"అవును! సాక్షాత్తూ కృష్ణుడే మనతో స్నేహం చేస్తున్నట్టు భావించి గర్వంగా చెప్పుకునేవాళ్ళం."
"ఇప్పుడు అవన్నీ తల్చుకుంటే నవ్వు వస్తుంది కదూ?"
"ఆ తర్వాత మీరు వైజాగ్ వెళ్ళిపోయారు."
"అవును. మళ్ళీ మనం బి.ఏ.లో కలుసుకున్నాము." అన్నది సావిత్రి.
అనసూయ ఆవలించింది.
"నిద్రవస్తోందా?"
"అవునే!"
"మీ ఆయన ఎప్పుడొస్తాడే?"
"రేపు రావాలి."
అనసూయ లేచింది
"ఎక్కడికే?" చివ్వున లేచి కూర్చుంది సావిత్రి.
"నువ్వు పడుకో. పాలు తోడుపెట్టి ఫ్రిజ్ లో పెట్టి వస్తాను."
అనసూయ డైనింగ్ హాల్లోకొచ్చింది.
వెనకే సావిత్రికూడా వచ్చింది.
"నాకు ఈ మధ్య ఒంటరిగా రాత్రిళ్ళు వుండాలంటే భయం వేస్తుందే."
"అంత భయమయితే ఎలా? మరి హాస్టల్లో ఎలా వుంటావ్?"
"గదికి నలుగురు వుంటారు."
ఇద్దరూ పడుకున్నారు
"కిటికీ తలుపులు వేసేదా?" అన్నది సావిత్రి కంఠం వణికింది.
"ఎందుకూ?"
"నాకు కిటికీ తలుపులు తెరిచవుంటే నిద్రపట్టదే. అందులోనుంచి ఎవరో తొంగి చూస్తారని పిస్తుంది" ఆ మాటలు అంటున్నప్పుడు సావిత్రి కంఠం వణికింది
"నువ్వు చాలా మారిపోయావు సావీ" కిటికీ రెక్కలు మూస్తూ అన్నదనసూయ.
"నాకెప్పుడూ ఆ దుర్మార్గుడి ముఖమే కన్పిస్తుంది"
"ఎవరు?"
"చెప్పానుగా! ఆ చంద్రవదన మొగుడు."
అనసూయ మాట్లాడలేదు.
సావిత్రి సున్నితమైన మనసుమీద చంద్రవదన చావు, అతని క్రూరత్వం బాగా దెబ్బతీశాయి.
అలాంటి మగవాళ్ళుకూడా ఉంటారు.
అనసూయ ఆవలించింది.
సావిత్రి నిద్రపోతున్నది.
9
ఉదయం ఆరున్నరకు రమణమూర్తి వచ్చాడు.
అనసూయ తలుపు తీసింది.
"హాయ్! అనూ!" సంతోషంగా అన్నాడు.
"ఇన్ని రోజులున్నారేం?"
"పని నిన్ననే పూర్తి అయింది. నీకోసం ఏం తెచ్చానో చూడు."
"ఏం తెచ్చారు?"
"ముందు ప్యాకెట్ విప్పి చూడు."
అనసూయ ప్యాకెట్ విప్పింది. కంచి పట్టుచీర. పింకు కలర్ చీరకు ఎల్లో జరీ బార్డర్. అనసూయ కళ్ళు తళుక్కుమన్నాయి.
"ఎంతయిందండీ?"
"ఆడబుద్ధి పోనిచ్చావుకాదు."
"అదేమిటో? ఆడబుద్ధి ఎలా వుంటుందేమిటి?"
"లేకపోతే ఏమిటి? ముందు చీర బాగుందో లేదో చెప్పకుండా ఖరదు అడుగుతావేం?"
"సారీ, చీరకేం చాలా బాగుంది. ఇప్పుడు చెప్పండి ఎంతయింది?"
"ఎనిమిది వందలు."
"అయ్యబాబోయ్! అంతపెట్టి ఇది ఇప్పుడు కొనకపోతేనేమండీ?"
"ఎనిమిది వందలు కాదులే."
"మరెంత?"
"నా ప్రేమంత!"
"ఉష్! మీ ప్రేమ ఇంతేనా? ఒక చీర ఖరీదేనా?"
"కాదు... కాదు... ఎంతో చెప్పనా?" కొంటెగా ఆమె కళ్ళలోకి చూశాడు.
"సరసాలు తర్వాత. త్వరగా స్నానం చెయ్యండి."
"స్నానానికి తొందరేమిటి?" అంటూ రెండు చేతులతో ఆమెను దగ్గరగా లాక్కున్నాడు.
"అబ్బ వదలండి. ముందు స్నానం చెయ్యండి..." అతని చేతుల్లోంచి జారిపోతూ అన్నది అనసూయ.
"రాణీగారి ఆజ్ఞ" అంటూ బెడ్ రూమ్ లోకి వెళ్ళబోతున్న భర్తను ఆపిందామె.
"వెళ్ళకండి"
"ఏం?"
"నా స్నేహితురాలు నిద్రపోతున్నది."
"హతోస్మి! ఇంకా మీ స్నేహితురాలు వెళ్ళలేదా?"
"చిన్నగా... వింటుంది"
"విననీయ్. నాకేం భయమా? మంచి ప్రోగ్రాం చెడగొట్టింది. పైగా ఇంట్లో తిష్టవేసింది."
అనసూయ భర్త చెయ్యి పట్టుకుని దూరంగా లాక్కెళ్ళింది.
రమణమూర్తి నవ్వుకుంటూ బాత్ రూమ్ లోకి వెళ్ళాడు.
అనసూయ సావిత్రిని కుదిపి నిద్రలేపింది.
"ఎంతయింది?" బద్ధకంగా కళ్ళు తెరుస్తూ అడిగింది.
"రోజూ నువ్వు లేచే సమయం కాలేదులే"
"మరెందుకు లేపావ్?"
"మా ఆయన వచ్చారు."
సావిత్రి చివ్వున లేచి కూర్చుంది. "పద, పరిచయం చెయ్యి."
"ఊహూ! ఇంత త్వరగానా? నువ్వు ముందు పళ్ళు తోముకుని ముఖం కడుక్కొనిరా. డైనింగ్ టేబుల్ దగ్గిరే పరిచయం" అంటూ ఆమె బయటికి నడిచింది.