"ఏం సార్! నేను మిమ్మల్ని మనసారా పొగిడినట్టు లేదా?" పుణ్యశ్రీ అడిగాడు పరమేశాన్ని.
పరమేశం సమాధానంగా మందహాసం చేశాడు.
మనకు కావాల్సింది పబ్లిసిటీ కాదయ్యా! అది కార్యరూపం దాల్చినప్పుడే మనం పరమేశంగార్ని అభినందించాలి" అన్నది మిసెస్ వైకుంఠం ఓరగా పరమేశాన్ని చూస్తూ.
"నీ సహకారం వుండాలేగాని ఇంతకు మూడింతలు కానూ?" అన్నాడు పరమేశం మిసెస్ వైకుంఠం కళ్ళల్లోకి చిలిపిగా చూస్తూ.
మిసెస్ వైకుంఠం పరమేశం కళ్ళలోకి చిరుకోపం తెచ్చిపెట్టుకుంటూ చూడటం చూసి,
"ఈ ముసలివాళ్ళ రోమాన్స్ చూడలేక చస్తున్నాను. దీని సిగతరగ! వయసు మళ్ళినా వగలు తగ్గలేదు" మనసులోనే అనుకున్నాడు పుణ్యశ్రీ.
"ఇదేమీ మనకు అర్ధంకావడం లేదే?" అన్నాడు లూ తడిపొడిగా నవ్వుతూ.
"నీకు అర్ధంకాదు. నీకు అర్ధమయేదల్లా, ఇసుకా, సున్నం, డబ్బూ గురించి మాట్లాడితేనే?" దెబ్బ తీశాను అన్నట్టు సంతృప్తి పడుతూ అన్నాడు పుణ్యశ్రీ.
లూ ముఖం ముడుచుకున్నాడు.
"మన ప్లాన్ ఏమిటో ఒక్క ముక్కలో తేల్చి చెప్పెయ్!" అన్నాడు పరమేశం మిసెస్ వైకుంఠంతో.
మిసెస్ వైకుంఠం గొంతు సవరించుకొని, నల్లకళ్ళద్దాలు కుడిచేత్తో వయ్యారంగా తిప్పుతూ మొదలుపెట్టింది!
"ఎంత డబ్బున్నా యీ రోజుల్లో రాజకీయ అధికారం లేనిదే రాణించలేరు. కాబట్టీ....?" ఆగి ఒకసారి అందరివైపూ మార్చి మార్చి చూసింది.
మళ్ళీ మొదలుపెట్టింది! "ప్రస్తుతం మన సమితి ప్రెసిడెంటుగావున్న నరహరిని ఓ ఏభై వేలు ఖర్చుపెట్టి ఎం.ఎల్.సీ.ని చేసి-మరో ఏభై వేలు ఖర్చుపెట్టి అల్లుడిగార్ని సమితి ప్రెసిడెంటునుచేసి - ఆ తర్వాత మరో లక్ష మనవి కావనుకుంటే అటు అల్లుడిగారి పరపతీ, ఇటు ఎం.ఎల్.సి. నరహరిగారి ఇన్ ఫ్లుయన్సుతో మన పరమేశంగారు ఎం.ఎల్.ఏ.అయీ...."
"మరో లక్ష అవతల పారేసి, ఇవతల పరమేశం గారు మంత్రి అయిపోతారు" మిసెస్ వైకుంఠం మాటల్ని మధ్యలోనే అందుకొని అన్నాడు పుణ్యశ్రీ.
లూ అంతవరకూ వేళ్ళు మడిచీ, తెరచీ లెక్క పెడుతున్నవాడల్లా సోఫాలోనుంచి ఎగిరి నిలబడి_
"అబ్బా మొత్తం మూడు లక్షలే? ఆ మూడు లక్షలు పెడితే పదిమైళ్ళు తారు రోడ్డూ, ఇరవై మైళ్ళు మెటల్ రోడ్డూ, మట్టి రోడ్డయితే...."
"మట్టి రోడ్డేమిటయ్యా! మన పరమేశంగారిది అంతా సిమెంటు రోడ్డే! మధ్యలోనే అందుకొని అన్నాడు పుణ్యశ్రీ.
తన విట్టుకు తనే మురిసిపోతూ పళ్లు బయటపెట్టాడు పుణ్యశ్రీ.
"మట్టిరోడ్డూకాదు, సిమెంటురోడ్డూ కాదు. మీవన్నీ వట్టి మట్టి బుర్రలు! మన శ్రీవారిది ఎప్పుడూ పూలబాటే!" మిసెస్ వైకుంఠం పరమేశం కళ్ళలోకి లోతుగా చూస్తూ అన్నది.
ఆ మాటకు అందరూ విరగబడి నవ్వారు.
"నాదో చిన్న సందేహం సార్?" అన్నాడు లూ పరమేశంతో.
"ఏమిటి?"
"అదే సార్! షార్ట్ కట్ లో సిమెంటు రోడ్డుండగా వంకర్లు తిరిగి డొంకన నడిచి ఎందుకు ఆయాసపడటమా అని?" అన్నాడు లూ.
