"ముంజలు తినిపించరా?"
"శ్రీధర్ పకపక నవ్వాడు.
"ముంజకాయల సీజన్ అయిపోయింది. ఇప్పుడు తాటికాయల సీజన్"
"అదేమిటి, రెండూ ఒకటేగా"
"కాదు రేపు తాటికాయ తినిపిస్తాను. నేను తెస్తాను. కొత్త పెళ్ళికూతురివి. నిన్ను వెంటబెట్టుకొని పొలాల వెంట నడిస్తే అందరూ చిత్రంగా చూస్తారు"
"చూడనియ్. నాకు అదే ఇష్టం" మెడ వెనక్కు విరుస్తూ జులపాలజుట్టును ఎడంచేత్తో విలాసంగా కదిలిస్తూ అన్నది.
"అంటే నలుగురూ నీకేసి చిత్రంగా చూడటం ఇష్టమా?"
"అవును. అప్పుడే జీవితంలో థ్రిల్ ఉంటుంది. అంతేగాని గుంపులో గోవిందా అని బ్రతికెయ్యటం నావల్ల కాదు బాబూ."
"అమ్మగారూ టైం ఎంతయిందో తెలుసా?"
"తెలుసు వంటిగంట. పవళిస్తారా."
"ఊహూ, నువ్వు జోలపాట పాడాలి"
"అలాగే" అంటూ అమూల్యను దగ్గరకు లాక్కున్నాడు.
* * *
అమూల్య శ్రీధర్ హైదరాబాద్ బయలుదేరారు. అమూల్యతో ఎవరూ రాలేదు. అమూల్య తల్లికి ఎవర్నీ అమూల్యతో పంపించడం ఇష్టం లేదు. తన కూతురి అత్తవారిల్లు తమ బంధువుల్లో ఎవరూ చూడటం ఇష్టం లేదు. తండ్రి చిన్న కూతుర్ని పంపించమన్నాడు.
"చాల్లే ఊరుకోండి. దాని జీవితం కూడా పాడు చెయ్యాలని వుందా?" అంటూ గయ్యిన లేచింది. అమూల్య ఆ మాట విన్నది. తనతో ఎవరూ రానక్కర్లేదని చెప్పింది.
ఊళ్ళో చాలామంది పిల్లతో ఎవరూ రాలేదేమని బంగారమ్మను అడగటం కూడా అమూల్య విన్నది.
"వాళ్ళు గొప్పవాళ్ళు. వాళ్ళ ఆచారాలు మనకేం తెలుస్తాయి" అని సమర్థించింది బంగారమ్మ. బంగారమ్మ సమర్థింపులో ఏదో అసంతృప్తి ఉన్నట్టు అమూల్య గ్రహించింది.
టాక్సీ వచ్చింది.
బంగారమ్మ అమూల్యకు పట్టుచీర పెట్టింది. ఆ చీర చూసి అమూల్య ముఖం చిట్లించుకుంది. "ఇలాంటివి నేను కట్టను. ఇవి ఎందుకు?" అన్నది.
"మా ఆర్ధిక పరిస్థితి నీకు తెలుసునమ్మా. అంతకంటే ఏం పెట్టగలను?"
అమూల్య గతుక్కుమన్నది.
నిజమే. అన్నీ తెలిసే తను పెళ్ళిచేసుకుంది.
"అది కాదత్తయ్య. ఇప్పుడే ఇదెందుకు డబ్బు దండగ అన్నాను"
"అంత మాత్రం అర్థం చేసుకుంటే చాలు తల్లీ" బంగారమ్మ సంతృప్తిగా అన్నది.
అమూల్య ప్రయాణానికి తయారవుతున్నది. ఎంతకూ గదిలోంచి బయటకు రాలేదు.
శ్రీధర్ లోపలకు వెళ్ళాడు. పెట్టెలోని చీరలన్నీ చిందర వందరగా పడి వున్నాయ్. అమూల్య కింద చతికిలబడి ఆలోచిస్తున్నది.
"ఇదేమిటోయ్ ఇంకా తయారు కాలేదు. ఈ చీరలన్నీ ఏమిటి ఇలా పడేశావ్? టాక్సీ వచ్చి నిలబడింది" అన్నాడు.
అమూల్య మాట్లాడలేదు.
"ఏమిటి రాణీగారు చిరాకుగా ఉన్నారు"
"వేళాకోళాలు కొంచెం సేపు ఆపు"
"ఇప్పుడేమైంది?"
"ఏమైందా? నా ముత్యాల సెట్టు కన్పించడం లేదు."
శ్రీధర్ తృళ్ళిపడ్డాడు.
"సరిగ్గా చూడు ఎక్కడ పోతాయి?"
"అన్నీ చూశాను."
"మరి ఏమైవుంటాయ్?"
"ఏమో నాకేం తెలుసు?"
"అసలు నువ్వు ముత్యాల సెట్టు తెచ్చావా?"
"అన్నీ మమ్మీ సర్దింది"
"అయితే ఆ సెట్టు పెట్టలేదేమో?"
"మా మమ్మీ ఇలాంటి పొరపాటు చెయ్యదు. ఈ తెల్లచీర మీదకు అవి పెట్టే ఉంటుంది. సరదాగా ఎక్స్ కర్షన్ కు వెళ్తే కూడా రెండు మూడు సెట్లు పెడుతుంది."
"అయితే ఆ నగలు ఏమైనాయని నీ ఉద్దేశం?"
"నాకు ఉద్దేశాలు ఏమీ లేవు. నా నగలు కన్పించడం లేదు అంతే."
"మీ మమ్మీ ఒకవేళ మర్చిపోయిందోమో? ఇప్పుడు వెళుతున్నాంగా? కనుక్కో?"
"అయినా ఒకసారి అత్తయ్యను అడిగితే."
"అమూల్య. ఏమిటి నీ ఉద్దేశం అమ్మ నీ నగలు దాచిందంటావా?"
"నేను అలా అన్నానా. నా నగల బట్టలు మీ అమ్మా మీ చెల్లెళ్ళూ ఈ మూడు రోజులనుంచి వచ్చిన వాళ్ళందరికీ చూపిస్తూనే వున్నారు"
"అయితే?"
అమూల్య మాట్లాడలేదు.
"అమూల్యా! ఈ ఇంట్లో అలాంటిది జరగదు. మీ ఇంటిదగ్గరే ఉంటాయి. ఈ విషయం మా అమ్మ వింటే బాధపడుతుంది. బట్టలు సర్ది బయలుదేరు అన్నాడు శ్రీధర్ కొంచెం కటువుగా."
అమూల్య తలెత్తి శ్రీధర్ ముఖంలోకి చూసింది. అతని ముఖం గంభీరంగా ఉన్నది.
అమూల్య గబగబా బట్టలు పెట్టెలో కుక్కింది.