ఒకరోజు అర్దరాత్రి నా గుర్రం ఎక్కి బయలుదేరాను.
ఎంత దూరం వెళ్ళానో నాకే తెలియదు.
ఒక అరణ్య మార్గంలో వెళ్తున్నాను. తెలతెల వారుతోంది. గుర్రం సకిలించింది. ముందుకు పోనని మొరాయించింది. అంతలో సింహగర్జన విన్పించింది. నా ప్రాణాలు ఉగ్గబట్టిపోయాయి. ఎదురుగా సింహం నిల్చుని ఉంది అల్లంత దూరంలో.
సింహం నా మీదకు లంఘించడానికి సిద్ధంగా ఉంది.
నేను 'కెవ్వు' మని అరిచాను.
రక్షించమణి కేకలు పెట్టాను.
"వెనక్కు తిప్పు గుర్రాన్ని !" ఎవరో అరిచారు వెనకనుంచి.
నేను గుర్రాని వెనక్కు తిప్పాను.
సింహం గర్జిస్తూ గుర్రంమీదకు దూకిందనే అనుకున్నాను. అది అరుస్తూనే ఉంది. దిక్కులు మార్మోగుతున్నాయి. అయినా నేను క్షేమంగానే ఉన్నాను. గుర్రాన్ని ఆపి వెనక్కు చూశాను.
ఒక్కసారిగా గుర్రం మీదినుంచి కిందకు దూకాను.
నా కాళ్ళు భూమిలోకి కూరుకుపోతున్నట్టుగా దూకినచోటనే నిల్చుండిపోయాను.
ఎదురుగా భయంకరమైన దృశ్యం.
ఒక యువకుడు బల్లెంతో సింహంతో పోరాడుతున్నాడు. బలిష్ఠమైన శరీరం.
ఒక్కసారిగా భీకర గర్జన చేస్తూ సింహం కింద పడిపోయింది.
నేను ఒక్క పరుగున ఆ యువకుడి దగ్గర కెళ్ళాను.
అతని ముఖంమీదా, ఛాతీమీదా, చేతులమీదా సింహపు గోళ్ళు గీరుకున్న గాయాలున్నాయి. వాటినుండి రక్తం ఓడుతున్నది.
అతను నన్ను చూశాడు.
నేను అతన్ని చూశాను.
ఎంతసేపు అతన్ని అలాచూస్తూ ఉండిపోయానో నాకే తెలియదు.
నేను ఒక్కసారిగా ఆవేశంతో వెళ్ళి అతని చుట్టేశాను.
అతను శిలలా నిల్చుండిపోయాడు.
నా ఆవేశపు పొంగు తీసింది.
వెంటనే అతన్ని వదలి సిగ్గుపడుతూ దూరంగా జరిగి నిల్చున్నాను.
అతను నా పేరు అడిగాడు. నేను నా గురించి అంతా చెప్పాను.
అతను తనను గురించి చెప్పాడు.
అతడు గిరిజనుడు. ఒక దళనాయకుడి కొడుకు. పేరు సఫరాన్.
అతని అంగ సౌష్ఠవాన్ని రెప్పవాల్చకుండా చూస్తూనే నిల్చున్నాను.
సఫరాన్ నాకు ధైర్యం చెప్పాడు. ఫిరోన్ తను ఉన్నంతవరకు నన్నేమీ చెయ్యలేడని మాట ఇచ్చాడు. ఇంటికి తీసుకెళ్ళాడు. అతని తల్లిదండ్రులు నన్ను ఆదరించారు.
వారం రోజుల్లోనే అతన్ని ఎంత ప్రేమిస్తున్నానో అర్థం చేసుకున్నాను. నా ప్రేమను అతని ఎదుట ప్రకటించాను. అతనుకూడా నన్ను ప్రేమిస్తున్నాడని తెలుసుకొన్న నా ఆనందానికి అవధుల్లేవు.
మా యిద్దరికీ పెద్దలముందు వారి పద్ధతి ప్రకారం వివాహం జరిగింది. కొమ్ము బూరలు ఊదారు. ఇప్పసారా తాగారు.డ్యాన్సులు చేశారు.
తుఫాను వచ్చింది. వెళ్ళిపోయింది.
