"కష్టమేముందండీ!" అంది శ్రీమతి వైకుంఠం అంతకంటే ఏమనాలో బోధపడక. కారు సాగిపోతూ వుంటే చూస్తూ నిలబడిపోయింది. రాజారావు కూడా ఆమెకు అర్ధంకాలేదు. ఇంతకుముందు తనకు పరిచయమైన పురుషులకూ అతనికీ ఏదో వ్యత్యాసం వున్నట్లనిపించింది. "స్త్రీని కేవలం విలాస వస్తువుగా వాడుకొనే మనస్తత్వం కాదు రాజారావుది" అనుకుంది. రాజారావంటే శ్రీమతి వైకుంఠానికి గౌరవంలాంటి భావం ఏర్పడింది.
ఇంట్లో ప్రవేశించి, అరుంధతి మొదట కూచున్నచోటే ఆలోచిస్తూ కూచుని వుండటాన్ని చూసింది శ్రీమతి వైకుంఠం. ఏదో అనబోయింది. మళ్ళీ ఏమీ అనకుండానే ఒకసారి ఆమెవైపు జాలిగా చూసి వెళ్ళిపోయింది.
25
దేశానికి స్వాతంత్ర్యాన్ని అహింసతోనే తెచ్చామంటూ సగర్వంగా చెప్పుకుంటున్న నాయకులను చూసి, మూటా మల్లే సర్దుకొని స్వదేశానికి పయనమైన ఇంగ్లీషువాడు-తన విరిగిన నడ్డిని సవరించుకుంటూ, భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ మొదలైన మృత్యు వీరులను తలచుకొని తనలో తనే నవ్వుకున్నాడు. చూస్తుండగానే కాలగర్భంలో పది సంవత్సరాలు గడిచిపోయాయి.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక మూడోసారి జనరల్ ఎలక్షన్స్ కూడా అయిపోయాయి. కాంగ్రెసు ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు బలపడ్డాయి. ప్రజలు ఎన్నుకొన్న ప్రతినిధులు శాసకులయారు. దేశ పురోభివృద్ధికి ఎన్నో ప్రణాళికలు వేశారు. కోట్ల ఖర్చుమీద ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతూంది. తెల్ల ప్రభుత్వంలో లక్షాధికారులుగా వున్నవారు ఈనాడు కోటికి పడగలెత్తుతున్నారు. కొందరు ఏమీ లేనివారే లక్షలు ఆర్జించారు. కాని దేశంలోని సగటు మనిషి జీవిత ప్రమాణంలో చెప్పుకోతగిన మార్పు ఏమీరాలేదు. భారత ప్రధాని పండిట్ జవహర్ లాలా నెహ్రూయే స్వయంగా "బీదవాడు మరీ బీదవాడయాడు. భాగ్యవంతుడు మరీ భాగ్యవంతుడయాడు" అన్నారు. అయినా "సోషలిస్టిక్ పాట్రన్ ఆఫ్ సొసైటీ" నిర్మాణం కోసం ముందుకు రమ్మని ప్రజలకు పిలుపునిచ్చి, తానుమాత్రం కన్నుమూశారు.
ఈ పదిసంవత్సరాలకాలంలో అరుంధతి జీవితస్థాయిలోనైతేనేం, మానసిక అంతస్తులోనైతేనేం వచ్చినమార్పు అసాధారణం అనే చెప్పుకోవాలి.
దేశానికి ఇద్దరు ప్రధానమంత్రులు మారారు. అయినా జనం మారలేదు. ఇప్పుడు రాజారావు అధికార పార్టీకి చీఫ్ విప్. ఆయన తన పార్టీవాళ్ళను తనచేతిలో కీలుబొమ్మల్నే చేశాడు. అతను మంత్రిపదివిని ఆశించలేదు.
"ఆయనకు మంత్రి పదవి ఎందుకు? మంత్రి అయితే ఒక శాఖకే పాలకుడవుతాడు. ముఖ్యమంత్రే రాజారావు చేతిలో వున్నాడు. ఆ విషయం తెలుసుకున్న అందరు మంత్రులూ అతని చేతినోనే ఉన్నారు. అతను అన్ని శాఖలకీ పాలకుడే" అనేవారు అతన్ని చూసి ఈర్ష్యపడేవారు చాలామంది.
ముఖ్యమంత్రి రాజారావు సలహా లేకుండా ఏ పనీ చేసేవాడు కాదు. పాలసీ మేటర్స్ లో నిర్ణయాలు రాజారావు సలహామీదనే జరిగేవి.
