Previous Page Next Page 
మరీచిక పేజి 21


    క్షణక్షణం భంగురమే! కాని అలాంటి క్షణాలే కదా సృష్టికి స్థిరత్వాన్ని కలుగజేస్తున్నాయి. అందుకే కాలాన్ని విభజించడం తెలివి తక్కువ అంటాను. బ్రతకడం చేతగాని వాళ్ళపని అంటాను.

 

    కాలం ఆగేదికాదు. జీవితం కూడా ఎవరికోసమూ, దేనికోసమూ ఆగదు. అందుకే అంటాను. ఈ జీవితాన్ని వంశగౌరవం పేరుతో సంప్రదాయాల సంకెళ్ళతో బంధించకూడదు అని. ఈ విజ్ఞానం, సంప్రదాయాలూ కలిసి జీవితంలో గడిచిపోయిన ఒక్క క్షణాన్ని తిరిగి సంస్కారం, యివ్వగలవా? అందుకే బేబీ! వచ్చెయ్! ప్రతిక్షణం జీవించు. ఒక్క క్షణం కూడా హిపోక్రసీతో వేస్టు చేసుకోకు!" అంటాడు జాన్.

 

    తను మార్గాన్ని అనుసరించాలి? శబరి తనతో తనే పోరాటం సాగించింది. తనకు జీవితం కావాలి! ఈ జీవితం అమూల్యమైంది అని జ్యోతికూడా అంటుంది. కాని తనకోసం తను బతకడంలో జీవిత పరమార్థం లేదంటుంది. దీనులకోసం జీవితం అంకితం చేయాలట! తన కోసం, తన ఆనందం కోసం బతకడం జంతుబుద్ధి అట. ఈ జీవితం తనది! తన సుఖంకోసమే తను బతుకుతుంది. జాన్ మార్గాన్నే తను అనుసరిస్తుంది.

 

    తనను బంధించే హక్కు తన తలిదండ్రులకు ఎందుకుండాలి? ఒకరి జీవితంమీద మరొకరికి హక్కేమిటి? తనకు జన్మనిచ్చినంత మాత్రాన తన జీవితం వాళ్ళది యెలా అవుతుంది. తాను పుట్టకముందు తను పడుతుందనీ, తన రూపం యిలా వుంటుందనీ, వాళ్ళు ముందుగానే ఊహించారా? లేక ఇలాగేవుండాలని కోరుకున్నారా?

 

    వాళ్ళ ఆనందంలోనుంచి తను పుట్టింది. పుట్టుక ఒక యాక్సిడెంట్! అంతే.

 

    తను తల్లి గర్భంలో ప్రవేశించాక కొంతకాలం తర్వాతగానీ ఆమెకు తెలియదు. తమ ఆశల్ని, ఆశయాల్నీ, కోరికల్నీ, పిల్లల ద్వారా తీర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. తన బిడ్డ అందరికంటే అందంగా వుండాలనీ, గుణవంతురాలై పరువు ప్రతిష్ఠల్ని ఇనుమడింప చెయ్యాలనీ కోరుకుంటారు.

 

    అమ్మ తనను ఆదిత్యకిచ్చి పెళ్లి చెయ్యాలని ఆరాటపడుతోంది. ఎందుకు? అతనికి డబ్బు వుంది. సమాజంలో పెద్ద అంతస్థు వుంది. హోదా వుంది. అతను అల్లుడయితే అమ్మ హోదా కూడా పెరుగుతుంది. పదిమంది మధ్యలో గర్వంగా తిరగొచ్చు.

 

    తనకు ఆదిత్య అంటే ఇష్టమో కాదో ఆమెకు అక్కర్లేదు. తను జాన్ ను పెళ్ళి చేసుకుంటానంటే అంగీకరిస్తుందా? అంగీకరించదు. కారణం అమ్మ కోరుకొనే గుణాలేవీ అతనిలో లేవు. అసలు ఇంతకీ పెళ్ళి తనకా? ఆమెకా? తన మనసు మీద ఆమెకేం అధికారం వుంది? నో! నో! తన మనసు మీద అధికారం తనదే! వివాహం ఒక సామాజిక బంధం! ఆ బంధంలో కట్టుబడి ప్రేమ ఉన్నా లేకపోయినా, సమాజం కోసం కాపురం చెయ్యాలి! కాదు చేస్తున్నట్టు నటించాలి! హిపోక్రసీ!