మా ఇద్దరిమధ్యా ఉన్న గోడలన్నీ పడిపోయాయి.
ఉన్నది మేమిద్దరమే! ప్రేమ సముద్రంలో పూర్తిగా మునిగిపోయాం.
ఇలా ఎంతోకాలం గడువలేదు.
ఫిరోన్ కు నా ఉనికి గురించి తెలిసింది.
అతను తన సైన్యంతో ఆ దళంమీద విరుచుక పడ్డాడు. అతని సైన్యంముందు ఈ చిన్నదళం ఆగలేకపోయింది. సఫరాన్ నా కోసం చివరి వరకు పోరాడాడు. గాయపడ్డాడు. స్పృహతప్పి పడిపోయాడు. రోన్ అతను చనిపోయాడనే భావించాడు. నన్ను బలవంతంగా తన మహల్ కు తీసుకెళ్ళాడు.
నా తండ్రికి ఇదంతా తెలుసు.
అయినా అసమర్ధుడు. అసహాయంగా మిన్నకుండిపోయాడు.
నేను అతనికి ఒక పట్టాన లొంగలేదు. లొంగదల్చుకోలేదు.
నా ప్రియుడు చనిపోయాడు.
నేను వెళ్ళిపోవాలి కాని వీడ్ని మాత్రం వదలకూడదనుకొన్నాను.
ఆ రాత్రి నేను లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టు కబురు పంపించాను. అతడి సంతోషానికి అవధుల్లేవు.
చక్కగా అలంకరించుకొని నన్ను ఉంచిన గదికి వచ్చాడు.
దాసీలు నన్ను కూడా అలంకరించారు. నేను ఎదురించలేదు.
అతన్ని మంచి మాటలలో మత్తులోకి నెట్టాను.
దిండు కింద దాచిన విషంపూసిన కత్తితీసి గుండెల్లో గుచ్చాను. అతను పిచ్చిగా అరిచాడు. లేచి నన్ను అందుకోవడానికి ప్రయత్నించాడు. అతడు చాచిన చేతికి మళ్లీ కత్తితో గాయం అయ్యింది. కత్తివల్ల తగిలిన గాయంకంటే విషం వేగంగా పనిచేసింది. అతడు కుప్పకూలిపోయాడు. నేను ఆ కత్తితోనే పొడుచుకొని ప్రాణాలు వదిలాను.
నా సఫరాన్ చావలేదు. అతను కోలుకున్నాడు. అయితే మరో వివాహం చేసుకోలేదు. నేను అతనికోసం ప్రేతయోనిలో ఎదురుచూశాను. నిండు జీవితాన్ని అనుభవించిన అతను మళ్ళీ జన్మించాడు. ఈ సారి రష్యాలో జన్మించాడు." ఆగి నా వంక చూసింది.
"అంటే ఆ సఫరాన్ ను నేనేనా?"
"అవును ప్రియా! నువ్వే! నువ్వే! నీవు మూడువేల సంవత్సరాల నుండి పుడుతున్నావు. చస్తున్నావు. నిన్ను కలుసుకునే అవకాశం నాకు లభించలేదు. ఈసారి నువ్వు భారతదేశంలో జన్మించినట్టు తెలుసుకున్నాను. దేశమంతా అశాంతిగా తిరుగుతూనే ఉన్నాను. ఇన్నాళ్ళకు ఇక్కడ నిన్ను కలుసుకోగలిగాను."
"మరి పూర్వజన్మలో ఎందుకు ఇలాగే కలుసుకోలేకపోయావు?" సందేహంగా అడిగాను.
"ఫిరోన్ కూడా కటిక చావుచచ్చాడు. ప్రేతయోనిలో ప్రవేశించాడు. వాడు నన్ను కనిపెట్టుకొనే ఉంటున్నాడు. నిన్ను కలుసుకోవడానికి ప్రయత్నించినప్పుడల్లా వాడు అడ్డు పడ్తూనే ఉన్నాడు."
"మరి ఇవ్వాళ?"
"అదే నాకు ఆశ్చర్యకరంగా ఉంది."
"హెలెన్!" దిక్కులు బద్దలైనట్టు అరుపు.