తను వెళ్ళిపోయాక కూడా అలవాటుగా తాతగారు 'డాక్టరమ్మా' అంటూ, అమ్మ 'కాళిందీ, అంటూ, నాన్న 'చిన్న నాన్నా...అంటూ పిలుస్తూనే ఉంటారు!
అలాంటి అక్క సందీప్ తో తిరగడం తప్పు అని చెప్పిన తర్వాత మానేయాల్సిందే కదా!
* * *
రెండు రోజులు సందీప్ ని తప్పించుకుని తిరిగాను.
ఎలక్షన్స్ అయ్యాయి. సందీప్ బ్రహ్మాండమైన మెజారిటీతో నెగ్గాడు. అతని హడావుడికి అంతేలేదు!
గ్రౌండ్ లో బుక్కాలు చల్లుకుని సెలబ్రేట్ చేసుకున్నారు.
మా క్లాస్ దగ్గరకొచ్చి నా ముఖం నిండా రంగు పూసి అమాంతం పైకెత్తి గిరగిరా తిప్పాడు. నేను కూడా సంతోషంగా అతని మీద రంగుజల్లాను.
"కమాన్ బేబీ..." అంటూ నన్ను తనతోబాటు తీసుకుపోతుంటే కాదనలేకపోయాను.
చిన్నక్క చెప్పింది తాత్కాలికంగా మరిచిపోయాను. అతని ప్రక్కన ఉండడం పట్టాభిషేకం అంత గొప్పగా మురిసిపోయాను. ఆ రోజు మొదటిసారిగా సందీప్ ఇంటికి వెళ్ళాను. ఆ ఇంట్లో కుక్కలా ఖర్చుపాటి ఉండదు మా నాన్న నెలసరి ఆదాయం అనిపించింది.
వాళ్ళ అమ్మా, నాన్న యాడ్స్ లో చూపించే వాళ్ళలా షోగ్గా ఉన్నారు. వాళ్ళ తాతగారూ, బామ్మగారూ కూడా మా అమ్మ నాన్నకంటే యంగ్ గా కనిపిస్తున్నారు. ఆ అలంకరణా, పోషణావల్ల అనుకుంట.
మా అందరికీ ఐస్ క్రీమ్స్, స్నాక్స్ యిచ్చారు. సందీప్ తో నేను కాకుండా చాలామంది అమ్మాయిలొచ్చారు.
వాళ్ళంతా అతన్ని తాకుతూ చేతులు పట్టుకుని లాగుతూ మాట్లాడుతున్నారు. వాళ్ళ అమ్మా నాన్నా కూడా చాలా మందితో ఇలాగే క్లోజ్ గా బిహేవ్ చేస్తున్నారు. అక్కడ వాతావరణం వేరుగా ఉంది.
సందీప్ తండ్రికీ, తండ్రి స్నేహితులకీ డ్రింక్ సర్వ్ చేస్తున్నాడు. ఆ తేనె రంగు ద్రవాన్ని నేను కళ్ళు విప్పార్చుకుని చూస్తున్నాను.
సందీప్ కూడా గ్లాసు చేతిలోకి తీసుకుని తండ్రి గ్లాసుకి తాకించి 'ఛీర్స్' చెప్పాడు.
ఒక్కసారిగా నేను ఉలిక్కిపడ్డాను! అక్కడ వాతావరణానికీ మా ఇంట్లో వాతావరణానికీ తాజ్ మహల్ కీ తులసికోటకీ ఉన్నంత తేడా ఉంది!
నేను కాసేపటికి ఆ ఆరిస్ట్రోక్రెసీకి ఊపిరి అందక ఉక్కిరిబిక్కిరి అయ్యాను.
సందీప్ మ్యూజిక్ కి అనుగుణంగా బీనాతో స్టెప్స్ వేస్తున్నాడు. అడుగులు కదుపుతూనే ఆమెని తమకంగా తనకేసి అదుముకుంటున్నాడు. ఆ కళ్ళల్లో అదే కామం...నన్ను కారులో ముద్దుపెట్టుకున్నప్పటి కోరిక!
