నేను చాలా తప్పుచేశాను. అతనితో స్నేహం చేసే ముందే ఇవన్నీ ఆలోచించుకోవలసింది అనుకున్నాను.
మనసంతా వ్యాకులంగా ఉంది.
సందీప్ కి చాలా సన్నిహితంగా బీవా... రూబీ... ఇంకా చాలామంది.
నేనెక్కడ? నాకు అర్థం కాలేదు. తెల్లవార్లూ అతడి గురించిన ఆలోచనలే. నిన్న... అతని గురించిన ఆలోచనలు మధురిమలు గుబాళించాయి. ఈ రోజు... వేదనని బహూకరించాయి!
ఉమర్ ఖయ్యాం చెప్పినట్టు 'ఎదురు చూపుతో ఎండిపోతున్నాను... నన్ను మధువుతో నింపు...' అనే మట్టి పాత్రవంటిది ఈ పిచ్చి మనసు!
కలలో... చిన్నక్క కోప్పడ్తోంది!
ప్రతాప్ హెచ్చరిస్తున్నాడు.
అమ్మ ఆయాసంవల్ల కలుగుతున్న బాధతో మెలికలు తిరుగుతోంది.
నాన్న తెగిన చెప్పుతో నడవలేక అవస్తపడ్తున్నాడు!
సందీప్ తన తండ్రికి 'ఛీర్స్' చెప్పి డ్రింక్ చేస్తూ పగలబడి నవ్వుతున్నాడు.
నేను గేట్ వైపు నడుస్తుంటే దూరం తరగడం లేదు!
* * *
క్యాంటీన్ లో చిత్ర మెరుస్తున్న కళ్ళతో "రేపు మా బావ స్టేట్స్ నుండి వస్తున్నాడు. త్వరలోనే మా ఎంగేజ్ మెంట్!" అని ప్రకటించింది.
"అయ్యో! అప్పుడే పెళ్లా? మరి చదువో?" అని అడిగింది వైజయంతి.
"పెళ్ళయినా ఫైనల్ ఇయర్ ఇక్కడే ఉండి పూర్తి చేసేస్తా" అంది చిత్ర.
'పెళ్ళి' ఆ మాటగురించి నేను ఇప్పటివరకూ ఆలోచించలేదు. ఇంకా చిన్నక్కకే ఆ ధ్యాసలేదూ. ఆ సమయంలో నాకు సందీప్ గుర్తొచ్చాడు. సందీప్ నన్ను... పెళ్ళి చేసుకుంటాడా?
"ముక్తా నీ పెళ్ళెప్పుడూ?" వైజయంతి అడిగింది.
"ఛీ! ఇప్పుడే ఏం పెళ్ళి?" అన్నాను.
అంతలో అక్కడే వున్న ప్రతాప్ సీరియస్ గా "నేను కాలేజీ మానేస్తున్నాను" అన్నాడు.
"ఏం? నీకు పెళ్ళా?" అరిచింది వైజయంతి.
"వైజూ...బీ సీరియస్" అన్నాడు.
"మరి వున్నట్లుండి సడెన్ గా అదేం నిర్ణయంరా?" అన్నాడు వెంకట్.
"నాన్నగారి ఆరోగ్యం బాగాలేదు. అమ్మ ఇన్నాళ్ళూ కిరానా దుకాణాన్ని ఎలాగో అలా లాగుతోంది. ఇంక ఇప్పుడు ఆయన మంచంలో పడ్డాకా, ఆయన్నే కనిపెట్టుకు ఉండాల్సి వస్తోంది. దుకాణం నడవకపోతే ఇల్లు జరగదు. నా చదువుకి డబ్బు మాత్రం ఎక్కడి నుండి వస్తుందీ?" అన్నాడు.
అందరం దిగులుగా చూశాం.
ఫైనల్ ఇయర్ లోపలే మా గ్రూప్ లోంచి ఒకళ్ళు వెళ్ళిపోవడం బాధగా అనిపించింది.
కానీ ఎవరూ ఏం చెయ్యలేని పరిస్థితి!
"ఛ! ఇటువంటి ఇప్పుడే నాకు చాలా డబ్బుంటే బావుండ్ను అనిపిస్తుంది" అన్నాడు బాధగా రఫీ.
దాదాపుగా మా అందరికీ అలాగే వుంది.
ప్రతాప్ చాలా బ్రైట్ స్టూడెంట్.
"ఎప్పట్నించీ మానేస్తున్నావు?" చిత్ర అడిగింది.
"సాయంత్రం బండికే వెళ్ళిపోదామనుకుంటున్నాను. అన్నయ్య టెలిగ్రాం ఇచ్చాడు" అన్నాడు.
"ఆ!" అన్నాను.
రఫీ ఆ షాక్ కి తట్టుకోలేక ప్రతాప్ చేతిమీద తన చెయ్యివేసి గట్టిగా పట్టుకున్నాడు.
"అయితే ఈ రోజంతా మనం క్లాసులకి అటెండవద్దు. ఈ ఒక్క రోజూ అయినా ప్రతాప్ తో సరదాగా గడుపుదాం" అన్నాడు వెంకట్.
"ప్రిన్సిపాల్ తో మాట్లాడదాం. పరీక్షలకి వచ్చి వ్రాసేట్లు ఒప్పిద్దాం" అంది వైజయంతి.
"వైజూ...అక్కడికి వెళ్ళాకా ఇంక చదువుకోవడం కుదరదు. చాలా పల్లెటూరు. పొద్దుట్నుంచి సాయంత్రం దాకా పనిచేసినా సరిపోదు. అమ్మ దుకాణంలో బేరాలు చూస్తూ గేదెల దగ్గర పనిచేస్తూ ఒక్క క్షణం కూడా విశ్రాంతి తీసుకోదు తెలుసా?
"నూట నాలుగు జ్వరంతో బాధపడుతూ కూడా కొట్లో కూర్చుంటుంది. కొట్టు మూస్తే నోళ్ళు కూడా మూసుకోవాల్సి వస్తుంది!" అన్నాడు.
వాళ్ళ అమ్మ మీద నాకు చెప్పలేనంత గౌరవం కలిగింది. ఎవరన్నారు స్త్రీ అబలని?
"ఎక్కడికైనా పోదామా?" అడిగింది చిత్ర.
"మనం ఎప్పుడూ కూర్చునే మర్రి చెట్టు క్రింద కూర్చుందాం" అంటూ ప్రతాప్ లేచాడు.
"నా ఎంగేజ్ మెంట్ కి తప్పక రావాలి" అంది చిత్ర.
ప్రతాప్ నవ్వుతూ "వైజూ ఆ గోపీతో నీ లవ్ ఎఫైర్ ఎంతవరకూ వచ్చింది?" అన్నాడు.
"నీ మొహం! ఒకరోజు లిఫ్ట్ ఇచ్చాడు. అంత మాత్రానికే ఎఫైరా?" అంది వైజయంతి.
"మరి శామ్యూల్ వేరే అమ్మాయితో క్లోజ్ గా ఉంటున్నాడని తెగ ఈర్ష్య పడ్డావుగా, అది కూడా ఎఫైర్ కాదా?" అడిగాడు ప్రతాప్.
"రోజుకొకర్ని ప్రేమించడానికి ఇది మనసనుకున్నావా? లేక మట్టి బొమ్మా?" మొహమంతా ఎర్రగా చేసుకుని కోపంగా అడిగింది వైజయంతి.
"మరి శామ్యూల్ వ్రాసిన ప్రేమలేఖలు గొప్పగా చూపించుకున్నావుగా" అడిగాడు రఫీ.