 

    ఆదిత్య బాగా చదువుకున్నవాడట! ఏమిటా చదువు?

 

    "ఈనాటి విద్య మనిషిలో స్వార్థాన్ని పెంచుతూ వుంది. ఈ విద్య మన సంస్కార గతమైన క్షుద్రత్వాన్నీ, క్రూరత్వాన్నీ, సంకుచిత తత్త్వాన్నీ ఇనుమడింప చేస్తూ వుంది. తర్కబుద్ధినీ, హేతువాద దృక్పథాన్ని పెంపొందించడం లేదు. బూజు పట్టిన భావాలనూ, బంధాలనూ తెంచుకొని బయట పడటానికి ఉపకరించని ఈ విద్య ఎందుకు?" అంటుంది జ్యోతి.

 

    నిజమే! జ్యోతి ఎంత చక్కగా ఆలోచిస్తుందో! బయట కారు ఆగిన శబ్దం అయింది. రుక్మిణి పరుగులాంటి నడకతో కూతురి గదిలోకి వచ్చింది.

 

    "ఇంకా స్నానం చెయ్యలేదేమే? ఆదిత్య వచ్చేశాడు!" గాభరా పడిపోతూ అన్నది.

 

    "ఏం వస్తే రానియ్!"

 

    "ఇలాగే అతని ముందుకు వస్తావా? నీకు నిజంగానే ఏ దెయ్యమో పట్టిందే!"

 

    "ఇలా అతని ముందుకు వస్తే ఏమౌంతుందట? ఇవ్వాళ సరిగా అలంకరించుకొని అతని ముందుకొస్తాను. బాగానే వుంటుంది. ఆ తర్వాత, పెళ్ళయిన తర్వాత నిద్రలేవగానే నన్ను చూడడా? ఇదేం సినిమానా, చీరనలక్కుండా, తలరేగకుండా హీరోయిన్ లా నిద్రపోవడానికి? అప్పుడు నా పాచిముఖం చూసి అసహ్యించుకున్నా పర్వాలేదు గదూ? పెళ్ళయి పోయాక చచ్చినట్టు కాపురం చెయ్యాలిగా ఇష్టంవున్నా లేకపోయినా! ఒకర్నొకరు అసహ్యి..."

 

    "బరితెగించి పోతున్నావ్! వాగకుండా త్వరగా తయారవు!" కసురుకుంది రుక్మిణి.

 

    "అక్కర్లేదు! ఇలాగే వస్తాను."

 

    రుక్మిణి కోపం తారాస్థాయిని అందుకుంది. శబరి ఆ చంపా, ఈ చంపా ఫెడీ ఫెడీమని వాయించసాగింది. అప్పుడే లోపలికి వచ్చిన రంగారావు "ఏమిటిది?" అంటూ భార్యను దూరంగా లాగాడు.

 

    "నన్ను వదలండి! దానికి బొత్తిగా భయం లేకుండాపోయింది" అంది రొప్పుతూ రుక్మిణి.

 

    శబరి స్థాణువులా నిల్చుండిపోయింది. శబరికి ఊహ తెలిశాక దెబ్బ అంటే ఏమిటో తెలియదు. తల్లిగానీ, తండ్రిగానీ గట్టిగా తిట్టికూడా ఎరుగరు.

 

    "ఏమిటి తల్లీ ఇది! మమ్మల్నెందుకిలా బాధపెడ్తావ్?"

 

    శబరి మాట్లాడలేదు.

 

    "నువ్వు పద. అమ్మాయితో నేను మాట్లాడుతాను" అన్నాడు భార్యతో. రుక్మిణి బయటకు వెళ్ళిపోయింది. శబరి చెంపల్ని అరచేత్తో రాచుకుంటూ నిల్చుంది.

