"నిజంగా చదువుతున్నావా?"
"లేకపోతే?"
"కలలు కంటున్నావేమోనని?"
"పగటికలలు అలవాటు లేదు."
"పగటి కలలు కాదు. పరువంలోని కలలు."
"ఛీ".... సిగ్గుతో మొహానికి రెండు చేతులూ అడ్డం పెట్టుకుంది.
"ఊ" అంటూ చేతులు పట్టుకున్నాడు అతని కళ్ళలోకి చూడలేక కళ్లు మూసుకుంది.
అంత సిగ్గెందుకో ఏవీ తుమ్మెదల్లాంటి నీ కళ్లు. తనివితీరా చూడనీ" అంటూ వంగి రెండు కళ్లూ ముద్దు పెట్టుకున్నాడు.
"అబ్బ..... ఏమిటిది?"
"ఛీ, పొండి" అంది అతన్ని మెల్లగా పక్కకినెడుతూ. మరింత దగ్గరకి జరిగాడు మధన్.
"అదుగో అత్తయ్య" అంది బెదురుగా.
పకపకా నవ్వుతూ తప్పించుకు పారిపోయింది రాధిక.
"అమ్మదొంగా, సరే చెబుతాలే నీపని" అని నవ్వుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు.
రాధిక తిరిగి తన గదిలోకొచ్చి కూర్చుంది.
అతను ముద్దు పెట్టుకున్న కళ్ళని చేతులతో నిమిరింది. తియ్యని తలుపులు చిందరవందర చేశాయి. మనస్సుని. అలా కూర్చుండిపోయింది కుర్చీలో ఆలోచిస్తూ.
ఏం చెల్లెమ్మా, దీపమైనా వేసుకోకుండా ఏమిటంత సుదీర్ఘంగా ఆలోచిస్తున్నావ్?" అన్న గొంతు విని ఉలిక్కిపడింది రాధిక.
గబుక్కున లేచి లైటు వేసింది.
"సత్యం అన్నయ్యా! ఎప్పుడొచ్చావ్" అంది ఆశ్చర్యంగా.
"నేనొచ్చి గంటయింది. మధన్ తో మాట్లాడుతూ కూర్చున్నా."
"అన్నయ్యా ఇన్నాళ్ళూ ఏమైపోయావు. ఇప్పుడా రావడం అన్నయ్యా" అంది కోపాన్ని నటిస్తూ.
"ఇక ముందు రోజూ వస్తాను."
"చూస్తాగా!"
"రాకపోతేయెలా? పెళ్ళి పెత్తనమంతా నాదేగా?"
"పో. అన్నయ్యా" అంటూ తలవంచుకుంది. సిగ్గుతో బుగ్గలు ఎర్రబడ్డాయి.
"వస్తానమ్మా. మళ్ళీ కలుస్తాను అంటూ సత్యం వెళ్ళిపోయాడు.
వెనకాలే సాగనంపటానికి వెళ్ళాడు మధన్.
వారంరోజులూ యిట్టే గడిచినయ్. బంధువు లెవరూ రాలేరు. "ఇంత తక్కువ వ్యవధిలో రాలేకపోయాము" అంటూ ఉత్తరాలు రాశారు. రేణుక మిగతా పిల్లలూ సత్తెనపల్లి నుంచొచ్చారు. రేణుక భర్త "రత్నావళే మీ అక్కయ్యా" అంటూ అదోలా అయిపోయాట్ట. పెళ్ళికి నేరాలేను నువ్వెళ్ళుమన్నాట్ట - రేణుక చెప్పింది.
ఏది యెలాగున్నా సత్యం హడావిడి వందమంది పెట్టు ఒక్కక్షణం మధన్ ని వొదిలిపెట్టకుండా సరసాలాడుతూ సాంబశివరావుగారికి సహాయపడుతూ సరదాగా తిరుగుతున్నాడు.
పెళ్లికి అట్టేమందిని పిలవకపోయినా రత్నావళిని చూడాలని జనం వాళ్ళంతట వాళ్ళే వొచ్చేశారు.
పాలమీగడ ఛాయలో ఎర్రని బెనారస్ పువ్వుల చీర మధ్యన పాలరాతి బొమ్మలా మెరిసిపోయింది రాధిక. నల్లని కాటుక కళ్ళు తుమ్మెదల్లా మిలమిలా మెరుస్తూ కదలాడుతూ వుంటే నుదుటున ఎర్రని కల్యాణం బొట్టు వెలువడిన ఉదయభానుడి ప్రతిబింబంలా ధగ ధగ మెరుస్తూంటే, చందమామలోని మచ్చలా బుగ్గమీద నల్లని మచ్చ కొత్త అందాలు చిందుతూ ఈమె మనిషా అప్సరసా అన్నంత ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించింది.
కొందరు అంత అందాలరాశి మధన్ భార్య కావడం అతని అదృష్టమన్నారు.
కొందరు ఈర్ష్య పడ్డారు. మరికొందరు అసూయను భరించలేక యిష్టం వచ్చినట్టు మాట్లాడారు.
"వ్రతం చెడ్డా ఫలం దక్కిందిలే, సమంతకమణివంటి భార్యామణి. కో అంటే కోట్లు సంపాదిస్తుంది"
"అయితే మధన్ వుద్యోగం మానెయ్యొచ్చును."
"మానెయ్యకేం చేస్తాడు?"
"రత్నావళి బాగా డాన్స్ చేస్తుందిరా, దీన్ని హైదరాబాదులో చూశాను."
"అవును. బాగా పాడుతుంది కూడా. ఒకటి రెండుసార్లు కొందరు మిత్రులతో కలసి వెళ్ళాను పాట వినడానికి. దీని అబ్బ అనుకుంటా వాడు బోలెడంత డబ్బులాగేసేవాడు."
"ఇకవారి మాటలు వినలేకపోయింది రాధిక. నీళ్ళు నిండిన కళ్ళతో మెల్లగా చూశాడతను. సత్యం అలా మాట్లాడుతూన్న వాళ్ళని చూసి మండిపడ్డా ఏమీ చెయ్యలేక మాట్లాడక ఊరుకున్నాడు.