రాజారావు ఇలా వుండగా అరుంధతి ఎలా వుందీ అంటే:-
నగరం నడిరోడ్డున ఆకాశాన్ని "నువ్వు నాకంటే యెంత ఎత్తు ఉన్నావు?" అంటూ ప్రశ్నిస్తుందా అనిపించే ఎత్తైన భవనం. ఆ భవనం ముందు శ్రద్ధగా, చక్కగా, మొగల్ గార్డెన్స్ స్టయిల్లో పెంచిన తోట. ఆ బంగళా చరిత్ర తెలియని వాళ్ళుకూడా ముందు నుంచి వెళుతూ ఓ నిముషం నిల్చొని ఆ భావనాన్నీ, ఆ తోటనూ చూడకుండా ముందుకు అడుగు వెయ్యలేరు. ఆ బంగాళా ముందు ఎప్పుడూ రెండు మూడు కార్లు ఆగి ఉంటాయి.
సాయంత్రం ఆరు అయింది. అయినా ఆ ఇంటి గేటు తెరువబడలేదు. గేటుకు పక్కగా స్టూల్ మీద గేటు కాపలావాడు కూచునివున్నాడు. అతనికి ఓ పాతిక ఏళ్ళు ఉండవచ్చును. దృఢకాయుడు. గేటుకు ఇరువైపులా, రోడ్డుకు పక్కగా కార్లు ఆగి ఉన్నాయి. కార్ల తాలూకు యజమానులు కారుల్లోనే కూర్చుని గేటువేపు చూస్తున్నారు.
"ఈవిడగారు గేట్లో గూర్ఖాను పెట్టుకోరు ఎందుకనో?" అన్నాడు అంబాసిడర్ కార్లో కూర్చున్న లావుపాటి పెద్దమనిషి తన ప్రక్కనేవున్న వ్యక్తితో. అతని స్వరంలో ఆవిడగారి మీదవున్న అక్కసు వెల్లడవుతూనే వుంది.
"గూర్ఖా అయితే ఆవిడ అనే మాటలకు పొడిచేసి మరీ వెళతాడు" అన్నాడు రెండోవ్యక్తి.
గూర్ఖాకు ఉన్న మాత్రం పౌరుషం, అభిమానం తనకు లేదని అతను అంటున్నాడని అనుకొని గతుక్కుమన్నాడు మొదటి పెద్దమనిషి.
కారు తలుపు తీసుకొని ఓ పొడువాటి పెద్దమనిషి ఖరీదయిన ఇద్దరు దుస్తుల్లో దిగాడు. అతని ముఖంలో విసుగు స్పష్టంగా కనిపిస్తూంది. కారు తలుపు గట్టిగా వేసి విసుగ్గా గేటుకేసి నడిచాడు. గేటువాడు నిర్లక్ష్యంగా చూసి ముఖం తిప్పుకున్నాడు.
"తస్సాదియ్యా! కాపలా వాడికే ఇంత పొగరుందే? మరి ఆవిడ ఎలా ఉందో?" అనుకున్నాడు.
"ఏమోయ్! మీ అమ్మగారి దర్శనం కావాలంటే ఈ రోడ్డుమీద ఇంకెంత కాలం తపస్సు చెయ్యాలి?" అన్నాడు కోరమీసం దువ్వుతూ.
గేటువాడు ఆ పెద్దమనిషిని ఎగాదిగా చూశాడు. ఆరడుగుల ఎత్తు. భారీ విగ్రహమే కాకుండా చాలా ఆకర్షణీయంగా కూడా ఉంది. పెద్దనుదురూ, పెద్ద కళ్ళూ, ఆ కళ్ళల్లో ఎర్రజీరలు, లావుపాటి ముక్కూ, బలమైన గడ్డం, దృఢంగా కనిపించే పెదవులు, మొత్తంమీద మనిషిలో మహారాజు ఠీవి ఉట్టిపడుతూంది అని అనుకున్నాడు కాపలావాడు. ఆ వ్యక్తి దిగిన కారు కేసి చూశాడు. అది చిన్నపాటి విమానంలా కనిపించింది. ఆ యింటి ముందు చాలారకాల కార్లు వచ్చి ఆగటం చూశాడు కాని ఇంత పెద్దకారు అంతకు ముందెప్పుడూ చూడలేదు.
"తమరు కొత్తగా వస్తున్నారా బాబూ?" అన్నాడు గేటువాడు.
వాడి మాటల్లో- "ఇంత తొందరపడితే ఎలా? ఇలాంటి గంటలూ, రోజులూ ఎన్ని గడపాలో ఆ దేవిగారి దర్శనం కావాలంటే!" అన్న భావం ఏదో స్పురించింది ఆయనకు.