 

    "మరీ మొండితనం చేస్తున్నావమ్మా! అమ్మ ఎప్పుడైనా నిన్ను కొట్టిందా? ఆదిత్య వచ్చాడు. త్వరగా తయారై వచ్చెయ్!" అంటూ రంగారావు వెళ్లిపోయాడు.

 

    హూ! దెబ్బలకు భయపడ్తాననుకుంది. తనకు బొత్తిగా భయం లేదట! భయం ఎందుకుండాలి? అయినా అమ్మకు తనను కొట్టే అధికారం ఏముంది? తన కిష్టమైనట్టు తను ఉంటుంది! వాళ్ళెవరు తను ఎలా ఉండాలో చెప్పడానికి? భయం మనిషిని బతకనివ్వదూ, చావనివ్వదూ! పిరికివాడు తనను చూసుకొని తనే భయపడ్తాడు. ఎదుటివాడిని చూసి భయపడ్తాడు. అందుకే మూడోవాణ్ణి భయభీతుణ్ని చేస్తాడు!

 

    జాన్ చెప్పాడు భయాన్ని జయించాలనీ, భయపడుతూ బతకడం కంటే చావడం మేలనీ! తను భయాన్ని జయించింది. ఇప్పుడు తనకు ఎవరన్నా భయంలేదు. తన మార్గానికి ఎవరూ అడ్డురాకూడదు. తన ఇష్టం అయినప్పుడే స్నానం చేస్తుంది. బట్టలు మార్చుకుంటుంది. అంతేగానీ ఎవరికోసమో స్నానం చేయడం, బట్టలు మార్చుకోవడం ఏమిటి నాన్ సెన్స్! మళ్ళీ వస్తారు అమ్మా నాన్నా! వాళ్ళు రాకముందే ఇలాగే తను ఆదిత్య ముందుకు వెళ్ళాలి!

 

    శబరి ముఖంమీద పడ్తున్న జుట్టును వెనక్కు నెట్టుకుంటూ డ్రాయింగ్ రూంలోకి వెళ్ళింది. ఆదిత్య శబరిని చూస్తూ వుండిపోయాడు. రంగారావు తడబడ్డాడు. రుక్మిణికి కోపం వచ్చింది. తమాయించుకొని "ఇవ్వాళ దాని ఆరోగ్యం బాగాలేదు బాబూ!" అన్నది రుక్మిణి.

 

    "అరే! నాకు తెలియదే! ఎలా వుంది? ఏమిటి జబ్బు? జ్వరమా?" శబరిని చూస్తూ అన్నాడు ఆదిత్య.

 

    అవే నలగని దుస్తులు! బటన్ హోల్ లో ఎర్ర గులాబి! నెక్ టై! ముఖానికి పౌడరు కూడా వేసుకున్నట్టున్నాడు.

 

    "నా ఆరోగ్యానికేం? బాగానే ఉన్నానన్నానుగా?"

 

    "బయటికి రాగలవా?"

 

    "ఓ! నాకు అభ్యంతరం లేదు!"

 

    "అయితే త్వరగా తయారవు!" అన్నాడు ఆదిత్య.

 

    "తయారవడానికేముంది? నేను రెడీ!" అన్నది శబరి.

 

    ఆదిత్య శబరి ముఖంలోకి అయోమయంగా చూశాడు.

 

    "అదేమిటి? వెళ్ళి బట్టలు మార్చుకొని రా!" అన్నది తల్లి.

 

    "ఏం? ఇలా వస్తే మీకు అభ్యంతరమా? ఇలా వుంటే నేను అసహ్యంగా ఉన్నానా?" ఆదిత్యను ప్రశ్నించింది.

 

    "నో! నో! నువ్వెలా వున్నా అందంగానే వుంటావు!"

 

    "అయితే పద!"

 

    "ఇలాగే వస్తావా?"

 

    "ఇప్పుడే అన్నావుగా నేను ఎలా వున్నా అందంగానే వుంటానని!"

 

    "కాని... ఇలా బయటికి వస్తే చూసేవాళ్లు..."

 Previous Page Next Page