"నెమ్మదిగా మాట్లాడమ్మా. వాళ్ళు వింటే బావుండదు" అంది తులశమ్మ ధైర్యంచేసి.
"ఏం? ఎందుకు బావుండదు? వింటే తెలిసొస్తుంది. వాళ్ళనంటే మీకంత నెప్పిగా వుందా? అవున్లెండి, మాయదారి జబ్బుల వంకతో వాళ్ళకలుసిచ్చారు. వాళ్ళు మీ మొహానింత జావపోసినట్టే పోసి నా ఇల్లంతా గుల్ల చేస్తున్నారు. ఏళ్ళొస్తే సరికాదు బుద్ధుండాలి" అంటూ వాయించెయ్యసాగింది.
నర్మద గొంతు చిన్నదేం కాదు. అంతా పక్కింట్లోకి వినిపిస్తూనే ఉంది. జయ బిక్కచచ్చిపోయింది.
"అత్తగారితో అలాగేనా మాట్లాడడం వదినా?" అంది జయ.
"విని నేర్చుకో" అంది నవ్వుతూ కావేరి.
"నవ్వుతావేంటి వదినా? నాకొళ్ళుమండిపోతోంది. ఈ పచ్చడి తీసుకెళ్ళి మొహానపడేసిరానా?"
"దానివల్ల బాధపడేది ఆ ముసలావిడేకానీ ఈ శూర్పణఖ కాదు"
"మరేం చెయ్యడం!" అడిగింది దిక్కుతోచక.
కావేరి మాట్లాడలేదు. పూలు కట్టసాగింది. పక్కింట్లోంచి ధన,ధన చప్పుడుతో పాటు అంతకంతకూ నర్మద కఠినమైన వాగ్బాణాలు వినిపిస్తూనే వున్నాయి. గేటు చప్పుడుకి తలెత్తి చూసింది కావేరి. శంకర్ లోపలికొస్తున్నాడు.
"ఏమండోయ్! ఓసారిలా రండి" అని పిలిచింది కావేరి.
తన వాటావైపు వెళ్ళబోతున్నవాడల్లా ఆగి వెనక్కొచ్చాడు.
"లోపలికి రండి" అంది కావేరి.
ఎన్నడూ లేనిది ఇలా పిలుస్తుందేమిటి చెప్మా అనుకుంటూ లోపలికొచ్చాడు.
"కూర్చోండి" అని కుర్చీ చూపించింది.
టీ.వీ. గట్టిగా పెట్టి "ఏమండోయ్! ఓసారిలా రండి, అన్నయ్యగారొచ్చారు" అంటూ భర్తని పిలిచింది. సుధాకర్ లోపల్నుంచొచ్చి శంకర్ ని "హలో సార్"అని పలకరించి చెయ్యి కలిపాడు.
"పక్కపక్క వాటాల్లో వుండటమే కానీ ఒకరికొకరం పరిచయం కూడా కాలేదు" అన్నాడు నవ్వుతూ.
"అవునవును" అన్నాడు శంకర్.
ఇంతలో లోపల్నుంచి ప్లేటులో కాజా, అరిసె, కారప్పూస తెచ్చిపెట్టింది కావేరి శంకర్ ముందు.
"ఎందుకిప్పుడివన్నీ వద్దు వద్దు" అని కంగారుపడ్డాడు.
"ఫర్వాలేదు తీసుకోండి" అంటూ సుధాకర్ బలవంతం చేశాడు.
"మీ ఇంటికొస్తే పెట్టాల్సొస్తుందనా అన్నయ్యగారూ?" అంటూ కావేరి బలవంతం చేసింది. శంకర్ తినక తప్పలేదు. ఆ తర్వాత జయ చిక్కని కాఫీ కూడా తెచ్చిచ్చింది. సుధాకర్ ఆ కబురూ, ఈ కబురూ చెప్తూ కూర్చోపెట్టేశాడు చాలాసేపు. వర్ధనమ్మగారు లోపల్నుంచొచ్చి తులశమ్మగారి గుణగణాలు కాసేపు పొగిడింది.
"ఇందాక పిన్నిగారు కందిపచ్చడి చేస్తుంటే మా జయ వాసన బావుందండీ అన్నందుకు కాస్త పంపించారు. మాకు చాలా మొహమాటమేసింది." అంది కావేరి కావాలనే.
"దాన్దేముందండీ మణులా, మాన్యాలా? దానికి మీరంత మొహమాట పడక్కర్లేదు" చెప్పాడు కాఫీగ్లాసు కిందపెడ్తూ శంకర్.
"ఆవిడది చాలా దొడ్డగుణం. మీరు అదృష్టవంతులు... అటువంటి తల్లికి సేవ చేసుకుంటున్నారు" అన్న కావేరి మాటలకి పొలమారింది శంకర్ కి.
