కళ్ళముందు అద్భుత దృశ్యం. అద్వితీయం. అపురూపం.
ప్రపంచంలోని సౌందర్యమంతా రాసిపోసినట్టుంది. ప్రకృతి ఆమె పాదాల ముందు మోకరిల్లినట్టుగా ఉంది.
ఆమె ఈజిఫ్టు దుస్తుల్లో ఉన్నది.
ఎవరీమె? దేవకన్యా? స్వప్నాలలోని రాజకుమార్తా? వనకన్యా?
"నిన్ను కనులారా చూడడం కోసం కొన్నివేల ఏళ్లగా ఎదురు చూస్తున్నాను ప్రియా!"
నేను ఆమె పెద్ద పెద్ద కళ్లల్లోకిచూస్తూ మంత్రముగ్ధుడిలా ఉండిపోయాను.
"నువ్వు జన్మిస్తున్నావు, చనిపోతున్నావు, పూర్తి జీవితాన్ని జీవించి అనుభవించి చచ్చి పోతున్నావు. కాని నేను మాత్రం ఇలానీకోసం ఎదురు చూస్తూనే ఉన్నాను."
నేను అప్రయత్నంగానే బండి దిగాను.
"ప్రియా!" అనేక వెండి గంటలు మ్రోగాయి. కంఠంలో తేనెలు ఊరుతున్నాయి. ఎంత తియ్యటికంఠం?
ఆ కంఠస్వరంలో మునిగి పోవాలనిపించింది.
"ప్రియా! నీతో మాట్లాడటానికి, నీతోకలిసి కాసేపు కూర్చోవడానికి మూడువేల సంవత్సరాలగా ఎదురు చూస్తున్నాను."
"ఎవరు నువ్వు?" గొంతు పెగల్చుకొని ఎలాగో అన్నాను.
"నేనెవర్నని చెప్పను. మూడువేల ఏళ్ల క్రితం నువ్వు నన్ను ప్రాణప్రదంగా ప్రేమించినవాడివి."
నాకంతా అయోమయంగా ఉంది.
"ఓ పదినిమిషాలు అలా వెళ్లి ఆ చెట్టు కింద కూర్చుందాం. అన్ని విషయాలూ చెబుతాను!" అన్నది విలాసంగా చూస్తూ.
"ఆ చెట్టుకిందకా?" నాగొంతు కీచుమన్నది.
ఆమె గలగల నవ్వింది. జలజల పారిజాతాలు రాలినట్టుగా విన్పించింది ఆ నవ్వు.
"భయపడ్తున్నావా? నీకోసం - నీతోనే ఉండిపోవడంకోసం ఎంత పరితపిస్తూ తిరుగుతున్నానో నీకు తెలియదు."
"కావచ్చును! కాని నువ్వు ప్రేతానివి. నేను మనిషిని! మనిషి ప్రేతంకోసం ఈ జన్మను వదలిపెట్టడానికి ఇష్టపడడు!" అన్నాను ఆమె సౌందర్యాన్ని కనుదోయిలో నింపుకొంటూ.
"నేను అది కోరుకోవడంలేదు. కేవలం నీకు మన పూర్వజన్మ వృత్తాంతం వినిపించాలని ఉంది. అంతే."
"అందువల్ల నీకు వచ్చేదేమిటి?"
"సంతృప్తి! శాంతి!"
"వెళ్ళండి బాబూ! ఏం భయంలేదు." రహమాన్ అన్నాడు.
"నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ప్రతి జన్మలోనూ నిన్ను చూస్తూనే ఉన్నాను. ప్రేమించేవాడిని ప్రేతాలుకూడా చంపవు. నీ సుఖాన్ని చూసి ఆనందిస్తూనే ఉన్నాను. నువ్వయినా పరిపూర్ణ జీవితాలను గడుపుతున్నావని సంతృప్తి పడ్తున్నాను" అన్నది హెలన్ కెరీనా! ముగ్ధమోహనంగా నవ్వింది.
నా మనసు నా స్వాధీనంలో లేదు.
ప్రేతం అని తెలిసీ ఆమె మాటల్ని కాదనలేక పోతున్నాను.
ఆమె వెనకే నడుస్తున్నాను. కనుపించని బంధం ఏదో వేసి నన్ను ఆమె నడిపించుకొని వెళ్తున్నది.
"రహమాన్!" క్షణం ఆగి పిల్చాను.
"ఏం బాబూ!"
"నేను కాసేపు ఆ చెట్టుక్రిందున్న రాతి బండమీద కూర్చుంటాను. నువ్వు బండిలో విశ్రాంతి తీసుకో!"
"అలాగే !"
"నిద్రపోవద్దు."
"అలాగే !" అని వాడు నవ్వుకొంటూ వెళ్ళాడు. వాడిని లాగి కొట్టాలనిపించింది.
ఇద్దరం దూరం వెళ్ళి చెట్టుకింద ఉన్న రాతిమీద కూర్చున్నాం.
"హెలెన్! చెప్పు ! మన జన్మల గురించి చెప్పు!" నా ప్రశ్న నాకే ఆశ్చర్యాన్ని కలిగించింది.
నేను పునర్జన్మల్ని నమ్ముతున్నానా? నా మేధస్సు నన్ను హెచ్చరించ బోయింది.
లేదు. నమ్మడం లేదు. కాని నమ్మాలనిపిస్తోంది మనసుకు. అందుకే అడక్కుండా వుండలేకపోతున్నాను.
వినాలనే కుతూహలాన్ని ఆపుకోలేక పోతున్నాను.
"అది చాలా పెద్ద కథ!"
"అయినా వినాలని ఉంది. చెప్పు!" అన్నాను.
"ఆమె ముఖంలోకి తనివితీరా చూస్తూ ఎంతసేపయినా కూర్చోవాలని ఉంది.
3
"నేను ఈజిప్టు రాజకుమారిని. చాలా అందమైనదాన్ని. అమరి కళ్ళు నామీదే ఉండేవి. నాకు వయసు వచ్చినకొద్దీ ఎందరో రాజకుమారులు నా కోసం మా తండ్రికి కబుర్లు పంపించారు. నా తండ్రి మాత్రం నా పెళ్ళిగురించి శ్రద్ధ తీసుకొనేవాడుకాడు. ఒకరోజు మా అమ్మతో మాట్లాడుతుంటే విన్నాను. మా సైన్యాధిపతి పరమ దుర్మార్గుడు. అయితే బలవంతుడు. తెలివైనవాడు. సైన్యం అంతా అతని కనుసన్నల్లోనే మెలుగుతూ ఉండేది.
మా నాన్న పిరికివాడు. ఎప్పుడూ అనారోగ్యంతో బాధపడుతూ ఉండేవాడు. ఒకరకంగా రాజు సైన్యాధిపతి ఫిరోన్ తీన్ నే.
మా నాన్న నన్ను ఫిరోన్ తీలోన్ కు ఇచ్చి వివాహం చేస్తానని మాట ఇచ్చినట్టు ఆరోజు నాకు తెలిసింది. అమ్మ వీల్లేదన్నది. నేను చేసుకోనన్నాను. మా మాటకు ఎవరూ విలువ ఇవ్వరని నాకు తెలుసు. ఫిరోన్ చాల దుర్మార్గుడని నాకు తెలుసు.
నేను ఒక నిర్ణయానికి వచ్చాను.
ఏమైనా సరే ఫిరోన్ కు దక్కకూడదనుకొన్నాను.