మరీ ఆయన దృష్టిలో తేలికైపామూ?
ఆ రోజు ఉత్తరం నాకు చూపిస్తూ "అసలు వీడు మానవజన్మ ఎత్తాడా?" అన్నారు. అప్పుడు నేనెంత బాధపడ్డా ననుకున్నావ్?
నువ్వు నమ్ముతావో లేదోకాని ఉత్తరం చదువుకొని నేను నిన్ను పల్లెత్తుమాట అనలేదు. పిల్లవాడిమీద ప్రమాణంచేసి చెబుతున్నాను.
నేను నిన్ను ఏమీ అనకపోవడం ఆయన్ను మరీ రెచ్చి పోయేలా చేసింది. ఇద్దర్నీ కలిపి నానామాటలూ అన్నారు! ఏడుస్తూ కూర్చున్నానే కాని పెదవి కదపలేదు.
మరీ ఆయన తిట్లు వినలేక "పోనీయ్ లెండి! వాడెన్ని ఇబ్బందుల్లో వున్నాడో!" అన్నానురా! ఇక చూడు! ఆయన కళ్ళు నిప్పులు కురిపించాయి! మనిషి రాక్షసు డయ్యాడు.
"ఛా! దెయ్యపుముండా! కునీపెట్టేది ఏ కుక్కకు పెట్టినా విశ్వాసంగా పడివుంటుంది! సిగ్గులేక అన్నన్ను వెనుకేసు కొస్తున్నావా? అవున్లే నువ్వు వాడి చెల్లెలివేగా! బుద్ధి తక్కువదేలే! మిమ్మల్ని అనేం ప్రయోజనం !" అంటూ రువ తిరిగి ఆసుపత్రినుంచి వెళ్ళిపోయారు.
అదే ఇంటిగడ్డరైతే నావళ్ళు హూనం అయి వుండేది.
ఆ వెళ్ళడం వెళ్ళడం మూడు రోజుల దాకా తిరిగి చూడలేదు! నేను చచ్చానో బ్రతికానో కూడా కనుక్కోలేదు.
నాలుగురోజులకు వచ్చి రెండు నిముషాలు నిల్చుని వెళ్ళిపోయారు! వంట్లో ఎలా వుందని కూడా అడగలేదు మానవుడు.
వారంరోజుల తర్వాత నన్ను డిస్ చార్జి చేశారు. నేను రిక్షా కట్టించుకొని ఇంటికి వెళ్ళాను.
ఇది జరిగి రెండేళ్ళయినా నీకు చెప్పలేదు.
ఆనాటి నుంచి ఆయన నాతో మనసిచ్చి మాట్లాడలేదు! కన్నెత్తి ప్రేమగా చూడలేదు! అయినా అగ్ని పర్వత్వాన్ని గుండెల్లోనే దాచుకొన్నాను.
ఇంకో రోజు ఏమన్నారనుకున్నావు?
నన్ను ప్రేమించి పెళ్ళి చేసుకోలేద! జాలిపడి పెళ్ళి చేసుకున్నారట. తల్లి తండ్రీ లేని పిల్లనని జాలిపడ్డారట. ణా అందచందాలూ, తెలితేటలూ చూసి కాదట, నేను పట్టి పిచ్చిమొద్దునట. నాది వట్టి కుళ్ళుబుద్ధి అట.
ఆరోజు, ఆయన నన్ను పెళ్ళి చేసుకోవడానికి అంగీకరించినరోజు నువ్వు అన్నమాటలు నీకు గుర్తున్నాయో లేవో గాని చెవుల్లో యిప్పటికీ "గింగురు" మంటూనే వున్నాయ్.
మీ ఇద్దరూ మాట్లాడుకొంటూంటే తలుపుచాటుగా విని పొంగిపోయాను.
అతని మంచితనాన్ని ఒకటే పొగిడేశావు! అభ్యుదయవాది అన్నావు! సంఘ సంస్కర్త అన్నావు! అంటూ అతను నీ చెల్లెలికి భర్త కావడం నీ అదృష్టం అన్నావు, నీ చెల్లెలి జన్మ తరించింది అని ఆన్నావు..
నీ చెల్లెలి జన్మ తరించిందో లేదో కాని నీ జన్మ మాత్రం తరించింది.
వెతక్కుండా, దమ్మిడీ ఖర్చులేకుండా నీ చెల్లెలికి మొగుడు దొరికాడు! నీ నెత్తిమీద బరువును దించాడు.
యిలా అన్నావని బాధపడుతున్నావా అన్నయ్యా! ణా గుండెలు రగిలిపోతున్నాయ్, కడుపు మండిపోతూవుంది! నీకు కాక నా బాధ ఎవరికీ చెప్పుకోను?
ఆ రోజు నీ మాటలు విన్న నేను ఆనందంతో పరవశించిపోయాను.
నా జన్మ నిజంగానే తరించింది అనుకున్నాను.
నా బ్రతుకు బాటంతా పున్నమి వెన్నెల ఆరబోసి వుందని మురిసి పోయాను.
విరిసిన నవ్వులు పరిచి వున్నాయని పరవశించిపోయాను.
నా బ్రతుకే ఒక పూలబాటలో నడవబోనున్నదని కలలు కన్నాను.
