Previous Page Next Page 
మరో దయ్యం కథ పేజి 22


    నాకు వళ్ళు మండిపోయింది.

 

    అయినా మరో కొత్త వ్యక్తి ముందు ఏమి అనలేకపోయాను.

 

    "ఇవన్నీ మా వాడు నమ్మడు" అన్నాడు నన్ను పరిచయం చేస్తూ తన మిత్రుడితో కృష్ణకుమార్.

 

    "మీరు నమ్మరా?" అన్నాడు రఘుపతి.

 

    "నేను నమ్మను!" ఖచ్చితంగా అన్నాను.

 

    "డాక్టర్ రాజేంద్ర తెలుసా మీకు?" రఘుపతి అడిగాడు.

 

    "ఎందుకు తెలియదూ ? ఫేమస్ సర్జన్ ! ఈ మధ్యనే రిటైర్ అయ్యాడు" అన్నాను.

 

    "అతను కూడా నమ్ముతాడు." రఘుపతి అన్నాడు.

 

    "నాన్ సెన్స్!" అన్నాను.

 

    "అవునోయ్ ప్రసాద్ ! నువ్వొచ్చేముందు రఘుపతి అదే చెప్తున్నాడు!" అన్నాడు కృష్ణకుమార్.

 

    "అవునండీ! ఆయన పిలిస్తేచాలు స్పిరిట్సు పలుకుతాయి."

 

    నేను తృళ్ళిపడ్డాను.

 

    "ఆయనకు మానసికమైన అస్వస్థత ఏమైనా కలిగిందా? గ్రేట్ జీనియస్!" బాధగా అన్నాను.

 

    "మీరు బలేవారండీ! ఆయనకు మానసిక అస్వస్థత ఏమిటి? నాతో రండి. ఆయన ప్రత్యక్షంగా చూపిస్తారు!"

 

    "ఏమిటి చూపించేది?"

 

    "స్పిరిట్స్ ని!"

 

    నేను కృష్ణకేసి చూశాను.

 

    "అదే ప్రసాద్! ఆయన ఊజా బోర్డుమీద చూపిస్తారట. హోలీ స్పిరిట్సును పిల్చి, భూత, భవిష్యత్ వర్తమానాల గురించి చెప్తారట. ఆయన దగ్గరకు బాధల్లో ఉన్న వాళ్లెందరో వస్తూ ఉంటారట కూడా!" అన్నాడు కృష్ణ.

 

    ఏమిటీ పిచ్చి ?

 

    ఒక డాక్టరు - అనాటమీ క్షుణ్ణంగా తెలిసిన డాక్టరు - ప్రాణం లేని శరీరాలను - ప్రాణం ఉన్న శరీరాలనూ కోసిన డాక్టరు-శరీర నిర్మాణం తెలిసిన డాక్టరు-చర్మంలోని పొరలెన్నో తెలిసినవాడు-పొరకూ పొరకూ మధ్యన ఉన్నదేమిటో ఎరిగినవాడు-మంచి సర్జన్ గా రిటైర్ అయినవాడు- ఓపిక ఉన్నంతవరకూ ఆపరేషన్స్ చేసి ప్రజలకు ఉపయోగపడవలసిన వ్యక్తి-ఇలా ఊజా బోర్డులమీద స్పిరిట్సును పిలుస్తూ, అదంతా నిజమేనని నమ్ముతూ ప్రజల్ని నమ్మించడమా? ఓ మై గాడ్! ఈ దేశం ఎటుపోతోంది? ఎవరు దీన్ని కాపాడేది?

 

    ఈ విజ్ఞానం, ఈ సైన్సు ఆదిమానవుడిలో ఉన్న భయాలనూ, ఆ భయాలవల్ల ఏర్పడ్డ మూఢ నమ్మకాలనూ తొలగించలేకపోతున్నాయా?

 

    కొందరు స్వార్థపరులు అలా జరక్కుండా చేస్తున్నారు.

