Previous Page Next Page 
మరీచిక పేజి 20


    నాన్నా నువ్వు నాకోసం బాధపడకు. నేను మనిషిగా, కొద్దికాలమే కావచ్చు. మంచిగా బతకటానికే వెళుతున్నాను. జాతస్యం మరణం ధ్రువం! అసలు పుట్టుకలోనే చావు వున్నది. ప్రతివ్యక్తీ ఏదో ఒకనాడు మరణించక తప్పదు. ప్రజల కోసం జీవించి ప్రజల కోసం మరణించినవాడు ధన్యుడు. అమ్మ ఏడుస్తుందని నాకు తెలుసు. అమ్మకు ఈ విషయం చెప్పకు. ఎవర్నో ప్రేమించిందనీ, అతనితో వెళ్ళిపోయిందని చెప్పు!

 

    బావలాంటి అహంకారినీ, ధన మదాంధుణ్ణీ నేను గౌరవించలేను. చెల్లెలికి పెళ్లి చెయ్యండి. కట్నం ఇచ్చి చెయ్యవద్దు. మనసున్న మనిషికి ఇచ్చి చెయ్యండి. నన్ను వెదికించడానికి ప్రయత్నించవద్దు!

 

    ఇంకో ముఖ్య విషయం - నా ఫోటోలు కాల్చివేయండి. బాధ కలిగించినా ఆ పని చెయ్యక తప్పదు. కారణం నీకు ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. నాన్నా! శెలవు! మళ్ళీ కలుస్తానో లేదో! లాల్ సలామ్!

 

                                                                                              ఇట్లు

                                                                                            మీ జ్యోతి"

 

    రమణమూర్తి ఉత్తరం ముగించి స్థాణువులా వుండిపోయాడు.

 

    "ఏమిటి అలా వున్నారు? స్టేషన్ కు వెళ్ళరూ?" భార్య ప్రశ్నించింది.

 

    రమణమూర్తి బాత్ రూంలోకి వెళ్ళాడు. ఉత్తరం బాయిలర్ లో వేశాడు. జ్యోతి ఎంతపని చేసింది? నక్సలైట్స్ తో కలిసిపోయిందా? తనకు అలాంటి అనుమానం కూడా కలగలేదు. ఈ కుర్రకారంతా ఇలా తయారయ్యారేమిటి? ఎందరో మెరికల్లాంటి కుర్రాళ్ళు, ఇప్పటికే ఈ ఉద్యమానికి ఆహుతి అయ్యారు. తన బిడ్డ కూడానా? ఇందుకు తను గర్వించాలా లేక బాధపడాలా? ఏమైనా సిగ్గుపడాల్సిన అవసరం మాత్రంలేదు. ఈ వుద్యమం వ్యవసాయ కూలీలనూ, కార్మికుల్నీ ఆకర్షించలేక పోతోంది. మధ్య తరగతి, పై తరగతికి చెందిన యువకుల్ని అమితికంగా ఆకర్షిస్తోంది. ఎందుచేత?

 

    తను జ్యోతి భావాలను గౌరవించాడు. కాని ఆమె తీసుకున్న నిర్ణయానికి సంతోషించలేకపోతున్నాడు. ఈ వుద్యమంతో సంబంధంవున్న అనేకమంది యువతీ యువకులు పోలీసువాళ్ళ చేతుల్లో చిత్రహింసలకు గురి అవుతున్నారని తాను విన్నాడు. రమణమూర్తి నిలువెల్లా కంపించిపోయాడు. బుర్ర మొద్దుబారిపోయింది. జ్యోతి ఎందుకు ఇలా చేసింది? ఆమెకు తనేం తక్కువ చేశాడు? తన పెంపకంలో ఏదైనా లోపం వుందా? తనకెందుకింత శిక్ష విధించింది? లేదు, లేదు. తన పెంపకంలో ఏ లోపమూ లేదు.

 

    అందుకే జ్యోతి మంచి మనిషిగా బతకడానికి వెళ్ళింది. ఆ మార్గం సరైనదో కాదో తనకు తెలియదు. ఆ విషయం గురించి తను పెద్దగా ఏనాడూ ఆలోచించలేదు. అయినా వాళ్ళంటే తనకు సానుభూతి ఉన్నది. వాళ్ళేం చేసినా తమకోసం, తమ సుఖంకోసం, తమ బిడ్డల కోసం చెయ్యడం లేదు. వాళ్లు మానవత్వాన్నే ప్రేమించారు. పీడితుల, తాడితుల విముక్తి కొరకు ప్రాణాలను బలిస్తున్నారు.

 

    తన బిడ్డ ఫోటోలు తన చేతులమీదిగా కాల్చివెయ్యాలి.

