Previous Page Next Page 
ఆమె నవ్వింది పేజి 19

    దొంగతనం.....ఇంకా....ఇంకా....చేస్తే తప్పుగాని కష్టపడి నాలుగురాళ్ళు సంపాదించుకొంటే తప్పేమిటి? ఆ మెరక వీధి వెంకాయమ్మ ఇడ్డెన్ల వ్యాపారంచేసి, ఇద్దరి కూతుళ్ళ పెళ్ళిచేసి చిన్న ఇల్లు కట్టుకోలా? అనుకుంది రామసుబ్బమ్మ.

    ఓరోజు రామసుబ్బమ్మ తన గోడు పొరుగింటి కాంతమ్మగారితో వెళ్ళబోసుకుంది. ఆమె సాధారణంగా వెంకాయమ్మను చూపించి "ఏమిటమ్మా నీదంతా పిచ్చిగానీ! రోజూ పొద్దున్నే నాలుగు వాయిలు ఇడ్డెన్లు వేసి అమ్ముకుంటే ఒక రూపాయి డబ్బులు కళ్ళ చూస్తావు. ఇంటి ఖర్చు ఎల్లమారిపోదూ? ఆ మెరక వీధి వెంకాయమ్మను చూడరాదూ! ఇద్దరి కూతుళ్ళ పెళ్ళిళ్ళుచేసి, ఇంత నిలవ కూడా చేసుకుంది" అంటూ వుండేది.

    ఇంట్లోవున్న వెండి కంచాలూ, కూర గిన్నెలూ, మార్వాడీ కొట్లోకి తరలిపోగా, రామసుబ్బమ్మ ఏదో ఒకటి చెయ్యకపోతేగానీ లాభం లేదని మధనపడసాగింది.

    'ఏమో ఇడ్డెన్ల వ్యాపారం పెడితే ఆయన ఒప్పుకుంటారో లేదో?' అన్నది ఒకరోజు రామసుబ్బమ్మ కాంతమ్మతో.

    'ఒప్పుకోక ఉరేసుకుంటాడా ఏం? నీదంతా చోద్యం కాకపోతే' అన్నది కాంతమ్మ సాగదీస్తూ.

    'తప్పేముందిలే! ఏదో ఒకటి చెయ్యక తప్పుతుందా ఏం? సరేకాని ఈ పూటకు తవ్వెడు బియ్యం బదులివ్వు! అన్నీ కలిపి రేపిస్తాను.' అడిగింది రామసుబ్బమ్మ.

    'అయ్యో తల్లీ! మాఇంట్లో కూడా నిండుకున్నయ్యే! ఈ నెల్లో ఐదు మానికలు నీకే ఇస్తిని? అప్పుడే తెచ్చిన బియ్యమన్నీ అయిపోయాయని ఆయన 'ధూం ధాం' చేస్తున్నాడమ్మా!' అన్నది కాంతమ్మ.

    రామసుబ్బమ్మ సగం చచ్చి, నెత్తిన చీరకొంగు వేసుకొని ఖాళీబుట్ట తీసుకొని ఇంటికి తిరిగొచ్చింది.

    రాను రాను రామసుబ్బమ్మకు చేబదుళ్ళు పుట్టకుండా పోయినయ్! శేషయ్య చేతికి ఇంట్లో అమ్మదగిన వస్తువేదీ దొరక్కుండా పోయింది.

    అనేక రాత్రిళ్ళు నిద్రమానేసి ఆలోచించిన ఫలితంగా, రామసుబ్బమ్మ ఒక నిర్ణయానికి వచ్చింది. ఒకరోజు మెరకవీధి వెంకాయమ్మ దగ్గిరకెళ్ళి ఆ మాటా ఈ మాటా మాట్లాడుతూ, ఇడ్డెన్ల వ్యాపారంలోని సుళువుళూ బరువులూ తెలుసుకు వచ్చింది.

    వెధవముండయినా వెంకాయమ్మ నయం! కూతుళ్ళ పెళ్ళిళ్ళుచేసి, ఇంత వెనక్కూడా వేసుకుంది.  తనకూ పెళ్ళీడు కొచ్చిన కూతురుంది. ఆ మనిషి చూస్తే చీమకూడా కుట్టనట్టు తిరుగుతాడు. తను మాత్రం ఏం చెయ్యగలదు? సంసారం గడిచే మార్గం ఏది? 'గొప్పగా' బతికిన కుటుంబం అని ఈరోజు పనీ పాటా లేకుండా కూర్చుంటే గడుస్తుందా! తను ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒళ్లోంచి నాలుగు వాయిలు ఇడ్డెన్లువేసి అమ్ముకుంటే తప్పేముంది?

    రామసుబ్బమ్మ మధనపడి పడి ఓరోజు భర్తతో అంటే కస్సున లేచాడు.

    ఇకపోతే, రాగా పోగా ఇల్లు మాత్రం వుంది. ఆయన వాలకం చూస్తే అది కూడా ఏ అమ్మకానికో, తాకట్టుకో పెట్టే ధోరణిలో వుంది. ఆ ఇల్లు కాస్తా పోతే వుండటానికి ఈ నీడ కూడా వుండదు. ఎదిగొచ్చిన పిల్లను రొమ్ములమీద కుంపటిలా పెట్టుకొని తను ఏమైపోతుంది?

    శేషయ్య పెళ్ళాం తెగింపు చేసింది. ఏమయితే అయిందని ఇడ్డెన్ల వ్యాపారం చెయ్యాలనే నిశ్చయానికొచ్చింది.

    ఆరోజు ఉదయం రామసుబ్బమ్మ తన నల్లపూసల గొలుసు, తనకు పెళ్ళయిన కొత్తలో చేయించుకున్నది, తీసి మొగుడికి తెలియకుండా బజారుకు పంపించి అమ్మించింది. మెళ్ళో వట్టి నల్లపూసలూ, పసుపుకొమ్మూ కట్టుకొని, రెండూ అమ్మగా వచ్చిన ఆరువందల రూపాయలూ, పెట్టెలో భద్రంగా దాచింది.

    ఎలా పసికట్టాడో శేషయ్య సాయంత్రం రచ్చబండ దగ్గిరనుంచి వచ్చి భార్యమీదకు దూకుడుగా లేచాడు.

    రామసుబ్బమ్మ మొండికేసి మోటు సరిచింది.

    "ఇల్లాంటి దౌర్భాగ్యపు పనులు చేశావంటే ప్రాణాలు తోడేస్తాను" అన్నాడు శేషయ్య.

    "అన్నీ చేశావులే! నోరు మూసుకు ఓ మూల పడుండు!" అన్నది రామసుబ్బమ్మ.

    శేషయ్య ఉగ్రుడైపోయి, పళ్ళు బిగించి భార్యమీదకు లేచాడు.

    ఉద్రేకంతో వళ్ళు మర్చిపోయిన రామసుబ్బమ్మ మరోమాట మిగిలింది.

    "ఆ కూత మళ్ళీ కూశావంటే పళ్ళు రాల్తాయ్!" అంటూ శేషయ్య కర్ర పైకెత్తాడు.

 Previous Page Next Page