Previous Page Next Page 
రాబందులూ - రామచిలుకలు పేజి 19


    "హాట్ డ్రింక్, ఆర్ కూల్ డ్రింక్" సునంద పక్కనే కూర్చుంటూ అడిగింది రాణి.

 

    "నాకిప్పుడేమీ వద్దు."

 

    "డోన్ట్ బీ ఫప్సీ."

 

    అంతలోనే లక్ష్మి వచ్చి వాకిలిదగ్గర నిలబడింది.

 

    "లక్ష్మి! క్వీన్ ఫ్రిజ్ లోనుంచి రెండు గ్లాసులు ద్రాక్షపట్టుకురా!" అన్నది రాణి.

 

    "ఏదమ్మా ఆ పెద్ద సద్దిపెట్టెలోంచా!" అడిగింది లక్ష్మి.

 

    "నీ బొంద! సద్దిపెట్టేమిటే ఎన్నిసార్లు చెప్పినా.... రెండో ఫ్రిజ్ చిన్నది లేదూ....అందులో వున్నాయ్....కూల్ డ్రింక్స్."

 

    లక్ష్మి వెళ్ళగానే రాణి పకపక నవ్వింది.

 

    "ఇది వట్టి పల్లెటూరి మనిషి. ఎన్నిసార్లు చెప్పినా ఫ్రిజ్ అనడం రాదు. సద్దిపెట్టె అంటుంది" అన్నది సునందతో రాణి.

 

    "పాపం! పల్లెటూరివాళ్ళు! రాత్రి వండుకున్నది తెల్లవారికి దాచుకొని తింటారు" అన్నది సునంద.

 

    "అయితే నువ్వెప్పుడన్నా సద్దెన్నం తిన్నావా?" రాణి కుతూహలంగా అడిగింది.

 

    "ఓ! చిన్నప్పుడు రోజూ తినేదాన్ని! కాని మా యింట్లో ఈ సద్దిపెట్టె లేదోయ్ రాణీ!" అన్నది సునంద నవ్వుతూ.

 

    లక్ష్మి, కూల్ డ్రింక్స్ తెచ్చి టీపాయ్ మీదపెట్టి వెళ్ళింది.

 

    "కమాన్ హావ్ ఇట్" అంటూ రాణి కూల్ డ్రింక్ స్విప్ చేస్తూ స్టీల్ బీరువా తెరిచింది. హంగర్స్ కు తగిలించివున్న చీరలు ఒక్కొక్కటే తీసి బెడ్ మీద వెయ్యసాగింది.

 

    సునంద మౌనంగా కూల్ డ్రింక్ సిప్ చేస్తూ, చేస్తూ కూర్చుంది.

 

    రాణి తన నగలపెట్టెలు తెరిచి ఒక్కొక్కటే సునంద ముందు వుంచింది. పాతకాలపు పట్టెడనుంచి లేటెస్టు డైమండ్ నెక్ లెస్ వరకు వున్నాయి. సునంద రాణి గదంతా కలయజూసింది. డ్రెసింగ్ టేబుల్ మీద అనేకరకాల ఫారెన్ పౌడర్లూ, క్రీములూ, సెంట్లూ వున్నాయి. షెల్ఫ్ లో రకరకాల షేడ్స్ లో కూటెక్సులూ, లిప్ స్టిక్కులూ వున్నాయి. 

 

    "ఈ రోజు క్లబ్బు ఫంక్షన్ వుంది. ఏ చీర కట్టుకోమంటావో చెప్పు సునందా?" అన్నది రాణి.

 

    సునంద అన్ని చీరల్నీ చూసింది. సింపుల్ గా వున్న ఓ గద్వాల చీర చూపించింది. "ఈ కలరూ, అంచూ బాగున్నాయి" అన్నది.

 

    "వాట్? ఈ శారీయా? నీది చాలా పూర్ టేస్టు సునందా!" అన్నది.

 

    "టేస్టుకు కూడా పూర్, రిచ్ తేడాలుంటాయా? గుడ్ అండ్ బాడ్ లు ఉండొచ్చు. అయినా ఎవరి టేస్ట్స్ వారివి" అన్నది సునంద.

 

    "మరి నీకు నచ్చనిచీర ఎందుకు కొన్నావ్?" మళ్లీ సునందే అడిగింది.

 

    "అది నేను కొన్నది కాదు. ఎవరో ప్రెజెంట్ చేశారు. ఎక్స్ క్యూజ్ మీ సునందా, నేను ఫైవ్ మినిట్స్ లో వచ్చేస్తాను. ఇవి చూస్తూ వుండు" అంటూ సునంద ముందు ఫెమీనా, స్టార్ డస్టు, ఫిలింఫేర్, ఇలస్ట్రేటెడ్ వీక్లీ పడేసి, టవల్ భుజానవేసుకొని రాణీ బాత్ రూంలోకి వెళ్ళింది.