"అవునవును" అన్నాడు.
కాసేపటి తర్వాత ఇంటికెళ్ళిన శంకర్ కు గుమ్మంలోంచే నర్మద కేకలు వినిపించాయి. మళ్ళీ ఏమైందిరా బాబూ! అనుకుంటూ లోపలికెళ్ళాడు.
"వచ్చారా! రండి. మీ అమ్మగారు ఆ పక్కింటివాళ్ళకి ఇల్లంతా దోచిపెడ్తోంది. ఇందాక నేను వచ్చేటప్పటికి కందిపచ్చడి చక్కగా అందిస్తూ పట్టుబడిపోయింది. నేను కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదిస్తున్నది ఈవిడిలా దానధర్మాలు చెయ్యడానికా?" అంటూ అరుస్తున్న నర్మద మాటలకడ్దొస్తూ_
"ఛీ! సిల్లీ విషయాలకింత గొడవ చెయ్యకు. కాస్త కందిపచ్చడిచ్చినంత మాత్రాన నీ సొమ్మంతా దోచిపెడ్తోందన్నట్టు మాట్లాడ్తావేమిటి?" అని చిరాకుపడ్డాడు.
"అమ్మో! అమ్మో! మీరు కూడా ఇంతలోకే ఎంత మారిపోయారు? ఆ నంగనాచి తుంగబుర్ర మీకు కూడా మందేమైనా పెట్టిందేమిటండీ?" అంది ఆశ్చర్యంగా.
కావేరీ, ఆమె భర్తా మాట్లాడిన వైఖరి గుర్తుతెచ్చుకుని "ఛీఛీ ఇది ఇల్లు కాదు నరకం" అంటూ విసుగ్గా బాత్రూంలోకెళ్ళాడు శంకర్.
తులశమ్మకీ మార్పు వింతగా అనిపించింది. కొడుకెప్పుడూ కోడలితో ఈ మాత్రం గట్టిగా మాట్లాడటం ఆవిడ చూడలేదు.
నర్మద నోరునెప్పి పుట్టేదాకా పక్కింటివాళ్ళని ముఖ్యంగా కావేరినిం అత్తగారినీ, భర్తనీ అందరినీ కలిపి తిట్టింది. ఆ తర్వాత సుష్టుగా భోంచేసి పడుకుంది.
స్నానం చేసొచ్చిన శంకరం "అమ్మా! అన్నం తిందాంరా" అని పిలిచాడు.
ఎన్నాళ్ళయింది కొడుకింత ప్రేమగా పిలిచి అని ఆశ్చర్యపోయింది తులశమ్మ. తనే రెండు కంచాలు పెట్టి వడ్డించాడు శంకర్. ఆరోజెంతో తృప్తిగా భోంచేశారు తల్లీకొడుకులు.
* * * *
"బెండకాయలు, గోరుచిక్కుడు కాయలూ, వంకాయలు, టమోటా" అంటూ కేక వినిపించింది.
"వచ్చె వచ్చె" అంటూ మంచంమీద నుంచి లేచి బయటికెళ్ళిన కాత్యాయినికి బుట్టదింపుకుని నీరసంగా కూర్చున్న గంగ కనిపించింది.
"ఏమే అలా ఉన్నావు? ఒంట్లో బాగాలేదా ఏమిటి?" అనడిగింది. గంగ రెండు మూడేళ్ళ నుంచీ పరిచయం కాత్యాయినికి. రామారావుగారికీ మధ్య మార్కెటుకెళ్ళే ఓపికుండటం లేదు. యమున, శరత్ ఏ వేళ్టకొస్తారో భరోసా లేదు. అందుకే పదిపైసలెక్కువైనా గంగ దగ్గరే కూరలు కొంటోంది.
"పొద్దుగాల మబ్బుల లేచొచ్చినా, కడుపుల ఏమిలేదు. తిరిగి తిరిగి శోయ లేకుండయిపోబట్టి" అంది గంగ నీరసంగా.
తెల్లవారగట్లే ఇంట్లోంచి బయల్దేరుతుంది గంగ. ఏ పది పన్నెండు గంటలకో ఇంత చాయ్, బన్ రొట్టి కొనుక్కుని తిని సాయంత్రందాకా అమ్మి చీకటి పడ్తుండగా ఏ లారీనో పట్టుకుని సిటీకి దగ్గరగా ఉన్నవాళ్ళ ఊరు చేరుతుంది. ఓపికుండి వండుకుంటే ఇంత అన్నం, కారం కూడా సత్తుగిన్నెలో పెట్టి తెచ్చుకుంటుంది. లేకుంటే పస్తే.