తల్లి, తండ్రీలేక పోయిన తను ఎంత ప్రేమగా పెంచాడు.
దానికి, ఒక్క రోజైనా కష్టం కలిగించే మాట అన్నాడా?
చెయ్యి చేసుకున్నాడా?
కబుర్లు చూస్తే కోటలు దాటుతాయ్.
అభ్యుదయం అంటాడు.
అన్యాయం అక్రమం అంటూ ఏదేదో మాట్లాడుతాడు.
స్త్రీ స్వాంతంత్ర్యం గురించి ఉపన్యాసమే ఇస్తాడు. దాంపత్య జీవితం మీద వ్యాసాలు రాశాడు.
ఇవన్నీ బూటకపు కబుర్లేనా?
ప్రపంచం కోసమేనా?
తన పెళ్ళాం దగ్గరికి వచ్చేసరికి అతి మామూలు మగాడిలాగే ప్రవరిస్తున్నాడా? భార్యను కొడ్తాడా?
సత్యనారాయణ ఉత్తరం మీదకు దృష్టి మరల్చాడు.
అన్నయ్యా! ఇదంతా రాసి నీ మనసు కష్ట పెడుతున్నాను- కదూ? నన్ను క్షమించన్నయ్యా!
నువ్వు నన్ను ఇంత చదివించకుండా వుంటే బాగుండేదేమో! అప్పుడు ఇంతంత పెద్ద ఉత్తరాలు రాసి వుండే దాన్ని కాదేమో! నన్ను స్కూల్ ఫైనల్ వరకూ చదివించావ్ ?
కానీ వదిన పుణ్యమా అని పరీక్షలకు వెళ్ళకుండా చేశావ్. ఆనాడు స్కూల్ ఫైనల్ పాసయివుంటే ఈ బానిస బ్రతుకు నుంచి బయటపడి వుండేదాన్నేమో? ఇంత నికృష్టంగా బ్రతకాల్సి వచ్చేది కాదేమో? ఏ గుమాస్తా ఉద్యోగమో చేసుకొని నా పొట్ట నేను పోసుకునేదాన్ని.
ఈ ఉత్తరాలేగా నా ఏడుపును, నా బ్రతుకును నీ దగ్గరకు మోసుకొస్తాయ్?
ఇంతకంటే నేను చెయ్యగలిగింది మాత్రం ఏముంది?
నేను నోరు తెరిచి కష్టసుఖాలు చెప్పుకోవడానికి నీకంటే నాకు ఆప్తులు ఎవరున్నారురా అన్నయ్యా?
ఇప్పుడిప్పుడే మాటలొచ్చిన పసివాడికి చెప్పుకున్నా నా గోడు అర్థంకాదు. బోసినవ్వులు నవ్వుతాడు.
వాణ్ని చూస్తుంటే నాగుండెలు తరుక్కుపోతున్నాయ్ వాడికొరకే ఇంతకాలం ఓపిక పట్టాను. వాడు నాలా తల్లి లేనివాడు కాకూడదనే ఇంతకాలం జీవించాను.
అన్నయ్యా! ఎంతఘోరం జరిగిదనునున్నావ్ మొన్న రాత్రి... అదే మూడు రోజులక్రితం రాత్రి- అది నా జీవితంలో కాళరాత్రి.
తల్చుకుంటే నా గుండెలు విచ్చిపోతున్నాయ్.
ప్రాణాలు అవిసి పోతున్నాయి.
నా బిడ్డ నాలాగే తల్లి పక్షి అయితే నీ రెక్కల చాటునే దాచుకోవాలి. వాడిఆన్ల పాలన చూడటానికి నీ కంటే ఎవరున్నారు చెప్పు.
ఆత్మాభిమానం లేనిదాన్ని కాబట్టే ఆ రాత్రి అది జరిగాకకూడా ఇంకా బ్రతికి వున్నానంటే నాకేఆశ్చర్యంగా ఉంది.
ఆరోజు రాత్రి అమ్మను తల్చుకొని ఎంత యేడ్చాననుకున్నావ్, నాన్నా నాకు జ్ఞాపకమే లేరు.
అసలు విషయం చెప్పాలంటే గుండెలు చిక్కబడుతున్నాయ్!
ఆ రోజు అంటే శనివారం నాటి రాత్రి బాగా ప్రొద్దు పోయి ఆయన ఇంటికి వచ్చాను. ఈ మధ్య ఆయనకు బొత్తిగా ఇంటిధ్యాస లేకుండా పోయింది. నే నొకదాన్ని బ్రతికి వున్నాననీ, తనకోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురుచూస్తూ వుంటాననే జ్ఞానం బొత్తిగా ఆయనకు లేకుండా పోయింది.
ఉదయం పదిగంటలకు ఆఫీసుకెళ్ళిన మనిషి రాత్రి పదకొండుదాకా ఇంటికి రారు. అంతవచ్చిన ధూంధాములు చేస్తారు ఇంట్లో.
