Previous Page Next Page 
మానిని మనసు పేజి 21


    సావిత్రీ, రమణా అనసూయకేసి చూశాను.
    "మా సావిత్రిని మీరు చూసేవుంటారు" ఆమె భర్త కళ్ళలో దేనికోసమో వెదుకుతూ ఖచ్చితంగా అంది.
    "చూసినవాళ్ళకు మాకే గుర్తురావడం లేదు. నువ్వెలా అంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నావ్?" అంటూ నవ్వడానికి ప్రయత్నించాడు. అతనికే తన నవ్వు ఎంత పేలవంగా వుందో తెలిసినట్టయింది. అనసూయ చూపుల్ని ఎదుర్కోలేకపోతున్నాడు.
    "మీరు కొంతకాలం వైజాగ్ లో వున్నారుగా. అప్పుడే పరిచయం... కాదు... చూసి వుంటారు."
    సావిత్రి ఆ సంభాషణ విననట్టే టిఫిన్ చేస్తున్నది. కాని... ఆమెలో రేగుతోన్న సంచలనం ఆమె ముఖంలోనే కాక ప్రతి కదలికలోనూ వ్యక్తమవుతూనే వున్నది.
    "ఆఁ ఎంతకాలం వున్నాను. నిండా ఆరునెలలు కూడా వైజాగ్ లో లేను" అతి సాధారణంగా అన్నట్టు అన్నాడు.
    "ఒక మనిషితో పరిచయం కావడానికి ఒక్కరోజు... ఆ మాటకొస్తే ఒక్క నిముషం చాలు. ఆరునెలలు కావాలా ఏం?"
    "కరెక్ట్. ఒక మనిషిని కలుసుకోవడానికి నిముషం కూడా అక్కర్లేదు. అర నిముషం చాలు నీ స్నేహితురాల్ని నిజంగానే ఎక్కడో చూసే వుంటాను" పెదవులమీద నవ్వును తెచ్చిపెట్టుకుని అన్నాడు.
    "సరేలెండి. కాఫీ ఆరిపోతుంది తాగండి" అన్నది ఆమె అతి మామూలుగా.
    రమణ కాఫీ తాగి లేచాడు.
    "ఏమిటోయ్! టిఫిన్ అంతసేపు తింటున్నావ్?" అన్నది సావిత్రిని ఉద్దేశించి.
    సావిత్రి సమాధానం చెప్పలేదు.
    గబగబ టిఫిన్ తినసాగింది.
    "నీ క్రాస్ ఎగ్జామినేషన్ కు నీ ఫ్రెండ్ గాభరా పడినట్టుంది."
    "మీరు గాభరా పడలేదుగా?"
    రమణ తన రూమ్ లోకి వెళ్ళాడు.
    అనసూయ సావిత్రి ఎదురుగా ఏదో ఆలోచిస్తూ కూర్చుంది.
    రమణ ఆఫీసుకి తయారైవచ్చాడు.
    "అనూ! ఇవ్వాళ సాయంత్రం ప్రోగ్రాం ఏమిటి?"
    "ప్రోగ్రామా?"
    "అదే మీ ఫ్రెండ్ వచ్చిందిగా!"
    "మేము రోజూ తిరుగుతూనే వున్నాం."
    "మరి నీ ఫ్రెండును నేను కూడా ఎంటర్ టైన్ చేయొద్దూ?"
    "తప్పకుండా"
    "రాత్రికి వంట చెయ్యకు. ఇంగ్లీషు సినీమాకు వెళ్ళి... చైనీస్ రెస్టారెంటులో భోజనంచేద్దాం."
    "క్యాబరే డాన్సు ఉన్న రెస్టారెంటుకు మాత్రం తీసుకెళ్ళకండి."
    "ఓ.కే. వస్తాను. వస్తానండీ సావిత్రిగారూ!"
    సావిత్రి చివ్వున తలెత్తి అదోలా అతని ముఖంలోకి చూసినది. ఆ చూపుల్లో కన్పించిన భావాన్ని అనసూయ పసికట్టకపోలేదు.
    సావిత్రి మనసు మనసులో లేదు. ఆలోచిస్తున్నది. ఎదురుగా అనసూయ తననే చూస్తూ కూర్చున్న విషయం కూడా మర్చిపోయింది.
    "వీడా అనసూయ భర్త!"
    నన్ను ఎక్కడో చూసినట్టు ఉందా?
    రోగ్! వైజ్ రోగ్!
    నన్ను ఎంటర్ టైన్ చేస్తాడట! రాస్కెల్!
    నన్ను మంచిచేసుకోవాలని ప్రయత్నం!
    తన బండారం అనసూయ ముందు బద్ధలు కొడ్తానని భయం.
    పాపం అనసూయ!
    తన భర్త శ్రీరామచంద్రుడు అనుకుంటూ ఉన్నది. తనమీద చూపించేదంతా ప్రేమగానే భావిస్తున్నది.
    ఎంత నటన!
    నీ అంతు తేల్చుకుంటాను! నిన్ను వదల్ను!
    మేకవన్నె పులివి.
    అనసూయకు నీలోని జంతువును చూపిస్తాను.
    అనసూయ నా ప్రాణ స్నేహితురాలు.
    దానిని రక్షించడం నా బాధ్యత.
    అవును! నేను ఇతని సంగతి పూర్తిగా తేల్చుకుని గాని హాస్టల్ కు వెళ్ళను.
    "ఏమిటే ఆలోచిస్తున్నావ్?"
    "ఆఁ ఏం లేదు."
    "నన్ను నమ్మమంటావా? నీ వాలకం చూస్తూనే ఉన్నాను. నువ్వసలు ఇక్కడలేవు."
    "అవునవును! అమ్మ గుర్తొచ్చింది."
    అనసూయ అదోలా నవ్వింది.
    సావిత్రి కాఫీ సిప్ చేస్తూ మళ్ళీ ఆలోచనల్లోకి జారిపోయింది.
                                          10
    రెండు రోజులు గడిచిపోయాయి.
    రమణమూర్తి సావిత్రిని తప్పుకు తిరుగుతున్నాడు.
    సావిత్రి రమణ మూర్తితో మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నది. అనసూయకు తెలియకుండా, అతను వంటరిగా ఉన్నప్పుడు మాట్లాడాలని ప్రయత్నం.
    అనసూయ మనసులో అనుమానం తేలుపిల్లలా కొండీ ఎత్తింది. ఆమె ఇద్దర్నీ కనిపెడుతూ ఉన్నది.
    రమణమూర్తి రాగానే హాస్టల్ కు వెళ్ళిపోతానన్న సావిత్రి ఆ విషయమే ఎత్తకపోవడంతో అనుసూయలో అనుమానాన్ని పెంచింది.
    మూడోరోజు ఉదయం అందరూ డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నారు. రమణమూర్తి సావిత్రితో కలిసి టిఫిన్, భోజనం చెయ్యకుండా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కాని అనసూయ అతని అభిప్రాయాన్ని పసికట్టింది. అసలు సంగతేమిటో తెలుసుకోవాలనే పట్టుదల బయలుదేరింది. అందువల్లనే ఇద్దరూ ఒకేసారి డైనింగు టేబులు ముందు కూర్చునేలా చేస్తున్నది.

 Previous Page Next Page