"ఓ చక్కగా పాడేవు" అంది రాజేశ్వరమ్మ గరంగా. అక్కడికి మధన్ నిజంగానే బాగా పాడేసినట్టు.
రాధిక నవ్వుకుంది.
టిఫిన్ తినడం పూర్తిచేసి ఆఫీసుకి బయలుదేరాడు మధన్. రాధిక కాస్సేపు యిటూ, అటూ తిరిగి, ఏదో పత్రిక తిరగేస్తూ మంచం మీద పడి, అలాగే నిద్రపోయింది.
వంటపని పూర్తిచేసుకువచ్చి, సాంబశివరావుగారి పక్కన కూర్చుంది, రాజేశ్వరమ్మ.
"ఏమిటి ఇంత ప్రేమగా వచ్చి కూర్చున్నావ్?" పేపరు చదువుతూనే ప్రశ్నించారు సాంబశివరావుగారు.
"మీతో కొన్ని ముఖ్య విషయాలు మాట్లాడాలి" అంది.
"నాతోనా....?" అన్నారు సాంబశివరావుగారు.
ఈ మధ్యన మధన్ ఉద్యోగం చేస్తున్నప్పటి నుంచి, ఏం కావాలన్నా మధన్ తోనే మాట్లాడడం అలవాటైపోయింది రాజేశ్వరమ్మకి. అందుకే ఇవ్వాళ "మీతో మాట్లాడాలి" అని రాజేశ్వరమ్మ అన్నప్పుడు "నాతోనా" అని ఆశ్చర్యంగా అడిగారు సాంబశివరావుగారు.
"అబ్బాయి పెళ్ళి గురించండీ?" అంది.
పేపరు పక్కకి పెట్టి ..... "చెప్పు, ఏమంటావ్?" అన్నారు.
శ్రీహరిగారికి ఉత్తరం రాయండి, రాధికని మనం కోడలు చేసుకోబోతున్నామని, ఇప్పుడు దగ్గరలో వున్న ముహూర్తానికే పెళ్ళి చేసేస్తే బాగుంటుందనీ రాయండి."
"రాజా.... చిన్ననాడెప్పుడో తప్పిపోయిన రాధిక. అకస్మాత్తుగా దొరకడం, అదీ ఒక నీచమైన చోట దొరకడం. వాళ్లింకా ఈ షాకు నుంచే తేరుకోలేదు. కనీసం వాళ్ళమ్మాయిని కళ్లారా చూసుకుని, మనసారా పలకరించనయినా లేదు. అటువంటప్పుడు, మేము ఆ అమ్మాయిని కోడలుగా చేసుకుంటున్నాం, మీ ఉద్దేశం తెలపండి అని అడిగితే ఏమనుకుంటారు?" అన్నాడు.
"అయితే అలా రాయకుండా, మీ రెప్పుడొస్తున్నారూ, ఇక్కడికి? అని రాస్తే?"
"ఓ, అలా రాయి, బాగుంటుంది నువ్వు ఆవిడకి రాస్తే ఫరవాలేదు" అన్నారు.
'నిజమే. ఆపని చేస్తాను." అంటూ లేచి వెళ్లి కాగితం కలం తీసుకుని సరోజినికి ఉత్తరం రాసింది.
వారం తిరక్కుండానే శ్రీహరి, సరోజినీ, మెడ్రాసొచ్చారు. రాధిక కెందుకో పెద్ద సంతోషం కలుగలేదు. వారికోసం పరితపించి తను వారిని కలుసుకున్నప్పుడు, ఆమె కోరుకున్న ఆనందం ఆమెకి కలుగలేదు. పైగా జీవితం మీద విరక్తి కలిగింది. అటువంటి సమయంలో మధన్. తనకి ఆశాజ్యోతిని వెలిగించాడు. తల్లిదండ్రుల్నీ, సంఘాన్నీ కూడా ఎదిరించి తనని పెళ్ళి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. అటువంటి త్యాగశీలి ముందు, తల్లిదండ్రుల అనుబంధం, రక్తసంబంధం, అన్నీ బలాదూర్, అనిపించింది. అందుకే, ముభావంగా వుండిపోయింది రాధిక.
