Previous Page Next Page 
బొమ్మరిల్లు పేజి 20


    గౌతమ్ ఆలోచనల నుంచే నిద్రలోకి జారిపోయాడు.


                                        10


    రేణుక నిర్జీవ ప్రతిమలా గోడకు చేరబడి కూర్చున్నది.


    చేతిలోని వుత్తరం గాలికి రెపరెప లాడింది.


    ఆమె కళ్ళు గాజుగోళీల్లా కళా విహీనంగా ఉన్నాయి. ఆ చూపుల్లో జీవంలేదు. ఆ ముఖంలో చైతన్యం లేదు.


    "అక్కా! అమ్మ మళ్ళీ ఏడుస్తూంది" చిన్న చెల్లెలు సరళ ఏడుస్తూ చెప్పింది.


    రేణుక చెవులకు విన్పించలేదు.


    "అక్కా!అక్కా!" రేణుక భుజం మీద చెయ్యి వేసింది, ఊపింది ఐదేళ్ళ సరళ.


    రేణుక కదిలింది.


    చూపులు తిప్పి చూసింది.


    సరళ ఏడుస్తోంది "అమ్మ ఏడుస్తోంది" అంటోంది.


    అవును!


    అమ్మ ఏడుస్తోంది


    నేను ఏడుస్తున్నాను.


    నువ్వు మాత్రం ఏడవడం లేదూ!


    "అక్కా!అక్కా!" అక్కను గట్టిగా కుదిపింది సరళ. అక్క సరిగా పలక్కపోయేసరికి బావురుమన్నది.


    రేణుక ఈలోకంలో వచ్చింది గాభరగా చెల్లెల్ని వళ్ళోకి తీసుకుంది.


    "ఏడవకమ్మా!"


    "అమ్మ ఏడుస్తోంది. నాకేమో ఆకలేస్తోంది"


    "చిన్నక్క ఎక్కడ?"


    "బయట చెమ్మచెక్క ఆడుకుంటోంది"


    పద నీకు అన్నం పెడతాను. చేతిలో ఉన్న ఉత్తరాన్ని మడిచి బీరువాలో బట్టలక్రిందగా పెట్టింది.


    సరళకూ, చిన్న తమ్ముడు చంద్రానికి భోజనం పెట్టి నిద్రపుచ్చింది. వాళ్ళకు కూడా భోజనాలు పెట్టి చదువుకొమ్మని పురమాయించింది.


    తల్లి దగ్గరకు వచ్చింది. తల్లి గదిలో ఓమూల చాప మీద ముడుచుకొని పడుకొని ఉన్నది. కొంతసేపు అలా పడుకున్న తల్లిని చూస్తూ నిల్చున్నది.


    అమ్మ ఈ ఇరవై రోజుల్లో ఎంత చిక్కిపోయింది?


    ఒక మనిషిలో ఇరవై రోజుల్లో ఇంత మార్పు వస్తుందని తన ఊహకు కూడా అందని విషయం. పదేళ్ళ వయసు ఒక్కసారిగా మీదపడినట్టు అయింది.


    "అమ్మా!" తల్లి పక్కన కూర్చుని మీద చెయ్యి వేసింది.


    తల్లి సుందరమ్మ కళ్ళు తుడుచుకుని లేచి కూర్చుంది.


    "అమ్మా! నువ్వు ఇలా ఇరవై నాలుగ్గంటలూ ఏడుస్తూ ఉంటే ఎలా? ఎంత చిక్కిపోయావో తెలుసా? నాన్న పోయారు. నువ్వు కూడా మాకు లేకపోతే ఏమైపోవాలి మేము?" గద్గద కంఠంతో అన్నది రేణుక.


    "ఏం చెయ్యను తల్లీ. గుండెను ఎంత రాయి చేసుకుందామన్నా నా వల్ల కావటం లేదు. ఇటువంటిరోజు చూడాల్సి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. మిమ్మల్నందర్నీ ఏం చెయ్యను! ఎట్లా ఒడ్డు చేర్చ గలనో ఏమో?"