"నేను ఇంతకు ముందు వచ్చి ఉండనని ఎలా గ్రహించుకున్నావు?" ఆయన కంఠం హుందాగా, గంభీరంగా వుంది.
"మీమాటల్నిబట్టి! నేను వచ్చి నెలకూడా కాలేదు కాని, ఎవరు కొత్తవారో ఎవరు పాతవారో ఇట్టే పోల్చుకోగలను. ఇంతకుముందు మీరు ఇక్కడకు వచ్చి వున్నట్టయితే కారు తలుపు అంత గట్టిగా వేసి వుండేవారు కాదు."
"ఏం అది కూడా తప్పేనా?"
"తప్పా తప్పున్నరా? ఈ దరిదాపుల్లో తెలిసిన వాళ్ళెవరూ కారు హారన్ కూడా వెయ్యరు. కార్లు కూడా అమ్మగారి ముందు అల్లరి చెయ్యకూడదు. వినయంగా వుండాలి." సగర్వంగా చెబుతున్నాడు కాపలావాడు. ఆ పెద్దమనిషికి వాడి చెవ్వు మెలెయ్యాలనిపించింది.
ఆ పెద్దమనిషి జమీందారీ వంశానికి సంబంధించిన వాడు. ఇప్పుడు జమీందారీ లేకపోయినా, దానివల్ల లభించిన ఐశ్వర్యం, అభిజాత్యం, అహంకారం, అభిమానం, హుందాతనం, గాంభీర్యం మాత్రం యింకా మిగిలే వున్నాయి. తరతరాలుగా రక్తనాళాల్లో జీర్ణిచుకొనిపోయిన ఆ అహం, అలవాటయిన ఆ ఠీవీ పోవాలంటే ఇంకా కొన్ని తరాలు గడవాల్సి వుంటుంది- అని అనిపిస్తుంది అతన్ని చూస్తుంటే. ఆ పెద్దమనిషి పేరు దుర్గాప్రసాద్. కాని కుమార్ రాజా అంటేనే అందరికి తెలుస్తుంది.
"అమ్మగారు దివినుంచి భువికి దిగటానికి ఇంకా ఎంతసేపు పడుతుంది? అన్నాడు కుమార్ రాజా చేతి గడియారం చూసుకుంటూ.
"మరో అర్ధగంటలో దిగవచ్చు." కాపలావాడు మామూలు ధోరణిలోనే అన్నాడు.
"గేటు తియ్యరాదూ. అట్లా ఆ వరండాలోనన్నా కూచుంటాం. మరీ నడిరోడ్డుమీద నిల్చోవాలంటే బాగాలేదు" అన్నాడు రాజావారు.
"లేదండయ్యా! అమ్మగారు దిగొచ్చి తెరవమన్నదాకా గేటు తియ్యకూడదు" అన్నాడు కాపలావాడు.
"నీ పేరేమిటోయ్?"
"రంగన్న అంటారండీ!"
దుర్గాప్రసాద్ చాలా సేపటినుండి గేటులో నిల్చోవటం చూసి ఒక్కొక్కరే కార్లు దిగి రావటం మొదలుపెట్టారు. ఆయన వెనకొచ్చి లోపలకు వెళ్ళే, ముందు ఛాన్స్ ఎక్కడ కొట్టేస్తాడోనని వాళ్ళ భయం.
"ఓ రాజాగారా? నమస్కారమండయ్య!" అన్నాడు కాంట్రాక్టరు చిన్నయ్య. రాజావారు గతుక్కుమన్నారు. ఏది జరుగుతుందని ఇంతసేపూ ఆయన భయపడ్డాడో అదే జరిగింది. ఇంత బతుకూ బతికి ఈవిడ వాకిలి ముందు నిల్చోవటం ఎవరయినా తెలిసినవాళ్ళ కళ్ళ పడుతుందేమోనని ఆయన భయం.
ఈ వెధవాయి ఇక్కడ దాపురించాడే! వీడు లేని స్థలమే వుండదు. మంగళగిరి పానకాల రాయుడిలా వీడి డబ్బు దాహం ఎంతకూ తీరేదికాదు వీడితోపాటు తను ఆవిడగారి ఇంటిముందు నిల్చోవడమా? ఛ! ఎంత అభిమానం చంపుకోవాల్సి వచ్చింది? తిరిగి వెళ్ళిపోతే తనపని ఎప్పుడొచ్చిన ఇంతేగా? ఎప్పుడూ ఎవరో ఒకరు కనిపించక పోరు! ఆ రాజాగాడేమో మొహం దాటేస్తున్నాడాయె! ఈ రాణీగారి రికమండేషన్ కు తిరుగులేదని అందరూ అంటున్నారు. చ౧ ఏమిటిదంతా? ఇదా మన దేశం?
