Previous Page Next Page 
మరీచిక పేజి 19


    "అందరూ చూస్తే సరిపోతుందా? నేను నిన్ను భర్తగా చూడొద్దూ?"

 

    శేఖరం ముఖం నల్లగా మాడిపోయింది. ఆ ముఖం చూస్తుంటే జాలి వేసింది జ్యోతికి. వచ్చీ రాగానే బాధపెట్టటం అంత మంచిది కాదేమో ననిపించింది.

 

    "జ్యోతీ! నేనంటే నీకు నిజంగా ఇష్టం లేదా?"

 

    "ఆ మాట నేను అనలేదే?"

 

    "మరి?"

 

    "పెళ్ళికి ఇంత తొందరేమొచ్చింది బావా? ఇంకా రెండు నెలల్లో నేను ఫైనల్స్ రాయాలి."

 

    "అతి కష్టంమీద పదిహేను రోజులు లీవు దొరికింది. పది రోజుల్లో తిరిగి వెళ్ళిపోవాలి. మళ్ళీ రెండేళ్ళదాకా నేను రాలేకపోవచ్చును. అందుకే ఇంత తొందర పెట్టాల్సి వచ్చింది. మధ్యాహ్నం మామయ్య సిద్ధాంతిగార్ని పిలిపించారు. వచ్చే శుక్రవారం ముహూర్తం వున్నదట!"

 

    జ్యోతి పక పక నవ్వింది.

 

    "అమెరికా వెళ్ళినా నీకు ఈ ముహూర్తాల పిచ్చి వదల్లేదన్నమాట!"

 

    "నాకోసం కాదు. పెద్దవాళ్ళ సంతృప్తి కోసం..." నీళ్ళు నమిలాడు.

 

    "కొయ్యకు!"

 

    శేఖరం చిన్నబుచ్చుకున్నాడు.

 

    "పూర్తిగా వచ్చేస్తున్నావనుకున్నాను. మళ్ళీ వెడతావనుకోలేదు బావా!"

 

    "పూర్తిగా వచ్చెయ్యడమా? ఈ దేశమా?

 

    "ఏం? అంత ఏవగింపుగా వుందా ఈ దేశం అంటే? ఈ దేశంలో పుట్టావు. ఈ గడ్డమీదే ఇంతవాడివయ్యావ్! అమెరికాలో రెండేళ్ళున్నావో లేదో ఈ దేశంమీద రోత పుట్టిందా?"

 

    "నువ్వూ వస్తావుగా? రెండేళ్ళు అక్కరలేదు. ఆరు నెలల్లోనే అమ్మాయిగారి దేశభక్తి బయట పడుతుందిలే!"

 

    "నేనెందుకు అమెరికా వెళ్తాను?"

 

    "నేను అక్కడ వుంటే రాకేం చేస్తావ్?"

 

    ఆ దేశం అంత బాగుంటుందా బావా?" మాట మారుస్తూ అడిగింది.

 

    శేఖరం అమెరికన్ లైఫ్ ను వర్ణించసాగాడు.

 

    "అమెరికాలో మనవాళ్ళు ఎలా జీవిస్తున్నారో నాకు తెలుసు. కానీ నువ్వు మళ్ళీ వెళ్ళకు!"

 

    "వెళ్ళక ఇక్కడేం చెయ్యమంటావ్?"

 

    "ఇక్కడ చెయ్యడానికి ఏమీ లేదా? నువ్వు చెయ్యాలనుకోవాలేగాని ఎంతో చెయ్యవచ్చు. నువ్వు ముందు అక్కడికి వెళ్ళటం మానెయ్! ఆ తర్వాత నువ్వు ఏం చెయ్యాలో నేను చెబుతాను."

 

    "నువ్వేమీ మారలేదు జ్యోతీ!"

 

    "మారాను. చాలా చాలా మారాను!"

 

    శేఖరం జ్యోతిని తేరిపార చూశాడు.

 

    "ఈ వేషం ఏమిటి?"