 

    తన చెల్లెలికీ, బావమర్దికీ, శేఖరానికీ ఏం చెప్పాలి. వాళ్ళంతా జ్యోతిని అపార్థం చేసుకుంటారు. మాటలంటారు. అయినా తను వింటూ భరించాలి. కాని విప్లవ కారుల్లోకి వెళ్లిపోయిందని చెప్పకూడదు. రమణమూర్తి తల బద్దలైపోతూ వుంది. కళ్ళు మూసుకొని పడక కుర్చీలో వెనక్కు వాలాడు.


                                     13


    శబరి మంచానికి అడ్డంగా పడుకొని వళ్లు విరుచుకుంటూ గోడ గడియారం కేసి బద్ధకంగా చూసింది. అరే అప్పుడే అయిదయిందా? ఉదయంనుంచి స్నానం కూడాచెయ్యలేదు. బట్టలు మార్చుకోలేదు. తలలో దువ్వెన పెట్టలేదు. మమ్మీకి కోపంగా ఉంది. తనతో సరిగా మాట్లాడడం లేదు. పార్టీలకు రమ్మనడం లేదు. తను కాలేజీ మానేసినా ఎవరూపట్టించుకోవడం లేదు. మమ్మీకి తను కాలేజీకి వెళ్ళడం ఇష్టం లేదు. ఈ నెలరోజుల్లో తను గౌతమ్ ని రెండుసార్లు మాత్రమే అతి కష్టంమీద కలుసుకున్నది. మమ్మీ తనను ఒంటరిగా వదలడం లేదు.

 

    యల్.యస్.డి.మరోసారి వేసుకోవాలని వుంది. గౌతమ్ మార్జువానా రుచి చూపించాడు. సాయంత్రం తాగిన ఆ పొగ తాలూకు మత్తు తెల్లవారే వరకూ వున్నది. కాని యల్.యస్.డి.లా స్వర్గంలోకి తీసుకెళ్ళలేదు. తను ఈ బంధాలనుంచి బయట పడాలి. జ్యోతి వెళ్ళిపోయింది. జ్యోతికి తనకంటే ధైర్యం ఎక్కువ. ఎక్కడి కెళ్ళిందో? ఏం చేస్తోందో? అడవుల్లో గన్ పట్టుకుని తిరుగుతున్నదేమో? ఎంతమందిని చంపిందో? పోలీసులకి చిక్కితే జ్యోతిని కాల్చేస్తారేమో?

 

    శబరి నిలువెల్లా వణికిపోయింది. బాబోయ్! మనిషిని చంపటం తన వల్లకాదు! అడవుల్లో పోలీసులకు దొరక్కుండా దాక్కోవడం తన వల్లకాదు. ఆ రోజు హిప్పీల దగ్గరనుంచి వచ్చాక తనకు యెన్నో విషయాలు బోధించింది. గౌతమ్ కూడా ఎన్నో విషయాలు చెప్పాడు. అతని మాటల్లో థ్రిల్ ఉంటుంది. జ్యోతి మాటలు వింటుంటే ఒకోసారి ఆవేశం వస్తుంది. అంతలోనే ఏదో భయం కలుగుతుంది.

 

    తను పిరికిదా! నో!నో! కాదు! తను పిరికిది కాదు. జ్యోతి దాదాపు ఉపన్యాసమే ఇచ్చింది. యువత తల్చుకుంటే ఈ వ్యవస్థను తలకిందులు చేసెయ్యగలదట! యువశక్తి విజృంభణ ఫలితంగానే మానవుడు చంద్రమండలంమీద అడుగుపెట్టాడట! సిక్కిజం, క్రిస్టియానిటీ యువత అన్వేషణ ఫలితంగా ఏర్పడినవేనట. జ్యోతి ఆవేశంగా అంటుంది.

 

    "మౌర్య సామ్రాజ్యాన్ని యువకుడయిన చంద్రుగుప్తుడు (ఒక దాసీ పుత్రుడు) స్థాపించాడు.

 

    అలెగ్జాండర్ యువకుడిగానే విశ్వ విజేతగా కీర్తిని ఆర్జించాడు.

 

    శివాజీ తనకు ఇరవైఏడు ఏళ్ళు నిండీనిండకుండానే వీరోచిత సాహస కార్యాలకు ప్రసిద్ధికెక్కాడు. గురుగోవింద సింగ్ తన ముప్పయ్ మూడో ఏట కాల్సాను ఆర్గనైజ్ చేశాడు.

