Previous Page Next Page 
రాబందులూ - రామచిలుకలు పేజి 20


    "అది ఆయన్నే అడుగు. చెప్పు బావా! చెప్పు_ఎగ్రికల్చర్ నువ్వు చేస్తావా చేయిస్తావా?" అంది రాణి.

 

    "ఎగ్రికల్చర్ మాట ఎలా వున్నా ముందు నీ కల్చర్ తో చచ్చిపోతున్నాం ఇక్కడ. పద పద! ఇప్పటికే ఆలయం అయింది" అంటూ శేఖరం మెట్లు దిగసాగాడు.

 

    "పరిచయం చేయమన్నావ్! చేశాక ఎదురెదురుగా నిలబడి, 'నమస్తే నమస్తే' అని చెప్పుకోలేదేం బావా? అదేగా మీ కల్చర్?" శేఖరం వెనకే మెట్లు దిగుతున్న రాణి కళ్ళు గుండ్రంగా తిప్పుతూ అంది.

 

    శేఖరం ఆగి వెనక్కు చూశాడు.

 

    "ఆ నమస్తేలు చెప్పుకోవాల్సిన అవసరం యిప్పుడు లేదులే" అన్నది రాణి వెనకే మెట్లు దిగుతున్న సునంద.

 

    "అయితే ఆ ఫార్మాలిటీ అంతా ఇదివరకే అయిపోయిందన్నమాట?" ఠపీమని అన్నది రాణి.

 

    "ఆహా!" అంతకంటే ఖచ్చితంగా అన్నది సునంద.

 

    "మరి ఈయన లేదంటాడేం?" పెదవి విరిచి అన్నది రాణి.

 

    "అది ఆయన్నే అడుగు!" ముక్తసరిగా అన్నది సునంద.

 

    శేఖరం సునంద ముఖంలోకి చూస్తూ సన్నగా నవ్వుకున్నాడు. రాణి నోరు మూయించిగలిగిన సునందమీద అంతరాంతరాల్లో అభిమానం మొలకెత్తింది.

 

    శేఖరం, రాణీ, సునందా హాల్లోకి వచ్చేసరికి పరమేశం డ్రాయింగ్ రూంలో నుంచి వస్తూ ఎదురయాడు.

 

    "చూడు శేఖరం! నువ్వు సంతకాలు చెయ్యాల్సిన పేపర్సు చాలా వున్నాయి. ఆడిటర్సుకూ, ఇన్ కంటాక్స్ ఆఫీసులోనూ దాఖలు చెయ్యాల్సిన కాగితాలు అలాగే వుండిపోయాయి. ఆఫీస్ రూంలో టేబుల్ మీద వున్నాయి. చూసి సంతకాలు పెట్టు" అన్నాడు పరమేశం శేఖరంతో.

 

    "ఇప్పుడు టైంలేదు మామయ్యా! అవన్నీ రేపు చూస్తాలే" అన్నాడు శేఖరం వాచ్ చూస్తూ.


    
    "సరే! అయితే. ఆ చెక్స్ మీదన్నా సంతకాలు చేసివెళ్ళు" అన్నాడు పరమేశం.

 

    శేఖరం గబగబా ఆఫీసు గదిలోకి వెళ్ళాడు.

 

    పరమేశం రాణి పక్కగా నిలబడివున్న సునందను చూస్తూ "ఆ అమ్మాయి ఎవరు రాణీ!" అడిగాడు.

 

    "సునంద. నా క్లాస్ మేట్. మా డాడీ!" పరిచయం చేసింది.

 

    సునంద చేతులు జోడించి నమస్కారం చేసింది.

 

    "మీ ఇల్లెక్కడమ్మా? ఎవరమ్మాయివి?" పరామర్శగా అడిగాడు పరమేశం.

 

    "మాది ఈ ఊరు కాదండీ. హాస్టల్లో వుంటున్నాను."

 

    అంతలో శేఖరం రావడంతో సంభాషణ ఆగిపోయింది.

 

    పోర్టికోలో కారు దగ్గర నిలబడి "వస్తాను రాణీ. వెళ్ళొస్తానండీ! నమస్కారం" అన్నది సునంద రాణి దగ్గిరా, శేఖరం దగ్గిరా శెలవు తీసుకుంటూ.