    "ఆ విషయంలో నువ్వు బెంగ పడకమ్మా! ఇంకా ఒక సంవత్సరం ఓపిక పట్టు. నాకు డిగ్రీ వచ్చేస్తుంది. ఇంటి భారం తీసుకుంటాను"

    
    "నువ్వా?"


    "అవునమ్మా నాన్నకు మాట ఇచ్చాను. చెల్లెళ్ళనీ, తమ్ముళ్ళనూ చదివించి, పెళ్ళిళ్ళు చేసే బాధ్యత నాది"

    
    "నువ్వు ఆడపిల్ల తల్లివి. నీకున్నా రేపు మీ ఆయనకు ఈ ఇంటి బరువును మీద వేసుకోవడం ఇష్టం ఉండకపోవచ్చు. అలాంటి ఆశలు పెట్టుకోకూడదు తల్లీ"  


    రేణుక పెదవుల పై విరిసిన పాలలాంటి చిరునవ్వు, రేఖలీలా మాత్రంగా కన్పించింది.


    "అలాంటి పిచ్చిపిచ్చి ఆలోచనలు పెట్టుకోకమ్మా!"


    "ఎంతకాలం ఆడపిల్ల సంపాదన మీద బతకగలం?"


    "మరి ఆడపిల్లను మగపిల్లవాడిలా ఎందుకు చదివించారు? మగపిల్లలు కంటే ఎక్కువగానే మీరు నన్ను పెంచారు"


    "పెళ్ళి అయ్యేంత వరకే! పెళ్ళి అయ్యాక ఆడపిల్ల పరాయింటి పిల్ల అవుతుంది"


    "నేను అసలు పెళ్ళే చేసుకోకపోతే?"


    "సుందరమ్మ కూతురి ముఖంలోకి విస్మయంగా చూచింది.


    "ఏమిటమ్మా అలా చూస్తావ్? ఆడపిల్ల పెళ్ళి చేసుకోకుండా ఎలా ఉంటుందనేనా? అవన్నీ పాతకాలపు భావాలు. ఏం మగవాళ్ళు పెళ్ళి చేసుకోకుండా ఉండిపోయిన వాళ్ళెందరులేరు? మన శేఖర్ బావ ఏం చేశాడు? బ్రహ్మచారిగానే ఉంటూ ఆరుగురు తోబుట్టిన వాళ్ళను ప్రయోజకుల్ని చేశాడు"


    "అది వేరమ్మా! నువ్వు ఆడపిల్లవు" ఆడపిల్ల పెళ్ళి లేకుండా ఎలా ఉంటుంది అన్న భావం ఆమె కంఠంలో ద్యోతకమైంది.


    "ఏం? ఎందుకు ఉండకూడదూ? ఈ రోజుల్లో ఎందరు అలాంటి వాళ్ళు లేరు"


    "మా కోసం నీ జీవితాన్ని పాడు చేస్తాననుకుంటున్నావా తల్లీ. ఆ గుంటూరు సంబంధం నీకు నచ్చితే...ఆ అబ్బాయి కూడా డాక్టర్...నీ చదువు పూర్తి కాగానే ఆ మూడు ముళ్ళు వెయ్యిస్తాను.


    మా పాట్లు ఏవో మేం పడతాం! అంతేకాని....."


    "అమ్మా! ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు? సంవత్సరం తర్వాత విషయం. ఇప్పుడే  తొందరపడి ఆ గుంటూరు వాళ్ళతో ఏమీ మాట్లాడకు. వాళ్ళు తొందర పెడితే మా అమ్మాయి ఇప్పుడప్పుడే పెళ్ళి చేసుకోదని చెప్పు"


    "పాతికేళ్ళు పైన పడుతుంటే ఇంకెప్పుడు చేసుకుంటావే?"


    "అమ్మా! నీకు ఇదే చెప్తున్నాను. ఇక నా పెళ్ళి గురించి ఆలోచించడం మానేయ్"


    "భోజనానికి రామ్మా!"


    "నాకు ఆకలిగా లేదు"


    "నువ్వు తినమ్మా!"


    "నువ్వు రాకుండా నేను మాత్రం ఎలా తింటానమ్మా"


    సుందరమ్మ లేచింది.

 Previous Page Next Page