 

    సునంద వీక్లీ తిరగేస్తూ ఆలోచనలో పడింది.

 

    రాణి తనను ఇంటికి ఎందుకు ఆహ్వానించినట్టు? తన ఐశ్వర్యాన్నీ ఆడంబరాన్నీ చూపించి తను మామూలు ఆడపిల్లను కానని చాటుకోడానికా? తన అంతస్థూ, కల్చరూ పై తరగతికి చెందినవని నిరూపించుకోవడానికా? సంస్కారానికీ, నాగరికతకూ భేదం తెలియని పిచ్చిపిల్ల. అజ్ఞానం అందించిన అహంకారం ఆమెలో అణువణువునా తొంగి చూస్తూంది. ఇదంతా తన ముందు పనికట్టుకొని ప్రత్యేకంగా ప్రదర్శించాల్సిన అవసరం ఏమిటో? "ఏమిటలాగే కూర్చున్నావ్? టైం అయిపోతుంటేను! లే! లే!"

 

    సునంద వీపుమీద అతని చెయ్యి పడింది. సునంద వంగి చదువుతున్న వీక్లీ ఒక్కసారిగా వదిలేసి, చివాలునలేచి నిల్చుంది. తిరిగి చూసింది.

 

    సోఫా వెనక నిలబడివున్న శేఖరం నివ్వెరపోయాడు. అతని ముఖం వెల వెల పోయింది.

 

    సునంద అతనికేసి తీక్షణంగా చూసి దూరంగా జరిగి నిలబడింది.

 

    శేఖరం తలవంచుకొని సోఫా అంచు గోటితో గీరుతూ "శారీ! మా రాణీ అనుకున్నాను!" గొంతు పెకలించుకొని అన్నాడు.

 

    ఆమె నుంచి సమాధానం రాకపోయే సరికి తలెత్తి చూశాడు.

 

    అంతవరకూ అతన్నే దీక్షగా చూస్తున్న చూపులు కిందకు వాలిపోయాయి.

 

    "క్షమించాలి. రాణీ గదిలో మీరున్నట్టు నాకు తెలియదు, తొందరపడ్డాను. పొరపాటు జరిగిపోయింది" నొచ్చుకుంటూ అన్నాడు శేఖరం.

 

    "ఇప్పుడు జరిగిపోయిన ప్రమాదం ఏమీ లేదులెండి క్షమించటానికి" సునంద సూటిగా, నిర్మలంగా అన్నది.

 

    "థ్యాంక్యూ!"

 

    "అయితే ఓ చిన్న సందేహం. మీకు కొంచెం తొందరపాటు వున్నట్టుంది. అవునా?" అన్నది సునంద శేఖరం ముఖంలోకి చూస్తూ.

 

    "అంతేకాదు కొంచెం ఉద్రేకం కూడా వుంది" నవ్వుతూ సమాధానం ఇచ్చాడు శేఖరం.

 

    "అది అంత మంచిది కాదేమో!" సునంద పెదవుల మీద ఓ క్షణకాలంపాటు హాసరేఖలు కదిలి అదృశ్యమైనాయి.

 

    టవల్ చుట్టుకొని బాత్ రూంలోనుంచి వచ్చిన రాణి శేఖరాన్ని చూసి చిలిపిగా కేకపెట్టి, మళ్లీ బాత్ రూంలోకి పరుగుతీసింది.

 

    శేఖరం నవ్వుతూ "అదికూడా తొందరపాటే కదండీ?" అని సునంద ముఖంలోకి చూశాడు.

 

    "ముందు మీరు బయటికి వెళ్ళండి."

 

    "మీరు నన్ను క్షమించినట్టేగదా?"

 

    "ప్లీజ్ డూ గో అవుట్!"

 

    "థాంక్యూ థాంక్యూ" అంటూ శేఖరం గదినుంచి బయటికి వెళ్ళాడు.  

 

    "రాణీ! నువ్వు రావచ్చు!" సునంద బాత్ రూం తలుపు తడుతూ పిల్చింది.

 

    "వాట్ ఏ సిల్లీబాయ్" అంటూ రాణి బాత్ రూంలోనుంచి బయటికి వచ్చింది.

 

    "సునందా వై డోంట్ యూ హావ్ ఏ చేంజ్?" రాణి చీరకట్టుకుంటూ అన్నది.

 

    "నేనెందుకు చీర మార్చుకోవడం?"

 

    "నువ్వుకూడా మాతో క్లబ్బుకు రావాలి" అన్నది రాణి.

