"మనం బయటికి వెళుతోంది మనకోసమా లేక చూసేవాళ్ళ కోసమా?"
ఆదిత్య శబరి ముఖంలోకి విస్మయంగా చూశాడు. రుక్మిణి ముఖం ఎర్రబడింది. రంగారావు మౌనంగా కూర్చున్నాడు. చాలా మొండిఘటంలా వుంది. పెళ్ళయ్యాక ఎంతకాలం ఈ మొండితనం వుంటుందో తనూ చూస్తాడు అనుకున్నాడు ఆదిత్య.
"వెళ్దామా? శబరి ఆదిత్య ముఖంలోకి కొంటెగా చూస్తూ అన్నది.
"ఇవ్వాళ నీకు ఆరోగ్యం సరిగా లేనట్టుంది రేపు వెళదాం!" అన్నాడు ఆదిత్య.
"అబద్ధం! నేను ఇలా రావడం నీకు ఇష్టంలేదు! ఆమాటే తిన్నగా చెప్పొచ్చుగా! రేపు మాత్రం ముస్తాబై నీతో వస్తానని ఎందుకు అనుకుంటున్నావ్? ఇలాగే వస్తాను!" అన్నది శబరి మొండిగా.
ఆదిత్య తెల్లమొఖం వేశాడు.
"ఏమిటే ఆ వాగుడూ?" తల్లి గర్జించింది.
"ఇవ్వాళ ప్రోగ్రాం లేదుగా? నాకు నిద్రొస్తోంది. వెళుతున్నాను" అంటూ శబరి నిర్లక్ష్యంగా తన గదిలోకి వెళ్లిపోయింది.
ఆదిత్య ఆమె వెళ్లిన వైపే చూస్తూ వుండిపోయాడు.
"ఒక్క పిల్లగదా అని మరీ ముద్దుచేసి మేమే దాన్ని చెడగొట్టాం! మరీ మొండిగా తయారైంది. ఏమీ అనుకోకు బాబూ!" అన్నది రుక్మిణి బాధపడుతూ.
వాళ్లమ్మ మీద కోపం వచ్చింది. ఉదయం నుంచి అలాగే పడుకొని వుంది" రంగారావు సర్ది చెప్పాడు.
"అలా చెప్పండి. అలక పాన్పుమీద ఉన్నదన్నమాట!" రిలీఫ్ గా అన్నాడు ఆదిత్య. భర్త తెలివికి మొదటిసారిగా మనసులోనే మురిసిపోయింది రుక్మిణి.
"ఈ నెలలోనే పెళ్ళి చేద్దామనుకుంటున్నాం! నీ కిష్టం అయితే..." అంటూ ఆదిత్య ముఖంలోకి చూసింది.
"నేను ఆలోచించుకోవాలి!" అన్నాడు ఆదిత్య.
రుక్మిణి గతుక్కుమంది.
"దానికేముందీ! ఆలోచించుకునే చెప్పు" అన్నది.
"ముందుగా నేను శబరితో మాట్లాడాలి. ఆమె ఇష్టం తెలుసుకొని"
"దాని మొహం? దానికి బొత్తిగా ప్రపంచ జ్ఞానం లేదు. మొండితనం కొంచెం ఎక్కువ. నిజంగానే దానికి రాత్రినుంచి ఆరోగ్యం బాగాలేదు. మందు వేసుకోలేదని తిట్టాను. ఆ కోపంతో అది అలా ప్రవర్తించింది. ఏమీ అనుకోకు!" అన్నది రుక్మిణి.
"అబ్బే అనుకోవడానికేముందండి. శబరి అంటే నాకు చాలా ఇష్టం! ఆమెకు ఇష్టం అయితే నాకేం అభ్యంతరం లేదు!"
రుక్మిణి ముఖం వికసించింది.
"అది అదృష్టవంతురాలు బాబూ! పై నెల్లో ముహూర్తాలున్నాయ్! నీకు అభ్యంతరం లేకపోతే-"
"అలాగేనండీ! నేను ఫారెన్ వెళ్ళాలనుకుంటున్నాను."
"నిజంగా? ఎప్పుడు?"
"రెండు మూడు నెలల్లో -"
"మరి...."
"ముందు వెళ్ళి... ఆ తర్వాత రెండు మూడు నెలల్లో శబరిని పిలిపించుకుంటాను."
రుక్మిణి ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయింది.