 

    "ఏం?"

 

    "అంత చౌకబారు చీర కట్టుకున్నావేం?"

 

    "ఈ దేశంలో నూటికి డెబ్బైఐదుమందికి ఈ మాత్రం చీరలు దొరికితే చాలు!"

 

    "అమ్మాయిగారి దేశభక్తి ముదిరిపోయినట్టే వుంది!" వ్యంగ్యంగా అన్నాడు శేఖరం. జ్యోతి అక్కడనుంచి విసురుగా వెళ్ళిపోయింది.

 

    "నాన్నా! ముహూర్తాలు పెట్టించావా?" తండ్రి గదిలో ప్రవేశిస్తూ ప్రశ్నించింది.

 

    "అవును తల్లీ! వాళ్ళు తొందరపడ్తున్నారు. శేఖరంకు సెలవు లేదట!"

 

    "నాన్నా! ముహూర్తాలు పెట్టించే ముందు మాట మాత్రంగానైనా అడగటం అవసరం అన్పించలేదా?"

 

    రమణమూర్తి చివ్వున తలెత్తి కూతురి ముఖంలోకి లోతుగా చూశాడు. "అదేమిటమ్మా! ఇది కొత్త సంబంధం కాదు. బావ వస్తున్నట్టు నీకూ తెలుసు!"

 

    "నేను ఈ పెళ్ళి చేసుకోను!"

 

    తండ్రి కూతురి ముఖంలోకి చూస్తూ వుండిపోయాడు.

 

    "నీకు బావంటే ఇష్టంలేదూ?"

 

    "నేను ఆ విషయం గురించి ఆలోచించలేదు."

 

    "బావకేం తక్కువమ్మా! అందమైనవాడు. చదువుకున్నవాడు. పైగా అమెరికాలో వుంటున్నాడు. హోదాకు తక్కువా- అంతస్థుకు..."

 

    "నేను చేసుకునేవాడికి ఇవేమీ వుండనక్కర్లేదు."

 

    "అంటే?"

 

    "నా భావాలను గౌరవించి నన్ను అర్థం చేసుకోగల వ్యక్తినే చేసుకుంటాను. కానీ ఇప్పట్లో పెళ్ళి చేసుకోదల్చుకోలేదు."

 

    "చెల్లెలికి పెళ్ళి చెయ్యాలి. దానికి చదువుమీద శ్రద్ధలేదు."

 

    "చెల్లెలికి చెయ్యి నాన్నా!"

 

    "పెద్ద పిల్లకు చెయ్యకుండా... ఎవర్నయినా ప్రేమిస్తున్నావా?"

 

    "అలాంటిది ఏమీలేదు నాన్నా! ఉంటే నీవు అడక్కుండానే చెప్పేదాన్ని. నా అభిప్రాయాల్ని నువ్వు గౌరవిస్తావని నాకు తెలుసు."

 

    "ఏమోనమ్మా నాకేం అర్థం కావటం లేదు. రేపు అత్తయ్యా మామయ్యా వస్తున్నారు." దిగులుగా తనకు తనే చెప్పుకుంటున్నట్టుగా అన్నాడు రమణమూర్తి. జ్యోతి తనగదిలోకి వెళ్ళిపోయింది.


                                    12


    ఉదయం ఎనిమిది గంటలయినా జ్యోతి లేచి బయటికి రాలేదు. తల్లి జ్యోతిని లేపడానికి దగ్గరగా వేసివున్న తలుపులు తోసింది. ఖాళీ మంచం రాఘవయ్య ముఖంలోకి బోసిగా చూసింది. ఇంత పొద్దుటే ఎక్కడికి వెళ్ళింది!

 

    "అమ్మాయి ఇంత పొద్దుటే ఎక్కడికి వెళ్లిందండీ?" అంటూనే వంటింట్లోకి వెళ్ళిపోయింది రాఘవమ్మ.

