Previous Page Next Page 
బొమ్మరిల్లు పేజి 21


    రేణుక వంటగదిలోకి ఆలోచిస్తూ యాంత్రికంగా నడిచింది.


    తల్లీకూతుళ్ళు భోజనం అయిందనిపించి లేచారు. ఎవరికీ తినాలని లేదు. ఒకరి కోసం మరొకరు కూర్చున్నారు.


    సుందరమ్మ వెళ్ళి మళ్ళీ చాపమీద పడుకుంది.


    రేణుక డైనింగ్ టేబుల్ ముందు నుంచి లేచి వెళ్ళి బీరువా తెరిచింది. బట్టలు క్రింది నుంచి ఉత్తరం బయటికి తీసింది. మళ్ళీ డైనింగ్ టేబుల్ దగ్గిరకు వచ్చి కుర్చీలో కూర్చుంది.


    ఉత్తరం మరోసారి చదవసాగింది-


    "ప్రియమైన రేణూ,


    "మీ నాన్నగారు పోయారని తెలిసింది. చాలా బాధగా ఉన్నది. ఆ విషయం నాకు గౌతమ్ చెప్పాడు. నీకు నా సానుభూతి ఎలా తెలపాలో కూడా తెలియడం లేదు.


    అసలే బాధలో ఉన్న నిన్ను నా ఈ ఉత్తరం మరీ బాధిస్తుందని తెలుసు. అయినా రాయక తప్పలేదు. నీకు చెప్పుకుంటే గాని నా ఆత్మకు శాంతి ఉండదు. ఇప్పుడు చెప్పకపోతే మరింకెప్పుడూ చెప్పలేను. అందుకే ఈ ఉత్తరం రాస్తున్నాను. చేతనయితే నన్ను క్షమించు. నీ మనసు నాకు తెలుసు. నువ్వు క్షమిస్తావని కూడా నాకు తెలుసు.


    రేణూ నేను వెళ్ళిపోతున్నానే!

    
    చాలా దూరం వెళ్ళిపోతున్నాను.


    నన్ను ఎవరూ అందుకోలేనంత దూరం వెళ్ళిపోతున్నాను.


    ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? రాత్రి 11 గంటలు దాటింది. పరీక్షలకు కూడా పది తర్వాత నేను మెలకువతో ఉన్నట్టుగా నాకు గుర్తులేదు. పిలిస్తే పలికే నిద్ర నాకు దూరం అయింది. రెండురోజులైంది నేను నిద్రపోయి అంటే ఎవరూ నమ్మరు.


    కష్టం అంటే ఏమిటో తెలియకుండా పూలపాన్పు మీద పెరిగాను.


    కాని...కాని...దాదాపు సంవత్సరం నుంచి నా మనసులో ఒక విషయం తుమ్మ ముల్లులా గుచ్చుకుంటూనే ఉన్నది. అదీ సహజంగా ఈ వయసులో ఉండే ప్రేమ వ్యవహారం అని నీకు వేరే చెప్పనక్కర్లేదు. అది మరెవరితోనో అయితే నాకు ఏ బాధా లేదు.


    నువ్వు వట్టి అమాయకురాలివి. నీకు అసలు విషయం ఏనాడో చెప్పాల్సింది. అలా చెప్పకపోవడం వల్లనే ఇంత అనర్థానికి దారి తీసింది. నీ మనసు నాకు తెలుసు. నేను ప్రేమిస్తున్న వ్యక్తిని... నన్ను ప్రేమిస్తున్న వ్యక్తిని..నువ్వు ప్రేమించి అడ్డుగోడగా నిలబడేదానివి కూడా కాదని నాకు తెలుసు.


