    "కారు కన్పిస్తూ వుంటే కాదంటావేంరా?"


    తల్లి అమాయకత్వానికి శ్రీధర్ కు నవ్వు వచ్చింది.


    "కారేనమ్మా బాడుగకు తోలతారు. అప్పుడు దాన్ని టాక్సీ అంటారు."


    "బాడుగకు తెచ్చావా?"


    "అవును అమూల్యను గుంటూరు తీసికెళ్ళి సినిమా చూపిం...."


    "అన్నయ్యా" మాట పూర్తికాకుండానే చిన్న చెల్లెలు వచ్చింది.


    చెల్లెలు ఏమడగబోతుందో శ్రీధర్ కు అర్థం అయింది.


    "మంచి పని చేశావ్? బాడుగ ఎంతేమిటి?" అన్నాడు తండ్రి అరుగు మీద కూర్చుని పొగాకు పాయ తీస్తూ.


    "రానూ పోనూ ఏభై రూపాయలు" వంద అంటే తల్లి గొడవ చేస్తుందనే భయంతో ఏభై అని చెప్పాడు.    


    "ఏభై రూపాయలే?" తల్లి బుగ్గలు నొక్కుకుంది.


    "ఇప్పుడు నేను మాత్రం ఏమన్నానూ? బస్ లో వెళ్తే మనిషికి డెబ్బయ్ ఐదు పైసలేగా?"


    సాగదీసింది బంగారమ్మ.


    "అమూల్యకు బస్సులెక్కే అలవాటు లేదమ్మా"


    అప్పుడే ముస్తాబై బయటికి వచ్చిన అమూల్య "భయపడకండి ఆ ఖర్చు నేనే ఇచ్చుకుంటాను" అన్నది.


    మామగారు తల తిప్పి కోడలికేసి చూశారు.


    శ్రీధర్ కు ఏమనాలో తోచలేదు.


    "అదేమిటే పిల్లా ఇప్పుడు నేనేమన్నాను. వాడి డబ్బు ఒకటీ నీ డబ్బు ఒకటీనా? ఒరే అబ్బాయి ఎటూ కారు తెచ్చావు బోలెడు డబ్బు తీసుకుంటున్నాడు. చెల్లాయిల్ని కూడా తీసుకెళ్ళు" అన్నది బంగారమ్మ.


    శ్రీధర్ కంఠంలో పచ్చి వెలక్కాయ పడినట్టు అయింది.


    "నీకు మతిపోయిందా ఏమే! కొత్త దంపతులు సరదాగా వెళుతుంటే మధ్యలో వాళ్ళెందుకూ?" చుట్ట చుట్టుకుంటూ అన్నాడు శ్రీధర్ తండ్రి.


    కమలా, విమలా అన్న ముఖంలోకి ఆశగా చూశారు.


    "ఫర్వాలేదు నాన్నా! చెల్లాయిల్ని కూడా తీసుకెళ్తాను."


    అమూల్య గబగబా వెళ్ళి కారులో కూర్చుంది.


    "వద్దులే అన్నయ్యా. వదినకు ఇష్టం లేనట్టుంది" అన్నది కమల గుణుస్తూ.


    "అబ్బే అదేం లేదమ్మా! బయలుదేరండి"


    "వాళ్ళకు మతిపోతే నీకూ మతిపోయిందేమిటిరా? అమ్మాయి కారులో కూర్చుంది వెళ్ళు" అన్నాడు తండ్రి.


    శ్రీధర్ టాక్సీలో కూర్చున్నాడు. అతనికి చిన్నబుచ్చుకున్న చెల్లెళ్ళ ముఖాలు కళ్ళముందు కన్పిస్తున్నాయి.    


    టాక్సీ వేగంగా పోతున్నది. కొంతసేపు ఇద్దరూ మౌనంగా కూర్చున్నారు.


    అమూల్యకేసి చూశాడు. అమూల్య టాక్సీ అద్దంలో నుంచి రోడ్డు కేసి చూస్తున్నది.


    "రాణీ గారికి కోపం వచ్చిందా?" నడుంమీద చెయ్యి వేస్తూ గోముగా అడిగాడు.


    "నాకెందుకు కోపం"


    "మరి మాట్లాడవేం?"


    "ఏం మాట్లాడను?"


    "అమ్మ పల్లెటూరి మనిషి. ఏభై రూపాయలంటే ఆమెకు చాలా ఎక్కువ. అమ్మకు దరిద్రం అంటే ఏమిటో బాగా తెలుసు. తను తినీ తినక మమ్మల్ని పెంచి పెద్ద చేసింది. ఇప్పుడు నా సంపాదన వచ్చాక కాస్త ఊపిరి తీసుకుంటున్నది. నువ్వు తొందరపడి అలా అనకుండా వుంటే బాగుండేది."


    "అదే నేనూ ఆలోచిస్తున్నాను."


    "నిజంగా?"


    "కమల్నీ, విమల్నీ కూడా తీసుకొస్తే బాగుండేది" అన్నది.


    "మరి అలా వచ్చి టాక్సీలో ఎందుకు కూర్చున్నావ్?" అని అడగాలనుకున్నాడు.


    "పోనిద్దూ మధ్యలో వాళ్ళెందుకూ?" కేవలం అమూల్యను సంతోష పెట్టటానికి అలా అన్నాడు.


    అమూల్య ముఖం వికసించింది.

 Previous Page Next Page