కాస్త బాగా సాగితే మధ్యాహ్నంపూట గారెలూ, చిట్టిగారెలూ వేసి కుర్రాడికిస్తే వాడే అమ్ముకొస్తాడు. పావలా డబ్బులు చేతిలో పడతే ఈ కరువు రోజుల్లో మనిషి దొరక్క పోతాడా ఏం? అయినా పని చేసుకుంటే తప్పేముందీ; తిండిలేక మాది చస్తారా ఏం? దేవుడు మేలుచేస్తే, కాలం కలిసి వస్తే, వ్యాపారం బాగా సాగుతుంది. నిదానంగా ఓ చిన్న కాఫీ హోటలే పెట్టుకోవచ్చు. అవును మరి; హోటల్ వ్యాపారంచేసి లక్షలు గడించిన వాళ్ళున్నారు. పిల్లను ఒక ఇంటిదాన్ని చేస్తే తన దిగులు తీరిపోతుంది.
తను పెట్టబోయే ఇడ్డెన్ల వ్యాపారాన్ని గురించి ఆలోచిస్తూ రామసుబ్బమ్మ కునుకు తీసింది.
తొలి కోడి కూసింది. రామసుబ్బమ్మ వళ్ళు విరుచుకుంటూ లేచింది. రాత్రి అన్నం తినకపోవడంవల్ల వళ్ళు నీరసంగా వుంది.
తెల తెలవారుతోంది. బాదం చెట్టుమీద కాకులు రొదచేస్తూ గుంపులు గుంపులుగా అల్లీబిల్లీ తిరుగుతున్నాయ్. బావి దగ్గిర ముఖం కడుక్కుని పైట చెంగుతో ముఖం తుడుచుకుంటూ దేవుడి గదిలోకి వచ్చింది రామసుబ్బమ్మ.
ఆ మనిషి నిద్రలేవకముందే బజారుకెళ్ళి సామాన్లు కొనుక్కొస్తే మంచిది. అన్నట్టు కాంతమ్మ సాయం వస్తానన్నది. దాని మొగుడు రామలింగయ్యను కూడా తీసుకెళ్తే మంచిది. ఆ సుళువు బళువు తనకు తెలియదాయే! రెండుసార్లు వాళ్ళ సాయం తీసుకొంటే ఆ తర్వాత తనే అన్ని పనులూ చేసుకోగలదు. ఇదేం బ్రహ్మవిద్య కనకనా? ఒంటరిముండ ఆ వెంకాయమ్మ చేసుకోవటంలా?
ఆలస్యమైతే ముసలిపీనుగ లేస్తాడేమో? చూస్తే మళ్ళీ రంగం పెట్టుకు కూర్చుంటాడు.
అనుకుంటూ రామసుబ్బమ్మ నిశ్శబ్దంగా నడిచి గదిలోకి వెళ్ళి పెట్టె తెరిచింది. గుడ్డల పొత్తులకిందుగా వేళ్ళు పోనిచ్చి తను ఆనవాలుగా పెట్టినచోటు వెతికింది.
ఒక్క క్షణంపాటు రామసుబ్బమ్మ నిశ్చేష్టురాలై నిల్చుంది. నివ్వెరబోయిన రామసుబ్బమ్మ తెప్పరిల్లుకొని గదంతా కలియజూసింది.
దండెంమీద ఉతికిన ధోవతులు లేవు. కొయ్యెపెట్టె మీద బట్టలసంచి లేదు. వంకిన శేషయ్య చేతికర్ర లేదు.
రామసుబ్బమ్మ గాలి బిగపట్టి మంచంకింద చూసింది. శేషయ్య చెప్పులు లేవు.
"అయ్యో! నా కొంప తీశాడర్రో!" అంటూ రామసుబ్బమ్మ ముఖాన చేతులువేసి బాదుకుంటూ బోరున
ఏడ్చింది.
కూతురువచ్చి తల్లిని కౌగలించుకొని ఏడ్చింది. అసలు సంగతేమిటో తెలియకుండానే.
కొద్ది క్షణాల్లో ఇరుగు పొరుగు వాళ్ళంతా వచ్చి గదిలో నిండిపోయారు.
"నేను అనుకుంటూనే వున్నా అంతపనీ చేస్తాడనీ!" అన్నాడు ఓ ముసలాయన.
అందరూ తలొక మాటా అన్నారు.
"శేషయ్య పారిపోయాడా?" అన్నాడు ఒకాయన రామసుబ్బమ్మ మొఖంలోకి లోతుగా చూస్తూ....
రైల్లో ఓమూల ఒదిగి కూర్చొనివున్న శేషయ్య ముఖం గంభీరంగా వుంది.
రైలు వేగాన్నీ, రొదనూమించి శేషయ్య బుర్రలో ఆలోచనలు సాగినై__
తను ఈ శరీరాన్ని కొద్దిరోజుల్లోనే త్యజించ బోతున్నాడు. తన అభీష్టమూ నెరవేరింది. ఆ ఆరువందల రూపాయలతోపాటు దాని వ్యాపారం గల్లంతే! అయినా తను...ఆరువందలు.....డబ్బంతా తీసుకు రాకపోతే బాగుండేదేమో? తను చావదల్చుకుంటే ఇంతకంటే వేరు మార్గాలు లేవూ? ఇంటిదగ్గిర ఏ బావిలోపడి చచ్చినా, వురిపోసుకున్నా, ముందు పోలీసులొచ్చి చుట్టుకుంటారు. శవాన్ని తీసుకెళ్ళి ఆసుపత్రిలో కోస్తారట. ఎంత దారుణం? తను అలా ఎన్నటికీ జరగనివ్వడు.