బాగా ఆలోచించి, నాలుగు రోజులు రాత్రింబవళ్ళు మధనపడి ఈ నిర్ణయానికి వచ్చాను.
నిద్రమాత్రలు వేసుకొని శాశ్వతంగా నిద్రపోతున్నాను.
రేణూ నువ్వయినా త్వరపడు. వెంటనే గౌతమ్ ను పెళ్ళిచేసుకో లేకుంటే నీకంటే అందమైన యువతి పరిచయం అయితే నిన్ను మోసం చేస్తాడు.
నువ్వయినా సుఖంగా ఉండు.
గుడ్ బై రేణూ!
ఇట్లు
నీ
సుధ"
రేణుక కళ్ళనుంచి ధారాపాతంగా కన్నీరు కారుతోంది. చేతిలోని కాగితాలు తడుస్తున్నాయి. అక్షరాలూ అల్లుకు పోతున్నాయ్.
గౌతమ్ ఇంత నీచుడా?
ఒక నిండు జీవితాన్ని బలిగొన్న పశువా?
సుధ రూపం కళ్ళముందు మెరిసింది.
పాపం! సుధ ఈ పాటికి చచ్చిపోయి ఉంటుంది. శ్రీమంతుల ఏకైక సంతానం. నిలువునా ప్రాణాలు తీసుకుంది.
ఆ తల్లిదండ్రులు కడుపులో చిచ్చు రగిలించి వెళ్ళిపోయింది.
ఇంత జరిగాక సుధ, తాను గౌతమ్ చేసుకొని సుఖంగా కాపురం చేస్తుందని ఎలా అనుకున్నది?
తన మూలంగానే ఒక నిండు ప్రాణం పోయింది.
తను హంతకురాలు, గౌతమ్ హంతకుడు.
పిచ్చిపిల్ల! ఈ సంగతి ముందే తనతోచెప్పి ఉండవచ్చుగా? ఆ తర్వాత తనే రంగంలో నుంచి తప్పుకొనేది.
గౌతమ్! అబ్బ ఆ పేరు ఉచ్చరించాలంటేనే అసహ్యం వేస్తున్నది.
అతని రూపం ఎంత భయంకరంగా కనిపిస్తున్నదో?
తను ముందెప్పుడూ పెళ్ళిచేసుకోకూడదని నిర్ణయించుకుంది. నాన్నకు కుటుంబ బాధ్యత తీసుకుంటానని మాట ఇచ్చింది.
రేణుక కళ్ళముందు వంటినిండా గాయాలతో, బేండేజీలతో మరణశయ్య మీద ఉన్న తండ్రి కన్పించాడు. తండ్రి మాటల్ని మననం చేసుకోసాగింది.
"తల్లీ నేను బ్రతకను"
"నాన్న!" తను బావురుమన్నది.
"ఏడవకమ్మా! నువ్వు ధైర్యంగా ఉండాలి" రెండు చేతులతో ముఖం దాచుకొని వెక్కివెక్కి ఏడవసాగింది.
"ఏడవకు తల్లీ. నేను చెప్పేది విను, ఆలస్యం అయితే చెప్పలేకపోవచ్చును".
"చెప్పు నాన్నా! నన్నేం చెయ్యమంటావో చెప్పు" బెక్కుతూ అన్నది.
"నా మరణంవల్ల నీకు అన్యాయం జరుగుతుందని నాకు తెలుసమ్మా! నేను నిన్ను కోరబోయే కోరిక ఏ తండ్రీ తనబిడ్డను కోరకూడదు తల్లీ!"
"చెప్పు నాన్నా! మీకోసం ఏదైనా చేస్తాను. మీరు నన్ను ఎన్నో ఆశలు పెట్టుకొని పెంచారు. డాక్టర్ చదివించారు. ఏనాడూ నా కోర్కెను తిరస్కరించలేదు. చెప్పు నాన్నా!"
"నువ్వు నేను లేని లోటును తీర్చాలి తల్లీ! నలుగురు రెక్కలురాని పిల్లల్నీ, అమాయకురాలైన తల్లినీ నీకు వదిలేసి వెళ్ళిపోతున్నాను.
"నాన్న! నీకు నయం అవుతుంది. అలా అనకు!"
"మనిషి కోరుకున్నట్టే అన్నీ జరిగితే ప్రపంచంలో ఇంక దుఃఖం ఎందుకుంటుందమ్మా? నువ్వు నాకో మాట ఇవ్వాలి! అప్పుడే నా ఆత్మకు శాంతి..."
"చెల్లాయిల్నీ, తమ్ముళ్ళనూ పెంచి పెద్ద చేస్తాను. అమ్మను అపురూపంగా చూసుకుంటాను. ఆ విషయంలో నువ్వు బెంగపడకు నాన్నా!"
"నన్ను క్షమించగలవా తల్లీ!"
"క్షమించడం ఏమిటి నాన్నా! నన్ను డాక్టర్ను చేశారు. ఇంటికి పెద్ద బిడ్డను. నా బాధ్యతను నేను నిర్వహిస్తాను"
"అందుకు నువ్వు చాలా పెద్ద త్యాగమే చెయ్యాల్సి ఉంటుందమ్మా!"
"అది త్యాగం కాదు. అది నా బాధ్యత" ఖచ్చితంగా అన్నది రేణుక.
"అమ్మా రేణూ!" ఆపైన మాటలు పెగల్లేదు.
"నీకేం ప్రమాదం లేదు నాన్నా!"
తండ్రి కూతురి కళ్ళలోకి చూశాడు. ఆ కళ్ళలో ఎన్నో చెప్పాలనే ఆతృత ఉన్నది. కాని క్రమంగా మూతలు పడ్డాయి. కోమాలోకి జారిపోయాడు..."
అంతే మళ్ళీ కళ్ళు తెరవలేదు.
"నాన్నా! నాన్నా!" పెద్దగా అరిచాననుకుంది. కాని ఎవరో కంఠం నొక్కేసినట్టు ఆమె మాటలు గొంతులోనే ఆగిపోయాయి.
"నన్ను ఎంత అన్యాయం చేసిపోయావు దేవుడో!" తల్లి ఏడుస్తోంది.
తల్లి రాగంతో రేణుక తృళ్ళిపడి ఈ లోకంలోకి వచ్చింది.
చేతిలో ఉన్న కాగితాలు కసిగా చించివేసింది. రెండు చేతులతో కాగితం ముక్కల్ని నలిపి లేచివెళ్ళి కిటికీలోనుంచి బయటికి పారేసింది.
అలసటగా వెళ్ళి మంచానికి అడ్డంగా పడింది. తల్లి ఏడుస్తున్నది. పడుకోబోయేముందు తల్లిపక్కన రోజూ కాసేపు కూర్చుని ధైర్యం చెప్పేది.
ఈ రోజు ఆమెకు ఆ ఓపిక లేనట్టు అన్పించింది.
తల్లి ఏడుస్తుంది. బాధకు మారు చిరాకు అనిపించింది.
కళ్ళు మూసుకుంది. నిద్రరావడం లేదు.
గౌతమ్...సుధారాణి...సుధారాణి...గౌతమ్... మార్చిమార్చి మూసుకున్న కళ్ళకు కన్పిస్తున్నారు.
ఈ ఇరవై రోజులుగా గౌతమ్ కు తన నిర్ణయాన్ని ఎలా వినిపించాలా అని మధనపడింది. ఇప్పుడు ఆ అవసరం కూడా లేకుండా పోయింది.
అతని ముఖంకూడా చూడాలని లేదు.