    రేణూ! అసలు ఈ మగవాళ్ళను నమ్మకూడదే! ముఖ్యంగా మునిముచ్చులా ఉండే వాళ్ళను అసలు నమ్మకూడదు. గౌతమ్ అంటే నీకు ఇష్టమని నాకు తెలుసు. కానీ మీ పరిచయం ఇంత దూరం వస్తుందనుకోలేదు. అందుకే నిన్ను ముందుగా హెచ్చరించలేదు. గౌతమ్ నేను రెండేళ్ళుగా కలిసిమెలిసి తిరుగుతున్నాం దొంగచాటుగా జరుగుతోంది ఈ వ్యవహారం ఇంత కాలం. తన హౌస్ సర్జెన్సీ పూర్తి అయ్యేంత వరకూ మా ఈ ప్రేమ వ్యవహారాన్ని రహస్యంగా ఉంచమని గౌతమ్ సలహా ఇచ్చాడు. ఇంత తాడూ బొంగరం లేనివాడితో తిరుగుతున్నట్టు తెలిస్తే మా డాడి కాలేజీ కూడా మాన్పించి వెంటనే ఓ మిలియనేర్ తో నాపెళ్ళి జరిపించేస్తాడని నా భయం. అందుకే రహస్యంగా అతి జాగ్రత్తగా ఎవరికీ అనుమానం కూడా రాకుండా అతి మెళుకువతో ప్రవర్తిస్తూ వచ్చాం.


    గౌతమ్ మనీ దగ్గిర చులకనగా మాట్లాడేదాన్ని. ఎందుకో తెలుసా? నువ్వు నాకంటే అందంగా ఉంటావ్. నీకు అతనంటే ఇష్టం అని తెలుసు నీ ఆకర్షణలో పడతాడనే భయంకొద్దీ అలా మాట్లాడేదాన్ని. నీ మనస్సు విరచాలని ప్రయత్నించేదాన్ని. అదే నా దుర్గతికి కారణం అయింది. అసలు విషయం మనసు విప్పి నీకు చెప్పాల్సింది. కాని చెప్పలేకపోయాను.


    నేను భయపడిందే జరిగింది. మీ ఇద్దరూ కలిసి తిరుగుతున్నట్లు నాకు చాలా ఆలస్యంగా తెలిసింది. గౌతమ్ ను అడిగితే అంతా అబద్ధం అని చెప్పాడు. నేను అతన్ని గుడ్డిగా నమ్మాను. ఆడది అనాదిగా నమ్ముతూనే ఉన్నది. మోసపోతూనే ఉన్నది.


    అంతవరకూ చదివి రేణుక ఇక చదవలేను అన్నట్టు తలపట్టుకొని కూర్చుంది. ఐదు నిముషాల తర్వాత మళ్ళీ చదవసాగింది.


    రేణూ! నాలుగురోజుల నుంచి నీకు ఈ విషయం రాయాలా వద్దా అని మధనపడి చివరికి నువ్వు కూడా నాలా మోసపోకూడదనే ఈ ఉత్తరం రాస్తున్నాను. ఈ ఉత్తరం అందేసరికి నేను శాశ్వతంగా ఈ ప్రపంచం నుంచి, ఈ కుళ్ళు ప్రపంచం నుంచి, ఈ దగాకోరు మనుష్యుల నుంచి వెళ్ళిపోతున్నాను. మళ్ళీ ఎవరెంతమొత్తుకున్నా తిరిగిరాని ప్రదేశానికి వెళ్ళిపోతున్నాను.


    గౌతమ్ ని నువ్వు ప్రేమిస్తున్నావని నాకు తెలుసు. అతను నిన్ను ప్రేమిస్తున్నాడో లేదో నాకు సందేహమే.


    నాలుగు రోజులనాడు మేము కలుసుకొనే మెరీనా బీచికి వెళ్ళాను. నువ్వు ఊళ్ళో లేవుగా? గౌతమ్ నాకంటే ముందే వచ్చి ఎదురు చూస్తున్నాడు. నేను ఏదో ఓ విషయం తేల్చుకుందామనే ఆ రోజు నిర్ణయించుకున్నాను. గౌతమ్ ను నిలదీసి అడిగాను. నువ్వు ఊరికివెళ్ళే రోజు గౌతమ్ నీకు సెండాఫ్ ఇవ్వడం చూశాను. ట్రైన్ కదిలే ముందు నీ చేతిని అందుకొని పెదవులకు ఆనించుకొనడం కూడా చూశాను. ట్రైన్ కదిలింది. నేనూ మా డాడి ఎవర్నో పంపించడానికి స్టేషన్ కు వచ్చాం. బయటికి వస్తున్నప్పుడు నన్ను చూసి బిత్తరపోయాడు. డాడీ ఉండటం వల్ల ఏమీ మాట్లాడలేకపోయాను. పది పదిహేను రోజులు నన్ను తప్పించుకు తిరిగాడు.