ఆ రోజు ఆయన పదకొండయినా ఇంటికి రాలేదు.
ఆయనకోసం ఎదురుచూస్తూ పిల్లవాడు మంచానికి అనుకొని కూర్చున్నాను. పిల్లవాడు ఉలిక్కి ఉలిక్కిపడుతూ వుంటే మీద చెయ్యివేశాను. నా గుండెలు అనిసిపోయాయంటే నమ్ము! వళ్ళు కాగిపోతుంది. ఏం చెయ్యడానికీ తోచడంలేదు. మధ్యమధ్య కలవరితలు.
ఆయన పదకొండు దాటాక వచ్చారు. ఎక్కడ కెళ్ళారని అడిగితే కస్సున లేచారు.
"బోడిముండా! నీ అదుపాజ్ఞల్లో వుండాలా? మగవాణ్ని!బయట ఎన్నో పనులుంటాయ్! నీకు చెప్పాలా?"
అంటూ కసురుకున్నారు. పిల్లవాడి సంగతి చెప్పాను.
"అదే తగ్గిపోతుందిలే" అన్నారు నిర్లక్ష్యంగా.
ఆయన వచ్చాక కొంత భయం తిరినట్టు అన్పించింది. అన్నంపెట్టి ఎదురుగా కూర్చున్నాను.
నువ్వు తిన్నావా లేదా అని కూడా అడగలేదు.
అన్నకూతురి పెళ్ళి గురించి చెప్పారు. వాళ్ళన్నయ్య మా ఇద్దర్నీ పదిరోజులుముందే రమ్మన్నారట. లీపు అప్లయి చేశాననీ వచ్చేశుక్రవారం పోదామని చెప్పారు. ఏదో లోన్ తీసుకున్నారట. రెండువేల రూపాయల ఇంటికి తెచ్చారు.
ఏనాడూ ఏదీ ఆయన్ను కోరలేదు. ఆరోజు బుద్ది తక్కువై ఒకటి కోరాను. వీల్లేకపోతే లేదని చెప్పవచ్చుగా! ఎంత ఈసడింపుగా చూశారనుకున్నావు? ఎంత వ్యంగ్యంగా నవ్వారోరాయలేను.
నాకు పెళ్ళయి నాలుగేళ్ళు అయింది. చిన్న మెత్తు బంగారం కొన్నారా? కనీసం ముక్కుపుడకైనా చేయించారా? నేను మాత్రం అడిగానా? చిన్న చిన్నవి అడిగే తీసుకొంటూ వచ్చాను.
ఆరోజు చూట్టానికే కాబోలు సంవత్సరం క్రితం నాలో ఒక కోరిక తలెత్తింది.
కట్టుకున్న మొగుణ్నికాక ఎవర్ని అడగ్గలను? నిన్ను మాత్రం అడగ్గలనా?
ఏదో ఒక చీర అడగ్గలను.
చిన్న చిన్న వస్తువులేమైనా అడగ్గలను. కానీ నగలు చేయించమని అడగ్గలనా? పెళ్ళయిన ఏ ఆడపిల్ల అన్నల్ని నగలు చేయించమని అడగగలదా?
పోయిన సంవత్సరం దీపావళికి నీ దగ్గరకు వచ్చాను గుర్తుందా? అప్పుడు వదిన చేతులకు ఎర్రరాళ్ళు గాజులు వున్నాయ్! అవి నా కెంతో నచ్చాయి. నీకేవో 'అరియర్స్' వస్తే చేయించావట.
అప్పటినుంచీ నాకు అలాంటి గాజులు కొనుక్కోవాలని వుంది. నా కోరికను గొంతుపిసికి నాలో నేనే కుమిలిపోయాను. అందరికి అన్ని కోరికలూ తీర్తాయా అని మనసు సర్ది చెప్పుకొన్నాను.
ఆ రోజు బుద్ధితక్కువై అడిగాను. నాకు రెండు ఎర్రరాళ్ళ గాజులు చేయించమని.
అంతేరా అన్నయ్యా నేనుచేసిన తప్పు!
ఒక ఆడపిల్లలకు అటువంటి కోరిక కలగడం తప్పా అన్నయ్యా?
అది కోరారని కోరికా నువ్వే చెప్పు?
అలా కోరడం చెయ్యరాన్ని అపరాధమా?
అలాంటి కోరిక భర్తను అడగడం నేరమా?
అప్పుడు ఆయన చూసినచూపు ఎలా వర్ణించను?
నాకేం కథలు రాయడం వచ్చా ఏమన్నానా?
మీ అన్నయ్యను అడుగు! నాకొచ్చే జీతం నీ రోగాలకూ, నిన్ను మేపదానికే చాలడంలేదు" అన్నారు.
మీకు చేతకాకపోతే కాదని చెప్పండి. మధ్య మా అన్నయ్యా ఊసెందుకు అన్నాను.
దాంతో రెచ్చిపోయి నిన్నూ. నన్నూ నోటికొచ్చినట్టు తిట్టారు. ఆ తిట్లు రాసి నీ మనసును నొప్పించడం నాకు ఇష్టంలేదు.