 

    కారు డోర్ తెరిచి పట్టుకొని నిల్చున్న శేఖరం "అదేమిటి? వారు క్లబ్బుకు రావడం లేదా?" ఆశ్చర్యంగా అడిగాడు, రాణి ముఖంలోకి చూస్తూ.

 

    "నన్నడుగుతావేం? ఆమెనే అడుగు."

 

    "క్షమించండి. నేను హాస్టల్ కు వెళ్ళాలి" అన్నది సునంద.

 

    "ఏం? క్లబ్ కు రాకూడదనే నియమం ఏమైనావుందా?" నవ్వుతూ అడిగాడు శేఖరం.

 

    "అబ్బే అదేం కాదండీ. ఎనిమిది గంటలకల్లా హాస్టల్లో వుండాలి. పైగా మా రూంమేటుకు త్వరగా వస్తానని చెప్పాను" అన్నది సునంద.

 

    "సరే! అయితే మిమ్మల్ని హాస్టలు దగ్గర దింపివెళ్తాం ఎక్కండి" అన్నాడు శేఖరం.

 

    "వద్దండీ రిక్షాలో వెళ్తాను."

 

    రాణి కారెక్కి కూర్చుంది.

 

    "ఎక్కండి" అన్నాడు శేఖరం డోరు పట్టుకొని నిల్చొని.

 

    "మీకు ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. మళ్ళీ...." మొహమాటపడుతూ అన్నది సునంద.

 

    "పర్వాలేదు ఎక్కండి. అయిన ఆలస్యం ఎటూ అయింది అన్నాడు శేఖరం.

 

    "ఎక్కవోయ్. మరీ అంత ఫన్ చెయ్యకు" అన్నది రాణి. శేఖరం రాణికేసి చురచుర చూశాడు. సునంద కారు ఎక్కింది.

 

    శేఖరం డోర్ వేసి ముందుసీట్లో డ్రైవర్ పక్కన కూర్చున్నాడు.

 

    కారు హాస్టలుముందు ఆగింది. అంతవరకూ ముగ్గుర్లో ఎవ్వరూ మాట్లాడలేదు.

 

    "వస్తా! రాణీ! వస్తానండీ!" ఇద్దరికీ చెప్పి సునంద హాస్టల్లోకి వెళ్ళిపోయింది.

 

    శేఖరం దిగివచ్చి, వెనక సీట్లో రాణీ పక్కన కూర్చున్నాడు. కారు బయలుదేరింది.

 

    "ఏం బావా! ఆలస్యం అయిపోయిందని అంత హడావిడి చేశావుగా? మరి సునందను డ్రాప్ చెయ్యడానికి ఆలస్యం అయితే పర్వాలేదా?" వ్యంగ్యంగా అన్నది రాణి.

 

    శేఖరం ఓ క్షణకాలంపాటు రాణి ముఖంలో గుచ్చి చూశాడు.

 

    "ఏం నీకు జెలసీగా వుందా?" వస్తున్న నవ్వును ఆపుకుంటూ అడిగాడు శేఖరం.

 

    రాణి చివ్వున తలెత్తి చూసింది. ఆమెకు వళ్ళు మండిపోయింది. ముఖంలో రోషం, కోపం ఒకదాన్ని ఒకటి ఒరుసుకున్నాయి.

 

    "నాకా? జెలసీయా? సునందను చూశా, ఐశ్వర్యం చూశా లేక అందం చూశా?" విసురుగా అన్నది రాణి.

 

    "వాటన్నింటినీ మించింది ఒకటుంది ఆమెకు."

 

    "ఏమిటది?" రోషంగా ప్రశ్నించింది రాణి.

 

    "సంస్కారం!" గంభీరంగా పలికింది శేఖరం కంఠం.

 

    "ఏమిటా సంస్కారం. పల్లెటూరి గబ్బిళాయిలా వుండటమేనా నీ దృష్టిలో సంస్కారం? ఆ సంస్కారం నా కక్కర్లేదు. మీకూ మీ సంస్కారానికీ ఓ నమస్కారం" కసిగా అన్నది రాణి.

 

    "సారీ! రాణీ! నిన్ను బాధపెట్టాలని కాదు నా ఉద్దేశ్యం!" రాణి ముఖం చూసి శేఖరం జాలిగా అన్నాడు.

 

    రాణి జవాబివ్వలేదు. మూతి సున్నాచుట్టి బయటకి చూస్తూ కూర్చుంది.

 

    రాణిని బాధ పెట్టినందుకు శేఖరం మనస్సులోనే నొచ్చుకున్నాడు.

