Previous Page Next Page 
పిపాసి పేజి 21


    "రాధిక లక్షణంగా లేదా? మాకు కట్నాలూ, కానుకలమీద ఏనాడూ ఆశలేదు. మావాడికి నచ్చిన పిల్లని చెయ్యడమే మాకిష్టం."


    "అంటే"


    "అంటే.... మావాడికి రాధిక నచ్చింది. అంటే మాకూ నచ్చింది. మీకభ్యంతరం లేకపోతే, వెంటనే ముహూర్తాలు చూసి పెళ్ళి చేసేద్దాం."     


    "వొదినా..... మీరు నిజంగా దేవతలు. రాధిక దొరికిందని తెలిసినప్పటి నుంచి, సంతోషం ఒక పక్కా, దాని భవిష్యత్తును గురించిన బెంగ ఒకపక్కా మమ్మల్ని వేధించాయి. రాధిక నిజంగా అదృష్టవంతురాలు. కోరుకున్న యింటికి కోడలవడం, నాకూ చాలా సంతోషంగా వుంది. కానీ వొదినా మాకు కాస్త వ్యవధి కావాలి. మొన్ననే రేణుక పెళ్లి చేశాం కదా."


    "వొదినా మధన్ కి తన పెళ్ళి ఆడంబరంగా జరగడం ఇష్టం లేదుట. ముఖ్యమైన స్నేహితులు కొందరు, మరీ దగ్గిరబంధువులు కొందరు తప్పితే, మరెవర్నీ పిలవదల్చుకోలేదుట. అందుకనే మరేమీ బెంగపెట్టుకోనఖ్కర్లేదు, ఊ.... అంటే చాలు. పెళ్ళి జరిపించేసి, ఆ తరువాతే రాధికను పట్టుకెళ్లొచ్చును" అంది రాజేశ్వరమ్మ.


    సరోజినీకేమనాలో అర్థం కావడం లేదు. రాధిక దొరికిందన్న సంతోషంకన్నా, సాంబశివరావుగారింటి కోడలవుతుందన్న సంతోషం ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే! "వొదినా. ఈ విషయం వారితో చెబుతాను. సంతోషం పట్టలేకుండా వున్నాను" అంటూ "ఏమండీ.... ఇలా ఒక్కసారి వస్తారా" అంటూ శ్రీహరిగారి కోసం కేకపెట్టింది. ఈ సంభాషణంతా వింటున్న రాధిక, ఉబ్బితబ్బిబ్బయింది. పక్కనే వున్న మధన్ ఫోటోకి చేతులెత్తి నమస్కరించింది. ఆ తరువాత గుండెలకు హత్తుకుని, తనివితీరా ముద్దు పెట్టుకుంది.


    "మధన్, నాజీవితాన్నే మార్చేశావు. మురికికూపంలోంచి బయటకులాగి, స్వర్గానికే తీసుకొచ్చావు. జన్మ జన్మలకీ నీ ఋణం ఊహలగిలిగింతల్లో ఉక్కిరిబిక్కిరి అవుతూ మంచం మీద వాలిపోయింది, ఊహా సౌధాలు నిర్మించుకుంటూ.


    మధ్యాహ్నం భోజనం ముందు అంతా ప్రసక్తే సాంబశివరావుగారు భోజనాలయ్యాక, పురోహితుడికోసం కబురుపెట్టారు. వెంటనే దగ్గరలోవున్న ముహూర్తానికే పెళ్ళి నిశ్చయం చెయ్యమన్నారు. అంటే మరో వారంరోజుల్లోనే. శ్రీహరిగారూ, సాంబశివరావుగారూ, అందరికీ ఉత్తరాలు రాయడంలో నిమగ్నులవుతే, సరోజినీ, రాజేశ్వరమ్మ వియ్యపురాళ్ళ వరసలతో జరగవలసిన   కార్యక్రమాన్ని గురించి ముచ్చటించుకుంటున్నారు.   


    సాయంత్రం మధన్ రాగానే, రాధిక ఎదురు వెళ్ళలేకపోయింది రోజూలాగా.