 

    రమణమూర్తి జ్యోతి గదిలోకి వెళ్ళాడు. ఏదో అజ్ఞాత భయం అతని మనసును చుట్టివేసింది. జ్యోతి పుస్తకాలు ఉన్న టేబుల్ దగ్గరకు వెళ్ళాడు. "రక్తాక్షరాలు" అనే పుస్తకం మీద కన్పించేలా పెట్టి వున్న కాగితపు మడతను వణుకుతూనే చేతిలోకి తీసుకున్నాడు. మడత విప్పాడు. చేష్టలుడిగి నిలిచిపోయాడు కొద్ది క్షణాలపాటు.

 

    ఉత్తరం చదవసాగాడు.

 

    "నాన్నా!నన్ను క్షమించు! నా ప్రవర్తన నీకు బాధ కలిగిస్తుందని నాకు తెలుసు! ఎప్పుడో ఒకనాడు ఈ పని చెయ్యడానికే నిశ్చయించుకున్నాను. మీకు చెప్పి వెళ్ళాలనే సంకల్పంతోనే వున్నాను. కాని ఎలా చెప్పాలో తెలియక ఇంతకాలం చెప్పలేదు. మీరు ముహూర్తాలు కూడా పెట్టించారు. ఇవ్వాళ అత్తయ్యవాళ్ళు వస్తారు. చాలా పెద్ద గొడవ అవుతుంది. అందుకే నువ్వు నా ఉద్దేశ్యాలను గౌరవిస్తావనీ, నా మార్గానికి అడ్డురావని తెలిసినా నీకు చెప్పకుండానే వెళ్ళిపోతున్నాను. నన్ను చదివించావు. నాకు ఏది కావాలన్నా, నేను ఏం చేయాలన్నా, నీకు ఇష్టం వున్నా లేకపోయినా అంగీకరించి నా వ్యక్తిత్వానికి గౌరవం ఇచ్చావు. ఇలా ఎంతమంది తండ్రులు చేస్తున్నారు?

 

    అయినా నా నిర్ణయాన్ని ధైర్యంగా మీతో చెప్పలేక సతమతం అయ్యాను. నామీద వున్న మమకారంతో నా మార్గానికి అడ్డు నిలుస్తారేమోననే భయం. ఇలా దొంగ చాటుగా వెళ్ళటం నాకు బాధగానే వున్నది.

 

    ఈ వ్యవస్థ అంటే నాకు అసహ్యం! సంపద సృష్టించిన ఈ అంతస్థులు అంతరాలు అంటే నాకు కసి! దారిద్ర్యం, దోపిడీ, పీడనలతో నిండివున్న ఈ వ్యవస్థకు నేను విరోధిని. ఈ నికృష్ట సమాజాన్ని పరిశుద్ధం చెయ్యాలన్నా, మానవుణ్ణి ఈ దుర్భర పరిస్థితుల్నుంచి రక్షించాలన్నా, నాకు ఒకే మార్గం కన్పిస్తున్నది. మానవత్వాన్ని ప్రేమించే ఎందరో ఆ మార్గాన్ని అనుసరించారు. ఈ వ్యవస్థలోని దుర్మార్గాన్నీ, పాశవికతనూ, నైచ్యాన్నీ ఎదిరించిన అనేకమంది తన ప్రాణాలను అర్పించారు.

 

    మరో ప్రపంచ సృష్టి జరుగుతున్న మహాయజ్ఞంలో ఒక సమిధను కావడానికే వెళుతున్నాను విప్లవం ఒక ప్రవాహం లాంటిది. అప్పుడప్పుడు ఆ ప్రవాహం వేగం తగ్గినట్టు కన్పించవచ్చు! కాని ఆ ప్రవాహం ఆగదు. అది నిరంతరం గమ్యం చేరేవరకూ సాగిపోతూనే వుంటుంది. ఏ విప్లవకారుడూ ఇల్లు విడిచిపోతూ చెప్పి పోతాడని నేను అనుకోను అయినా నేను నీకు చెప్పాలనే అనుకున్నాను.

 Previous Page Next Page