"వచ్చాడు. ఆ దుర్మార్గుడు వచ్చాడు. నువ్వు పారిపో!" అరిచింది హెలెన్ భయంగా.
ఆమె మాటలు పూర్తి అయీ కాకుండానే భీభత్సం కలుగుజేస్తూ ఏవేవో శబ్దాలు. అరుపులు. పిట్టల రెక్కల చప్పుళ్ళు.
నా ముఖంమీద గబ్బిళాలు దూకుతున్నాయి.
గబ్బిళాల గోళ్ళు నా ముఖాన్ని చీరుతున్నాయి.
"ఏమే! నీ ప్రియుడ్ని కలుసుకున్నానని కులుకుతున్నావా? చూడు నిన్నేం చేస్తానో!" మగ కంఠం గర్జించింది.
గబ్బిళాలకు చేతులు అడ్డం పెట్టుకుంటూనే ఆ మాటలు వింటున్నాను. వాడెవడో నాకు కన్పించడంలేదు.
"దుర్మార్గుడా! నువ్వు నన్నేం చేస్తావురా? నా కోరిక తీరింది. నాకు ప్రేతయోనినుంచి విముక్తి లభించింది. నువ్వింకా ఈ పిశాచ రూపంలోనే మరో వెయ్యి సంవత్సరాలు తిరుగు." ఆమె కంఠం పలికింది.
చుట్టూ రకరకాల అరుపులు.
కుక్కల ఏడుపు.
గబ్బిళాల అరుపులు.
పక్షుల రెక్కల చప్పుళ్ళు.
నాకు స్పృహ తప్పుతోంది.
"రహమాన్!" గట్టిగా అరవడం మాత్రమే గుర్తుంది.
4
"బాబుగారూ! బాబుగారూ!"
తట్టి లేపాడు రహమాన్.
నేను కళ్ళు తెరిచాను.
పైన బండి కప్పు.
"నేను బండిలోకి ఎలా వచ్చాను?"
"నేనే ఎత్తుకొచ్చి పడుకోబెట్టాను బాబూ!"
"ఆమె ఏమైంది?"
"ఆమె ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయింది. ఆమె కోరిక తన ప్రియుడ్ని చూడాలనీ, మాట్లాడాలనీ, తన కథ చెప్పాలనీను- అది తీరిపోయింది. ఆమెకు ప్రేతయోని నుంచి విముక్తి లభించింది."
"వాడు?"
"వాడు వెర్రెక్కినట్టు కాసేపు బీభత్సం చేశాడు. నేను నా సహచరులూ శాంతపర్చి పంపించేవేశాం!"
"నువ్వు..........నీ.........."
"అదే బాబూ! ఈ ప్రాంతంలోని ప్రేతాలన్నీ నా చెప్పుచేతల్లో ఉన్నాయని ముందే చెప్పాగా?"
ఏమిటో వీడి మాటలూ వీడూను!
ప్రతిమాటా మర్మగర్భంగానే మాట్లాడుతున్నాడు.
ఆ నవ్వు మరీను!
అసలు నేను చూసింది వాస్తవమా?
లేక కల వచ్చిందా?
నేను బండిలో కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ పడుకొన్నాను.
నా ముఖంమీద చేతితో తడిమి చూసుకొన్నాను. గబ్బిళాలు నా ముఖాన్ని గీరాయిగా? మరి మామూలుగానే ఉందే? ఇది కలే! నిజం కాదు. ఎంత భయంకరమైన కల?
"రహమాన్! నేను చూసిందంతా వాస్తవమేనా?"
"ఏమిటిబాబూ మీరు అంటున్నది?"
"అదే ఆ ఈజిఫ్టు రాకుమారి........."
వాడు మాట్లాడలేదు.
"మాట్లాడవేం?"
"కళ్ళారాచూసి అనుభవించిన విషయాన్ని వాస్తవమేనా అని అడిగే వారికి సమాధానం ఏం చెప్పగలను?"
"అయితే గబ్బిళాలు నా ముఖాన్ని గీరాయి. కాని నా ముఖంమీద గాట్లు లేవే?"
"పిశాచాలు మానవ శరీరాన్ని గాయ పర్చలేవుబాబూ!"
"మరి?"
"మనసు మీదే దెబ్బతీస్తాయి."
"అంటే గబ్బిళాలు నా ముఖంమీద వాలలేదంటావా?"
"వాలాయి, కాని గాయపర్చలేదు. ఆ శక్తి వాటికి లేదు."
"దుమ్మలగూడెం ఇంకెంత దూరం ఉంది?" అంటూ విషయాన్ని మార్చాను.
"వచ్చేశాం బాబూ! మరో అర్ధగంట!"
టైం చూసుకొన్నాను. 2-40 అయింది.
ఇదేమిటి, ఇంకా 2-40 గంటలేనా? ఎప్పుడో 2-30 అయిందే?
ఆ సంగతే అడగాలనుకొన్నాను.
కాని అడగ బుద్ధి పుట్టలేదు.
ఎంత పెద్ద కలైనా కొద్ది క్షణాలే ఉంటుందంటారు.
నేను చూసింది కలే?
ఇలాంటి కళ నాకు ఎందుకు వచ్చినట్లు?
వెంటనే ఆ మధ్యనే జరిగిన ఒక ఉదంతం గుర్తొచ్చింది.
* * *
డాక్టర్ కృష్ణకుమార్ నా స్నేహితుడు. డాక్టరంటే పి.హెచ్.డి. డాక్టర్. యూనివర్సిటీలో రీడర్ గా పని చేస్తున్నాడు.
అతనికి మూఢ నమ్మకాలు లేవు.
కాని కొన్ని నమ్మకాలు ఉన్నయ్.
ఒక రోజు నేను వారి ఇంటికి వెళ్ళేసరికి ఊజా (ouja) బోర్డు మీద స్పిరిట్ ను పిలవడానికి మరొక స్నేహితుడితో కూర్చుని ప్రయత్నిస్తున్నాడు.
"ఇదేం పిచ్చి?" అన్నాను అది చూస్తూ.
కృష్ణకుమార్ నవ్వాడు.
"వీడు నా బాల్యమిత్రుడు. పేరు రఘుపతి. ఇతనికి స్పిరిట్సు కన్పిస్తాయట. పూజాబోర్డు ద్వారా పిలిస్తే వచ్చి ప్రశ్నలకు సమాధానం చెబుతాయట. అందుకే చూస్తున్నాను. ఓపెన్ మైండుతో దేన్నయినా తెలుసుకోవడానికి ప్రయత్నించడంలో తప్పేముంది?" అన్నాడు కృష్ణకుమార్.