"నమస్కారం సార్!" మూతిలో మూతిపెట్టి మళ్ళీ చిన్నయ్య అన్నాడు.
వీడికి ఎంత ధైర్యం వచ్చింది! ఇద్దరం ఒకటేనన్నట్లు ప్రవర్తిస్తున్నాడు.
"ఆఁ ఏం చిన్నయ్యా! కులాసాగా వున్నావా? ఈ మధ్య కాంట్రాక్టులమీద బాగా సంపాదించావటగా?" అన్నారు రాజావారు హుందాగా.
"ఏదో లెండయ్యా! అంతా తమ దయ!" చిన్నయ్య మామూలుగానే అన్నా, అందులో హేళన వినిపించింది రాజావారికి.
"తమరు కూడా ఇలా దయచేశారు? ఆమెగారు ఎప్పుడు కిందకు దిగివస్తారో చెప్పలేం! తమరు అలా నడిరోడ్డుమీద గేటుకు ఎదురుగా నిల్చొని వుండటం బాగాలేదు. తమరు కార్లో కూచోండి." అన్నాడు చిన్నయ్య, నిజంగానే రాజావారికి పట్టిన దుర్గతికి చింతిస్తూ.
"ఫరవాలేదులే, నీక్కూడా ఈవిడగారితో పని పడిందన్నమాట!" అన్నాడు కుమార్ రాజావారు సిగరెట్ ముట్టించుకుంటూ.
"నాకు పనిపడటం ఏమిటిబాబూ? అసలు నాలాంటివాళ్ళకే ఈమెతో ఎక్కువ పనులుంటాయి." అన్నాడు చిన్నయ్య అతి తెలివిగా నవ్వుతూ.
రాజావారికి అతని వెకిలి నవ్వుకు చిరాకువేసింది.
"నువ్వే పనిమీద వచ్చావు?" అన్నాడు రాజావారు.
"నల్లమల అడవులనుంచి శ్రీశైలానికి రోడ్డు వెయ్యాలని గవర్నమెంటు ఆలోచిస్తుందిట" అన్నాడు చిన్నయ్య.
"ఊఁ" అని మాత్రమే అన్నారు రాజావారు గంభీరంగా.
"ఆ కాంట్రాక్టు ఏదో నేనే తీసుకుందామని ఇన్ని గొడవలు పడుతున్నాను."
"ఈ కాంట్రాక్టులో ఎన్ని లక్షలు కొట్టొచ్చునేమిటి?"
"చివరికి ఎంత మిగిలి చస్తుందోగాని, ముందు ఈమెగారికి చెల్లించవద్దూ ముడుపు! యాభయ్ వేలకు తగ్గేలాలేదు." అన్నాడు చిన్నయ్య.
"అప్పుడే బేరాలుకూడా అయాయన్నమాట. ఇచ్చేయ్! ముష్టి యాభయ్ వేలేగా? నువ్వా కాంట్రాక్టుమీద ఎంత లేదన్నా రెండులక్షలు కొట్టేస్తావ్! నీ సంగతి నాకు తెలియదా!" అన్నారు రాజావారు సిగరెట్ దమ్మును గట్టిగా లాగుతూ.
"ఆ! అంత ఎక్కడ వచ్చి చస్తుందిలేండి? అసలు ఇంకాఈమెగారూ అందందే? అదుగో ఇదుగో అంటూ ఇంటిచుట్టూ కుక్కను తిప్పినట్లు తిప్పుతుందంటే నమ్మండీ!"
"అయితేనేం? రెండు లక్షలు- రెండు లక్షలు వస్తున్నాయంటే, నీలాంటివాడు కుక్కలా తిరగడమేకాదు, పీతలా పాకి, గాడిదలా అరవమన్నా అరుస్తాడు" అనుకున్నాడు కుమార్ రాజా మనస్సులోనే.
"ఏరా రంగడూ! అమ్మగారు ఇంకా కిందకు రాలేదు?" చనువుగా అడుగుతున్న వ్యక్తికేసి రాజావారు, చిన్నయ్యా ఒకేసారి చూశారు.
"నమస్కారం నాగేంద్రబాబూ!" అన్నాడు వినయంగా చిన్నయ్య.