 

    "రాణీ! కోపంలోనే నువ్వు మరీ అందంగా వుంటావు. 'నీ ముక్కు మీద కోపం, నీ ముఖానికే అందం' పాట పాడనా!" ఆమెను నవ్వించే ఉద్దేశ్యంతో రాగయుక్తంగా అన్నాడు శేఖరం.

 

    రాణి పక పక నవ్వుతూ యూ సిల్లీ బాయ్!" అన్నది. శేఖరానికి నవ్వురాలేదు. ముఖం గంభీరంగా మారింది.


                                                                           12


    హాల్లో సోఫాలో వెనక్కువాలి పరమేశం శ్రద్ధగా పేపరు చదువుతున్నాడు.

 

    ఎదురుగా కూర్చునివున్న పుణ్యశ్రీ పరమేశం ముఖంలో కదిలే భావాలను చదవటానికి ప్రయత్నిస్తున్నాడు. కాని పరమేశం ముఖానికి పూర్తిగా పేపరు అడ్డు వుండటంవల్ల పుణ్యశ్రీ అతని ముఖం చూడలేకపోతున్నాడు.

 

    పేపరు చదివి, మడిచి, మందహాసంచేస్తూ పరమేశం మిసెస్ వైకుంఠానికి అందించాడు.

 

    పరమేశం గురించి పొగుడుతూ పుణ్యశ్రీ వ్రాసిన వ్యాసాన్ని మిసెస్ వైకుంఠం గట్టిగా చదవసాగింది.

 

    "అది చదవకపోయినా పర్వాలేదులే. ముందు ఆ చంద్రమౌళిని గురించి వ్రాసిన వ్యాసం చదువు" అన్నాడు పరమేశం చిరునవ్వుతో.

 

    పరమేశం ముఖంచూసిన పుణ్యశ్రీ కళ్ళు సంతోషంతో మిలమిలలాడాయి.

 

    చంద్రమౌళి లంచగొండితనాన్ని గురించీ, అక్రమాల గురించీ తిట్టినతిట్టు తిట్టకుండా ఐదుపేజీలు రాశాడు పుణ్యశ్రీ.

 

    "మునిసిపాలిటీ రాజకీయాల్లో రాబందుల రెక్కల చప్పుడు...."

 

    "నేను చదివాలే. నువ్వు చదువుకో" అన్నాడు పరమేశం మిసెస్ వైకుంఠం పైకి చదువుతూవుంటే అడ్డు వచ్చి.

 

    మిసెస్ వైకుంఠం చదువుతున్నంతసేపూ ఆమె ముఖంలో ప్రదర్శిస్తున్న భంగిమల్ని చూస్తూ కూర్చున్నాడు పుణ్యశ్రీ.

 

    "వాహ్! భలే తిట్టావయ్యా పుణ్యశ్రీ! ఆ దెబ్బతో చంద్రమౌళికి ప్రజల్లో మంచినీళ్ళుకూడా పుట్టవు" అన్నది మిసెస్ వైకుంఠం, పుణ్యశ్రీ కేసి ప్రశంసాపూర్వకంగా చూస్తూ.

 

    పుణ్యశ్రీ సగర్వంగా పరమేశం ముఖంలోకి చూశాడు. కళ్ళజోడు తీసి తుడిచి మళ్ళీ పెట్టుకున్నాడు.

 

    "మేడం! పరమేశంగారి గురించి రాసింది కూడా చదవండి" అన్నాడు పుణ్యశ్రీ ఉత్సాహంగా.

 

    చదివి ముగించి చప్పరించింది మిసెస్ వైకుంఠం.

 

    పుణ్యశ్రీ డీలా పడిపోతూ "ఏం మేడం? బాగాలేదా?" అడిగాడు.

 

    "పొగుడుతూకంటె తిడుతూనే నువ్వు బాగా రాయగలవయ్యా అన్నది మిసెస్ వైకుంఠం నవ్వుతూ.

 

    "తిట్టడం ఎవరికైనా చేతనవుతుంది. పొగడటమే కష్టం. ఒక మంచితనాన్ని పొగడాలంటే అవతల మనిషికి ఎంత మంచితనం వుండాలి. అవకాశం చిక్కిందికదా అన్నట్టు లూ పుణ్యశ్రీ మీదకు మాటలు గురిచూసి విసిరాడు.

 Previous Page Next Page