Previous Page Next Page 
బొమ్మరిల్లు పేజి 23


    గౌతమ్ నిజంగా అలా ప్రవర్తించి ఉంటాడా?


    లేకపోతే సుధారాణి ఆడపిల్ల ఆత్మహత్యకు పాల్పడాల్సిన అవసరం ఏమిటి?


    అందుకే అంటారు అతి వినయం ధూర్త లక్షణం అని...


    కాని గౌతమ్ లో అతి వినయం లేదు. వినయంగా కన్పిస్తాడు. అవసరం అయితే చాలా గట్టిగానే ఏ పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కోగలిగిన గుండె నిబ్బరం ఉన్నది.


    చిన్న చెల్లెలు నిద్రలో "నాన్నా!నాన్నా"! అంటూ ఏడుస్తున్నది.


    రేణుక చివ్వున మంచం దిగింది.


    సరళ ను ఎత్తుకొని బుజ్జగిస్తూ తన మంచం దగ్గరకు వచ్చింది. తన పక్కన పడుకోబెట్టుకొని చిచ్చి కొడుతూ తనూ నిద్రలోకి జారిపోయింది.


                                         11


    రేణుక కాలేజీకి వచ్చింది.


    అలా వస్తున్నట్టు గౌతమ్ కు ఉత్తరం రాయలేదు. గౌతమ్ రాసిన ఉత్తరాలకు సమాధానం కూడా రాయలేదు.


    ఆసుపత్రిలో ఎదురుగా రేణుక. ఓ క్షణం గౌతమ్ ఆమె ముఖంలోకి చూస్తూ ఉండిపోయాడు.


    "ఎప్పుడొచ్చావ్?"


    "ఉదయం"


    "సారీ! రేణూ! మరీ అలా అయిపోతే పోయినవాళ్ళు వస్తారా?" నువ్వు ధైర్యంగా ఉండాలి.


    రేణుక ఉలకలేదు పలకలేదు.


    "నా ఉత్తరాలు అందాయా?"


    తల ఊపింది.


    మరో ప్రశ్నకు అవకాశం ఇవ్వకుండా రేణుక గబగబా తన వార్డులోకి వెళ్ళిపోయింది.


    రేణుక ప్రవర్తన గౌతమ్ కు అర్థంకాలేదు. ఆమె వెళ్తున్న వైపు చూస్తూ నిల్చుండిపోయాడు.


    ఆత్మీయుల్ని చూసినప్పుడు అణుచుకున్న దుఃఖం కట్టలు తెంచుకొని వెల్లువై ప్రవహిస్తుంది. ఆసుపత్రిలో డాక్టరై ఉండి ఏడవడం బాగుండదు. అందుకే అలా వెళ్ళిపోయింది. మనసు సముదాయించుకుంటూ తన పనిలో మునిగిపోయాడు.


    సాయంత్రం రేణుకను కలుసుకోవడానికి హాస్టల్ కు వెళ్ళాడు.


    ఆరోగ్యం బాగాలేదనీ, నిద్రపోతున్నదనీ కబురు వచ్చింది.


    రెండో రోజు కూడా ఆసుపత్రిలో రేణుక గౌతమ్ ను తప్పించుకొని తిరగసాగింది.


    గౌతమ్ కు ఆమె ప్రవర్తన అర్థంకాలేదు. రెండు మూడు రోజులు గౌతమ్ కూడా చూసీ చూడనట్టే నటించాడు. అయినా రేణుక ప్రవర్తనలో ఎలాంటి మార్పు కన్పించలేదు.


    అయితే సుధారాణి విషయంలో తనను అపార్థం చేసుకున్నదన్నమాట! ఈ విషయంలో ఆడవాళ్లంతా ఒకలాగే ప్రవర్తిస్తారు. చదువుకున్నవాళ్ళూ, చదువులేనివాళ్ళూ కూడా ఒకేలా ప్రవర్తిస్తారు. అసలు ఆడవాళ్ళకు చెప్పుడు మాటలంటే ఎందుకో ప్రీతి! రేణుక కూడా ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తుందని తను కలలో కూడా ఊహించలేదు. తనమీద అనుమానం కలిగితే అసలు విషయం నిలదీసి అడిగి తెలుసుకోవచ్చుగా?