"అంటే?" మిసెస్ వైకుంఠం, పుణ్యశ్రీ ఒకేసారి ప్రశ్నించారు ఆశ్చర్యంగా.
"నీ సందేహం నాకు అర్హం అయిందిలే!" అన్నట్టు మందహాసం చేశాడు పరమేశం.
లూ, పరమేశం సమాధానంకోసం చూశాడు.
"ముందు వాళ్ళ సందేహం తీర్చు. ఆ తర్వాత నీ సందేహం నేను తీరుస్తాను" అన్నాడు పరమేశం లూ తో.
"అదే ఒక ఏభైవేలు ఖర్చుపెడితే పరమేశంగారు యం.యల్.సి. అయిపోవచ్చుగదా? మరో ఏభై వేలో, లక్షో అవతల పారేసి మంత్రిగారు గావచ్చు గదా? మరి ఏభై వేలు ఖర్చుపెట్టి నరహరిని ఎం.ఎల్.సి. చెయ్యడం.... ఇంకో ఏభైవేలు ఖర్చుపెట్టి శేఖరాన్ని సమితి ప్రెసిడెంటు చెయ్యడం ఎందుకా అని" లూ తన అభిప్రాయాన్ని బయటపెట్టాడు.
మిసెస్ వైకుంఠానికీ, పుణ్యశ్రీకి కూడా లూ చెప్పింది సబబే ననిపించి సమాధానం కోసం పరమేశం ముఖంలోకి చూశారు.
"అధికార వికేంద్రీకరణ జరిగిన ఈ రోజుల్లో సమితుల్ని చేతులో పెట్టుకోకపోతే అధికారం చేజిక్కదు. సమితులకు గ్రామాలు ఆయువు పట్టులు. సమితి ప్రెసిడెంట్ల సహకారం లేనిదే, ఎం.ఎల్.ఏ.గా నెగ్గడం అంత తేలికకాదని పోయిన ఎలక్షన్సులో తేలిపోయింది గదయ్యా? నరహరి సమితి ప్రెసిడెంటుగా వుంటే నేను ఎం.ఎల్.ఏ.గా గెలుస్తాననే నమ్మకం ణాలు లేదు. అందుకే ఆయువుపట్టయిన ఆ స్థానంలో మనవాడు వుండాలి. ఆ స్థానం ఖాళీ కావాలన్నా, ఆ స్థానంలోకి మనవాడు రావాలన్నా, నరహరికి లిఫ్ట్ ఇవ్వకతప్పదు. తెలిసిందా? అదీకాక ఎం.ఎల్.సీ.ల కంటే మంత్రి పదవులు సంపాదించడానికి ఎం.ఎల్.ఏ.లకే ఎక్కువ అవకాశాలు వున్నాయి. ఎందుకంటే వీళ్ళు ప్రజలచేత నేరుగా ఎన్నుకోబడినవాళ్ళు. మంత్రి కావాలేగాని ఇలాంటి ముష్టి మూడు లక్షలు సంపాదించడానికి ఎన్ని రోజులు పడుతుంది?" అన్నాడు పరమేశం.
"మన పరమేశంగారు ఒక ప్లాను వేశారంటే, దానికి తిరుగుండదు. ముందు చూపుతోనే చేస్తారు ఏ పని చేసినా?" అంటూ మిసెస్ వైకుంఠం మురిపెంగా చూసింది పరమేశం ముఖంలోకి.
"అమ్మమ్మ! ఏం ఎత్తుగడలు! ఏం ప్లాను! ఎంత ముందు చూపు! బలే చెప్పారు సార్! నిజంగా మీచేత రాజకీయ కళాశాల పెట్టించాలి సార్!" పుణ్యశ్రీ తను ఊగిపోతూ, పరమేశాన్ని ఉబ్బేస్తూ అన్నాడు.
పరమేశం గంభీరంగా తలపంకించి మందహాసం చేశాడు.
"సార్! మరయితే యీ నెల చివరి వారంలోనే మరో ప్రత్యేక సంచిక వేస్తాను" చేతులు నలుపుకుంటూ అన్నాడు పుణ్యశ్రీ.
"మరేం పనిలేదూ? ఎన్ని ప్రత్యేక సంచికలు వేస్తావయ్యా?" అన్నాడు పరమేశం కొంచెం విసుగ్గా, చేతిలో వున్న ప్రత్యేక సంచికను టీ పాయ్ మీదకు విసిరేస్తూ.
"అదికాదు సార్...."
"ఏది కాదయ్యా?"
"అదేసార్! ఇది మీ ప్రత్యేక సంచిక! రాబోయేది నరహరిగారి ప్రత్యేక సంచిక సార్!" నీళ్లు నములుతూ అన్నాడు.