 

    వారి ప్రజలు ఎంత అజ్ఞానంలో ఉంటే అంత మంచిది.

 

    ఈ ప్రజల అజ్ఞానాన్ని ఈమధ్య కొందరు రచయితలు కూడా తమ స్వార్థంకోసం ఉపయోగించుకోవడం శోచనీయం. క్షమించరాని అపరాధం. అవన్నీ తాము అనుభవించిన, చూచిన వాస్తవాలనే రాస్తున్నట్టుగా స్టేట్ మెంట్సు పారేసి పాఠకుల్ని మోసం చెయ్యడం - వీళ్లు నిజంగా రచయితలా లేక స్మగ్లర్సా?

 

    "ఏమిటి ప్రసాద్ ఆలోచిస్తున్నావ్? వెళ్దామా?" అని అడిగాడు కృష్ణ.

 

    నా ఆలోచనా స్రవంతికి ఆనకట్ట పడింది.

 

    అయినా పూర్తిగా అందులోనుంచి తేలలేదు.

 

    "ఎక్కడికీ?" సాలోచనగా అడిగాను.

 

    "రాజేంద్రగారింటికి!"

 

    "నేను రాను!" ఠక్కున అనేశాను.

 

    "మీలాంటివాళ్ళే రావాలి" అన్నాడు రఘుపతి.

 

    గిర్రున తల తిప్పి అతనికేసి చూశాను.

 

    "అవునండీ! మీలాంటి నమ్మకం లేనివాళ్ళే రావాలి. నమ్మకం లేని మీరే నమ్మడం జరిగితే ప్రజలకు ఇహానికీ, పరానికీ కూడా సేవ చెయ్యొచ్చును" అన్నాడు రఘుపతి.

 

    "ఇహానికీ-పరానికీ కూడానా?" నా కంఠంలో ఏం పలికిందోగాని కృష్ణ అందుకొని "ఊరికే చూద్దాం రారాదూ?" అన్నాడు.

 

    "పదండి వెళ్దాం!" అదేదో అక్కడే తేలుస్తాను అన్నట్టు అన్నాను.

 

    డాక్టర్ రాజేంద్రగారు మమ్మల్ని ఆదరంగా ఆహ్వానించారు.

 

    ఐదేళ్ళ క్రితం ఆయనను చూశాను.

 

    ఆ రూపం ఇంకా గుర్తుంది.

 

    ముఖంలో గాంభీర్యం కొట్టవచ్చినట్టుండేది.

 

    ఆ కళ్లల్లో ఎంతో ఆత్మ విశ్వాసం!

 

    పలుకులో కరుణ.

 

    ఆయనను చూస్తూంటే పేషెంటుకు తన ప్రాణాలకు భయంలేదన్న ఆత్మ విశ్వాసం కలిగేది.

 

    ఆయనను అందరూ గౌరవించేవారు.

 

    అకస్మాత్తుగా రిటైరయ్యే ముందు ఆయన ఒక్కగా నొక్క కొడుకు కారు యాక్సిడెంటులో చచ్చిపోయాడని విన్నాను.


    
    అప్పటినుంచీ ఆయనలో ఎంతో మార్పు వచ్చిందని అటూ ఉండేవారు.

 

    ఒకటి రెండు ఆపరేషన్స్ ఫెయిల్ అవడంతో అతని దగ్గర ఆపరేషన్ అంటే జనం భయపడసాగారు. అదికూడా ఆయన మనసు మీద గట్టి దెబ్బ తీసిందని విన్నాను.

 

    రిటైర్ అయ్యాక ఆయన గురించి అనుకొన్నవాళ్ళే లేరు.

 

    వంటి నిండా విభూతి రేఖలతో కన్పించిన రాజేంద్రను చూస్తూ నిల్చుండిపోయాను.

 

    రఘుపతి మా ఇద్దర్నీ పరిచయం చేశాడు.

 

    నాకేసి ఆయన అదోలా చూచాడు.

 Previous Page Next Page