    ఆరోజు బీచికి రాకపోతే అతని బండారం నీముందు పెడతానన్నాను. భయపడ్డాడు. అందుకే ఆ రోజు వచ్చాడు.


    ఏమీ జరగనట్టే నటించాడు. ఎంత నటన.


    నిలదీసి అడిగాను. మొదట బుకాయించాడు. ఆ తర్వాత నీతో తిరుగుతున్నట్టు అంగీకరించాడు.


    రేణూ! ఇదంతా నా దురదృష్టం. అప్పటికే మా పరిచయం హద్దులు మీరింది. నువ్వు తెలివైన దానివి. దూరంగా ఉన్నావ్. అందువల్లనే అతని ఆకర్షణ నువ్వంటే రోజురోజుకూ పెరుగుతూ వచ్చింది.


    ఆడది లొంగిపోనంత వరకూ మగవాడు ఆడదాని చుట్టూ తిరుగుతాడు. ఆ తర్వాత ఆడదాన్ని నిర్లక్ష్యం చేస్తాడు. స్త్రీ ఒకసారి లొంగిపోయాక అతన్ని వదలలేదు. నా విషయంలో అదే జరిగింది. కష్టం సుఖం ఎరగనిదాన్ని, లోకం పోకడ తెలియనిదాన్ని. జీవితం అంటే రంగుల హరివిల్లు అని భ్రమపడేదాన్ని అందుకే మోసపోయాను. నాకు నెల తప్పింది.


    ఆ మాటచెబితే ఏమన్నాడో తెలుసా?


    "ఆ బిడ్డ నా బిడ్డేనని నమ్మకం ఏమిటి? నువ్వు ఎంతమందితో తిరిగావో!" అన్నాడు.


    రేణూ అప్పుడు నాకు ఏమనిపించిందో తెలుసా? పరుగులు తీసి సముద్రగర్భంలో కలిసిపోవాలనిపించింది.


    ఇంకా "నేను నిన్ను ప్రేమించడం లేదు. పెళ్ళికి ముందే హద్దులు మీరిన నిన్ను నేను వివాహం చేసుకోను. నువ్వు బంగారు బాతువు, డబ్బు ఉన్న దానివి. డబ్బున్న వాళ్ళంటే నాకు కసి. అందుకే నీతో తిరిగాను. నేను రేణుకను ప్రేమిస్తున్నాను. నీకు నాలాంటి వాళ్ళు ఎంతమంది అయినా దొరుకుతారు" అన్నాడు.


    విన్నావా! రేణూ! గౌతమ్ అలా ప్రవర్తించి ఉంటాడని నీకు నమ్మబుద్ధి పుట్టడం లేదు కదూ? నువ్వే కాదు, కాలేజీలో ఎవరూ నమ్మరు. అతను చాలా తెలివైనవాడు. తన పాత్రను చక్కగా నటించాడు.


    "నీచుడా! నీముఖం చూస్తేనే పంచపాపాలూ చుట్టుకుంటాయి?" అన్నాను.


    అందుకు అతను ఒక విషపు నవ్వు నవ్వాడు.


    నేను కోపంతో కసిగా కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాను. యాక్సిడెంటు అయితే బాగుణ్ణు అనుకున్నాను. కాని క్షేమంగా ఇంటికి చేరాను.


    మనసారా ప్రేమించినవాడికి నా సర్వస్వం సమర్పించాను. పైగా నేను గర్భవతిని అని తెలుసుకుంటే మమ్మీ, డాడీ ఎంత కృంగిపోతారో నాకు తెలుసు.

 Previous Page Next Page