"దట్స్ గుడ్!" అన్నాడు. అతని కార్లో ముందు వేలాడకట్టిన బొమ్మ గాలికి ఊగుతోంది.
* * *
నేను స్టేషన్ కి వెళ్ళేసరికి జస్ట్ ట్రైన్ కదలబోతోంది.
"ముక్త వచ్చేసింది" అరిచింది చిత్ర.
ప్రతాప్ చెయ్యిజాపాడు.
నేను అతని చేతిని పట్టుకుని "మర్చిపోకు" అన్నాను.
"నువ్వు కూడా నేను చెప్పిన మాటలు ఎప్పటికీ మర్చిపోకు!" అన్నాడతను.
నేను తలవూపాను. నా కళ్ళనిండా నీళ్ళొచ్చాయి.
అందరం అతను కనిపించినంతవరకూ చేతులు ఊపుతూనే వున్నాం. ప్రతాప్ ని తీసుకుని రైలుబండి నిర్దయగా ముందుకి వెళ్ళిపోయింది.
ప్లాట్ ఫారం ఇదంతా నాకు అలవాటే అన్నట్లు ఎప్పటిలా కళకళలాడ్తోంది. చిత్ర బండిమీద రఫీ "అర్జెంట్ పనుంది" అంటూ వెళ్ళిపోయాడు.
వెంకట్ "ట్యూషన్ ఉంది" అని తనూ వెళ్ళిపోయాడు.
నేను వైజూ బస్ స్టాప్ వైపు నడుస్తున్నాం.
"ఇంక రేపట్నుండీ కాలేజీలో వెలితిగా ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటుంది" అన్నాను.
"మీకు కాలేజీలోనే వెలితి! నాకు జీవితంలోనే వెలితిగా ఉంటుంది!" అంది వైజయంతి.
"వైజూ!" ఆశ్చర్యంగా చూశాను.
వీధిదీపం వెలుగులో ఆమె కంట్లో తడి మెరిసింది. గబుక్కున మొహం తిప్పుకుంటూ "అంతా బాధే! అందుకే ప్రేమించకు, ప్రేమించినట్లు నటించు!" అంది.
విజు భుజం నొక్కాను. నాకూ ఎందుకో ఏడుపోచ్చేసింది. ఆ సంజె చీకట్లలో కన్నెపిల్లలు నిలబడి వేరువేరు వ్యక్తులకోసం ఏడవడం... ఇంకో పదేళ్ళ తరువాత తలచుకుంటే ఎలా ఉంటుందో?
* * *
ఎక్కడో ఓ పూవు విచ్చుకుని ఆ పరిమళం గాలిలో వ్యాపించి ఘాటుగా నా ఎడదనితాకి నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న భావన! ఎక్కడిదా పరిమళం?
ప్రతిచోటా వెదికాను. వెదకి వెదకి అలసిపోయాను. చివరికి చిక్కింది. ఆ పరిమళం నా గుండెలోతుల్లోంచి పుట్టింది. ఓ ప్రేమగులాబీ అప్పుడే రేకు విచ్చుకుంటోంది! సందీప్ మీద ప్రేమలో నేను పూర్తిగా మునిగిపోయాను.
రోజులూ, వారాలూ గడిచిపోతున్నాయి. క్లాసులు మిస్సయి లెక్చరర్స్ చేత చివాట్లు తింటున్నాను.
ఇంటికి ఆలస్యంగా వచ్చి అమ్మముందు నేరస్థురాలిగా తలవంచుకుంటున్నాను.
అయినా హాయిగానే వుంది. మళ్ళీ తెల్లవారుతుంది. సందీప్ ని చూస్తాను... అనే ఊహేచాలు అన్నింటినీ భరించే శక్తినిస్తోంది!
నాగార్జునసాగర్ ఎక్స్ కర్షన్ కు వెళ్ళేరోజు ఇంట్లో గొడవైంది. ఆ రోజు అమ్మకి పొద్దుట్నుండీ ఒంట్లో బాలేదు. నాన్నగారు నన్ను ఎక్స్ కర్షనుకు వెళ్ళద్దన్నారు.
నా మొహంలో మారుతున్న భావాలని నేను ఆపుకోలేకపోయాను. నాన్నగారు గట్టిగా "నీకు అమ్మకంటే ఆ ఎక్స్ కర్షనే యెక్కువా?" అన్నారు.
నేను ఉలిక్కిపడ్డాను! ఔను! ఈ వయసులో అమ్మకంటే నన్ను సృష్టించిన ఆ భగవంతుడి కంటే, అన్నింటికంటే నాకు సందీప్ ఎక్కువ!
అతన్ని చూడకపోతే నేను బ్రతకలేను! కానీ... ఈ విషయం వాళ్ళకి ఎలా చెప్పాలీ?
పసివయసులో గిలక్కాయలూ, కాస్త పెద్దయ్యాక లక్కపిడతలూ, ఇంకాస్త పెద్దయ్యాక నగా నట్రా...అన్నీ తల్లిదండ్రులు అడక్కుండానే అమరుస్తారు. కానీ ఈ వయసులో మాత్రం అమ్మాయి మనోభావాలు అర్థం చేసుకోరు... ఎవరో చీపిరి తలవాడ్ని తెచ్చి పెళ్ళిచేసుకోమంటారు! నేను అమ్మవేపు చూడలేకపోయాను. ఆవిడ బాధ భరించేశక్తి నాకళ్ళకి లేదు. లేచి వంటింట్లోకి వెళ్ళిపోయాను.
సమయం గడుస్తున్నకొద్దీ...నాకు సందీప్ గుర్తొస్తున్నాడు. నా కోసం ఎదురుచూస్తున్నాడేమో... వచ్చేస్తాడేమో అమ్మో! రాకూడదు. వస్తే బావుంటుంది!
కిటికీలోంచి కారు హారన్లూ, మోటార్ సైకిల్ చప్పుళ్ళూ అయినప్పుడల్లా చూస్తూనే ఉన్నాను.
పాలు పొంగిపోయాయి!
నాన్నగారికి టీ ఇస్తూ ఒలకపోసాను.
"ఆడపిల్లన్నాక జాగ్రత్త అవసరం" అన్నారు నాన్న.
మధ్యాహ్నం దాకా నా ఆశ చావలేదు. ఆ రోజు అంతా కూడా నిస్సారంగా గడిచిపోయింది.
ఒకరోజు మొత్తం...సందీప్ ని చూడకుండా గడిచింది! నేను ఇంక ఆపుకోలేకపోయాను. టైం చూశాను.
రాత్రి తొమ్మిది అవుతోంది.
ఈపాటికి ఎక్స్ కర్షన్ నుండి వచ్చేసి వుంటారు. చప్పుడు కాకుండా ముందు గదిలోకి వచ్చి చెప్పులు వేసుకున్నాను.
అమ్మ కొద్దిగా కదిలింది.
ఊపిరి బిగపట్టి నిలబడ్డాను.
మళ్ళీ సర్దుకుని పడుకుంది. తలుపు శబ్దం కాకుండా తీసి బయటపడ్డాను.
ఫోన్ బూత్ అతను అప్పుడే మూసెయ్యబోతున్నాడు.
"ఒక్క నిమిషం...అర్జెంట్!" అన్నాడు. అతను నా కంగారు చూసి షాపు తెరిచాడు.
ఎంతో ఆత్రంగా, మరెంతో ఉద్విగ్నంగా సందీప్ ఇంటి నెంబర్ తిప్పాను.