    గౌతమ్ కు కోపం వచ్చింది. రోషం వచ్చింది. అతని అభిమానం లోతుగా గాయపడింది. అసలు విషయం ఏమిటో తేల్చుకోవాలనే పట్టుదల బయలుదేరింది.


    వారం తర్వాత తాడోపేడో తెల్చుకోవాలన్నట్టు ఒకనాటి సాయంత్రం హాస్టల్ కు వెళ్ళాడు. విజిటర్స్ గదిలో కూర్చున్నాడు.


    "రేణుకమ్మగారికి తలనొప్పిగా ఉందట!"


    "ఫర్వాలేదు. తలనొప్పేగా? రమ్మని చెప్పు ఆమె వచ్చేంతవరకు నేను వెళ్ళనన్నానని చెప్పు!" కోపంగా అన్నాడు గౌతమ్.


    పదిహేను నిముషాల తర్వాత రేణుక వచ్చి గడపలో నిల్చుంది. కళ్ళు ఉబ్బి ఉన్నాయ్.


    ఆమె రూపం చూడగానే గౌతమ్ కోపం మంచుముక్కలా కరిగి పోయింది.


    "రేణూ! ఏడుస్తున్నావ్? ఎంతకాలం అలా ఏడుస్తూ ఉంటావ్?" నువ్వు డాక్టర్ వి. మరొకరికి ధైర్యం చెప్పడం మన వృత్తి ధర్మం" రేణుక మాట్లాడలేదు.


    "కూర్చో!"

    
    రేణుక యాంత్రికంగా ఖాళీగా ఉన్న కుర్చీలో...గౌతమ్ కు దూరంగా ఉన్న కుర్చీలో కూర్చుంది.


    "వెళ్ళి బట్టలు మార్చుకొనిరా! బీచ్ కి వెళ్దాం!"


    రేణుక చివ్వున తలెత్తి చూసింది. ఆ చూపులు ఇష్టంలేని వస్తువును దేన్నో అనుకోకుండా చూసినట్టున్నాయ్.


    "ఏమిటి అలా చూస్తున్నావ్?"


    "నేను ఎక్కడికీ రాను!"


    "ప్లీజ్ !"


    "సారీ!" ఖచ్చితంగా పలికింది.


    గౌతమ్ రేణుక ముఖంలోకి లోతుగా చూశాడు.


    తండ్రి పోయిన దుఃఖం వల్ల కలిగిన మనో క్లేశం మాత్రమే కాదు. ఆమె చూపుల్లో కన్పిస్తున్నది. తనమీద అసహ్యం కన్పిస్తోంది. అంటే... అంటే వచ్చీ రాకముందే ఎవరో సుధారాణి కథ విన్పించారన్న మాట! గౌతమ్ కు వళ్ళు మండిపోయింది.


    "నువ్వు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. నీ ధోరణి వింతగా ఉన్నది. నన్ను తప్పుకు తిరగాలని ప్రయత్నిస్తున్నావ్. ఇష్టంలేని వాళ్ళ చుట్టూ తిరుగుతూ వాళ్ళకు న్యూసెన్స్ అయ్యేవాణ్ణి కాను. నీకు ఇష్టం లేకపోతే చెప్పు. మళ్ళీ నీకు ఎదురుగా కూడా రాను."


    రేణుక తల వంచుకొని ఉన్నది. ఆమె ముఖంలో కదిలే భావాలు గౌతమ్ కు కన్పించడం లేదు.


    "కాని నాకు కారణం వినాలని ఉంది. అందుకే ఇవాళ వచ్చాను."


    రేణుక నుంచి సమాధానం లేదు.


    "నువ్వు కూడా నమ్ముతున్నావా?"


    "ఏమిటి?" చివ్వున తలెత్తింది రేణుక.


    "అదే నేను సుధను మోసం చేశానని!"


    కళ్ళుండీ వాస్తవాన్ని చూడలేనంత అమాయకురాల్ని కాదు."


    "ఓహో! అలాగా?" వ్యంగ్యంగా వుంది గౌతమ్ కంఠం.


    రేణుకకు వళ్ళు మండిపోయింది.

 Previous Page Next Page