"అమ్మాయ్. మళ్ళీ నిన్ను ఈ జన్మలో చూస్తాననుకోలేదమ్మా. ఇన్నేళ్ళూ మేమంతా వున్నా ఎవరూ లేనిదానిలా, ఎక్కడ పెరిగావో, ఎన్ని అవస్థలు పడ్డావో?" శోకాలు పెట్టింది సరోజిని.
"ఇప్పుడెందుకొదినా అవన్నీ. మళ్ళీ మనమ్మాయి మనకి దొరికింది. అదే పదివేలు. ఏ దేముడికి దయ కలిగిందో, మళ్ళీ ఒకచోట చేర్చాడు" అంది రాజేశ్వరమ్మ. అనుకోకుండా రాధిక కంట్లోంచి రెండు కన్నీటి బిందువులు జలజలరాలాయి.
"ఏడవకు తల్లీ" అంటూ రాధిక తల నిమిరింది సరోజిని.
"క్షమించమ్మా పరిస్థితుల వల్ల నిన్ను పరాయిదానిలా పరిచయం చెయ్యవలసొచ్చింది." అన్నారు శ్రీహరిగారు.
"ఫరవాలేదులెండి" అంది రాధిక.
"నాన్నా అని పిలువమ్మా చిన్నప్పుడు ఒక్కక్షణం వదిలిపెట్టేదానివి కాదు, 'నాన్నాలూ, నాన్నాలూ' అంటూ" అంది సరోజిని.
రాజేశ్వరమ్మ అందరికీ కాఫీలు పట్టుకొచ్చింది. రాధిక ఒక్కొక్క కప్పు తీసి అందరికీ అందించింది. కాఫీలు స్నానాలయ్యాక, రాజేశ్వరమ్మ వంట ప్రయత్నంలో పడింది. మధన్ ఆఫీసుకి వెళ్ళిపోయాడు. సాంబశివరావుగారు, శ్రీహరి ఏవో కబుర్లలో పడ్డారు లోకాభిరామాయణం రాధిక జడ వేసుకుంటోంది తన గదిలో.
రాజేశ్వరమ్మ, సరోజినీ, రేణుక పెళ్ళి విషయాలు చెప్పుకుంటున్నారు. "అల్లుడేం పని చేస్తున్నాడమ్మా." "లెక్చరరుగా ఉన్నారొదినా. చదువుకున్నవాడు. పదెకరాలభూముందిట. ఒక్కడే కొడుకు. ఒక కూతురు" "రేణుక అదృష్టవంతురాలే" అంది.
రాజేశ్వరమ్మ "ఏదో ఆ దేముడి దయ. ఇప్పుడు రాధికదే ఏం చెయ్యాలో తెలీటంలేదు" అంది సరోజిని నిట్టూరుస్తూ.
"పెళ్ళి చేసేస్తే సరి" అంది రాజేశ్వరమ్మ.
ఈ సంభాషణంతా తలుపుచాటుగా నుంచొనివింటోంది రాధిక.
"ఎలా చెయ్యాలో ఏమిటో ఒదినా. దాన్ని ఎత్తుకుపోయిన దరిద్రుడు, దానికి ఆటా పాటా నేర్పించి, దాన్ని బొమ్మకింద బజారులోపెట్టి, దాని మీద డబ్బుచేసుకుంటూ ఒచ్చాట్టగా. ఈ సంగతి తెలిసినవాళ్ళు, ఎవరు పెళ్ళి చేసుకుంటారొదినా. లక్షణమైన సాంప్రదాయ కుటుంబంలో పుట్టినా, దాని రాత అలా తగులడింది."
"బంగారాన్ని తీసికెళ్ళి బురదలో పడేసినా, బంగారం బురద కాదుగా వొదినా."
"నిజమే, కానీ అది గ్రహించే మహానుభావులెవరు? ఎంతసేపు తప్పులు పట్టి, దెప్పిపొడిచే ఈ సంఘానికి నీతులు చెప్పడమేకానీ, న్యాయం చెయ్యడం ఎక్కడుంది?"
"వొదినా, రాధికని నా కోడలుగా చేసుకుంటాను."
"వొదినా, ఏమిటిది? మీకూ ఒక్కగానొక్కకొడుకు లక్షణమైన సంబంధం చేసుకోక ఇదేమిటొదినా"