Previous Page Next Page 
ఆమె నవ్వింది పేజి 20

    అదీ సంగతి! ఆ రోజు శేషయ్యకు అంత కోపం రావడానికి కారణం__ఇంత బతుకూ బతికి ఇంటెనకాల చచ్చినట్టు భార్య, ఇన్నేళ్ళు వచ్చినా ఇంగిత జ్ఞానం లేకుండా ఇడ్డెన్ల వ్యాపారానికి సిద్దమవటం ఏమిటి?

    "అదేమిటి నాన్నా?" అంటూ కూతురు తల్లితండ్రుల మధ్యకు రావడంతో కర్ర అవతల పారేసి మంచంమీద నడుం వాల్చిన శేషయ్య మనసు తుకతుకలాడిపోయింది.

    ఛీ! ఛీ! ఇక తను దీనితో సంసారం చెయ్యలేడు!

    అది వీదినపడి ఇడ్డెన్లు అమ్మడం మొదలుపెట్టాక తను ఏ ముఖంలో ప్రజల ముఖం చూస్తాడు? తరతరాలుగా తన పూర్వీకులు ఆర్జించిన కీర్తిప్రతిష్టలను ఈరోజు ఈ ముండ ఇడ్డెన్ల పాత్రలో పెట్టు కాల్చివేస్తుందా? దీని వాలకం చూస్తే రేపో మాపో ఇడ్డెన్ల అమ్మకం ఆరంభించేట్టుగా వుంది. అది చూస్తూ ప్రాణాలతో తను బతకలేడు.అయినా తన బతుక్కు ఇక అర్ధంలేదు. పూలు అమ్మినచోటే కట్టెలు అమ్మలేడు.

    "ఏమయ్యా శేషయ్యా! నీ పెళ్ళాం ఇడ్డెన్ల వ్యాపారం చేస్తుందటగా?" అని నిలేసి ఊళ్ళోవాళ్ళు అడిగితే తను ఆ మాటలు విని సహించగలడా? తన కుటుంబ గౌరవానికి, సాంప్రదాయానికీ రేపటితో బలిదానం ప్రారంభం కాబోతోంది. బతికినన్నాళ్ళు పరువుగా బతికాడు. పరువుపోయాక ఇక బతుకెందుకూ?

    మహా సముద్రంలో వాయుగుండం ప్రారంభం అయాక లేచిపడే అలల్లా శేషయ్య బుర్రలో ఆలోచనలు ఉవ్వెత్తుగా లేచి, సాగి, విరిగిపడుతున్నాయ్! శేషయ్య ముసుగు బిగించి పడుకున్నాడు.

    రాత్రి పది గంటలు దాటింది. కాని శేషయ్య ముసుగు తన్నిపట్టి పడుకొనే వున్నాడు.

    'భోజనానికి లేవమనవే!'-రామసుబ్బమ్మ సన్నగా, తలుపు పక్కగా నిల్చొని కూతురితో అన్నట్టు భర్తను ఉద్దేశించి అన్నది.

    శేషయ్య ఉలకనూ లేదు. పలకనూ లేదు.

    'లే నాన్నా! చాలా పొద్దు పోయింది-' కూతురు కూడా వచ్చి అన్నది.

    శేషయ్య ముసుగులోనుంచి ముఖం బయటపెట్టి 'పోండి! అవతలకు! నాకు అన్నం వద్దూ! ఏమీ వద్దు!' అన్నాడు.

    "అదేమిటి నాన్నా అట్లా అంటావ్?" అన్నది కూతురు దిగులుగా.

    "ఈ మంకు పట్టేమిటే ఇన్నేళ్ళూ వచ్చి?" అన్నది రామసుబ్బమ్మ.

    'ముందు పదండి అవతలికి! మీ చావు మీరు చావండి! నా చావు నేను చస్తాను. ఇక మీకూ నాకూ సంబంధం లేదు. ఆఁ ఇహ ! ఇంతే!' అంటూ శేషయ్య మళ్ళీ ముఖంమీదకు దుప్పటి లాక్కున్నాడు. బిగుసుకొని పడుకున్నాడు.

    అవును! శేషయ్య ఆత్మాభిమాని! ఆత్మాభిమానం ఆయనగారికి ఉగ్గుపాలతో పెట్టింది. శేషయ్య మాటంటే మాటే!హరిహరాదులు అడ్డొచ్చినా తను అనుకొన్న పని సాధించాల్సిందే! మరి శేషయ్యంటే శేషయ్యా? అమరయ్య గారి మనుమడు! ఉక్కుపిండం! ఉద్దండుడు! ప్రచండుడు! ఇంకా ఏమేమో ప్రశంసలు అందుకొన్నాడు లోకంనుంచి.

    శేషయ్య స్వభావం తెలిసిన తల్లీ__కూతుళ్ళు అక్కడి నుంచి జారుకున్నారు.

    'ఆ మనిషి ఒకళ్ళు చెబితే తలకెక్కదు. తనకు తోచదూ!' నిట్టూరుస్తూ మంచం వాల్చుకొని పండుకుంటూ "ఒసే పిల్లా! నువ్వు పెట్టుకు తినవే!" అన్నది.

    "నువ్వు కూడా తినవే!" అన్నది కూతురు.

    "నువ్వు పోవే, నన్ను విసిగించక. పోయి తిను" కసురుకుంది రామసుబ్బమ్మ.

    కమల మారు పలక్కుండా పిల్లిలా పోయి పడుకుంది.

    ఎంత ప్రయత్నించినా రామసుబ్బమ్మకు నిద్ర పట్టలేదు. మంచంమీద అటూ ఇటూ దొర్లడం మొదలు పెట్టింది.

    ఏం మనిషమ్మా! ముదనష్టపాడు! ఆస్తంతా సర్వనాశనం చేశాడు. తినడానికి కూడు లేకుండా చేశాడు. రెండు చేతులా దానధర్మాలు, పరువూ ప్రతిష్టా అంటూ సర్వం దుబారా చేశాడు. ఎదిగొచ్చిన పిల్ల ఇంట్లో వుందనే జ్ఞానం కూడా లేదు. ముసలిపీనుగ ఒప్పుకుంటేనేం? ఒప్పుకోకపోతేనేం? తను వ్యాపారం చేసితీరుతుంది. నాలుగు వాయిలు ఇడ్డెన్లు వేసి అమ్ముకుంటే ఈయన పరువు ప్రతిష్టలు కాలిపోతయ్యట? ఇంటింటికీ చేట పట్టుకెళ్ళి అడుక్కుంటూంటే పరువు కాలిపోదు కాబోలు? నీ పరువూ నువ్వూ మండ.

    రాసుబ్బమ్మ పెళ్ళున మెటికలు విరిచింది.

    ఈ ఆరువందల్తో గుట్టు చక్కగా వ్యాపారం చేసుకోవచ్చు. ఓ రెండువందలుపెట్టి ఇడ్డెన్ల పాత్రా, మిగతా సామాను కొనుక్కోవచ్చు. ఓ బస్తా మినుములూ, ఓ బస్తా బియ్యం ఒకేసారి కొని ఇంట్లో పెట్టుకుంటే లాభసాటిగా వుంటుంది. తను మాత్రం వీధిన తిరగాలా? ఏం? డబ్బులిచ్చి ఓ కుర్రాడిని పెట్టుకుంటే పొద్దున్నే ఓ గంట అట్టా పోయి అమ్ముకొస్తాడు. చుట్టుపక్కలవాళ్ళు ఎటు దిరిగీ ఇంటికే వస్తారాయె!

 Previous Page Next Page