Previous Page Next Page 
ఆలింగనం పేజి 21


    "వాడికున్నపాటి బుద్ధి మీకు లేదే అని చెప్పడానికి" ఉడుక్కుంటూ అంది.

 

    "వాడికంటే నీ సంగతి తెలీదు కాబట్టి రాశాడు పాపం!" అని ప్రతాప్ అనగానే.

 

    "యూ!" అని ఉక్రోషంగా అంటూ అతని వీపుమీద గుప్పెట బిగించి కొట్టింది.

 

    అందరం నవ్వుకుంటూ నడుస్తుండగా,

 

    సందీప్ ఎదురొచ్చాడు. నేను నవ్వాను.

 

    "కొంచెం పనుంది... నాతో రా!" అన్నాడు.

 

    నేను ఇబ్బందిగా చూశాను. నేనేం చెప్తానా అని ప్రతాప్ చూస్తున్నాడు.

 

    "తర్వాత వస్తాను. కాలేజీ అయ్యాక" అన్నాను.

 

    "ప్రతాప్ కి సెండాఫ్ ఇవ్వడానికి మాతో రావా?" అడిగింది చిత్ర.

 

    "ఔను! సందీప్...ఈ రోజు మా ప్రతాప్ ఊరికెళ్ళిపోతున్నాడు"

 

    "అయితే..." విసుగ్గా చూశాడు అతను.

 

    "ఇంక రాడుట. స్టడీస్ డిస్ డిస్ కంటిన్యూ చేస్తున్నాడు పాపం! వాళ్ళ ఊరిలో..." అని నేను చెప్తుండగానే.

 

    అతను విసుగ్గా "సరే...సరే...ఐదు నిమిషాలలో నా కారు దగ్గరికి వస్తే రా!" అని చెప్పి అక్కడ్నించి విసురుగా వెళ్ళిపోయాడు.

 

    అక్కడున్న అందరూ గొప్ప అవమానం జరిగినట్లుగా ఫీలయ్యారు.

 

    "సారీ!" కొంచెం గిల్టీగా అన్నాను ప్రతాప్ తో.

 

    ప్రతాప్ నవ్వి "అతను చిరాకుపడితే నువ్వు సారీ చెప్పడం ఎందుకూ?" అన్నాడు.

 

    "క్లోజ్ ఫ్రెండ్ కదా!" అంది చిత్ర.

 

    "క్లోజ్ ఫ్రెండ్ కాదు...బోయ్ ఫ్రెండ్. అతను క్లోజ్ ఎప్పటికి అవ్వాలి?" హేళనగా నవ్వింది వైజయంతి.

 

    "వైజూ!" కోపంగా అన్నాను.

 

    "వైజూ అన్నది కరెక్టే కదా! సందీప్ ఎవరికైనా బోయ్ ఫ్రెండ్ వరకే అవుతాడు. అంతకుమించి అతను ఏమీ కాలేడు!" అన్నాడు ప్రతాప్.

 

    ఆ సమయంలో నాకు సందీప్ బీనాతో డాన్స్ చెయ్యడం గుర్తొచ్చింది. తలవంచుకొన్నాను.

 

    "నువ్వు చాలా సెన్సిటివ్ ముక్తా...అతనితో జాగ్రత్తగా వుండు" అన్నాడు ప్రతాప్.

 

    "మనకెందుకులే త్వరలో తనే స్వయంగా తెలుసుకుంటుంది" అంది వైజయంతి.

 

    నేను కాసేపు వాళ్ళతో కూర్చున్నాను. మనసుమాత్రం సందీప్ చుట్టూ తిరుగుతోంది. అతని కళ్ళల్లో చిరాకు నేను భరించలేను. కాసేపవగానే నేను సాయంత్రం కలుస్తాను" అని చెప్పి లేచి వచ్చేశాను. నేను కట్టుబడ్తున్నది ప్రేమకో అతనికో అర్థంమవడం లేదు!

