Previous Page Next Page 
బంధితుడు పేజి 21


    నా హృదయాన్ని కొరడాలతో కొట్టినట్టు అయింది. ఓ క్షణం దిమ్మెరపోయి అలాగే నిల్చుండిపోయాను.

    వెలవెలాబోతూ ఆయన ముఖంలోకి చూశాను.

    ఆయన పెదవులమీద కదిలిన నవ్వు విషం కక్కింది.

    ఆ విషం నన్ను నిలువెల్లా దహించి వేసింది.

    ఎంత నీచంగా, హేళనగా చూశారనుకున్నావు? నా నరనరం అణువణువూ హేళనా తిరస్కారంతో నిండి పోయినట్టు అనిపించింది.

    భూమి నిజంగా ఆడదైతే అప్పటికప్పుడే చచ్చిపోయి. నన్ను తన కడుపులో దాచుకొనేది.

    ఎంతలేదన్నా నేనూ ఆడదాన్నే గదా? నాకూ కోరికలూ, ఆశలూ వుంటాయ్.

    నన్ను అవమానించడానికే ఆరోజు ఆ బట్టలు తెచ్చారు. అయినా నేను ఏమీ అనుకోలేదు.

    "నీకేమీ లేవులే" అంటూ అవమానించారు.

    పగబట్టిన పాములా నన్ను తరిమి తరిమి బాధించారు. నామీద కసి తీర్చుకోవడానికే పనికట్టుకొని ఆరోజు ఆ బట్టలు తెచ్చారు.

    "నాకు చీర తెలేదేం?" ఒళ్ళుమండి అనేశాను. ఎలా అనగలిగానో నాకే తెలియదు.

    "కూడు దొరికితే చాలులే. కొత్తచీర కట్టుకున్నంత ఫలం! రాళ్ళ గాజులు వేసుకున్నట్టు సంతోషించు" అదోలా ముఖం పెట్టి అన్నారు. అవమానం! తీరని అవమానం!

    నేను కోపంతో నిలువెల్లా వణికిపోయాను. మనసులో ఏదో తగలబడి పోసాగింది!

    "నువ్వు మనిషివికావు!" అనేశాను.

    "అవును! నువ్వూ మె అన్నయ్యా ఇద్దరే మనుషులు!" వ్యంగ్యంగా అన్నారు.

    రోషం, దుఃఖం నాగోంతులో వొరుచుకుంటున్నాయ్. ఏదో అనాలని వుంది. కానీ గొంతు పెగల్లేదు!

    "మొన్ననేగా మీ అన్నయ్య పట్టుచీర కొనిపెట్టాడు. దాని బదులు రాళ్ళ గాజులు అడగలేకపోయావు? చేయించేవాడు!" అన్నారు ఎత్తి పోడుస్తున్నట్టు.

    "మా అన్నయ్యతో మీకు పోలికా? మా అన్నయ్యను అడగాలే కాని రాళ్ళగాజులే కాదు రాళ్ళనెక్లెస్ చేయిస్తాడు.  కానీ ఎలా అడగను! మొగుడు వున్నాడుగా? మొగుడు లేకపోతే అట్లాగే అడిగేదాన్ని." ఉబికివస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుంటూ గబగబా అనేశాను.

    నా మాటలు పూర్తిఅయీ కాకుండానే మీద మీదకు వస్తూ వెర్రికేకలు వేశారు-

    "ఛీ! నోరుముయ్! నీ బతుకూ నీ అన్న బతుకూ ముందు చెబుతావా? అమ్మ పుట్టిల్లు మేనమామ దగ్గర పొగిడినట్లు ? నీ అన్న- పెళ్ళానికి చాలనివాడు. వాడితో నాకు పోలికేమిటి? నేను మగవాడ్ని నీ అన్నలా ఆడంగి వెధవను కాను. పూల్ ను కాదు! అన్నాడు"

    ఉత్తరం చదవడం ఆపి సత్యనారాయణ తల పై కెత్తాడు!

    పళ్ళు బిగించి "పూల్" "వాడికి మతిపోయినట్టు వుంది! పెళ్ళానికి చీర కొనడం చేతకాలేదు! పైగా నోటి కొచ్చినట్టు పెల్తాడా"

    అనుకుంటూ వణుకుతుద్న వేళ్ళతో ఉత్తరాన్ని గట్టిగా పట్టుకొని ఆదుర్దాగా మళ్ళీ చదవ నారంభింబాడు సత్యం!

    "అన్నయ్యా! ఆవజాన.... పిచ్చికుక్కలా అరుస్తూ  పై పైకి వచ్చారు.

    అలా వస్తున్నా ఆయన్ను చూస్తుంటే నాకు అసహ్యము వేసింది. నాకూ పిచ్చికోపం వచ్చింది. నామనసు నా స్వాధీనం తప్పింది.

    ఎదురుగా వున్నది మనిషిలా అన్పించలేదు. ఎలుగు గొడ్డులా అన్పించింది.

    అసహ్యం! కోపం!

    చేతుల్లో వున్న బట్టల పార్శిల్ కసిగా ఆయన ముఖం మీదికి విసిరికొట్టాను.