"నువ్వెంత సంపాదించినా ఇంతకంటే పెరగలేవులే" అనుకున్నారు రాజావారు చిన్నయ్య గురించి.
"వీరు ఉండవల్లి కుమార్ రాజా దుర్గాప్రసాద్ బహద్దూర్ వారు!" అంటూ చిన్నయ్య రాజావార్ని నాగేంద్రరావుకు పరిచయం చేశాడు.
రాజావారికి చిరాకు వేసింది. వీడొకడు! తను ఎవరికీ తెలీకుండా పని చేయించుకొని వెళ్ళాలనుకొంటూ వుంటే అందరికీ పరిచయం చేస్తున్నాడు. కావాలనే చేస్తున్నాడు. రాజావారే ఈ ఇంటిచుట్టూ తిరుగుతూంటే మనం తిరగటానికేముందిలే అన్నట్లుంది వాడి ధోరణి.
నాగేంద్రరావు రాజావారికి నమస్కరించాడు. రాజావారు సాలోచనగా తల పంకించారు.
"ఎంత అహం! తను సమస్కారం పెడితే తల వూపుతాడేం? ఇంకా రాజ్యాలు వున్నాయనే అనుకుంటున్నట్లున్నాడు." ఒళ్ళు మండిపోయింది నాగేంద్రానికి.
ఒక్కొక్కరే వస్తూవుంటే రాజావారు బిక్కచచ్చిపోతున్నారు. రేపీపాటికి ఉండవల్లి కుమార్ రాజా అరుంధతీదేవి ఇంటి గేటుముందు నిల్చొని, ఆమె దర్శనంకోసం పడికాపులు కాయటం చూశామని ఊరంతా టాం టాం వేస్తారు. తను ఇక్కడకువచ్చి తప్పుచేశాడు. వచ్చేముందు ఎంతో మధనపడ్డాడు. ఎం.పి. కావాలనే కోర్కె పురుగులా తన బుర్రను తొలుస్తూవుంటే మతిపోయి వచ్చాడు తను.
నాగేంద్రరావు గేటు తెరచుకొని లోపలకు వెళ్ళిపోయాడు. గేటువాడు మిగతావాళ్ళు ఎక్కడ జొరబడతారో అన్నట్లు గేటు తలుపులు కొద్దిగా తెరచి తను అడ్డం నిల్చున్నాడు. రాజావారికి నవ్వొచ్చింది. వీడు ఇంతకుముందు సినిమా గేటుల్లో పనిచేసి ఉంటాడు అనుకున్నాడు.
"అయ్యా! నాగేంద్రబాబూ! మన పని మర్చిపోకండి! ఎలాగయినా పాతికకు సెటిల్ చెయ్యండి" అన్నాడు చిన్నయ్య లోపలకు వెళుతున్న నాగేంద్రాన్ని ఉద్దేశించి. నాగేంద్రరావు వినీ వినిపించనట్టే బెట్టుగా లోపలకు వెళ్ళిపోయాడు.
"వీడొకడు మధ్యలో మన ప్రాణాలకు, మినిస్టర్ల దగ్గర పి.ఏ.లాగ, దేముడిదగ్గర పూజారిలాగ, ఈవిడదగ్గర దాపరించాడు" అన్నాడు అంతకుముందే అక్కడకువచ్చి నిల్చున్న వెంకటేశ్వర్లు.
"కనీసం గేటుతీస్తే వరండాలోనైనా కూచోవచ్చు. ప్రధానమంత్రి బంగళా ముందుకూడా ఇలా గేటులో నిల్చోనక్కరలేదు. ఇదేం తలపొగరు - పెద్దమనుషుల్ని రోడ్డుమీద నిల్చోపెట్టడం గంటలకొద్దీ" గొణుక్కున్నారు రాజావారు.
"చిన్నగా అంటారేమండీ? ఇంతసేపూ నిల్చుంటే చివరకు మాట్లాడుతుందనే నమ్మకంకూడా ఉండదు. ఒక్కొక్కరూ ఈ ఇంటి చుట్టూ ఎన్నిసార్లు తిరగాలో! తీరా పని జరగవచ్చు, జరక్కపోవచ్చు. ప్రాణాలన్నీ గుప్పెట్లో పెట్టుకొని మానాభిమానాలను కాళ్ళకింద తొక్కిపట్టుకొని నిల్చోవాలి ఆవిడగారి ముందు గంటల కొద్దీ" అన్నాడు సుదర్శన్. అతని వేషభాషలనుబట్టి ఏదో పెద్ద ఆఫీసరే అయివుంటాడని వూహించుకున్నారు రాజావారు.