Previous Page Next Page 
బొమ్మరిల్లు పేజి 19


    గౌతమ్ హనుమంతరావు ముఖంలోకి పిచ్చి చూపులు చూస్తూ ఉండిపోయాడు.


    "కారు సిద్ధంగా ఉంది. పద! నిన్ను మా స్నేహితుడి ఇంట్లో డ్రాప్ చేసి వస్తాను. కేసు తేలేంతవరకూ అక్కడే ఉండవచ్చును. అతను చాలా మంచివాడు. అతని వల్ల మనకు ఏ అపాయం ఉండదు"


    గౌతమ్ కు హనుమంతరావు ఏ భాషలో మాట్లాడుతున్నాడో బోధపడటం లేదు.


    "ఏమిటోయ్ అంత రహస్యాలు మాట్లాడుతున్నారు. నేను వినకూడదా?" అంటూ వేణు వచ్చాడు.


    అసలే గాభరాలో ఉన్న హనుమంతరావుకు వేణు ప్రవర్తన నచ్చలేదు.


    "అవును! రహస్యాలు. కాసేపు నువ్వు నీ కుర్చీలోనే ఉండు నేను వస్తాను"


    హనుమంతరావు మాటతో వేణు ముఖం మాడిపోయింది. చరచరా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. తన కుర్చీ దగ్గరకు వెళ్ళలేదు. బయటికి వెళ్ళిపోయాడు.


    "వీడొక్కడు మధ్యలో! మేనర్స్ కూడా తెలియదు" విసుక్కున్నాడు హనుమంతరావు.


    "బయలుదేరు"


    "సుధారాణి ఆత్మహత్యా ప్రయత్నం చేసిందా? అయితే నాకోసం పోలీసులు గాలించడం ఏమిటి?" పూర్తి షాక్ నుంచి కోలుకోకుండానే ప్రశ్నించాడు.


    "ఆమె దిండు కింద ఏదో ఉత్తరం ఉన్నదట. తను ఆత్మహత్య చేసుకోవడానికి కారణం నువ్వేనని రాసిందట"


    "నేనా?" పిచ్చివాడిలా ప్రశ్నించాడు.


    "అవునో కాదో ఆలోచించే సమయం లేదు. ఆవిడ అలా రాసి పెట్టింది. ఇంకా ఏమేమి రాసిందో వివరాలు తెలియవు"


    గౌతమ్ గిర్రున వెనక్కు తిరిగాడు.


    "ఎక్కడికి?" చెయ్యి పట్టుకొని ప్రశ్నించాడు హనుమంతరావు.


    "హాస్టల్ కు"


    "నీకు మతి పోయిందా?"


    "ఇంకా పూర్తిగా పోలేదు"


    "అక్కడ నీ కోసం పోలీసు వాళ్ళు ఎదురు చూస్తున్నారు"


    "చూడనియ్! నేను తప్పు చేస్తేగా భయపడి దాక్కోవడానికి!"


    "నా మాట విను"


    "నేను దాక్కున్నానే అనుకో, నేను నిజంగానే అపరాధిని అని అందరూ భావిస్తారు. అందుకే అన్యాయాన్ని ఎదుర్కోవడానికి వెళ్తున్నాను" మరో మాటకు అవకాశం ఇవ్వకుండా గౌతమ్ చరచరా బయటికి వెళ్ళిపోయాడు.


                                                                   * * *


    గౌతమ్ ను అరెస్టు చేశారు. ఆ రాత్రి రిమాండ్ లో ఉన్నాడు.


    రెండోరోజు ఉదయం హనుమంతరావు జామీన్ ఇచ్చి విడిపించాడు.


    కాలేజీలో ప్రతివాళ్ళ నోటా ఇదే విషయం.


    ఎక్కువమంది గౌతమ్ నిరపరాధి అని నమ్మారు.


    కొందరు మాత్రం అతన్ని అపరాధిని చూసినట్టే చూశారు.


    గౌతమ్ ఏ అభిప్రాయానికి విలువ ఇవ్వలేదు. ఏమీ జరగనట్టే తిరుగుతున్నాడు.


    మూడో రోజు రాత్రికి సుధకు స్పృహ వచ్చింది. అపాయం నుంచి బయటపడిందని చెప్పారు డాక్టర్లు.


