Previous Page Next Page 
మరో దయ్యం కథ పేజి 23


    నా భావాల గురించి అతనికి తెలిసే ఉంటుంది. నా పుస్తకాలు బహుశా ఒకటో రెండో చదివి కూడా ఉంటాడు.

 

    రఘుపతి అతనికి ప్రియ శిష్యుడులా అన్పించాడు.

 

    నేను డాక్టర్ రాజేంద్రను పరిశీలనగా చూశాను.

 

    అతనిలో ఎంతో మార్పు ఉంది.

 

    నిటారుగా ఉండే అతని శరీరం వంగినట్లుగా అయింది. అది శరీర అనారోగ్యంవల్ల కాదనీ, మానసికంగా కృంగిపోవడంవల్ల ఏర్పడిందేననీ అన్పించింది. అతని కళ్లలోకి చూశాను. ఆ కళ్ళు ఏవో కన్పించని బిందువులను వెదుకుతున్నట్టుగా ఉన్నాయి. అసలు అతని మనసే తనలోకి తను చుట్టుకొని పోయిందా అని అన్పించింది. ఆయన మమ్మల్ని కూర్చోమని చెప్పాడు. మరోసారి అతని ముఖంలోకి చూశాను.

 

    ఆ ముఖంలో అసంతృప్తి స్పష్టంగా కన్పిస్తోంది. ఆ కళ్ళల్లో ఏదో అశాంతి కూడా-కాదు-డిప్రెషన్ కన్పిస్తోంది. సాధారణంగా రిటైర్ అయినవాళ్ళు ఇక తమ జీవితం పూర్తి అయిందనే భావంలో పడిపోతారు. కృంగిపోతారు. ఎంతో ఆరోగ్యంగా ఉన్న వాళ్లు కూడా అనుకోకుండా హార్ట్ అటాక్స్ కు గురి అవుతారు.

 

    సైకలాజికల్ గా తాము ఇక ప్రపంచం దృష్టిలో పనికిరాని వాళ్ళం అనే భావం వచ్చేసిందని అనుకోవడమే అందుకు కారణం.

 

    కొంతమంది రిటైర్ అయి డెబ్బయ్ దాటినవారు ఎంతో సంతృప్తిగా హాయిగా కన్పిస్తారు. అలాంటి వాళ్ళంటే నాకెంతో ఇష్టం. వాళ్ళు జీవించడం తెలిసినవాళ్ళు. జీవితాన్ని అర్థం చేసుకొన్నవాళ్ళు. బ్రతికినంతకాలం ఏదో విధంగా తాము కూడా ఈ ప్రపంచానికి అంతో ఇంతో ఇవ్వగలమనే ఆత్మ విశ్వాసం ఉన్నవాళ్ళు. ఆత్మవిశ్వాసాన్నే చుట్టూ వాళ్ళకు పంచేవాళ్ళు!

 

    అది లేని వాళ్ళు డిప్రెషన్ కు గురి అవుతారు. మానసికంగా అనేక ఒత్తిడులకు గురి అవుతారు. ప్రపంచం నుండి విత్ డ్రా అవుతూ తమలోకి తాము చుట్టుకు పోతారు.

 

    ఆయన చుట్టూ అనేక పేరా సైకాలజీకి సంబంధించిన పుస్తకాలున్నాయి.

 

    ఆయన పూర్తిగా తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గురించి ఆలోచించడం మానేశాడు. చనిపోయాక ఏమౌతుందనే ఆలోచనలో పడిపోయాడు. ఒక్కసారి అందులోకి, ముఖ్యంగా ఆ వయసులో పడిపోయినవాడ్ని, నిజంగా వాళ్ళు నమ్మే ఆ భగవంతుడే వచ్చి, "ఆతర్వాత ఏమీ ఉండదు. దాన్ని గురించి ఆలోచించడం అనవసరం" అని చెప్పినా వాళ్ళు ఒప్పుకోరు.

 

    "మిమ్మల్ని వినాలని వచ్చారు" అన్నాడు రఘుపతి.

 

    డాక్టర్ రాజేంద్ర కళ్ళు మిలమిల పిచ్చిగా మెరిశాయి.

 

    భార్యను కేకవేసి కాఫీలకు ఆర్డరు ఇచ్చాడు.

 

    కాఫీలు అయ్యాయి. తన భార్యను పరిచయం చేశాడు. ఆమెను కూడా అక్కడే కూర్చోమన్నాడు. ఆమె మొహమాట పడుతూనే కూర్చుంది.