నాకు ఐస్ క్రీమ్ చేదుగా అనిపించింది. నేను వేసుకున్న నూట యాభై రూపాయల చుడీదార్, కాలికి తొడుక్కున్న రబ్బర్ స్లిప్పర్స్ అన్నీ నా స్థానం ఏవిటో తెలియజెప్పినట్లనిపించాయి. ఇంటికి వెళ్ళిపోవాలని బలంగా అనిపించింది. సందీప్ తో చెప్దామంటే అతను బిజీగా ఇంకో అమ్మాయితో డాన్స్ చేస్తున్నాడు. కాసేపు చూసి ఇంక ఓర్చుకోలేక బయటపడ్డాను.
అది చాలా గొప్పవాళ్ళుండే లొకాలిటీ, గేట్ దాకా నడిచేసరికి చాలా నీరసం వచ్చింది.
బస్ కోసం ఎదురుచూస్తూ బస్టాప్ లో నిలబడ్డాను. చిన్నక్క ఇంటి దగ్గర నాకోసం ఎదురుచూస్తుంటుందన్న విషయం అప్పుడు గుర్తొచ్చింది.
నా కళ్ళల్లో నీటిపొర అలుముకుంది. అక్కకి ఇచ్చిన మాట ఒక్కపూట కూడా నిలబెట్టుకోలేకపోయాను.
నాన్నగారి చేత సిగరెట్టు మానిపించడానికి పంతంగా తను కాఫీ మానేసి రెండు సంవత్సరాలుంది చిన్నక్క.
ఇంతలో రివ్వుమంటూ ఓ స్కూటరొచ్చి నా ఎదురుగా ఆగింది.
"హాయ్ ముక్తా ఎక్కు" అన్నాడు ప్రతాప్.
నేను ఆలోచించకుండా ఎక్కి కూర్చుని త్వరగా పోనీ ప్రతాప్... చాలా ఆలస్యం అయింది" అన్నాను.
"ఆ విషయం ఇప్పటిదాకా తెలియలేదా?" అన్నాడు.
మామూలుగానే అన్నాడేమోకానీ నాకు మాత్రం గతుక్కుమంది.
"ఇంటి దగ్గర వద్దు. ఇక్కడ ఆపేయ్" అన్నాను కంగారు పడుతూ.
నేను దిగగానే ప్రతాప్ ముక్తా... సందీప్ వాళ్ళలాంటి వాళ్ళు ఉండే లొకాలిటీ కొండ మీదవుంది. చాలా అప్... ఎక్కలేం. జారిపడతాం. జాగ్రత్త" అన్నాడు.
ప్రతాప్ మాటల్లో నిగూఢర్థం నాకు అర్థమైంది. కానీ అతను అంత తెలివిగా మాట్లాడగలడని మాత్రం నాకు అప్పుడే తెలిసింది! ఆశ్చర్యంగా చూశాను.
"వస్తా" అని అతను వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళేసరికి అమ్మకి ఆయాసం ఎక్కువై అంతా కంగారుగా ఉన్నారు.
చిన్నక్క ఏదో ఇంజెక్షన్ చేసింది. నాన్నగారిని పిలిచి చీటి ఇచ్చి మందులు తీసుకురమ్మంది.
"ఆస్తమాకి ఇంగ్లీషు మందులు పనిచెయ్యవే, హోమియో అయితే వేసుకుంటాను" ఆయాసపడ్తూనే అంది అమ్మ.
అక్క కోపంగా "నువ్వు మాట్లాడకుండా పడుకో... నాకు తెలుసు!" అంది.
నాన్నగారు వెళ్ళిపోయారు. అక్క ఇచ్చిన ఇంజెక్షన్ వల్ల కాబోలు అమ్మకి కాస్త నిద్రపట్టింది.
నాకు అన్నం వడ్డిస్తూ "ముక్తా... అమ్మకి ఇంగ్లీషు మందుల మీద నమ్మకం లేక కాదు! హోమియోపతీ అయితే బజార్లో చవకగా దొరుకుతాయని అలా అంటోంది" అంది.
నెలాఖరురోజుల్లో నాన్నగారిచేత డబ్బులు ఖర్చు పెట్టించడం ఇష్టం లేక అమ్మ నరకయాతనపడ్తూ కూడా తనకు మందులు ఒద్దంటోంది!
నాకు సందీప్ ఇంట్లో గ్లాసుల గలగలా, అమ్మాయిల కిలకిలా గుర్తొచ్చింది. ముద్ద మింగుడు పడలేదు!