    సుధ ఉత్తరంలో గౌతమ్ తనను ప్రేమించినట్టు కల్లబొల్లి కబుర్లు చెప్పి మోసం చేశాడనీ, తనకు మూడో నెల అనీ, ప్రపంచానికి ముఖం చూపించలేక ఆత్మహత్య చేసుకుంటున్నాననీ రాసింది.


    డాక్టర్ పరీక్షలో ఆమె గర్భవతి కాదని తేలింది.


    గౌతమ్ మీద కేసు కొట్టేశారు.


    సుధ సిగ్గుతో కాలేజీకి రావడం మానేసింది.


    కేసు కొట్టేసిన రాత్రి గౌతమ్ బుర్ర ఆలోచించడం ప్రారంభించింది. అంతవరకూ తను నిరపరాధినని నిరూపించుకోవడానికి పడే మానసిక సంఘర్షణతోనే గడిచిపోయింది.


    సుధ బ్రతికింది.


    ఒకవేళ చచ్చిపోయి వుంటే?


    తనను ఉరికంబం ఎక్కించేవారా?


    సుధ తనను అంతగా ప్రేమిస్తోందా? చివరకు ప్రాణాలను తీసుకోవడానికి కూడా వెనకాడ లేదు.


    దీన్ని ప్రేమ అనాలా? ప్రేమించే వ్యక్తి చివరి ఘడియల్లో ప్రియుడి మీద ప్రతీకారాన్ని కోరుతుందా?


    ఉంటారు కసితీర్చుకునే ఆడవాళ్ళు ఉంటారు. చిత్రాంగి పాత్ర సృష్టి, ఇలాంటి వారిని దృష్టిలో పెట్టుకొనే జరిగి ఉండాలి. అది నిజమో కాదో! కాని అలాంటివాళ్ళు మాత్రం ఈనాటికి ఉన్నారు.


    నిజమైన ప్రేమ బలికోరదు.


    సుధ ఏనాడూ తనను ప్రేమిస్తున్నట్టు ప్రవర్తించలేదు. సుధకు మగపిల్లల్ని చుట్టూ తిప్పుకోవడం, ఆకర్షించడం, ఆ తర్వాత తిరస్కరించడం హాబీ! ఫ్లర్టింబ్ టైప్ అని తనకు తెలుసు.


    తనూ రేణుకా కలసి తిరుగుతున్నప్పటినుంచీ ఆమెలో ఈర్ష్య బయలుదేరింది. ఆ ఈర్ష్య ద్వేషంగా మారింది. ఈర్ష్య ద్వేషాలు మనిషిని అశాంతి పాలు చేస్తాయి. సాలె పురుగు తన చుట్టూ తనే గూడు అల్లుకుంటుంది. అందులో ఊపిరి సలపక, ఎంతో శ్రమపడి ఆగూడు చీల్చుకొని బయటికి వస్తుంది. ఈర్ష్యాద్వేషాలు కూడా మనిషిని సాలెగూడు లాంటి విష వలయంలోకి నెట్టేస్తాయి. ఈర్ష్యాద్వేషాలు ఉన్న వ్యక్తి తన గోళ్ళతో తన శరీరాన్నే గాయపర్చుకుంటాడు. ఆ సంగతి అతనికి అర్థం కాదు. ఎవరో గాయపర్చారని భ్రమపడి ప్రతీకారం తీర్చుకోవటానికి ప్రయత్నిస్తాడు.


    ఇంత అన్యాయమా? చావబోతూ కూడా కసి తీర్చుకోవడమా? చివరి క్షణాల్లో ఒక నిరపరాధిని ఉరికంబానికి ఎక్కించే ప్రయత్నమా? హారిబుల్.


    ఆలోచిస్తున్న గౌతమ్ కళ్ళముందు సుధ రూపం మెదిలింది.


    ఆ సున్నితమైన శరీరంలో ఇంత క్రూరత్వం దాగి ఉందా?


    అంతలోకే సుధ మీద జాలి కలిగింది.


    పిచ్చిపిల్ల!


    సుధకు ఏం తక్కువైంది?


    కష్టం అంటే ఏదో తెలియని జీవితం.


    రేణుకకు ఈ విషయం తెలిస్తే?


    తండ్రిపోయిన బాధతో ఉన్నది. ఆమె ఇక్కడ లేకపోవడం మంచిదే అయింది. రేణుక వచ్చేసరికి తను నిరపరాధిగా రుజువు అయిపోయింది.


    లేకపోతే!

 Previous Page Next Page