"ఎల్లుండి మంచిరోజు! వచ్చి మీ అమ్మగారితో మాట్లాడతాం."
"అలాగేనండి. నేను వెళ్ళొస్తాను."
"మళ్ళీ ఎప్పుడొస్తావు బాబూ?" రుక్మిణి ఆప్యాయంగా అడిగింది.
"రెండు మూడు రోజుల్లో వస్తాను. రేపు నాకు కొంచెం అర్జెంటు పని వుంది!" అంటూ ఆదిత్య వెళ్ళిపోయాడు.
14
సాయంత్రం ఆరు గంటలయినా ఇంకా వాతావరణంలో వేడి తగ్గలేదు. శబరి అశాంతిగా లాన్ లో పచార్లు చేస్తూ వుంది. మధ్య మధ్య ఆగి ఆకాశం కేసి చూస్తున్నది. ఉన్నట్టుండి చేతికి అందిన మొక్క కొమ్మలు విరిచి దూరంగా విసిరేస్తూ వున్నది. ఏదో అశాంతిగా వుంది. నిల్చున్న చోట నిల్చోలేకుండా వున్నది.
పోరాడటం ముఖ్యంగా తనలో తానే పోరాడటం సామాన్య విషయం కాదు. సాహసం క్రియాశీలమైన కల్పనాశక్తి వున్న వ్యక్తే ప్రపంచంలో పోరాడగలడు. బాహ్య ప్రపంచంతో పోరాడలేనప్పుడే తనతో తన పోరాటం సాగిస్తాడు. తన సంకల్ప సిద్ధికోసం ముందుకు పయనిస్తాడు. అంతఃకరణ అంగీకరించకపోయినా అతని బుద్ధికి ఓ చిత్రమయిన సంతృప్తి కలుగుతుంది. భూమిమీద బతకడం మానేసి గగన విహారిగా మారిపోతాడు. జీవితంలోని వాస్తవాన్ని అంగీకరించడు. భ్రమల్ని వాస్తవాలుగా చూడటానికి ప్రయత్నిస్తూ, తనదే అయిన మరో ప్రపంచాన్ని కల్పనా బలంతో సృష్టించుకుంటాడు. వాస్తవంనుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తాడు.
శబరి పెళ్ళి ముహూర్తం దగ్గర పడుతోంది. గత నెలరోజుల నుంచి శబరికి ఏం చెయ్యాలో తెలియడం లేదు. ఎలాగో వీలు చూసుకుని రెండు మూడుసార్లు జాన్ కోసం బయటకు వెళ్ళింది. కాని అతను కనిపించలేదు. ఇప్పుడు తనేం చెయ్యాలి. జాన్ వాళ్ళు ఈ ఊరు వదిలి వెళ్ళిపోయారేమో! ఇప్పుడు తను ఎక్కడకు వెళ్ళాలి? జ్యోతి ఎక్కడ ఉందో కూడా తనకు తెలియదు. తనలో అమ్మా నాన్నను ఎదిరించే ధైర్యం సన్నగిల్లి పోతూ వుంది. ఎదిరించి ఏం చెయ్యాలో తెలియడంలేదు. తనకు ఇష్టం లేకపోయినా బొమ్మలా ఆదిత్యతో సినిమాకు వెళుతున్నది.
ఆదిత్యను పెళ్ళి చేసుకుంటే మళ్ళీ అంతా మామూలే! పిల్లల్ని కనడం వాళ్ళను పెంచడం - ఇంట్లో భర్తను బెదిరిస్తూ బయటివాళ్ళ ముందు భర్త అంటే తనకే ఎంతో భయం అన్నట్టు...అదే తను అమ్మలా ఆదిత్య నాన్నలా తయారవడం, తన పిల్లలకు పెళ్ళిచేయడం, మళ్ళీ ఆ పిల్లలకు పెళ్ళి - మళ్ళీ పిల్లలు ఛా... ఛా... తను చస్తే ఈ పిల్లల మధ్య బతకలేదు. రొటీన్ లైఫ్ లీడ్ చెయ్యడం తన వల్లకాదు.
మరి ఏం చెయ్యాలి! చచ్చిపోతే? కరెక్ట్! తను చచ్చిపోవాలి. చచ్చిపోవాలి. చచ్చిపోయి ఇప్పుడు తనను అర్థం చేసుకోకుండా తనను ఏడిపిస్తున్న అమ్మా నాన్నను ఏడ్పించాలి! వాళ్ళెలా ఏడుస్తారో చూడాలి. తను ఎలా చూస్తుంది? తను చచ్చిపోతుందిగా? చూడవచ్చును! తన యల్.యస్.డి. వేసుకుంటే? కనీసం మార్జువానా? కానీ అవి తనకు ఎవరు తెచ్చి పెడతారు?