నా మనసు ఎన్నెన్ని వింత లోకాల్లో విహరించిందో తెలుసు?
ఎన్ని మధురస్వప్నాల్లో కరిగిపోయానో నువ్వు ఊహించాలేవు.
కాని అప్పుడు నాకేం తెలుసు? నా బతుకుబాటలో పల్లేరు కాయలు పరిచి వున్నాయనీ, కఠోర వాస్తవం కత్తులు దూస్తూ నిల్చుని వుందనీ?
మనుషులు ఎంతలో మారిపోతారో?
మనుషులు మనసు ఎంత పెళుసుగా వుంటుందో? నాకేం తెలుసు?
ఆయన ఎంతలో ఎంత మార్పు చెందారు?
నా జన్మ తరించటానికే ఆయన నాకు భర్తగా లభించారనుకున్నాను.
కాని నా జీవితం అంతం కావడానికేనని గుర్తించ లేక పోయాను! మధుర స్వప్నంగా ఊహించిన నా జీవితం దుస్వప్నంగా మారిపోయింది.
ఇంకో రోజు ఏం జరిగిందనుకున్నావ్?
ఎందుకులే అన్నయ్యా? అవన్నీ తలుచుకుంటుంటే నా నరాలు తెగడానికి సిద్ధంగా వున్నాయ్.
గుండెలు విచ్చిపోతున్నాయ్! అవన్నీ ఇప్పుడు చెప్పే ఓపిక లేదు.
నాకు ఆఖరి ఘడియలు సమీపించాయి! నా బిడ్డను తల్లిలేని పక్షిని చేసి వెళ్ళిపోతున్నాను.
ఆఁ అన్నట్టు అసలు విషయం చెప్పనేలేదుగదూ?
ఆ రాత్రి... అదే రాళ్ళగాజులు చేయించమని అడిగిన రెండోరోజు రాత్రి ఏం జరిగిందను కున్నావ్?
నీకు ఇదంతా రాసి నిన్ను బాధపెట్టడం నాకు ఇష్టలేదు! కాని రాయక తప్పింది కాదు! రేపు ఏమైనా జరిగితే సుఖంగా వుండలేక గాడెక్కి చచ్చిందని నువ్వు అనుకోకుండా వుండాలనేదే ణా బాధ.
అందుకే రాస్తున్నాను. రేపు లోకంకూడా నన్నేనిందించ వచ్చును.
అన్నయ్యా! నీకంటే నాకీ లోకంలో ఇంకేవరున్నారు చెప్పు? నీనుంచి నేను దాయగలిగేదేముంది? నీకు చెబితే నా గుండెల్లో బరువు కొంతనైనా తగ్గుతుంది!
నాయందు సానుభూతి చూపేవాళ్ళు ఒక్కళ్ళువున్నా, వాళ్ళ పెదవులమీదకు ఒక్క జాలిమాట వచ్చిన్నా కళ్ళు చెమ్మగిల్లినా చాలు నా ఆత్మకు శాంతి దోరుకుతుంది!
ఆ రాత్రి పది దాటింది. ఆయన కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాను. నిద్ర ముంచుకొస్తుంది! ఒకవైపు ఆకలి దహించి వేస్తుంది!
"దబదబా" తలుపు కొట్టారు!
నేను లేచి వెళ్ళి తలుపు తీశాను!
ఆయన ఉషారుగా లోపలకు వచ్చారు! చేతిలో ప్యాకెట్లు వున్నాయి!
ఆయనగారు సంతోషంగా ఇంటికి రావడం చాలా రోజులకు చూశాను.
నా మనసు ఎంతో తేలికపడింది. మళ్ళి ఆయన నా జీవితానికి దగ్గరగా వస్తే?
అంతకంటే నాకేం కావాలి అని అనుకున్నాను.
చేతిలోని పార్సిల్సు బల్లమీద పెడుతూ "బాబు నిద్రబోయడా!" అని అడిగారు.
ఆ పార్సిల్ చూసేసరికి నాకు ప్రాణం లేచి వచ్చింది. రాత్రి గాజులు అడిగినందుకు నానా మాటలు అన్నారు. ఆ తర్వాత తమచేసింది. తప్పని ఆలోచించి పశ్చాత్తాప పడుతున్నా రనుకున్నాను. నన్ను సంతోష పెట్టడానికే బాబుకూ నాకూ బట్టలు తెచ్చారనుకున్నాను.
ఆశగా పార్సిల్ విప్పానురా అన్నయ్యా!
ఆయన నావంక అదో మాదిరిగా చూస్తూ బట్టలు మార్చుకుంటున్నారు.
పార్సిల్ విప్పి చూశాను. బాబుకు రెండు జతలు రెడీ మెడ్ బట్టలు వున్నాయ్. ఆయన తనకు ఒక ప్యాంటూ, ఒక బుష్ షర్టూ, రెండు లుంగీలూ తెచ్చుకున్నారు.
నాకు నిజంగా సంతోషం కలిగింది. నాకు ఏమీ తెలేదనే భావం కూడా రాలేదు.
లైటు వెలుగులో ఒక్కొక్కటే తీసి చూస్తున్నాను.
"నీకేం లేవులే అందులో అక్కడే పెట్టు?" అన్నారు.