 

    సందీప్ కార్లో కూర్చుని బీనాతో కబుర్లు చెప్తున్నాడు.

 

    నన్ను చూడగానే "నువ్వు వస్తావని తెలుసు! రా...ఎక్కు" అని డోర్ తెరిచాడు.

 

    బీనా దిగిపోతుంది అనుకున్నాను. దిగలేదు. అతని పక్కనే కూర్చుంది. నాకు బ్యాక్ సీట్ లో కూర్చోవడం ఇష్టం లేదు. అలాగే నిలబడ్డాను.

 

    "గెట్ ఇన్..." అన్నాడు.

 

    అతని కంఠంలో కమాండ్ కి వెంటనే ఎక్కేశాను.

 

    అతను ఆమె భుజాన్ని తాకుతూనే కూర్చున్నాడు. వాళ్ళిద్దరూ నవ్వినప్పుడల్లా నాకు కారం రాసుకున్నట్లవుతోంది! కూల్ డ్రింక్స్ షాప్ ముందు ఆపాడు.

 

    బీనా దిగుతూ అతని బుగ్గమీద ముద్దుపెట్టి "రాత్రికి ఫోన్ చెయ్యి...బై!" అంది.

 

    ఆ చర్యకి నేను తట్టుకోలేకపోయాను.

 

    సందీప్ ముందువైపు డోర్ తీసిపట్టుకుని "ముక్తా ముందుకి రా!" అన్నాడు.

 

    "నేను రాను" అన్నాను.

 

    "నేను నీ డ్రైవర్ని కాను" అన్నాడు.

 

    ఇంక తప్పలేదు, అతను నా భుజంమీద చెయ్యి వెయ్యగానే విసిరికొట్టి "ఛీ...ఇప్పుడే ఆ బీనాని ముట్టుకున్నావు. ముద్దుపెట్టుకున్నావు" అన్నాను.

 

    "నేను కాదు. తను ముద్దు పెట్టుకుంది" అని అదేదో జోక్ లా నవ్వసాగాడు.

 

    "నాకు ఇష్టంలేదు" అన్నాను.

 

    "నిన్ను అందుకే పెట్టుకోలేదనుకుంట!" జోక్ గా అని చిన్నగా నవ్వాడు.

 

    "నిన్ను ఆమె ముద్దుపెట్టుకోవడం నాకు ఇష్టం లేదు!" అని పెద్దగా అరిచాను.

 

    "ఓ.కే. నీ ముందు ఇంకెప్పుడూ అలా ముద్దు పెట్టుకోవద్దని చెప్తాలే!" అన్నాడు.

 

    "నాముందా? అంటే నేను లేకపోతే నీకు ఇష్టమేనా?" అడిగాను నా కళ్ళనిండా నీళ్ళు నిండాయి.

 

    సందీప్ సీరియస్ గా చూసి "అసలు నువ్వు నాకు ఎన్నిరోజులుగా పరిచయం?" అని అడిగాడు.

 

    నేను చెప్పలేకపోయాను.

 

    "జస్ట్...వన్ మంత్! అంతేనా? మరి బీనా...ఆరునెలలుగా పరిచయం. నీతో తిరగొద్దు అని ఆమె ఎప్పుడూ నాతో అనలేదే?" అన్నాడు.

 

    "నాకు...నాకు ఇష్టం లేదు"

 

    అతని భుజంమీద తలవాలుస్తూ అన్నాను. నా కన్నీళ్ళు అతని షర్ట్ ని తడిపేశాయి.

 

    "నాకు ఏడుపంటే గిట్టదు" అన్నాడు.

 

    నేను కళ్ళు తుడుచుకున్నాను.

 

    కేసెట్ లో ఏవో బీట్స్ వస్తున్నాయి.

 

    "కిస్ మీ..." అన్నాడు.

 

    నేను మంత్రముగ్దలా అతను చెప్పినపని చేశాను.

 Previous Page Next Page