అందుకే తను చచ్చిపోవాలి. ఎలా? మేడమీదనుంచి దూకి - అయ్యబాబోయ్! కాళ్ళూ చేతులూ విరిగిపోవూ! బావిలో దూకితే? అమ్మో! నీళ్ళలో ఊపిరాడదు. ఉక్కిరి బిక్కిరై పోవాలి. చచ్చిపోయాక శరీరం ఉబ్బిపోయి అసహ్యంగా తయారౌతుంది. మరి... విషం! అది తనకెలా వస్తుంది?
తన ఫ్రెండ్ రాజేశ్వరి ఆత్మహత్య చేసుకుందిట! పాపం! పెళ్ళయి నాలుగు నెలలన్నా కాలేదు. భర్త కట్నం చాలలేదని అనేక రకాలుగా వేధించాడట! ఆ బాధలు పడలేక కిరసనాయిల్ పోసుకొని నిప్పు ముట్టించుకున్నదట!
హారిబుల్! పిచ్చిది! అంత మాత్రానికే ఎందుకు చచ్చిపోవాలి! ఆ మొగుణ్ణి వదిలేసి వచ్చెయ్యకూడదూ? వస్తే అమ్మా నాన్నా వూరుకోరుగా? పరువు తగలబడి పోతుందని గగ్గోలు పెట్టేస్తారు. ఛ! ఏం మనుషులు! డబ్బు! డబ్బు! నాన్న వడ్డీ వ్యాపారం చేస్తాడు. బిజినెస్ లో వచ్చే లాభాలు చాలవు కాబోలు! పాపం! ఎంతోమంది బంగారం, వెండి తెచ్చి కుదువపెడ్తారు. మళ్ళీ విడిపించుకోలేరు పాపం! ఆ రాములమ్మ కూడా వెండి కడియాలు పెట్టింది. మళ్ళీ విడిపించుకోలేకపోయింది. అమ్మ వాటిని కరిగించి వెండి గిన్నె చేయించింది.
ఆ మధ్య డబ్బు తీసుకొని వచ్చింది కడియాల కోసం. "కడియాలా ఇంకెక్కడ వున్నాయ్! అమ్మేశాను. నీకిచ్చిన గడువు ఎప్పుడో అయిపోయింది!" అన్నాడు నాన్న.
రాములమ్మ కళ్ళలో నీరు తిరిగింది. ఆ కడియాలు తనకు భర్త పెళ్ళిలో పెట్టినవట! ఎంతో బతిమాలింది. కాని అవి ఇంకెక్కడ వున్నాయ్! నాన్న కసురుకున్నాడు. ఏడుస్తూ వెళ్ళిపోయింది. ఆ రోజంతా తనకు నాన్నను చూస్తుంటే, ఊరిబయట మర్రిచెట్టు మీదినుంచి అప్పుడే దిగివచ్చిన దయ్యాన్ని చూస్తున్నట్లు అన్పించింది.
ఆదిత్య కూడా బిజినెస్ చేస్తున్నాడు. ఎన్ని అన్యాయాలు చేస్తున్నాడో! జ్యోతి మాటల్లో ఎంతో నిజం వుందని తనకు ఇప్పుడు తెలిసింది.
గేటు అవతల ఎవరో నిల్చున్నట్లనిపించి శబరి గేటుకేసి చూసింది.
"హాయ్! జాన్!" అంటూ గేటుకేసి ఒక్కసారిగా పరుగుతీసింది.
"బాగున్నావా బేబీ!" నాలుక తడబడుతూ వుండగా అడిగాడు.
"ఇన్ని రోజులు ఎక్కడికెళ్ళావ్? ఇక నువ్వు కన్పించవేమోననుకున్నాను. "ఇక్కడ అమ్మా, నాన్నా నా పెళ్ళి ప్రయత్నాలు చేస్తున్నారు. ఏం చెయ్యాలో తెలియక తికమక పడుతున్నాను. థ్యాంక్ గాడ్! సమయానికి వచ్చావ్!" పసిపిల్లలా ఆనందపడిపోతూ గలగల మాట్లాడింది.