"వచ్చేవారంలో కూడా ప్రత్యేక సంచికే వేస్తున్నట్టు ఇందులో ప్రకటించినట్టున్నావ్?" అన్నది మిసెస్ వైకుంఠం టీ పాయ్ మీద వున్న "నీతి - నిజాయితీ" ప్రత్యేక సంచికను చేతిలోకి తీసుకుంటూ.
"అవునండీ! అది మహిళల ప్రత్యేక సంచిక."
"ఒకవైపు రచయిత్రుల్ని దుమ్మెత్తి పోస్తుంటావు. ఈ ఆడవాళ్లు అవాకులూ చవాకులూ రాస్తున్నారని నెత్తిన నోరు పెట్టుకొని రోజూ లబలబలాడ్తావు గదయ్యా?" అన్నది మిసెస్ వైకుంఠం.
"దానికదే దీనికిదే! ఇది మా వ్యాపారం! రచయిత్రుల రచనలంటే పాఠకులు పడిచస్తున్నారు. వాళ్ళకున్న డిమాండ్ రచయితలకు లేదు. నా పత్రిక సర్క్యులేషన్ పెరగాలంటే ఇలాంటివి తప్పవు మరి!" అన్నాడు పుణ్యశ్రీ.
"అటువంటప్పుడు నోరు మూసుకొని పడివుండాలి! అంతేగాని మారు పేరుతో వాళ్ళమీద అవాకులూ చవాకులూ వ్రాయడం ఎందుకు?" ఆవేశంగా అడిగింది మిసెస్ వైకుంఠం.
"రచయిత్రులు మరీ ఇమ్మెచ్యూర్ రచనలు చేస్తున్నారు. అవి చదువుతుంటే ఏడుపొస్తుంది. నిజ జీవితంలో వారి తీరని కోరికల్ని, రచనల ద్వారా తీర్చుకుంటూ ఆంధ్రదేశాన్ని పాడుచేస్తున్నారనేదే నా బాధ. అలాంటి రచనలను ఎన్ కరేజ్ చెయ్యకూడదు" అన్నాడు పుణ్యశ్రీ సోఫా అంచు మీదకు జరిగి ముందుకు వంగి కూర్చుని.
"నీ అసలు బాధ అదికాదని నాకు తెలుసులేవయ్యా. చాలాకాలం కిందట నువ్వు కొన్ని కథలు రాశావు. నీకు రావల్సినంత పేరు రాలేదు. అప్పుడు సంపాదించుకున్న కీర్తి ఇప్పటి జనరేషన్ వరకూ అందలేదు. అదే నీ బాధ, పేరు తెచ్చుకుంటున్న రచయిత్రులను చూసి మరీ బాధ. నీలో ఆ బాధే కసిగా మారింది" ఆగి పుణ్యశ్రీ ముఖంలోకి చూసింది.
పుణ్యశ్రీ ముఖం నల్లగా మాడి అసహ్యంగా కనిపించింది. తన మాటలు వృధాపోలేదని తెలుసుకున్న మిసెస్ వైకుంఠం మరీ దూకుడుగా మొదలుపెట్టింది.
"అంతమందిని దుమ్మెత్తి పోస్తున్నావుగదా! ఏదీ నువ్వొక్క నవలైనా చెప్పుకోదగిందీ, నాలుగు కాలాలపాటు నిలబడగలిగిందీ రాశావా? రాయగలిగావా? నువ్వేకాదు_ఈనాడు రాస్తున్న ఎంతమంది మగాళ్లు, అచ్చం ఆడవాళ్ళలా అంతకంటే అధ్వాన్నంగా రాయడంలేదూ? వాళ్ళను గురించి ఒక్క మాటా అనవేం? చాలామంది మగవాళ్ళ కంటే, చాలాబాగా రాసే రచయిత్రులు కూడా వున్నారు. వాళ్ళను పొగడాలంటే నీ కలం కదలదేం?" అంటూ పుణ్యశ్రీ ముఖంలోకి తీవ్రంగా చూసింది మిసెస్ వైకుంఠం.
"నా ఉద్దేశం అదికాదు మేడం....క్రిటిసిజం లేకపోతే సాహిత్యంలో చెత్త ఎక్కువయిపోతుందనీ...."
"క్రిటిసిజం....ఏదయ్యా క్రిటిసిజం? క్రిటిసిజం కన్ స్ట్రక్టివ్ గా వుండాలి. డిస్ట్రక్టివ్ క్రిటిసిజం సాహిత్యానికి మంచి కంటే ఎక్కువగా హానినే కలిగిస్తుంది. విమర్శకుడు సహృదయుడై వుండాలి. అసలు నీకెందుకు చెప్పు ఆ బాధ? ధాన్యం పండిస్తాం. అందులో తాలూ-తప్పా కూడా వుంటుంది. గాలి వాటుకు తాలూ-తప్పా ఎగిరిపోతుంది. ధాన్యం మిగులుతుంది. ఏవి మంచి రచనలో, ఏవి కావో కాలమే నిర్ణయిస్తుంది. మధ్యలో నీకెందుక్యా ఇంత కంఠశోష? ఇంత కసి?"