 

    ఆయన ఆత్మల గురించీ, పిశాచలోకాన్ని గురించీ చెప్పసాగాడు. అచ్చం అతను ఆ లోకంలోనే బ్రతుకుతున్నట్టూ, ఆ పిశాచాల్లో తనూ ఒక పిశాచం అయి, అవి అనుభవించేవన్నీ తనే అనుభవిస్తున్నట్టుగా చెబుతూ ఉంటే నాకు ఏడవాలో నవ్వాలో అర్థంకాక జాలిగా మాత్రం చూశాను.

 

    చనిపోవడం అంటే ఏమిటి ?

 

    చనిపోతున్న క్షణంలో ప్రాణి ఎలాంటి అనుభూతిని పొందుతుంది? మనం ఊహిస్తున్నట్టు ఈ జన్మలో వదలలేక బాధ పడుతుందా? లేక ఈ పాపిష్టి లోకం నుంచి వెళ్ళిపోతున్నందుకు ఆనందిస్తుందా?

 

    ప్రాణం పోగానే ఆత్మ పైనుండి తన మృత శరీరాన్ని చూస్తున్నప్పుడు ఎలాంటి అనుభూతిని పొందుతుంది?

 

    ఆ కొత్త లోకంలో-పిశాచ లోకంలో - మొదట మొదట అడ్జస్టు కాలేక ఎంత హింసను అనుభవిస్తుంది?

 

    ప్రేత యోనిలోకి ప్రవేశించడానికి అది ఎంత శ్రమ పడుతుంది?

 

    దారీతెన్నూ తెలియక అల్లాడే ఆత్మలు ఎలా మీడియం కోసం పిచ్చిగా తిరుగుతాయి?

 

    మీడియం దొరగ్గానే వాటికి ఎంత శాంతి లభిస్తుంది?

 

    ఆ మీడియంనే మనం దయ్యం పట్టిన వాళ్ళంటాం.

 

    దయ్యాల్ని వదిలించడానికి మంత్రగాళ్ళను పిలుస్తాం.

 

    మంత్రగాళ్ళు ఎలా క్రూరంగా దయ్యాల్ని వదిలిస్తారు?

 

    అలా మీడియం నుంచి పారదోలబడిన ఆత్మ ఎంత అల్లాడిపోతుంది - మరో మీడియం దొరికేంతవరకు?

 

    మనుషులు ఎంత స్వార్థపరులు ?

 

    దయ్యాల్ని వదిలించడానికి చూస్తారేగాని ఆ తర్వాత ఆ ఆత్మ అనుభవించే నరకయాతన గురించి ఆలోచిస్తున్నారా? ఇంతకంటే దారుణం మరొకటి ఉంటుందా?

 

    అన్న అనేక ప్రశ్నలు ఆయన చాలా సీరియస్ గా వేశారు! అన్నిటికీ సమాధానాలు చెప్పసాగాడు. మనుష్యులు ఆత్మలకూ, పిశాచాలకూ చేస్తున్న అన్యాయాల గురించి కూడా అనర్గళంగా మాట్లాడాడు.

 

    మమ్మల్నందర్నీ పిశాచ లోకంలోకి తీసుకెళ్ళిపోయాడు.

 

    ఆయన మంచం మీద బాసింపట్లు వేసుకొని కూర్చున్నాడు. ఆయన చుట్టూ పేరాసైకాలజీ పుస్తకాలూ, వివిధ దేశాలకు సంబంధించి విచ్ క్రాఫ్టుకు సంబంధించిన పుస్తకాలూ ఉన్నాయి.

 

    ఆ పుస్తకాలను భట్టీ పట్టినట్టున్నాడు. అందులోని విషయాలను అనర్గళంగా చెప్పుకుపోతున్నాడు.

 

    పేరాసైకాలజీ ఒక శాస్త్రం కాదనీ, ఇంకా ఆ విషయాల మీద కొందరు ప్రయోగాలు చేస్తూనే ఉన్నారనీ చెప్పాలనిపించింది.

 

    నాకు ఎన్నో ప్రశ్నలు వెయ్యాలనిపించింది.

 

    మళ్ళీ అవన్నీ కూడా స్వయంగా అనుభవించినట్టూ, చూసినట్టూ చెప్తున్న అతన్ని ప్రశ్నించి ప్రయోజనం లేదని అర్థం చేసుకొన్నాను.

 

    దుర్మార్గుడు చచ్చీ దుర్మార్గపు దయ్యం అవుతాడట. అధికారం చలాయించినవాడూ, బలవంతుడూ కూడా ప్రేతలోకాన్ని - అంటే తన దరిదాపుల్లో ఉన్న బలహీన ప్రేతాన్ని వశం చేసుకొని- రాజ్యం చేస్తాడట.

 Previous Page Next Page