 

    "ఏం ఈ చీరతో క్లబ్బుకువస్తే, లోపలికి రానివ్వరా?" అన్నది సునంద.

 

    "ఆహాఁ అదికాదు. నీట్ గా డ్రెస్ అయితే బాగుంటుందని. నీ ఇష్టం వచ్చిన చీరకట్టుకో. ఆ గద్వాల్ చీర నీకు నచ్చిందిగా. అదే కట్టుకో. ఈ నెక్ లెస్ పెట్టుకో. ఇది నీకు చాలా బాగుంటుంది" అన్నది రాణి నెక్ లెస్ వున్న పెట్టె సునందకు అందిస్తూ. సునంద అందుకోలేదు.

 

    "థాంక్స్. నాకివేమీ వద్దు ఇప్పుడు. నేను త్వరగా హాస్టల్ కు వెళ్ళాలి" అన్నది సునంద నిర్లిప్తంగా.

 

    "క్లబ్బుకు రావడంలేదా?"

 

    "లేదు."

 

    "ఇప్పుడే హాస్టల్ కు వెళ్ళి ఏంచేస్తావ్? ఎప్పుడూ ఆ గదిలోనే వుంటావ్, ఎలా తోస్తుంది బాబూ! ఈ ఒక్కరోజు నాతో రా క్లబ్బుకు" అన్నది రాణి.

 

    "సారీ! రాలేను రాణీ!"

 

    రాణి ముస్తాబయి సునందతో బయటికి వచ్చింది. గదిముందు చిరాకుపడుతూ వేచివున్న శేఖరం, కళ్ళు చెదిరిపోయేలా అలంకరించుకున్న రాణీని "ఏమిటి నీ వేషం నువ్వూనూ?" అన్నట్టు చూశాడు. వెంటనే అతని కళ్ళు సునందవైపు తిరిగాయి. క్షణం చూసి కళ్ళు మరల్చుకున్నాడు.

 

    "నీ కసలు టైంసెన్సులేదు. గంటసేపట్నుంచి డ్రెస్ చేసుకుంటున్నావ్. ఇప్పుడు టైం ఎంతయిండో చూశావా? ఫంక్షన్ బిగిన్ అయే వుంటుంది" అన్నాడు శేఖరం చిరాకుపడుతూ.

 

    "ఫంక్షన్ ప్రారంభిస్తే ఇప్పుడు మునిగిపోయిందేమీ లేదులే. నువ్వేమన్నా ప్రారంభోత్సవం చెయ్యాలా ఏమన్నానా?" అన్నది రాణి విసురుగా.

 

    "సరేలే! ఇక నడువ్! ఆఁ మీ ఫ్రెండ్ ను పరిచయం చెయ్యలేదేం?" అన్నాడు స్కేహారం సునందకేసి చూస్తూ.

 

    " ఆ అవసరం లేదనుకున్నానే!" కొంటెగా అన్నది రాణి.

 

    "అంటే?" శేఖరం నొసలు ముడిచాడు.

 

    "ఆఁ హా! మీ ఇద్దరూ ఇంతకుముందే పరిచయం చేసుకున్నారనుకున్నానే?"

 

    "ఇంతకుముందా? ఎప్పుడు?" తడబడుతూ అన్నాడు శేఖరం.

 

    శేఖరం తడబాటు చూస్తుంటే సునందకు నవ్వొచ్చింది. పెదవులు బిగబట్టి నవ్వు ఆపుకుంది.

 

    "నేను బాత్ రూంలో వున్నప్పుడు" శేఖరం ప్రశ్నకు ఠపీమని జవాబిచ్చింది రాణి.

 

    ఇహ వాళ్ళ సంభాషణ అలా పెరగటం ఇష్టంలేని సునంద "నాపేరు సునంద. రాణి క్లాస్ మేటును" అన్నది.

 

    "నాపేరు...." శేఖరం మాటకు అడ్డొచ్చి మాబావ శేఖరం. పోష్టు గ్రాడ్యుయేట్. కావడానికి లిటరేచర్ పోస్టుగ్రాడ్యుయేటే, అయినా అప్పుడప్పుడూ పల్లెటూరికెళ్ళి అగ్రికల్చర్ చేస్తూ వుంటాడు" గబా గబా చెప్పింది రాణి.

 

    "మీ బావ వ్యవసాయం చేస్తాడా? చేయిస్తాడా? రాణీ?" అడిగింది సునంద నవ్వుతూ.

 

    శేఖరం సునంద ముఖంలోకి చూశాడు.

 

    సునంద కళ్ళు మరల్చుకుంది చురుగ్గావున్న అతని చూపుల్ని ఎదుర్కోలేక.

 Previous Page Next Page