    మధన్ కొత్తమనిషిలా కనిపించాడు. వింత వింత తన అనుభూతులు గిలిగింతలు పెడుతూ వుంటే వెళ్ళి తన గదిలో కూర్చుంది. మనసు మరోలోకంలో విహరిస్తూ వుంటే కాఫీగ్లాసు మధన్ చేతికిస్తూ "బాబూ.... ఇరవై ఎనిమిదో తారీకు, మంచిదటరా ముహూర్తం పెట్టేశాం, పెళ్ళికి అత్తయ్యా, మామయ్యా కూడా ఒప్పుకున్నారు. ఆ ముహూర్తం" అంది రాజేశ్వరమ్మ.


    "ఇవాళప్పుడే ఇరవై ఒకటి. ఏడు రోజులుంది. అమ్మా పెద్ద అట్టహాసాలేమీ చెయ్యొద్దు. సింపుల్ గా అయిపోవాలి" అన్నాడు.


    "బాబూ మధన్, నీ ఋణం ఈ జన్మలో తీర్చుకోలేము. పదిహేనేళ్ళక్రితం తప్పిపోయి, ఇహ దొరకదనుకొని, గుండెను రాయిచేసుకున్న సమయంలో, మీ అమ్మాయి దొరికిందీ అంటూ చల్లని వార్త అందించావు. అయితే కానిచోట పెరిగిన ఆడపిల్ల. దాని భవిష్యత్తు ఎలా? ఒక యింటిదాన్ని చెయ్యడం ఎలా? అని సతమతమయిన మాకు, నేనే పెళ్ళి చేసుకుంటానని చెప్పి, చీకటి నిండిన దాని బతుకులో, దీపాలు వెలిగించావు. నువ్వు మామూలు మనిషివి కావు కాదు బాబూ" అంది సరోజిని.  


    "ఆ..... ఆ...... వొదినా. చిన్నవాళ్ళని పొగడకూడదు." అంది నవ్వుతూ రాజేశ్వరమ్మ.


    అంతలో శ్రీహరిగారు అక్కడి కొచ్చారు "ఎప్పుడొచ్చావ్ మధన్ ఆఫీసు నుంచి" అంటూ.


    "ఇప్పుడే వచ్చానండీ"


    "బాబూ... నిన్ను ఎలా అభినందించాలో తెలీటం లేదు."


    "అదేమిటి మామయ్యా..... మీరూ పొగడ్తలు మొదలుపెడుతున్నారా! ఆడవాళ్ళే అనుకున్నాను. ఇంతకీ నే చేసిందంతా నాకోసం, నా స్వార్థం కోసం, రాధికను ప్రేమించాను, పెళ్ళి చేసుకోవాలనుకున్నాను. అంతేకానీ, నేచేసిన త్యాగమేమీలేదు ఇందులో.


    "అదంతా నీ మంచితనం మా అదృష్టం బాబూ."


    "అంతా, దైవ నిర్ణయం మామయ్యా."


    "మామా అల్లుడూ ఒకర్నొకరూ పొగిడేసుకుంటున్నారే?" అంటూ వచ్చారు సాంబశివరావుగారు.


    మధన్ నవ్వుతూ అక్కడినుంచి వెళ్ళిపోయాడు. రాధిక ఏం చేస్తోందోనని చూడడానికి రాధిక గదిలోకెళ్ళాడు.


    మంచం మీద వెళ్ళకిలా పడుకుని పత్రిక చూస్తోంది. చప్పుడు చెయ్యకుండా వెళ్ళి వెనకాలే నుంచున్నాడు. పకపకా నవ్వడం మొదలెట్టాడు. ఉలిక్కిపడి తిరిగి చూసింది. రాధిక. మధన్ నవ్వుతూనే ఉన్నాడు పొట్టచెక్కలయ్యేలా. అర్థంకాక అతనికేసి చూసింది. "ఎందుకలా నవ్వుతారు?" అంది అయోమయంగా. "అమ్మగారు పత్రిక తిరగేసి చదువుతుంటేనూ?" మళ్ళీ నవ్వడం మొదలెట్టాడు.    


    రాధిక సిగ్గుతో తలవంచుకుంది.                  

 Previous Page Next Page