ఎంత నీచంగా మాట్లాడారనుకున్నావు? ఆరాత్రంతా ఏడిస్తూనే గడిపాను.
ఆయనగారు తన జీవితంలో పొందే అపజయాలకూ అసమర్థతకూ నేనే కారణం అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. ఒకటే సాధింపు! కందిరీగలా ఒకటే రొద!
ఈ రెండు సంవత్సరాల్లో మూడు ఉద్యోగాలు మార్చారు. ఎప్పుడు చిరబురలాడుతూనే వుంటారు. ఆఫీసులో రోజూ ఏదో ఒక చిన్న తగాదా తెచ్చుకుంటూనేవుంటారు.
ఏరోజు కా రోజు ఉద్యోగం మానేస్తున్నట్టే మాట్లాడతారు. ఆ ఉద్యోగం చెయ్యడం నన్ను మేపటానికే అని ఎన్నిసార్లు అన్నారో! నేను ఆయన మెడకు గుది బండనట!
ఈమధ్య ఆయన రాస్తున్న కథలు చదువుతున్నావా? ఆ కథల్లో నిన్ను గురించే రాస్తున్నారు.
ఒక కథ....ఏం చెప్పను....ఈ మధ్యనే వచ్చింది. ణామీదే రాశారు నేను గయ్యాళి గపనట. చిలిపి తగాదాలు పెట్టుకుంటానట. ఎదగని మనిషినట.
ఇంకా ఏమేమో రాశారు.
అడిగితే 'నీ గురించి కాదులే' అని నవ్వేశారు.
మరోకథలో నిన్ను విశ్వాసఘాతకుడిగా చిత్రించారు.
నువ్వు ద్రోహివట.
నువ్వుమాత్రం కట్నం తీసుకొని పెళ్ళి చేసుకున్నావట.
చెల్లెలికి చిల్లికానీ ఇవ్వలేదట.
నువ్వు పెళ్ళాంచేతిలో కీలుబొమ్మవట.
నీది వట్టి మార్వాడీ మనస్తత్వమట.
ఇట్లాగే ఏమేమో రాశారు.
పైగా రోజూ సూటీ పోటీ మాటలు అంటూ వుంటారు. ణా హృదయాన్ని ఎంత గాయపరుస్తున్నాడనుకున్నావు? ములుకుల్లాంటి మాటల్తో ణా మనసు తూట్లు పడిపోయింది.
నీమీద లోకంమీద వున్న కసికంతా నామీదే చూపిస్తున్నారు. ఆయనకు ఎవరిమీద కోపం వచ్చినా శిక్ష నాకే విధిస్తున్నారు. మరి పెళ్ళాన్నిగదా? ఆడదాన్నికదా?
"నీ ముఖానికి తోడు రాళ్ళగాజులు కావాలా?" ఎంత ఎద్దేవగా అన్నారనుకున్నావ్ అన్నయ్యా!
నేనేం పాపం చేశానురా అన్నయ్యా?
నిజంగా ఏ జన్మలోనో పాపం చేసే వుంటాను.
లేకపోతే నాన్నా, అమ్మా నన్ను వదిలి వెళ్ళిపోతారా? నన్ను అనాధగా వదిలేసి పోతారా? నీమీద వదిలేసి వెళ్ళిపోయారు.
అతను నీకు ప్రాణస్నేహితుడు. నీ దృష్టిలో చాలా మంచివాడు. కట్నం వద్దన్నాడు. అతనికి నన్నిచేసి నీ బరువు దించుకున్నావు. ముఖ్యంగా వదినపీద విరగడయింది.
మీ ఇద్దరిమధ్య ఏమైనావుంటే మీరూ మీరూ చూసుకోవాలి. కానీ నన్నెందుకు మధ్య బలి పశువును చేస్తారు? నీ మీదున్న కోపం అంతా నామీద చూపించడం న్యాయమా?
ఒక విషయం- ఆయన ఒకసారి నాకు మందులూ మాకులూ కావాల్సివచ్చి నీకు డబ్బు పంపించమని ఉత్తరం రాశారట. అప్పుడు నేను ఆస్పత్రిలో వున్నాను. ఆయనకు అప్పుడు ఉద్యోగంకూడా లేదు. నీకు తెలుసుగా ఈ నాలుగేళ్ళలో మూడు ఉద్యోగాలు మారారు.
నువ్వు డబ్బు పంపకపోగా ఘాటుగా జవాబు రాశావట. దాంతో ఆయనకు నామీద కోపం మరీ ఎక్కువైంది. నువ్వు మాత్రం ఏం చేస్తావ్? ప్రతిసారీ డబ్బు పంపిస్తే వదిన ఊరుకోదని నాకు తెలుసు.
కాని ఆయనకేం తెలుసు? మా అన్నయ్య మా వదినకు భయపడ్తాడని ఎలా చెప్పుకోను?