 

    చర్చిగేటు గురించిన పరిశోధనను కాన్విన్ తన ఇరవై అయిదవ సంవత్సరంలో పూర్తిచేశాడు. లెనిన్ తన మొదటి పుస్తకం ఇరవై నాల్గవ ఏట రచించాడు. నెపోలియన్ గద్దెనెక్కేసరికి అతని వయసు ముప్పయ్ అయిదుమాత్రమే.

 

    విలియం సిట్ పద్నాలుగవ ఏట ప్రధానమంత్రి అయ్యాడు.

 

    కారల్ మార్క్స్ తన ముప్పయవ ఏటనే కమ్యూనిస్టు మానిఫెస్టో ను రచించాడు.

 

    మనం తల్చుకుంటే ఈ దోపిడీ వ్యవస్థను మార్చగలం. వర్గశత్రువులను హతమార్చగలం."

 

    జ్యోతి మాటలు వింటున్నంతసేపూ తనకూ ఆమెతో వెళ్ళిపోవాలనిపించేది.

 

    జాన్ కూడా తనకు తెలియని ఎన్నో విషయాలను చెప్పాడు! అతని మాటలు వింటూంటే తనకు అద్భుతమయిన మంత్రం ఏదో వింటున్నట్లు అన్పిస్తుంది.

 

    "సమయాన్ని సెకండ్లలో, రోజుల్లో, నెలల్లో విభజించగలమా?

 

    కాలంలో మనిషిలేడు. మనిషిలో కాలం వుంది. అది ఒక ప్రవాహంలా నిరంతరం ప్రవహిస్తూనే వుంటుంది. దానికి తీరాలు లేవు. ఎల్లలు లేవు.

 

    ఈ కాలాన్ని ఆదివారం సోమవారం అంటూ రోజుల్లోనే, శ్రావణ, భాద్రపదాలంటూ నెలల్లోనూ, ప్రభవా, విభవ అంటూ సంవత్సరాలలోనూ ఎందుకు విభజించాలి? అది మానవుడు తనను తాను విభజించుకోవడం కాదా?

 

    నిన్నటిని ఇవాల్టిని రేపటిలోకి ఎవరు మార్చారు? బాల్యం, కౌమారం, యవ్వనం, వృద్ధాప్యం... ఈ జీవితాన్ని ఇన్ని భాగాలుగా ఎందుకు విడగొట్టుకోవాలి? నేను పుట్టుక నుంచీ మరణం వరకూ అవివాహితుడుగానే వుంటాను. కొడుకు, భర్త, తండ్రి అంటూ నన్ను నేను ముక్కలు ముక్కలుగా నరుక్కోలేను.

 

    "గాలిలా స్వచ్చందంగా వీస్తూ తిరుగుతాను. డ్రగ్స్ వేసుకుంటాను. కళ్ళు మూసుకొని ప్రపంచాన్ని చూస్తాను. దుఃఖానికి దూరంగా, బ్రహ్మ పదార్ధంలో లీనమై ఆనందాన్ని జుర్రుకుంటాను. స్వర్గంలో ప్రవేశిస్తాను. అక్కడ నేను తప్ప మరొకరు ఉండరు. బేబీ! మాలోకి వచ్చేయ్! ఈ యల్.యస్.డి. రుచి చూడు. కొత్త ప్రపంచంలోకి వచ్చేయ్! కుళ్ళు కంపుకొట్టే ఈ ప్రపంచాన్ని వదిలేయ్!" అంటాడు జాన్.

 

    జ్యోతి మాటలలో కసి కన్పిస్తుంది. ఆమె కళ్ళలో హింస కన్పిస్తుంది. జాన్ మాటల్లో మత్తు...

 

    "వ్యక్తి జీవితంలాగే సంఘ జీవితం కూడా సంఘర్షణలో, విప్లవంలో ఉదాత్తతనూ, మహోన్నతనీ పొందుతుంది. ఈ సమాజంలో క్షుద్రత్వం నిండిపోయి వుంది. మురుగుగుంటలా మారిపోయింది. ఈ సమాజాన్ని మార్చడానికి ప్రయత్నించు! దీనిని యీ బురద గుంటలో నుంచి వెలికి తియ్యడానికి జరుగుతున్న ప్రయత్నంలో భాగస్వామినివై నీ జీవితాన్ని ధన్యం చేసుకో! అంతేకాని పిరికితనంతో పారిపోయి మరో మురికి గుంటలో పడకు" అన్నది జ్యోతి.

 

    "మనం యీ కృత్రిమ బంధాలనుంచి బయటపడ్డప్పుడే మనం జీవించే ప్రతిక్షణం ఎంత విలువయినదో తెలుసుకుంటాం! నీటి బిందువు చిన్నదే కావచ్చు. అలాంటి అనేక బిందువుల కలయికతో మహాసముద్రం ఇమిడి వుంది.

 Previous Page Next Page