"పిచ్చిది" అనసూయను చూస్తూ అనుకుంది సావిత్రి.
సావిత్రి డైనింగ్ టేబుల్ ముందు కూర్చుని కాఫీ సిప్ చేస్తూ నలువైపులా పరికించి చూసింది.
"ఎక్కడే మీవారు?"
"వస్తారుండు. స్నానం చేస్తున్నారు."
అంటూ అనసూయ భర్త గదిలోకి వెళ్ళింది.
"ఏమిటి హడావుడి?" బట్టలు వేసుకుంటూ అన్నాడు రమణ.
"మా సావిత్రిని పరిచయం చేస్తాను."
"అబ్బ చంపేస్తున్నావ్. ఎవరో వి.ఐ.పి. ఇంటికి వచ్చినట్టు అంత గొడవపడిపోతావేం?"
అనసూయ వెనకే అతను వచ్చాడు.
"సావీ! మా శ్రీవారు."
సావిత్రి కళ్ళప్పగించి చూస్తూ వుండిపోయింది. అరచేతుల్లో చెమట్లు పడుతున్నయ్.
"నా ఫ్రెండు సావిత్రి. ఎం.ఏ. సైకాలజీ చేసింది. ఇప్పుడు పి.హెచ్.డి చెయ్యబోతున్నది."
"నమస్తే..." రమణమూర్తి గొంతు ఏదో అడ్డుపడినట్టు అయింది.
"నమస్తే... " సావిత్రి కంఠంలో వణుకు.
అతని కాళ్ళకింద భూమి జరిగినట్టయింది. కుర్చీని గట్టిగా పట్టుకున్నాడు.
సావిత్రి రెప్పవాల్చకుండా అతన్నే చూస్తున్నది. ఆమె ముఖములో అనేక భావాల తాలూకు రేఖలు గజిబిజిగా అల్లుకుపోతున్నయ్.
"అదేమిటి అలా నిలబడిపోయారు?" అనసూయ భర్తనూ సావిత్రినీ మార్చిమార్చి చూస్తూ అన్నది.
రమణ కుర్చీలో కూర్చున్నాడు.
సావిత్రి ఈ లోకంలో లేదు. ఆమె కళ్ళు రమణమీదనే నిలిచిపోయాయి.
"ఏమిటే మావారు అంత అందంగా ఉన్నారా? కళ్ళు అలాగే నిలబెట్టి నీలుక్కుపోయావ్!" కంఠం అదోలా పలికింది.
సావిత్రి తృళ్ళిపడింది. రమణకూడా అదిరిపడ్డాడు.
"ఇద్దరూ మాట్లాడుకుంటూ మూడో వ్యక్తికి తెలియరాని విషయాన్ని దేన్నో దాస్తున్నట్టే. అవునా సావీ" అన్నది అనసూయ.
"మీ స్నేహితురాలిని ఎక్కడో చూసినట్టున్నది" సాధ్యమైనంతవరకూ మనసులో రేగిన సంచలనాన్ని దాచుకుంటూ అన్నాడు.
"అవునవును నాకూ అలాగే వున్నది" సావిత్రి అనేసింది.
"మీ ఇద్దరికీ ఇంతకుముందే పరిచయం వుందన్నమాట" అనసూయ భర్త ముఖంలోకి చూస్తూ అంది.
"లేదు... మాకు పరిచయం లేదు."
"అయితే మా సావిత్రిని చూడగానే మీకు ఎక్కడో చూసినట్టు అన్పించిందన్నమాట"
"అవునవును."
"సావీ! నీక్కూడా అలాగే అన్పించిందా?"
"ఊఁ"
"ఎక్కడ ఒకర్నొకరు చూసుకొని వుంటారబ్బా" అదోలా పలికింది ఆమె కంఠం.
"అదే గుర్తురావడం లేదు. కొంతమందిని చూస్తే మొదటిసారి ఎక్కడో చూసినట్టు అన్పిస్తుంది. మీ ఫ్రెండుని చూస్తే అలాగే అనిపించింది" కుర్చీలో ఇబ్బందిగా కదిలాడు రమణ.
"ఏమే సావిత్రీ! నీకూ అలాగే అన్పిస్తుందా?"
"నేను ఎక్కడో చూసే వుంటాన మీ ఆయన్ను" సావిత్రి రమణమూర్తి ముఖంలోకి చూస్తూ అన్నది.
"చాలా చిత్రంగానే వున్నది."