    దాంతో ఆయన నా మీదకు దూకి, జుట్టు పట్టుకొని వెనక్కు విరిచి ముఖంమీద "ఫెడీ ఫెడీ" మంటూబాదసాగారు"

    "రాస్కెల్! బ్రూట్! పశువు"

    "ఆప్రయత్నంగా బల్లమీద చేతులు గుద్దుతూ అరిచాడు సత్యనారాయణ.

    "అవును పశువే! నేను చెబితే విన్నారూ? మీ చెల్లెలు పశువుకాక మనిషి అనుకున్నారా? మనిషి అయితే తన ఏడుపు ఏదో తను ఏడవక మనమీద ఎందుకు పడుతుందీ"

    కూతురికి నీళ్ళుపోసి వళ్ళు తుడుస్తూ, భర్త  వెనగ్గా నిల్చుని పద్మ అన్నది.

    సత్యనారాయణ అయోమయంగా భార్య ముఖం లోకి చూశాడు.

    "అట్లా గుడ్లు మిటకరించుకొని చూస్తారేం? మన  దగ్గర ఒక్క దమ్మిడీ దొరకదని రాయండి. ఆఁ అన్నీ టక్కులు! దొంగవేషాలు వేస్తుంది మహాతల్లి! మనం  మాత్రం  ఇక్కడ రాసులు పోసుకొని..." వొళ్ళు తుడుస్తూ చదివేస్తూంది పద్మ.

    "నువ్వు నోరుమూస్తావా నన్ను మూయించమంటావా" ఉగ్రుడై గట్టిగా అరిచాడు అతను. 

    "నన్ను ఒకళ్ళు నోరుమూయించేదేమిటి? నా నోరు నేనే మూసుకుంటాను. కానీ ముందు మీ చెల్లెలి నోరు మూయించండి. చీటికి మాటికి అంతంత ఉత్తరాలు రాయ వద్దని బుద్ధి చెబుతూ జవాబు రాయండి"

    "ఏమే! నీగ్గాదూ చెప్పేది? నోరుమూస్తావ లేదా?" గర్జించాడు సత్యనారాయణ.

    కానీ పద్మ తనను కానట్టే మాట్లాడుకుపోతోంది.

    "మొగుడు కథలు రాసి సంపాదిస్తే ఈవిడగారు ఉత్తరాలు రాసి మనదగ్గర డబ్బు గుంజుతూ వుంది. దీని తెలివి మండిపోనూ" పిల్లకూ ఒళ్ళు తుడుస్తూనే వుంది.

    "పద్మా"

    పద్మ వినిపించుకోనట్లే తన ధోరణిలో మాట్లాడసాగింది.

    "ఠావులకు ఠావులు ఉత్తరాలు రాస్తుంది. కథలు అల్లి మరీ రాస్తుంది కథలు! అంతకంటే నవలలు రాస్తేపోలా? ఆడవాళ్ళ నవలలు బోల్డంత డబ్బులోస్తాయట? నవలరాసి పత్రికకు పంపక, ఉత్తరాలు రాసి మన కెందుకు పంపుతుంది? మన ప్రాణాలు ఎందుకు తోడేయటం?"

    "ఛత్ దరిద్రపు ముండ"

    పద్మ తనను కానట్టే మళ్ళీ చదవసాగింది-

    "ఇక్కడ మనమేదో సుఖపడిపోతున్నామని దాని ఏడుపు. ఇట్లాంటి ఆడపడుచులు వున్న ఇంట్లో సుఖం కూడానా? నన్ను మరి రెండుకళ్ళతో చూళ్ళేదు. నా పుట్టింటివాళ్ళు పంపుతున్నారేమో నేను తింటున్నాను. అంతేగాని ఒకళ్ళసొమ్ము నేనెరగను"

    "రాస్కెల్! ఫో ఇక్కడ్నుంచీ"

    సత్యనారాయణ కళ్ళురుముతూ చెయ్యి పై కెత్తాడు.

    ఏమైనా తన భర్తకు తనమీద చెయ్యి చేసుకొనే ధైర్యంలేదనీ పద్మకు తెలుసు. అయినా భర్త ఉగ్రరూపం చూసి కొంచెం బెదిరిపోయింది.

    ఒళ్ళు తుడిపించుకోవటానికి కూడా ఏడుపేనే నీకు" అంటూ కూతురి వీపుమీద రెండు తగలనిచ్చింది.

    గుక్కుపట్టి ఏడుస్తున్న పిల్లను బర బరా లోపలకు లాక్కెళ్ళింది.

    చేతితో కణతలు నొక్కుకుంటూ బల్లమీదకు వంగి చెల్లెలు రాసిన ఉత్తరం పైకి దృష్టిని సారించాడు.

    ఆ అక్షరాల్లోనుంచి చెల్లెలి శోకపూరిత కంఠం వినిపిస్తున్నట్లు అనిపించింది.

    అశృపూరిత నయనాలతో ఐదేళ్ళు తేలి ఎర్రబడిన చెంపలతో చెల్లెలు దీనాతిదీనంగా కళ్ళముందు కదిలినట్టు అయింది.

 Previous Page Next Page